జస్టిస్ ఎన్‌వీ రమణ ఎవరు? న్యాయమూర్తుల హక్కులపై ఆయన అభిప్రాయం ఏమిటి

జస్టిస్ ఎన్‌వీ రమణ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జస్టిస్ ఎన్‌వీ రమణ
    • రచయిత, బళ్ల సతీశ్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అధికారికంగా ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసింది. సుప్రీం కోర్టు ప్రస్తుత జడ్జి జస్టిస్ ఎన్‌వీ రమణ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నారని ఆరోపిస్తూ భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశారు ఏపీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి.

తన 8 పేజీల లేఖలో జస్టిస్ ఎన్‌వీ రమణ గురించి పలు అంశాలు ప్రస్తావిస్తూ పలు ఆరోపణలు చేశారు జగన్.

''చంద్రబాబు నాయుడు, జస్టిస్ రమణల మధ్య సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. నేను ఎంతో బాధ్యతాయుతంగా ఈ మాట చెబుతున్నాను.'' అన్నారు జగన్.

''తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు హైకోర్టు న్యాయమూర్తుల డ్యూటీ రొటేషన్‌ను(జడ్జీల రోస్టర్) జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారు. హైకోర్టు సిట్టింగులను ప్రభావితం చేస్తున్నారు. ఇది స్పష్టంగా కొందరు జడ్జిలు, జస్టిస్ ఎన్‌వీ రమణ, తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధాన్ని తెలుపుతోంది'' అని లేఖలో జగన్ ఆరోపించారు.

తన లేఖతో పాటూ జస్టిస్ ఎన్‌వీ రమణపై ఆరోపణలతో కొన్ని పత్రాలను జత చేశారు ఏపీ సీఎం. ఆ లేఖతో ఉన్న ఒక అనుబంధ పత్రంలో ఐదుగురు హైకోర్టు న్యాయమూర్తులపైనా జగన్ కొన్ని ఆరోపణలు చేశారు. ఈ వివరాలు, లేఖలు, పత్రాలను శనివారం రాత్రి అధికారికంగా మీడియాకు విడుదల చేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం.

2013లో దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అప్పటి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, 2013లో దిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్‌గా ప్రమాణ స్వీకారం చేసిన తరువాత అప్పటి దిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్ జంగ్‌తో

జస్టిస్ ఎన్‌వీ రమణ నేపథ్యం

జస్టిస్ ఎన్‌వీ రమణ పూర్తి పేరు నూతలపాటి వెంకట రమణ. కృష్ణా జిల్లా పొన్నవరం గ్రామంలో 1957 ఆగస్టు 27న జన్మించారు.

సుప్రీం కోర్టులో 2017 ఫిబ్రవరి 2న నియమితులయ్యారు. ఇంకా రెండేళ్ల పదవీ కాలం అంటే, 2022 ఆగస్టు 26 వరకూ ఆయనకు సర్వీసు ఉంది.

1983 ఫిబ్రవరి 10న న్యాయవాదిగా కెరీర్ ప్రారంభించారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అదనపు అడ్వకేట్ జనరల్ గా పనిచేశారు.

వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన రమణ బీఎస్సీ, బీఎల్ చదివారు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రైబ్యునల్(క్యాట్), ఉమ్మడి ఏపీ హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో ప్రాక్టీసు చేశారు. వివిధ ప్రభుత్వ సంస్థలకు పానెల్ కౌన్సిల్ గా ఉన్నారు. క్యాట్‌లో కేంద్ర ప్రభుత్వం, రైల్వేల తరఫున పనిచేశారు.

2000 జూన్ 27న ఏపీ హైకోర్టు పర్మినెంటు జడ్జిగా నియమితులయ్యారు. 2013 మార్చి 10 నుంచి మే 20 వరకూ ఏపీ హైకోర్టు యాక్టింగ్ ఛీఫ్ జస్టిస్‌గా పనిచేశారు. 2013 సెప్టెంబరు 2న దిల్లీ హైకోర్టు ఛీఫ్ జస్టిస్‌గా పదోన్నతి పొందారు. అనంతరం 2014 ఫిబ్రవరి 17న సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.

ప్రస్తుతం సుప్రీం కోర్టు సీనియారిటీ జాబితాలో ఆయనది ఛీఫ్ జస్టిస్ తరువాతి స్థానం.

రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, రిటైర్డ్ జస్టిస్ జాస్తి చలమేశ్వర్

జస్టిస్ చలమేశ్వర్ లేఖ వివాదంలో..

జస్టిస్ ఎన్‌వీ రమణ, అప్పటి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుల మధ్య సంబంధం ఉందనే భావన వచ్చేలా వ్యాఖ్యానించారు నాటి సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జాస్తి చలమేశ్వర్. అప్పటి సుప్రీం ఛీఫ్ జస్టిస్‌కి జస్టిస్ చలమేశ్వర్ రాసిన ఒక లేఖలో, ''న్యాయ వ్యవస్థకు, కార్యనిర్వాహక వ్యవవస్థకీ మధ్య అవసరంలేని చనువుకు ఇది ఒక బలమైన ఉదాహరణ'' అంటూ వ్యాఖ్యానించారు.

ఉమ్మడి ఏపీ హైకోర్టుకు న్యాయమూర్తుల ఎంపిక విషయంలో చంద్రబాబు నాయుడు కామెంట్లకూ, జస్టిస్ రమణ నివేదికకూ దగ్గర పోలికలు ఉన్నాయంటూ ఈ వ్యాఖ్యలు చేశారు. 2017 మార్చిలో రాసిన ఆ లేఖలో ''గౌరవ జడ్జి గారు (జస్టిస్ ఎన్‌వి రమణ), ప్రస్తుత ఏపీ సీఎం (చంద్రబాబు నాయుడు) మధ్య దగ్గరితనం అందరికీ తెలిసిందే'' అన్నారు. ''గౌరవ జడ్జి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారి కామెంట్లు ఎంత దగ్గరగా ఉన్నాయంటే, అవి కాకతాళీయంగా జరిగాయి అనుకోలేనంత'' అని రాశారు.

ఈ వ్యాఖ్యలు చేసినప్పటికి జస్టిస్ చలమేశ్వర్ న్యాయమూర్తులను ఎంపిక చేసే సుప్రీంకోర్టు కొలీజియంలో సభ్యులు. ఆ తరువాత చంద్రబాబు నాయుడు, జస్టిస్ రమణలు ఇచ్చిన నివేదికను తిరస్కరిస్తూ, కొత్త న్యాయమూర్తులను నియమించింది సుప్రీం కోర్టు.

దీనిపై అప్పట్లో ఒక ఇంగ్లిష్ పత్రికకు స్పందించిన జస్టిస్ ఎన్‌వీ రమణ.. ''నా అభిప్రాయం చెప్పమని సీజేఐ అడిగారు. చెప్పాను. అంతకు మించి నాకేమీ తెలియదు. ఏపీ, తెలంగాణ సీఎంలు ఏ అభిప్రాయం చెప్పారో నాకు తెలియదు'' అన్నారు. 2016లో వీరి పేర్లు ప్రతిపాదించిన నెలలోనే కేసీఆర్ తన అభిప్రాయం ఇవ్వగా, చంద్రబాబు మాత్రం 11 నెలల సమయం తీసుకున్నారు.

సుప్రీంకోర్టు

ఫొటో సోర్స్, Getty Images

న్యాయమూర్తుల హక్కుపై జస్టిస్ రమణ అభిప్రాయం

''అభాండాలకు న్యాయమూర్తులు బాధితులు అవుతున్నారు. సమర్థించే స్వేచ్ఛ కూడా లేకపోవడంతో ఇతరులకు సులువుగా లక్ష్యంగా మారుతున్నారు. చాలా మంది న్యాయమూర్తులు విలాసంగా బతుకుతారు అనుకుంటారు. అది వాస్తవం కాదు'' అన్నారు జస్టిస్ రమణ. ఓ సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి రాసిన పుస్తక ఆవిష్కరణ సభలో 2020 సెప్టెంబరు రెండో వారంలో జస్టిస్ రమణ ఈ వ్యాఖ్యలు చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)