వైఎస్ జగన్: సుప్రీంకోర్టు జడ్జిపై ఆరోపణలతో భారత ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి

ఫొటో సోర్స్, facebook/ysjagan
- రచయిత, బళ్ల సతీశ్
- హోదా, బీబీసీ ప్రతినిధి
ఒక సుప్రీం కోర్టు న్యాయమూర్తి, పలువురు ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఫిర్యాదు చేశారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన రెడ్డి.
ఈ విషయమై శనివారం రాత్రి సమయంలో ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారు అజేయ కల్లం మీడియా ముందుకు వచ్చి, ఆ వివరాలను మీడియాకు వెల్లడించారు. ముందుగా తయారు చేసి ఉంచిన ఒక ప్రకటన ఇంగ్లిషులో చదివారాయన.
''విస్తృత ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, కొన్ని మీడియాల్లో వస్తోన్న ఊహాగానాలకు తెర దించడానికీ, ప్రభుత్వానికి చెందిన అన్ని అంగాల గౌరవాన్ని కాపాడటానికీ, అధికారికంగా మాట్లాడాలని నిర్ణయించుకున్నాం'' అంటూ ఏపీ ప్రభుత్వం తరఫున ప్రకటించారు అజేయ కల్లం.
''ప్రస్తుతం సుప్రీం కోర్టు జడ్జిగా ఉన్న జస్టిస్ ఎన్ వి రమణ ఏపీ హైకోర్టు వ్యవహారాలలో జోక్యం చేసుకుంటున్నారు. అదే విషయాన్ని భారత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి దృష్టికి తీసుకుని వెళ్లాం. అలాగే ఇటీవల హైకోర్టులో జరిగిన పరిణామాలు ఆయన ముందు ఉంచాం. అమరావతి భూ కుంభకోణంగా చెబుతోన్న కేసులో హైకోర్టు ఇచ్చిన గ్యాగ్ ఆర్డర్ విషయమూ, కేబినెట్ సబ్ కమిటీ, సిట్ దర్యాప్తులపై ఇచ్చిన స్టే ఆదేశాల గురించి కూడా సీజేఐ దృష్టికి తీసుకునివెళ్లాం.'' అంటూ జగన్ సీజేకి రాసిన లేఖలోని విషయాలు వెల్లడించారు.

ఫొటో సోర్స్, AP I&PR
''ముఖ్యంగా జస్టిస్ ఎన్ వి రమణ, టీడీపీ అధ్యక్షులు చంద్రబాబుల మధ్య దగ్గరితనం గురించీ, జస్టిస్ ఎన్‌వీ రమణ ఉమ్మడి ఏపీ హైకోర్టు జడ్జిగా ఉన్నప్పుడు టీడీపీనీ, ఆ పార్టీ వారినీ రక్షించడానికీ ఇచ్చిన తీర్పులూ, దమ్మాలపాటి శ్రీనివాస్‌కు అనుకూలంగా ఇచ్చిన తీర్పుల గురించీ సమాచారాన్ని సీజఐకి అందించాం.'' అంటూ జగన్ లేఖలోని అంశాలు బయటపెట్టారాయన.
ఏపీ సీఎం జగన్ సీజేఐకి రాసిన లేఖ, దానికి సంబంధించిన అనుబంధ వివరాలూ, దానికి అదనంగా గతంలోని తీర్పులకు సంబంధించిన వివరాలను మీడియాకు విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
అయితే గ్యాగ్ ఆర్డర్ ఉన్నందున అమరావతి కేసు వివరాలు మీడియాకు ఇవ్వడం లేదని తెలిపారు ఏపీ ప్రభుత్వ ప్రతినిధి.
అమరావతి భూముల్లో అవినీతి ఆరోపణలపై విచారణ నిమిత్తం ఒక కేబినెట్ సబ్ కమిటీని ఏర్పాటు చేసింది ఏపీ ప్రభుత్వం.
ఆ నివేదికల ఆధారంగా రాష్ట్ర అవినీతి నిరోధక శాఖ 8/RCO-ACB-GNT/2020 నంబరుతో కొందరిపై ఎఫ్ఐఆర్ నమోదు చేసింది.
దానిపై మీడియాలో వార్తలు రాయకూడదని ఏపీ హైకోర్టు సెప్టెంబరు 15న రిట్ పిటిషన్ నంబరు 16468/2020 లో ఆదేశించింది. (ఏదైనా విషయానికి సంబంధించిన సమాచారాన్ని బహిరంగ పరచవద్దు అనే ఆదేశాలను గ్యాగ్ ఆర్డర్ అంటారు.) అలాగే, సిట్ విచారణ, కేబినెట్ సబ్ కమిటీ ప్రొసీడింగులు ఆపాలని మరో తీర్పులో ఆదేశాలిచ్చింది.
ఈ గ్యాగ్ ఆర్డర్ ఉన్నప్పటికీ ఈ అంశంపై ఏపీ ప్రభుత్వం ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాసి, మీడియా ముందుకు వచ్చింది.



లేఖలో ఏముంది?
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బాబ్డేకి ఏపీ ముఖ్యమంత్రి జగన్ రాసిన 8 పేజీల లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు.
అందులో రాజ్యాంగం పరిధులు, న్యాయ, శాసన, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య సంబంధమూ, అమరావతి భూములపై సబ్ కమిటీ ఏర్పాటూ, జస్టిస్ ఎన్‌వీ రమణ గురించీ రాశారు. దాదాపు నాలుగు పేజీల్లో జస్టిస్ ఎన్‌వీ రమణ ప్రస్తావన ఉంది. ఈ లేఖతో పాటూ 7 ఫైళ్లను జత చేశారు.
''చంద్రబాబు, జస్టిస్ రమణల మధ్య దగ్గరితనం అందరికీ తెలిసిందే. నేను ఎంతో బాధ్యతాయుతంగా ఈ మాట చెబుతున్నాను. గతంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన జస్టిస్ చలమేశ్వర్ ఈ విషయాలను సాక్ష్యాలతో సహా బయటపెట్టారు. హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో బాబు, జస్టిస్ రమణలు ఇచ్చిన అభిప్రాయాలను మీముందు ఉంచుతున్నాను.'' అని సీజేఐకి రాసిన లేఖలో పేర్కొన్నారు జగన్.
''తెలుగుదేశం పార్టీకి ముఖ్యమైన విషయాలు వచ్చినప్పుడు హైకోర్టు జడ్జీల డ్యూటీ రొటేషన్‌ను(జడ్జీల రోస్టర్) జస్టిస్ రమణ ప్రభావితం చేస్తున్నారు. హైకోర్టు సిట్టింగులను ప్రభావితం చేస్తున్నారు. ఇది స్పష్టంగా కొందరు జడ్జీలు, జస్టిస్ రమణ, తెలుగుదేశం పార్టీల మధ్య సంబంధాన్ని తెలుపుతోంది.'' అని లేఖలో జగన్ ఆరోపించారు.
అంతేకాదు మీడియా కవర్ చేయవద్దని హైకోర్టు చెప్పిన ఎఫ్ఐఆర్ వివరాలను కూడా ఆ లేఖలో ఆయన ప్రస్తావించారు.
''ఈ అంశాలు పరిశీలించి, న్యాయ వ్యవస్థ నిష్పక్షపాతంగా ఉంటడానికి మీరు తగిన చర్యలు తీసుకోవాలి'' అని భారత ప్రధాన న్యాయమూర్తిని కోరారు జగన్.
ఆ ఫైళ్లలో ఏముంది?
ఆ జత చేసిన 7 ఫైళ్లూ మొత్తం 29 పేజీలు.
అందులో పలువురు న్యాయవాదులను హైకోర్టు న్యాయమూర్తులుగా ఎలివేట్ చేయడానికి జస్టిస్ ఎన్‌వీ రమణ, చంద్రబాబునాయుడు ఇచ్చిన అభిప్రాయాలూ, 2013-16 మధ్య జస్టిస్ రమణ ఆస్తుల డిక్లరేషన్, హైకోర్టు గ్యాగ్ ఆర్డర్ ఉన్న ఎఫ్ఐఆర్ వివరాలూ, ఆ ఎఫ్ఐఆర్ కాపీ, కేబినెట్ సబ్ కమిటీపై హైకోర్టు ఇచ్చిన రిట్ పిటీషన్లో ఇచ్చిన ఆదేశాలు, ఏపీ హైకోర్టు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఇచ్చిన తీర్పు అని ఆరోపిస్తున్న ఆదేశాలు వీటిల్లో జత చేశారు. (మీడియాకు ఇచ్చిన ప్రతిలో గ్యాగ్ ఆర్డర్ ఉన్న ఎఫ్ఐఆర్ వివరాలు తీసేసి మిగతావి ఇచ్చారు.)
మీడియాకు ఇచ్చిన వివరాలేంటి?
మీడియా అనుబంధం అంటూ 11 పేజీల ఇంగ్లిష్ కాపీని విడుదల చేసింది ఏపీ ప్రభుత్వం.
అందులో ఐదుగురు ప్రస్తుత హైకోర్టు న్యాయమూర్తుల పేర్లు, వారు ఇచ్చిన కొన్ని తీర్పుల వివరాలు ఉన్నాయి. ''తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా హైకోర్టు ఇచ్చిన తీర్పులు, వాస్తవాలు'' అన్న పేరుతో ఆ ప్రకటన ఉంది.
అమరావతి భూ కుంభకోణం ఎఫ్ఐఆర్‌లపై స్టే, ఇళ్లు ఖాళీ చేయాలంటూ సీఆర్డీయే ఆదేశాలపై స్టే, రమేశ్ ఆసుపత్రులు కేసులో స్టే, రాష్ట్ర ఎన్నికల సంఘం అదనపు కార్యదర్శిపై విచారణపై స్టే, ఇళ్ల పట్టాల పంపిణీపై స్టే, ప్రైవేటు ఇంటర్ కాలేజీలు ఫీజుల వ్యవహారంలో తీర్పు రిజర్వు చేయడం, పోలవరం-నవయుగ కేసు వంటివి ప్రస్తావించారు.
ఒక పేజీలో అయితే ''నాపై, నా ప్రభుత్వంపై హైకోర్టు ద్వేషం'' అనే హెడింగ్ కింద కొన్ని విషయాలు పొందుపర్చారు.
విశాఖలో బాబు అరెస్టు, హైకోర్టు జడ్జీల ఫోన్ ట్యాపింగ్ కేసు, వైయస్సార్సీప ఎమ్మెల్యేలు కోవిడ్ ప్రోటోకాల్ ఉల్లంఘన కేసుల గురించి ప్రస్తావించారు.
సుప్రీం కోర్టు లాయర్ ప్రశాంత్ భూషణ్ ఏమన్నారు...
జస్టిస్ ఎన్ వి రమణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఉన్నాయని సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ భూషణ్ ట్వీట్ చేశారు.
ఆయన చేసిన అవినీతి ఆరోపణలపై చిత్తశుద్ధితో విచారణ జరగాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది

ఫొటో సోర్స్, BandaruSM/FB
టీడీపీ స్పందన
దేశంలో పాలకులు ఎవరైనా అత్యంత గౌరవమైన, విలువైన భారత రాజ్యాంగానికి విలువిచ్చారని.. అహంకారి, అవినీతిపరుడైన జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యాక రాజ్యాంగంలోని వ్యవస్థలను కాలరాస్తున్నారని, ఆ వ్యవస్థల్లో అతిముఖ్యమైన న్యాయవ్యవస్థపై దాడికి దిగడం హేయాతిహేయమని మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఆదివారం ఆయన తన నివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
న్యాయవ్యవస్థపై దాడిచేయడమంటే ముమ్మాటికీ ప్రజాస్వామ్యంపై దాడిచేయడమేనని సత్యనారాయణమూర్తి అన్నారు.
"జగన్మోహన్ రెడ్డి ప్రధాని మోదీని కలిశాకే రాష్ట్రంలోని వైసీపీనేతలు అడ్డూ, అదుపులేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా కేంద్రమంత్రులో, ప్రధానో, ఎవరో ఒకరు స్పందించి, జగన్ తమతో ఏం చర్చలు జరిపాడనో వివరాలు తెలపాలి.
బెయిల్ పై వచ్చి బయటతిరుగుతూ, ముఖ్యమంత్రి అయిన వ్యక్తిని వెనకేసుకురావాలని చూస్తే, అదిఎప్పటికైనా ఎవరికైనా ప్రమాదమేననే విషయాన్ని మోదీ, అమిత్ షా, ఇతర కేంద్రపెద్దలు గ్రహించాలి" అని అన్నారు.
జగన్మోహన్ రెడ్డి పాలనలో ప్రజలకు వ్యక్తిగత భద్రతకూడా లేకుండాపోయిందని కూడా ఆయన ఆరోపించారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయమూర్తిపై ఫిర్యాదు చేసే హక్కు ముఖ్యమంత్రికి ఉందా?
మామూలు న్యాయార్థిగా ప్రధానన్యాయమూర్తికి ఫిర్యాదు చేసే అధికారం హక్కు జగన్మోహన్ రెడ్డికి ఉందని న్యాయ వ్యవహారాల నిపుణులు, కేంద్ర సమాచార మాజీ కమిషనర్ మాడభూషి శ్రీధర్ విశ్లేషించారు. " ఒక ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఫిర్యాదు చేయడంలో తప్పులేదు. అయితే, ప్రత్యేకంగా ఆ లేఖను అనుబంధాలతో సహా పత్రికలకెందుకు విడుదల చేశారనే ప్రశ్న ఉదయిస్తుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి న్యాయ వ్యవస్థకు మధ్య యుద్ధంగా అభివర్ణించడం సరైంది కాదు. ఇది కొన్ని కేసుల్లో వ్యతిరేక తీర్పులకు గురైన బాధితుడి ఫిర్యాదు ఆరోపణ" అని ఆయన అన్నారు.
అంతేకాకుండా, "జగన్ ఫిర్యాదు అనేక అసందిగ్ధ పరిస్థితులకు దారితీస్తుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉన్న అనేక పిటిషన్లను హైకోర్టు న్యాయమూర్తులు విచారించాలా వద్దా? అప్పుడు ఏం చేయాలి? సుప్రీంకోర్టులో ఈ ఫిర్యాదు పైన ఏం జరుగుతుంది? దాని ప్రభావం హైకోర్టు పైన ఉంటుందా అంటే చెప్పడానికి ఏ ఆధారాలు లేవు. మొత్తానికి హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి అస్థిర వాతావరణం ఏర్పడింది" అని శ్రీధర్ విశ్లేషించారు.
ఇవి కూడా చదవండి:
- సముద్రపు దొంగలను పట్టిస్తున్న అరుదైన పక్షి ఇది..
- మోదీ కేబినెట్లో మంత్రి రాజీనామాకు కారణమైన మూడు బిల్లుల్లో ఏముంది.. వాటి వల్ల రైతులకు లాభమా, నష్టమా?
- 40 ఏళ్ల కిందట చోరీ అయిన సీతారామ లక్ష్మణుల విగ్రహాలు బ్రిటన్‌లో ఎలా దొరికాయి?
- హుస్సేన్‌సాగర్‌లో దూకి ఆత్మహత్యకు ప్రయత్నించిన 114 మందిని ఈయనే కాపాడారు
- #విమెన్ హావ్ లెగ్స్: మహిళలు కాళ్లు కనిపించేలా బట్టలు ధరించకూడదా?
- పాకిస్తాన్‌తో యుద్ధానికి భారత సైన్యంలోని ముస్లిం రెజిమెంట్ నిరాకరించిందా? Fact Check
- కరోనావైరస్ లక్షణాలు ఏమిటి? పిల్లల్లో ఎటువంటి లక్షణాలు కనిపిస్తాయి? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
- భారతదేశంలో అసలు కరోనావైరస్ కేసుల సంఖ్య 10 కోట్లు దాటిపోయిందా?
- తెలంగాణ కొత్త రెవెన్యూ చట్టం: మీ భూమి మీదేనని అధికారికంగా చెప్పేది ఎవరు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








