న్యాయమూర్తుల ‘తిరుగుబాటు’కు ఏడాది - జస్టిస్ చలమేశ్వర్ ఇప్పుడేం చేస్తున్నారు?

ఫొటో సోర్స్, Getty Images
'ఇక్కడ పార్లమెంటు లేదు, సుప్రీం కోర్టు లేదు. ప్రస్తుతం ప్రశాంతమైన జీవితం గడుపుతున్నా. భారత ప్రభుత్వం సరిగ్గా పనిచేస్తుందా లేకా సుప్రీం కోర్టు తన పని సక్రమంగా చేస్తుందా అన్నది నాకిప్పుడు అప్రస్తుతం'... సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి, జస్టిస్ జాస్తి చలమేశ్వర్ బీబీసీతో చెప్పిన మాట ఇది.
గతేడాది సరిగ్గా ఇదే రోజున జస్టిస్ చలమేశ్వర్ ఓ చరిత్రాత్మక ఘటనలో భాగమయ్యారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా 2018 జనవరి 12న నాటి సుప్రీం కోర్టు న్యాయమూర్తులు నలుగురు ప్రెస్ మీట్ పెట్టి నాటి భారత చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా పనితీరుపైన కీలక ప్రశ్నలు సంధించారు.
ఆ ప్రెస్‌మీట్‌లో జస్టిస్ చలమేశ్వర్‌తో పాటు ప్రస్తుత చీఫ్ జస్టిస్ రంజన్ గోగోయ్, జస్టిస్ కురియన్ జోసెఫ్, జస్టిస్ మదన్ లోకూర్ కూడా పాల్గొన్నారు.
సుప్రీంకోర్టు వర్కింగ్ జడ్జిలు, చీఫ్ జస్టిస్‌కు వ్యతిరేకంగా మాట్లాడటం అదే తొలిసారి.
తన రిటైర్‌మెంట్ తరువాత సుప్రీంకోర్టు బార్ కౌన్సిల్ వీడ్కోలు వేడుకలో పాల్గొనకుండా నేరుగా తమ ఊరికి వెళ్లిపోయి జస్టిస్ చలమేశ్వర్ మరోసారి వార్తల్లో పతాక శీర్షికగా మారారు.
ప్రస్తుతం ఆయన తమ ఊళ్లో వ్యవసాయం చేస్తున్నట్లు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, జస్టిస్ చలమేశ్వర్
'నాకు అన్నం దొరకడం కష్టం కాదు. నేనే వ్యవసాయం చేసి పండించుకుంటా. వాళ్లు నా పెన్షన్ ఆపేసినా కూడా నాకొచ్చే ఇబ్బందేం లేదు' అని ఆయన అన్నారు.
కానీ, ఇప్పటికీ తాను లేవనెత్తిన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయని దానివల్ల తనపైన 'తిరుగుబాటుదారు' ముద్ర కూడా పడిందని చెప్పారు.
ఉదాహరణకు, హైకోర్టులో ప్రధాన న్యాయమూర్తిగా ఉన్న వ్యక్తి, సుప్రీంకోర్టులో తనకు కావల్సిన నిర్ణయాన్ని తెచ్చుకోగలనని స్వేచ్ఛగా చెప్పుకుంటున్నారని జస్టిస్ చలమేశ్వర్ గతంలో అన్నారు.
'ఆ మాజీ ప్రధాన న్యాయమూర్తిని సీబీఐ అదుపులోకి తీసుకుంటుంది. ప్రాథమిక విచారణ చేస్తుంది. ఆ మరుసటి రోజే ఆయనకు బెయిల్ దొరుకుతుంది. కానీ, వేలాది భారతీయులు జైళ్లలో మగ్గుతారు. వారికి మాత్రం బెయిల్ దొరకదు. ఆ విషయాన్ని నేను ప్రశ్నిస్తే, నా పైన 'తిరుగుబాటుదారు' అన్న ముద్ర వేస్తారు. కొందరు నన్ను 'ద్రోహి' అని కూడా పిలిచారు' అంటారు జస్టిస్ చలమేశ్వర్.
పదవీ కాలంలో ఉన్నప్పుడు న్యాయమూర్తులను ఎంపిక చేసే 'కొలీజియం' వ్యవస్థపై ఆయన ప్రశ్నలు సంధించారు.

ఫొటో సోర్స్, Getty Images
న్యాయమూర్తుల ఎంపిక పారదర్శకంగా సాగాలని ఆయన కోరుకున్నారు.
'నేను చెప్పిన ప్రతిదీ సరైనదే కావాలనేం లేదు. కానీ, ఏది తప్పో చెప్పాల్సిన బాధ్యత నాది. నేనదే చేశాను. దేశ్యాధ్యక్షుడు, ప్రధాన మంత్రి, ఇతర అన్ని పదవులకు జవాబుదారీతనం ఉన్నప్పుడు, ప్రధాన న్యాయమూర్తి పదవికి మాత్రం ఎందుకుండదు' అని ఆయన గతంలో అన్నారు.
ప్రస్తుతం మౌనంగా ఉన్నారా? అని ఆయన్ను ప్రశ్నిస్తే, విద్యార్థులతో మాట్లాడే అవకాశం దొరకుతోందని చెప్పారు.
విశ్వవిద్యాలయాల ఆహ్వానం మేరకు వెళ్లి జస్టిస్ చలమేశ్వర్ తన మనసులోని మాటలను బయటపెడుతున్నారు.
ఇవి కూడా చదవండి
- ‘మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ బీఎండబ్ల్యూ కారులాంటి వారు’: సంజయ్ బారు
- PUBG: ఈ ఆటకు ఎందుకంత క్రేజ్? ఎలా ఆడతారు? ఇందులో గెలుపు ఓటములు ఏమిటి?
- రాకెట్లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?
- Fact Check: ఈ వైరల్ ఫొటోలు నిజానికి భారత సైనికులవి కాదు
- అంతరిక్షం నుంచి మళ్లీ అవే సంకేతాలు? ఎవరు పంపారు?
- భారత్ కన్నా పేద దేశమైన చైనా 40 ఏళ్లలో ఎలా ఎదిగింది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








