శ్యామ్ సింగరాయ్ రివ్యూ: అన్నీ ఉన్న కథలో ఆ ఒక్క ఎలిమెంట్‌ను దర్శకుడు ఎలా మిస్సయ్యారు?

ఫొటో సోర్స్, Niharika Entertainment/twitter
- రచయిత, సాహితి
- హోదా, బీబీసీ కోసం
పునర్జన్మ కాన్సెప్టు తరతరాలుగా తెలుగు సినిమాకు కథల కొరత తీరుస్తూనే ఉంది. ప్రతీ తరంలోనూ ప్రేక్షకులు. మరు జన్మ పొందిన కథానాయకుల్ని, కథానాయికల్నీ చూస్తూనే ఉన్నారు. `మూగమనసులు` దగ్గర్నుంచి `మగధీర` వరకు ఈ ఫార్ములాని నమ్ముకుని తీసిన సినిమాలే.
అయితే, ఆ పునర్జన్మకు ఏదో ఓ కొత్త అంశం తోడవ్వాలి. ఆలంబనగా నిలవాలి. అప్పుడే... ఆయా కథలు విజయతీరాలకు చేరతాయి.
`శ్యామ్ సింగరాయ్` పునర్జన్మ ఎత్తిన ఓ విప్లవ కారుడి కథ. మరి ఈ కథని చెప్పడానికి దర్శకుడు ఎంచుకున్న నేపథ్యం ఏమిటి? మరు జన్మ ఎత్తిన కథానాయకుడు ఈ జన్మలో సాధించిందేమిటి?

ఫొటో సోర్స్, @NameisNani/twitter
ఇప్పటి వాసుదేవ్... అప్పటి శ్యామ్ సింగరాయ్
ఈ కథ హైదరాబాద్ లో మొదలవుతుంది. వాసుదేవ్ (నాని) షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్. ఓ షార్ట్ ఫిల్మ్ తీసి, తద్వారా దర్శకుడైపోవాలని కలలు కంటుంటాడు. తన షార్ట్ ఫిల్మ్‌లో కథానాయిక కోసం అన్వేషిస్తుంటే, కీర్తి (కృతి శెట్టి) పరిచయం అవుతుంది. అయిష్టంగానే ఈ షార్ట్ ఫిల్మ్ లో నటించడానికి ముందుకొచ్చినా, ఆ తరవాత.. వాసు ప్రవర్తన, తన తపన చూసి ఇష్టపడుతుంది.
ఓసారి కీర్తిని రౌడీ మూక ఆటపట్టిస్తుంటే అక్కడుంటాడు వాసు. అక్కడ జరిగిన ఘర్షణలో... వాసు తలకు గాయం అవుతుంది. అప్పటి నుంచీ... వాసు ప్రవర్తనలో మార్పు వస్తుంటుంది. తనకు తెలియకుండానే బెంగాలీ పదాలు పలుకుతుంటాడు. రోసీ.. అనే పేరు కలవరిస్తుంటాడు. దాంతో.. వాసుని తప్పుగా అర్థం చేసుకున్న కీర్తి.. తనని వదిలి వెళ్లిపోతుంది.
`ఉనికి` అనే సినిమాతో దర్శకుడవుతాడు వాసు. ఆ సినిమా హిట్టవుతుంది. బాలీవుడ్ లో రీమేక్ చేసే అవకాశం కూడా వస్తుంది. సరిగ్గా అప్పుడే.. వాసుపై కాపీ ముద్ర పడుతుంది. శ్యామ్ సింగరాయ్ రాసిన బెంగాలీ కథల్నికాపీ కొట్టి, వాసు సినిమా తీశాడని పోలీసులు అరెస్ట్ చేస్తారు.
ఈ కథ నాదే అని నిరూపించుకోవడానికి వాసు దగ్గర ఎలాంటి ఆధారం లేదు. మరి... కాపీ ముద్ర నుంచి వాసు ఎలా బయటపడ్డాడు? అసలు శ్యామ్ సింగరాయ్ ఎవరు? తలకు గాయమైన దగ్గర్నుంచి వాసు.. వింతగా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అనేదే కథ.
వాసుదేవ్ శ్యామ్ సింగరాయ్‌లా ఎందుకు ప్రవర్తిస్తున్నాడు? అనే ఆసక్తిని పెంచడానికి దర్శకుడు తొలి భాగాన్ని వాడుకున్నాడు. శ్యామ్ సింగరాయ్ పాత్రని పరిచయం చేస్తూ.. విశ్రాంతి కార్డు వేశాడు. దాదాపు గంట సేపు శ్యామ్ సింగరాయ్ ని దాచడం... నిజంగా సాహసమే. వాసు లఘు చిత్ర ప్రయత్నాల్లోంచి వినోదం పుట్టించాలని చూశాడు దర్శకుడు. అది అక్కడక్కడ మాత్రమే పండింది.
నాని-కీర్తి ల జోడీ బాగుండటం, వాళ్ల మధ్య కెమిస్ట్రీ పండటం తొలి భాగాన్ని కొంత వరకూ కాపాడాయి. వాసుపై కాపీ ముద్ర పడిన దగ్గర్నుంచి కథలో ఆసక్తి మొదలవుతుంది. అప్పటి వరకూ రాసుకున్న సన్నివేశాలన్నీ కేవలం లీడ్ కి మాత్రమే ఉపయోగపడ్డాయి. అయితే ఈ క్రమంలో షార్ట్ ఫిల్మ్ ని సైతం, క్లైమాక్స్ లో వాడుకోవడం బాగుంది.

ఫొటో సోర్స్, @NameisNani/twitter
సింబాలిక్ టచ్
అసలు కథంతా ద్వితీయార్థంలో జరుగుతుంది. పునర్జన్మ అనే రొటీన్ కాన్సెప్టునే ఎత్తుకున్నా, దానికి కోల్‌కతా, దేవదాసిల నేపథ్యం ఎంచుకోవడంతో కథకు కొత్త కలర్ వచ్చినట్టైంది. దేవదాసి వ్యవస్థ ని ఈ కథలో కాస్త టచ్ చేశాడు దర్శకుడు.
బెంగాలీ రచయితలకు అభ్యుదయ భావాలు చాలా ఎక్కువ. అక్కడ ఎంతోమంది సంఘ సంస్కర్తలు పుట్టుకొచ్చారు. రచయితలే కొత్త చరిత్ర లిఖించారు. ఎన్నో చట్టాలకు కారణమయ్యారు. కాబట్టి.. శ్యామ్ సింగరాయ్ చేసిన పోరాటానికి బెంగాల్ ని నేపథ్యంగా ఎంచుకోవడం తెలివైన నిర్ణయం అనిపిస్తుంది. అలాగని దేవదాసీ వ్యవస్థ మూలాల్లోకి వెళ్లలేదు. కథని నడిపించడానికి దాన్నో పావుగా వాడుకున్నాడు.
ఎలాంటి కథలో అయినా భావోద్వేగాలు చాలా అవసరం. వాటిని పండించడానికి దేవదాసీ అనే పాయింట్ ఉపయోగపడింది. ఆడది వస్తువు కాదు - వెల నిర్ణయించడానికి అని చెప్పడం, ఆడదానిపై హక్కు ఆ దేవుడికి కూడా లేదు - అనే విషయాన్ని ప్రభావవంతంగా చూపించడానికి ఆయా సన్నివేశాల్ని వాడుకున్నాడు దర్శకుడు. పతాక సన్నివేశాలు కూడా రక్తి కట్టిస్తాయి.
ఇప్పటి వాసుదేవ్ - ఒకప్పటి రోసీ కలిసిన వేళ... దర్శకుడు మాటల జోలికి వెళ్లలేదు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం భావోద్వేగాల నడుమ కథని ముగించాడు. అక్కడ దర్శకుడి నైపుణ్యం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ సన్నివేశంలో దర్శకుడు రెండు విషయాల్ని బలంగా చెప్పాడు. ఒకటి.. రోసీ కల. రెండోది... `నన్నే నీ బిడ్డ అనుకో` అని గత జన్మలో...రోసీకి, శ్యామ్ చెప్పడం, అది సింబాలిక్ గా నిజం చేసి చూపించడం.. బాగున్నాయి.

ఫొటో సోర్స్, @NameisNani/twitter
లాజికల్ ఫినిషింగ్
లాజిక్కులు మిస్సవ్వకుండా దర్శకుడు వీలైనన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు. శ్యామ్ తెలుగు ఎందుకు మాట్లాడతాడు? దేవదాసి మైత్రీకి తెలుగు వచ్చా? ఇలాంటి ప్రశ్నలకు వాళ్ల సంభాషణలు, నేపథ్యాలతో సమాధానం చెప్పాడు. వాసుదేవ్ తీసిన షార్ట్ ఫిల్మ్ ని సైతం కథలో వాడుకున్నాడు. పతాక సన్నివేశాల్లో... ఓ కీలకమైన పాత్రనిప్రవేశ పెట్టి, లాజిక్కులకు పుల్ స్టాప్ పెట్టాడు. ఆ మాటకొస్తే.. పునర్జన్మల కాన్సెప్టులో లాజిక్ ఉండదు. కేవలం మ్యాజిక్ మాత్రమే. అలా అనుకుంటే ఎలాంటి గందరగోళం ఉండదు.
ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా - కొన్ని చోట్ల దర్శకుడు తేలిగ్గా దొరికిపోవడం కూడా విస్మయానికి గురి చేస్తుంది. `ఉనికి` అనే కథలో.. వాసుదేవ్ క్లైమాక్స్ రాలేక తర్జనభర్జనలు పడుతుంటే, శ్యామ్ సింగరాయ్ పాత్ర ఆవహించి క్లైమాక్స్ పూర్తి చేస్తుంది. అంటే ఆ కథలో కేవలం క్లైమాక్స్ మాత్రమే శ్యామ్ సింగరాయ్ ది. అలాంటప్పుడు మొత్తం కథని కాపీ అని ఎలా అంటారు?
శ్యామ్ సింగరాయ్ బెంగాల్ లో గొప్ప రచయిత అని చెబుతారు. అలాంటి వ్యక్తికి సంబంధించి ఒక్క ఫొటో కూడా ఉండదా? వాసుదేవ్ పై కాపీ ముద్ర పడినప్పుడు అప్పటి శ్యామ్, ఇప్పటి వాసుదేవ్ ఒకేలా ఉన్నారన్న విషయం జనాలకు తెలీదా? శ్యామ్ సింగరాయ్ ఫొటోలు లేవు అని చెప్పడానికి కూడా లేదు. ఎందుకంటే... క్లైమాక్స్ లో శ్యామ్ సింగరాయ్ ఫొటో కనిపిస్తుంది.
అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే...శ్యామ్ సింగరాయ్ ఓ కమ్యునిస్ట్. దేవుళ్లని నమ్మడు. అలాంటి వ్యక్తి కథ చెబుతూ.. తనకు పునర్జన్మలను ఆపాదించడం కాస్త వింతగా అనిపిస్తుంది.

ఫొటో సోర్స్, @NameisNani/twitter
ఎవరు ఎలా చేశారు?
నాని, సాయి పల్లవి లాంటి నటులు ఉండడం శ్యామ్ సింగరాయ్ కి కలిసొచ్చిన విషయం. ఏమీ లేదన్న చోట కూడా తమ నటనతో.. ఏదో ఉంది అనిపించారు. వాసు లాంటి పాత్రల్లో నానిని ఇది వరకు చాలాసార్లు చూసి ఉంటాం. ఆ పాత్రని చాలా ఈజ్ తో చేసేశాడు. అయితే శ్యామ్ సింగరాయ్ లాంటి బరువైన పాత్ర పోషించడం మాత్రం నానికి పూర్తిగా కొత్త. హుందాతనం నిండిన ఆ పాత్రలోనూ నాని రాణించాడు. మరీ బరువైన డైలాగులు ఇవ్వకుండా, మరీ అభ్యుదయ వాదిగా చూపించకుండా ఆ పాత్రని సరైన దిశలోనే నడిపించారు.
ఇక సాయి పల్లవి కనిపించిన కాసేపూ.. ఆ పాత్రతో ప్రయాణం చేసేస్తాం. పతాక సన్నివేశాల్లో ఆమె మేకప్ మరీ ఓవర్ గా అనిపిస్తుంది. రాహుల్ రవీంద్రన్ కూడా అంతే. కృతి గ్లామరస్ గా కనిపించింది. తొలి సన్నివేశాల్ని నడిపించడంలో కీలక పాత్ర పోషించింది.
1970ల నాటి బెంగాల్ నేపథ్యాన్ని తెరపైకి తీసుకుని రావడంలో టెక్నికల్ టీమ్ కృషి మెచ్చుకోదగినది. కళా విభాగం సమర్థవంతంగా పని చేసింది. అయితే కొన్ని చోట్ల మాత్రం `ఇది సెట్టింగే` అని చెప్పేసేంత వెసులుబాటు కూడా కల్పించింది. పాటలు కథలో భాగమైపోయాయి.

ఫొటో సోర్స్, @NameisNani/twitter
సిరివెన్నెల రాసిన సిరివెన్నెల పాట భావోద్వేగభరితంగా సాగింది. సంభాషణలన్నీ ఒకే మీటర్ లో సాగాయి. మరీ గుర్తుపెట్టుకోదగినంత మాటలు వినిపించకపోయినా, ఆ సమయంలో మాత్రం సన్నివేశాల్ని ఎలివేట్ చేయడానికి ఉపయోగపడ్డాయి.
ఈ కథలో అన్నీ ఉన్నాయి. అభ్యుదయ భావాలు, ఉద్వేగాలు, ప్రేమకథ, పిరియాడికల్ టచ్.. ఇవన్నీ కనిపిస్తాయి. అయితే ఏ ఎమోషన్ కూడా పతాక స్థాయిలో పండలేదు. `ఈ విషయంలో దర్శకుడు కొత్తగా ఆలోచించాడు, కొత్తగా చూపించాడు` అనే భావన రాదు.
కథంతా ఒకే స్పీడులో వెళ్తుంటుంది. తొలి సగంలో.. కాస్త సాగదీత కనిపిస్తే, ద్వితీయార్థంలో ఎమోషనల్ పెయిన్ అనేది పుట్టదు. శ్యామ్ సింగరాయ్ మరో జన్మ ఎత్తడానికి కారణమేంటి? రోసీని తన దగ్గరకు తీసుకెళ్లిపోవడానికా? అని ప్రశ్నించుకుంటే సమాధానం దొరకదు. శ్యామ్ సింగరాయ్ మరు జన్మ ఎత్తేంత బలమైన కారణం ఉండి ఉంటే...ఈ కథ మరో స్థాయిలో ఉండేది.
(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)
ఇవి కూడా చదవండి:
- 83: ‘‘అప్పట్లో క్రికెట్ పిచ్చోళ్ళు తక్కువ.. కలలో కూడా ఊహించని విజయం.. ఎలా సెలబ్రేట్ చేసుకోవాలో తెలియలేదు’’
- హిందూ రాజ్యం: హరిద్వార్ ధర్మ సంసద్‌లో వివాదాస్పద ప్రసంగాలపై కలకలం.. ఎవరెవరు ఏమన్నారు?
- ఉత్తర తెలంగాణపై దండెత్తిన కోతులు.. కొండ ముచ్చులు వీటికి చెక్ పెట్టగలవా?
- అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
- తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు
- పుష్ప రివ్యూ: సుకుమార్ ఆ పని చేయకపోవడమే ప్లస్, మైనస్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












