కృతి శెట్టి: ‘శృంగారం కూడా నటనే కదా.. అలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పా’ - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/NiharikaEnt
ఉప్పెన' సినిమాలో పోషించిన బేబమ్మ అనే పల్లెటూరి అమ్మాయి పాత్రకు పూర్తి భిన్నంగా ఉండే పాత్రను 'శ్యామ్‌సింగరాయ్'లో పోషించాను. అన్ని సీన్లలో నటించినట్లే శృంగారం సన్నివేశాల్లోనూ నటిస్తాను అని నటి కృతిశెట్టి అన్నట్లు 'ఆంధ్రజ్యోతి' పేర్కొంది.
''నానికి జోడీగా ఆమె నటించిన ఈ చిత్రం ఇటీవలే విడుదలైంది. సినిమాలో తన నటనకు వస్తున్న ప్రశంసలు, కెరీర్ గురించి కృతిశెట్టి మాట్లాడారు.
'నేను ఏ పాత్ర పోషించినా దాని తాలూకు సహజ స్వభావం, లక్షణాలు, అలవాట్ల గురించి వివరంగా నోట్స్ రాసుకుంటాను. కీర్తిపాత్రకు సంబంధించి రాసుకున్న నోట్స్ చాలా ఉపయోగపడింది. నా పాత్ర కాస్త మగరాయుడిలా ఉంటే బాగుంటుందని నేనే దర్శకుడికి చెప్పాను.'
'పొగ తాగడం నాకిష్టం ఉండదు. కానీ ఈ సినిమాలో నేను సిగరెట్ తాగే సన్నివేశాలు ఉన్నాయి. నేను చేయనంటే డైరెక్టర్ పొగాకు లేని సిగరెట్లు తెచ్చారు. మూడు రోజులు ప్రాక్టీస్ చేసి సిగరెట్ తాగే సన్నివేశాలు చేశాను.'
'శృంగార సన్నివేశాల్లో నటించడాన్ని తప్పుగా అనుకుంటారు. కానీ దాన్ని మేం వృత్తిపరంగానే చూస్తాం. యాక్షన్ సన్నివేశాలు చేసినట్టే శృంగార సన్నివేశాల్లోనూ నటిస్తాను. కథతో ముడిపడి ఉంటేనే అలాంటి సన్నివేశాలు చేస్తాను.'
నాకు యాక్షన్ సినిమాలు చేయాలని ఉంది. సుకుమార్ సినిమాలో నటించాలనుంది. 'బంగార్రాజు' షూటింగ్ పూర్తయింది. ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మాచర్ల నియోజకవర్గం అనే సినిమాలు కొత్త సంవత్సరంలో విడుదలవుతాయి. రామ్‌తో చేసే సినిమా సెట్స్ పై ఉందని'' కృతి చెప్పినట్లు ఆంధ్రజ్యోతి రాసుకొచ్చింది.

ఫొటో సోర్స్, ANI
జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్, 10 నుంచి ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్
జనవరి 3 నుంచి పిల్లలకు వ్యాక్సినేషన్ ప్రారంభిస్తామని ప్రధాని నరేంద్ర మోదీ చెప్పినట్లు 'వెలుగు' తెలిపింది.
''శనివారం రాత్రి జాతినుద్దేశించి ప్రసంగించిన మోదీ... ప్రపంచ వ్యాప్తంగా ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తిచెందుతున్నందున జాగ్రత్తగా ఉండాలన్నారు.
దేశంలోనూ ఒమిక్రాన్ వ్యాపిస్తోందన్నారు. ఒమిక్రాన్ విషయంలో అప్రమత్తంగా ఉండటంతో పాటు ప్రజలందరూ మాస్క్ తప్పనిసరిగా ధరించాలన్నారు. ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోవాలని సూచించారు.
'ఒమిక్రాన్ తో ప్రపంచ దేశాలు ఇబ్బందిపడుతున్నాయి. కరోనాను భారత్ సమర్థవంతంగా ఎదుర్కొంటోంది. దేశంలో 18 లక్షల ఐసోలేషన్ బెడ్లు సిద్ధంగా ఉన్నాయి. 4లక్షల ఆక్సిజన్ సిలిండర్లు సిద్ధంగా ఉన్నాయి.
పిల్లల కోసం ప్రత్యేకంగా 90 వేలకు పైగా బెడ్లు సిద్ధం చేశాం. దేశంలో గత జనవరి 16 నుంచి వ్యాక్సినేషన్ ప్రారంభం కాగా, దేశంలో అర్హులైన 61 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయింది. త్వరలో దేశంలో నాసల్ వ్యాక్సిన్ అందుబాటులోకి రానుంది.
జనవరి 3 నుంచి 15 నుంచి 18 ఏళ్ల లోపు వారికి వ్యాక్సిన్ అమలు చేస్తాం. జనవరి 10 నుంచి హెల్త్ కేర్ , ఫ్రంట్ లైన్ వర్కర్లకు బూస్టర్ డోస్ వేస్తాం. 60 ఏళ్ల పై వారు, ధీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు డాక్టర్ల సలహా మేరకు బూస్టర్ డోసు తీసుకోవచ్చని'' మోదీ ప్రసంగంలో చెప్పారని వెలుగు తెలిపింది.

ఫొటో సోర్స్, REUTERS / DANISH SIDDIQUI
ఏదో ఒక రోజు సాగు చట్టాలను మళ్లీ తెస్తాం: నరేంద్ర సింగ్ తోమర్
భవిష్యత్‌లో సాగు చట్టాలను మళ్లీ తీసుకొస్తామని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ అన్నట్లు 'సాక్షి' తెలిపింది.
''దాదాపు ఏడాదిపాటు సాగిన రైతు ఉద్యమం, రెండు రాష్ట్రాల ఎన్నికల నేపథ్యంలో దిగొచ్చిన కేంద్ర ప్రభుత్వం.. వ్యవసాయ చట్టాల్ని వెనక్కి తీసుకుంటున్నట్లు ప్రకటించిన తెలిసిందే. అయితే ఈ నిర్ణయం ప్రకటించిన కొద్దిరోజులకే కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తాజా సంచలన వ్యాఖ్యలు చేశారు.
నాగ్‌పూర్(మహారాష్ట్ర)లో శుక్రవారం అగ్రో విజన్ ఎక్స్‌పోలో పాల్గొన్న ఆయన సాగు చట్టాల్ని మళ్లీ తీసుకొచ్చేందుకు ప్రయత్నస్తున్నట్లు తెలిపారు.
కొన్ని మార్పులతో వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తీసుకొస్తాం అని వ్యాఖ్యానించారు. కొందరి వల్లే చర్చకు కూడా నోచుకోకుండా చట్టాలు వివాదాస్పదం అయ్యాయి. కేంద్రం వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది.
అందుకే కొన్ని మార్పులు చేసి మళ్లీ వ్యవసాయ చట్టాలు తీసుకొస్తాం. ఒక అడుగు వెనక్కి వేశామంటే.. మూడు అడుగులు ముందుకు వేస్తాం. వ్యవసాయ చట్టాల్ని మళ్లీ తెచ్చి తీరుతాం అని ఉద్ఘాటించారాయన.
సిక్కు మత వ్యవస్థాపకుడు గురు నానక్ జయంతి సందర్భంగా.. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా కొనసాగిస్తున్న ఆందోళనను ఇక విరమించాలని, ఇళ్లకు తిరిగి వెళ్లాలని ప్రధాని మోదీ రైతులకు విజ్ఞప్తి చేశారు.
సాగు చట్టాల ఉపసంహరణకు కేబినెట్ ఆమోదం తెలపగా.. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ఆమోదం, వెనువెంటనే సాగు చట్టాల రద్దు బిల్లుపై రాష్ట్రపతి ముద్ర పడినట్లు'' సాక్షి పేర్కొంది

ఫొటో సోర్స్, TRS/FACEBOOK
తెలంగాణలో సుపరిపాలన.. పరిశ్రమలు, సాంఘిక సంక్షేమంలో టాప్
దేశంలో పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో తెలంగాణ మొదటి ర్యాంకు సాధించిందని 'నమస్తే తెలంగాణ' కథనం పేర్కొంది.
''కేంద్ర ప్రభుత్వం శనివారం గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్ గణాంకాలు విడుదల చేసింది. కేంద్ర పరిపాలనా సంస్కరణలు, పబ్లిక్ గ్రీవెన్సెస్ శాఖ 2020-21 సంవత్సరానికి రాష్ట్రాలకు గుడ్ గవర్నెన్స్ ర్యాంకులను ప్రకటించింది.
రాష్ట్రాలను రెండు క్యాటగిరీలుగా, కేంద్ర పాలిత ప్రాంతాలను ఒక క్యాటగిరీగా, ఈశాన్య రాష్ట్రాలు, కొండలు, గుట్టలతో కూడిన రాష్ట్రాలను మరో కేటగిరీగా విభజించి ర్యాంకులను ప్రకటించారు.
తెలంగాణ రెండు అంశాల్లో మొదటి స్థానంలో నిలువగా, మరో రెండు అంశాల్లో రెండో స్థానంలో నిలిచింది. వ్యవసాయం, దాని అనుబంధశాఖ బాగా పురోగతి సాధించిందని నివేదికలో వెల్లడించారు.
పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో తెలంగాణ మొదటి ర్యాంకు సాధించింది. సాంఘిక సంక్షేమం, అభివృద్ధి అంశంలోనూ తొలి ర్యాంకును సాధించి దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచింది. ఆర్థిక నిర్వహణ, ప్రజామౌలిక సదుపాయాల్లో రెండో ర్యాంకును సాధించినట్లు'' నమస్తే తెలంగాణ తెలిపింది.
ఇవి కూడా చదవండి:
- హిమాన్షు బాడీషేమింగ్.. ‘అమిత్ షా గురించి, మోదీ కుటుంబం గురించి ఇలాగే మాట్లాడొచ్చా?’ - కేటీఆర్ ఆగ్రహం
- క్రిస్మస్ 2021: ఒమిక్రాన్ భయంతో తగ్గిన వేడుకలు.. మార్కెట్లలో కొనసాగుతున్న షాపింగ్ రద్దీ
- వాజ్‌పేయి మాటల్ని నెహ్రూ ఎందుకంత శ్రద్ధగా వినేవారు?
- ఏసుక్రీస్తు ఎలా కనిపించేవారు.. ఆయన అసలు చిత్రం ఏది?
- ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లోనూ నైట్ కర్ఫ్యూ తప్పదా... ఒమిక్రాన్ ఆంక్షలు ఎప్పటి నుంచి?
- కోవిడ్ -19తో మగవాళ్ల స్పెర్మ్ కౌంట్ తగ్గుతోందా... ఈ ప్రభావం నుంచి తప్పించుకోవడం ఎలా?
- చైనా: ప్రపంచ ఆయుధ పోటీలో డ్రాగన్‌దే విజయమా?
- శ్యామ్ సింగరాయ్ రివ్యూ: అన్నీ ఉన్న కథలో ఆ ఒక్క ఎలిమెంట్‌ను దర్శకుడు ఎలా మిస్సయ్యారు?
- హిందూ రాజ్యం: హరిద్వార్ ధర్మ సంసద్‌లో వివాదాస్పద ప్రసంగాలపై కలకలం.. ఎవరెవరు ఏమన్నారు?
- ఉత్తర తెలంగాణపై దండెత్తిన కోతులు.. కొండ ముచ్చులు వీటికి చెక్ పెట్టగలవా?
- అప్పుడే పుట్టిన శిశువుల్లో కామెర్లు ప్రమాదకరమా? కళ్లు పచ్చగా ఉంటే బాక్సులో పెట్టాలా? ఎండలో పెడితే సరిపోతుందా?
- బాయ్‌ఫ్రెండ్ ఆత్మహత్య.. గర్ల్‌ఫ్రెండ్‌కు జైలు శిక్ష విధించిన అమెరికా కోర్టు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










