యూరప్: ప్రాణాలను కాపాడే వ్యాక్సీన్లు రెడీగా ఉన్నా ప్రజలు ఎందుకు వేయించుకోవట్లేదు? మీరు తెలుసుకోవాల్సిన 3 అనుకూల, వ్యతిరేక వాదనలు..

కొన్ని దేశాలు వ్యాక్సీన్లను తీసుకోవడం తప్పనిసరి చేసే ఆలోచనల్లో ఉన్నాయి

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, కొన్ని దేశాలు వ్యాక్సీన్లను తీసుకోవడం తప్పనిసరి చేసే ఆలోచనల్లో ఉన్నాయి
    • రచయిత, టామ్ పూల్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ప్రపంచంలో చాలా దేశాల్లో కోవిడ్ వ్యాక్సీన్లను వేయించుకోవడం తప్పనిసరి చేశారు.

మీరు ఫ్రెంచ్ డాక్టర్, న్యూజీలాండ్ టీచర్, లేదా కెనడా ప్రభుత్వ ఉద్యోగి అయినా కూడా విధుల్లోకి వెళ్లాలంటే వ్యాక్సీన్ తీసుకోవడం తప్పనిసరి. ఇండోనేసియాలో వ్యాక్సీన్లను తీసుకోని వారికి లబ్ధి పథకాలను నిలిపేస్తోంది.

గ్రీసు దేశంలో 60 ఏళ్ళు పైబడిన వారికి వ్యాక్సీన్లు వేయించుకోవడం తప్పనిసరి చేశారు. తాజాగా ఈక్వెడార్ కూడా ఈ జాబితాలో చేరింది.

ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోన్న దృష్ట్యా ప్రజలకు నిర్బంధ వ్యాక్సినేషన్‌ను తప్పదని ఈక్వెడార్ ఆరోగ్య మంత్రిత్వశాఖ ప్రకటించింది.

ఫిబ్రవరి నాటికి ప్రతి ఒక్కరూ వ్యాక్సీన్ తీసుకోవడం తప్పనిసరి చేయాలని ఆస్ట్రియా భావిస్తోంది.

అలా అని ప్రజలందరికీ బలవంతంగా వ్యాక్సీన్లను ఇవ్వదు. కొంత మందికి వైద్యపరమైన, మతపరమైన కారణాల రీత్యా మినహాయింపులు ఇస్తుంది. కానీ, మినహాయింపులు లేని వారు మాత్రం వ్యాక్సీన్లు తీసుకోని పక్షంలో జరిమానాలు చెల్లించాల్సి ఉంటుంది.

జర్మనీ కూడా ఇదే విధానాన్ని అవలంభించాలని చూస్తోంది. ఈ విషయం గురించి నేను కొంత మంది పబ్లిక్ హెల్త్ నిపుణులతో మాట్లాడాను.

ఈ నేపథ్యంలో నిర్బంధ వ్యాక్సినేషన్‌కు మద్దతుగా, వ్యతిరేకంగా నిలిచే 3 అంశాల గురించి తెలుసుకుందాం.

వీడియో క్యాప్షన్, వెల్‌నెస్ బ్రాస్లెట్‌ల నుంచి రేడియేషన్ వెలువడుతోందా

మద్దతు : వ్యాక్సీన్లు ప్రాణాలను కాపాడతాయి

వ్యాక్సీన్లు తీసుకోవడం ద్వారా తీవ్రంగా జబ్బుపడే ముప్పు తగ్గుతుందని అంటున్నారు. దీంతో, ఆసుపత్రి పాలయ్యేవారి సంఖ్య తగ్గడంతో పాటు మరణాలు కూడా తగ్గుతాయి.

వ్యాక్సినేషన్ చరిత్రలోకి తొంగి చూస్తే, గతంలో అమలు చేసిన వ్యాక్సీన్ల కార్యక్రమాల ద్వారా స్మాల్‌పాక్స్ లాంటి రోగాల బారి నుంచి ప్రజలకు రక్షణ లభించింది. ఈ కార్యక్రమాలు మానవాళిని కాపాడి విజయవంతమైనట్లు కనిపిస్తుంది.

"వ్యాక్సినేషన్ ద్వారా తమను తాము రక్షించుకోవడం మాత్రమే కాకుండా, సమాజానికి కూడా రక్షణ కలుగుతుంది" అని యేల్ యూనివర్సిటీలో మెడిసిన్ హిస్టరీ అసోసియేట్ ప్రొఫెసర్ జ్యాసన్ షార్ట్జ్ చెప్పారు.

"వ్యాక్సీన్లు పని చేస్తాయి. అవి పని చేస్తాయనడానికి చాలా ఆధారాలున్నాయి" అని అన్నారు.

ఆస్ట్రియా కంటే కాస్త సరళంగా వ్యాక్సీన్లను తప్పనిసరి చేసిన దేశాల్లో కూడా వ్యాక్సినేషన్ శాతం పెరిగింది.

రెస్టారెంట్‌లు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో తిరిగేందుకు వ్యాక్సీన్ తప్పనిసరి చేయడం ద్వారా ఫ్రాన్స్‌లో వ్యాక్సీన్లు తీసుకునేవారి సంఖ్య పెరిగింది. దీంతో, బలవంతంగా వ్యాక్సీన్లను ఇచ్చే అవసరం ఉండదు.

కొన్ని దేశాల్లో కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు.

ఫొటో సోర్స్, Anadolu Agency

ఫొటో క్యాప్షన్, కొన్ని దేశాల్లో కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు

వ్యతిరేకం: ప్రతిఘటన ఎదురవుతుంది

లండన్‌లో జులైలో లాక్ డౌన్‌ను విధించినప్పుడు దానికి వ్యతిరేకంగా కొంత మంది నిరసనలు నిర్వహించారు.

కొన్ని సార్లు ప్రభుత్వం ఏమి చేసినా కొంత వ్యతిరేకత ఎదురవుతుంది. ప్రపంచంలోని కొన్ని దేశాల్లో కోవిడ్ నిబంధనలకు వ్యతిరేకంగా ప్రదర్శనలు నిర్వహించారు.

"వ్యాక్సీన్ల విషయం వచ్చేసరికి ప్రజలు కాస్త భిన్నంగా ఆలోచిస్తారు" అని లండన్ యూనివర్సిటీ కాలేజీలో ఇన్స్టిట్యూట్ ఫర్ గ్లోబల్ హెల్త్‌ డాక్టర్ వాగీష్ జైన్ చెప్పారు.

"వారి శరీరంలోకి ఎక్కించుకునే పదార్ధాల విషయంలో సాధారణ నిబంధనల మాదిరిగా చూడరు" అని అన్నారు.

కొంత మంది మాత్రం వ్యాక్సీన్లను తీసుకోవడానికి ప్రతిఘటిస్తారు. వ్యాక్సీన్లను పూర్తిగా వ్యతిరేకించనప్పటికీ వాటి గురించి చాలా మందికి అనుమానాలుంటాయి.

90లక్షల మంది ఉన్న ఆస్ట్రియా దేశ జనాభాలో 14.5 % మంది వ్యాక్సీన్ తీసుకోవడానికి సిద్ధంగా లేకపోగా, 9% మంది మాత్రం సందేహిస్తున్నట్లు ఒక అధ్యయనం తెలిపింది.

వ్యాక్సీన్లను తీసుకునేందుకు ప్రతిఘటించడం కంటే కూడా వ్యాక్సీన్లను తీసుకోవడం వల్ల లాభాలు ఎక్కువగా ఉంటాయనే విషయం గురించి కూడా ప్రభుత్వాలు చెప్పాలి. కానీ, ఈ విషయంలో చట్టపరంగా కూడా వాదనలు చేసేందుకు అవకాశం ఉందని కేప్ టౌన్ యూనివర్సిటీ లా ప్రొఫెసర్ అంటున్నారు.

"వ్యాక్సీన్లు తీసుకోవడం పట్ల వ్యతిరేకత, వైద్య చికిత్స గురించి సొంతంగా నిర్ణయాలు తీసుకునే హక్కు ఉండవచ్చు. కానీ, ప్రాణాపాయం కలిగించే రోగాల నుంచి రక్షించుకునేందుకు ఇతరుల హక్కులను హరించినట్లవుతుంది" అని ఆమె చెప్పారు.

మద్దతు: ఇతర మార్గాలన్నీ ప్రయత్నించి చూశాం

ఇప్పటికే కొన్ని రోజులుగా ప్రజలందరూ కోవిడ్‌తో సహవాసం చేస్తున్నారు. ప్రస్తుతం వ్యాక్సీన్లు కూడా అందుబాటులోకి వచ్చాయి.

యూరోప్‌లో గత కొన్ని నెలలుగా వ్యాక్సినేషన్లు జరుగుతున్నప్పటికీ, ఇంకా చాలా మంది జనాభా వ్యాక్సీన్లను తీసుకోలేదు.

ప్రపంచంలో పశ్చిమ దేశాలతో పోలిస్తే, తూర్పు దేశాల్లో వ్యాక్సినేషన్ తీసుకున్న వారి శాతాల్లో తీవ్రమైన వ్యత్యాసాలున్నాయి.

యూరప్‌లో వ్యాక్సీన్లు

వ్యాక్సినేషన్లు తప్పనిసరి చేసేందుకు ఆలోచించాల్సిన సమయం వచ్చిందని యూరోపియన్ కమిషన్ చీఫ్ ఉర్సులా ఓన్‌డేర్‌లేయేన్ అన్నారు. కానీ, ఇందుకు ఆయా దేశాల ప్రభుత్వాలు నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుందని అన్నారు.

"మన దగ్గర ప్రాణాలను కాపాడే వ్యాక్సీన్లు ఉన్నాయి. కానీ, వాటిని తగినంతగా ఉపయోగించటం లేదు" అని ఆమె అన్నారు.

వ్యతిరేకం: ఇంకా సమయం ఉంది

వ్యాక్సీన్లను తప్పనిసరి చేయాలని బలమైన వాదనలున్నాయి. కానీ వ్యాక్సినేషన్ శాతాన్నిపెంచేందుకు ఇదొక్కటే మార్గం కాదు.

"వ్యాక్సీన్లను తప్పనిసరి చేయడం ద్వారా సత్వర ఫలితాలు వస్తాయనే ఆశతో రాజకీయ నాయకులు ఈ ఆలోచనను సమర్థిస్తారు" అని ఆక్స్ ఫర్డ్ వ్యాక్సీన్ గ్రూప్ లో సోషల్ సైన్సెస్ రీసెర్చర్ సమంత వాండ్ స్లాట్ అన్నారు.

"ప్రజలందరూ వ్యాక్సీన్లను తీసుకునేందుకు ప్రభుత్వం చేపట్టవలసిన ఇతర చర్యలను పక్కన పెట్టడం నేను ఒప్పుకోను" అని ఆమె అన్నారు.

"ఫిబ్రవరి వరకు ఆస్ట్రియా కూడా వ్యాక్సీన్లను తప్పనిసరి చేయదు. ప్రస్తుతానికి ఆ దేశం ఇతర మార్గాలను అవలంభిస్తోంది".

"వ్యాక్సీన్లను తీసుకునేందుకు భయపడేవారి, నమ్మకం లేని వారి, తక్కువ ముప్పు ఉన్న వారి ఆందోళనలను కూడా విని దృష్టిలో పెట్టుకోవడం అవసరం" అని ఇన్స్ బ్రాక్ యూనివర్సిటీలో హెల్త్ సైకాలజిస్ట్ బార్బరా జూయెన్ చెప్పారు.

దక్షిణాఫ్రికాలో 24 శాతం మంది జనాభా వ్యాక్సీన్ తీసుకున్నారు. ఇది యూరోప్‌లో వ్యాక్సీన్ తీసుకున్న వారి సగటులో సగం. కానీ, ఆఫ్రికా ఖండం మొత్తం జనాభాలోవ్యాక్సీన్ తీసుకున్న వారి కంటే 7 % ఎక్కువ.

ఇక్కడ వ్యాక్సీన్ డోసుల కొరత లేదు. వ్యాక్సీన్ల గురించి సరైన సమాచారం లేకపోవడంతో వ్యాక్సీన్లను తీసుకునేవారి సంఖ్య తక్కువగా ఉంది.

కొన్ని పరిస్థితుల్లో ప్రభుత్వం వ్యాక్సీన్‌లను తీసుకోవడం తప్పనిసరి చేసింది. కానీ, ఒమిక్రాన్ వేరియంట్ తలెత్తినప్పటి నుంచి వ్యాక్సీన్లు తీసుకునే వారి సంఖ్య పెరిగింది.

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్ నేపథ్యంలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఎలాంటి నిబంధనలు పాటిస్తున్నారు

మద్దతు: లాక్ డౌన్లకు ముగింపు

వ్యాక్సీన్లను తప్పనిసరి చేయడం మాత్రమే కాకుండా... చాలా ప్రభుత్వాలు కోవిడ్ పాస్‌లను ప్రవేశపెట్టడం ద్వారా ప్రయాణ ఆంక్షలను విధించడం లాంటి నిబంధనలను అమల్లోకి తెచ్చాయి.

వ్యాక్సీన్లను తప్పనిసరి చేయడం ద్వారా లాక్ డౌన్లకు అంతం పలకడంతో పాటు ప్రాణాలను కూడా కాపాడవచ్చు.

"వ్యాక్సీన్లను తీసుకోకపోవడం కేవలం వ్యక్తి స్వాతంత్రానికి సంబంధించిన విషయం కాదు. ఇది ఆర్ధిక, మానసిక, ఆరోగ్య, శారీరక ఆరోగ్యానికి కలిగించే నష్టం కూడా" అని ఆక్స్‌ఫర్డ్ ఉహీరో సెంటర్ ఫర్ ప్రాక్టికల్ ఎథిక్స్‌లో సీనియర్ రీసెర్చ్ ఫెల్లో ఆల్బెర్టో గ్విబిల్నీ అన్నారు.

కరోనావైరస్ సోకే ముప్పు ఉన్నవారందరికీ వ్యాక్సీన్లను తప్పనిసరి చేయాలని ఆయన అన్నారు.

"వైరస్ ను నిరోధించేందుకు ఇతర చర్యలు అందుబాటులో ఉన్నప్పుడు లాక్ డౌన్లు విధించి ప్రజలను ఇబ్బంది పెట్టాల్సిన అవసరం లేదు" అని అన్నారు.

వీడియో క్యాప్షన్, ఒమిక్రాన్ వేరియంట్‌ను ఎదుర్కోవాలంటే బూస్టర్ డోస్ కావాల్సిందేనా?

వ్యతిరేకం: నష్టాలు ఉండవచ్చు

వ్యాక్సీన్ల వల్ల కొన్ని దీర్ఘకాలిక ఆందోళనలు కూడా ఉన్నాయి.

"విపత్తు సమయంలో పథకాలను తప్పనిసరి చేయడం ద్వారా అవి తిప్పికొట్టే ప్రమాదం ఉంది" అని అల్‌జజీరా చానెల్‌తో ప్రపంచ ఆరోగ్య సంస్థకు పాండెమిక్ నుంచి కోలుకునే విధానాల పట్ల సలహాలను ఇచ్చే ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ డిక్కీ బుడిమాన్ అన్నారు.

"కుట్ర సిద్ధాంతాలు, లేదా వ్యాక్సీన్ల పట్ల అపనమ్మకాలు ఉన్నప్పుడు తప్పనిసరిగా అమలు చేసే పథకాలు వారి అభిప్రాయాలను మరింత బలపరుస్తాయి" అని అన్నారు.

ప్రస్తుతమున్న రాజకీయ వాతావరణం గురించి వాండెల్‌స్లాట్ ప్రస్తావించారు. "యూరోప్‌లో కొన్ని పార్టీలు వ్యాక్సీన్ వ్యతిరేకతను ప్రదర్శించడం చూశాం. అది కొన్ని వర్గాల నుంచి ఓట్లను పొందేందుకు ఒక మార్గంగా కూడా చూశారు" అని అన్నారు.

"మనం మరిన్నిరాజకీయ పార్టీలను ఇదే తరహాలో చూడవచ్చు. వారి రాజకీయ ప్రచారాల్లోకి ఇదే సందేశాన్ని చేర్చి తప్పనిసరిగా వ్యాక్సీన్లను తీసుకోవడం అనే నిబంధనను తొలగిస్తామనే హామీ ఇవ్వవచ్చు. ఇది కేవలం భయం మాత్రమే. పార్టీలు ఒకసారి ఇలాంటి పద్ధతిని గనక అవలంభిస్తే, దీనిని ఒక విధాన చర్యగా అమలు చేసేందుకు అవకాశం ఉండదు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)