జొమాటో, స్విగ్గీ ఆర్డర్లపై పన్ను భారం: 5 శాతం జీఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయం - ప్రెస్‌రివ్యూ

జొమాటో, స్విగ్గీ

ఫొటో సోర్స్, NURPHOTO/GETTYIMAGES

జొమాటో, స్విగ్గీ వంటి ఫుడ్ డెలివరీ యాప్స్ ఇకపై నేరుగా కస్టమర్ నుంచే 5 శాతం జీఎస్టీని వసూలు చేసేందుకు కేంద్రం నిర్ణయించిందని 'నమస్తే తెలంగాణ' ఒక వార్తాకథనం ప్రచురించింది.

''ఈ నిబంధన జనవరి 1 నుంచి అమల్లోకి రానుంది. దీనివల్ల ఫుడ్ ఆర్డర్లు భారం కానున్నాయని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరికొందరు తోసి పుచ్చుతున్నారు.

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు గతంలో రెస్టారెంట్లు 5 శాతం చొప్పున జీఎస్టీని వసూలు చేసేవి. స్విగ్గీ, జొమాటో కేవలం తమ సేవలకు వినియోగదారుల నుంచి కొంత మొత్తం వసూలు చేసేవి.

ఈ విధానం వల్ల కొన్ని గుర్తింపు లేని రెస్టారెంట్ల కారణంగా ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్నట్లు కేంద్రం గుర్తించింది.

ఈ నేపథ్యలో జీఎస్టీ చెల్లించాల్సిన బాధ్యతను ఈ ఫుడ్ డెలివరీ యాప్‌లకే అప్పజెప్పాలని, డెలివరీలపై 5 శాతం జీఎస్టీని విధించాలని జీఎస్టీ కౌన్సిల్‌లో నిర్ణయం తీసుకున్నారు.

క్యాబ్‌లు

ఫొటో సోర్స్, Getty Images

క్యాబ్ బుకింగ్ రద్దు చేస్తే డ్రైవర్లకు జరిమానా

కొత్త సంవత్సరం వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ పోలీసులు విడుదల చేసిన మార్గదర్శకాల్లో భాగంగా ప్రయాణికుల బుకింగ్‌లను వాహన డ్రైవర్లు రద్దు చేస్తే ఈ-చలాన్ రూపంలో రూ. 500 జరిమానా విధించనున్నట్లు పేర్కొన్నట్లు 'సాక్షి' తెలిపింది.

''క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటో రిక్షా ఆపరేటర్లు యూనిఫాం ధరించి ఉండాలి. అన్ని రకాల వాహన పత్రాలను వెంట ఉంచుకోవాలని పోలీసులు నిర్దేశించారు.

ఎవరైనా క్యాబ్, ఆటో బుకింగ్స్‌ను రద్దు చేస్తే సైబరాబాద్‌ పరిధిలో అయితే 94906 17346, రాచకొండ పరిధిలో అయితే 94906 17111కు వాహనం, సమయం, ప్రాంతం వంటి వివరాలను వాట్సాప్‌ చేయాలని సూచించారు.

ఓఆర్‌ఆర్‌పై విమానాశ్రయానికి వెళ్లే వాహనాలకు (విమాన టికెట్‌ను చూపించాలి) మినహా ప్యాసింజర్, తేలికపాటి వాహనాలకు అనుమతి లేదు.

మీడియం, గూడ్స్‌ వాహనాలకు మాత్రం అనుమతి ఉంటుంది. ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వాహనాలకు మినహా పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ మీదకి ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు.

క్లబ్, పబ్‌ నిర్వాహకులూ బాధ్యులే..

బార్, క్లబ్, పబ్‌లలో మద్యం తాగి వాహనం నడిపి ఏదైనా ప్రమాదాలకు కారణమైతే వాహనదారులతో పాటూ సంబంధిత బార్, క్లబ్, పబ్‌ నిర్వాహకులపై కూడా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.

తాగి వాహనం నడిపే బదులుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. ర్యాష్‌ డ్రైవింగ్, మితిమీరిన వేగం, హారన్, ట్రిపుల్, మల్టీఫుల్‌ రైడింగ్‌ వంటి వాటిపై కేసులు నమోదు చేస్తారని'' సాక్షి తెలిపింది.

వంగవీటి రాధా

ఫొటో సోర్స్, VANGAVEETI RADHA KRISHNA/FB

రాధా ఇంటి వద్ద స్కూటీ కలకలం

'నన్ను హత్య చేయడానికి రెక్కీ నిర్వహించారు' అంటూ వంగవీటి రాధా చేసిన వ్యాఖ్యల తర్వాత... తాజాగా రాధా కార్యాలయం ఎదురుగా ఒక స్కూటీ పార్క్‌ చేసి ఉండడం సంచలనంగా మారిందని 'ఆంధ్రజ్యోతి' రాసుకొచ్చింది.

''వంగవీటికి మహాత్మాగాంధీ రోడ్డును ఆనుకుని కార్యాలయం ఉంది. దీనికి ఎదురుగా ఇల్లు ఉంది. ఈ ఇంట్లోనే వంగవీటి మోహన్‌రంగా ఉండేవారు. రాధా ఇక్కడికి వచ్చినప్పుడు కార్యాలయంలో ఉంటారు.

నాలుగు రోజులుగా ఏపీ16 ఎఫ్‌డీ 5914 నంబరు స్కూటీ ఇంటి వద్ద పార్క్‌ చేసి ఉంది. దీన్ని రాధా కార్యాలయంలోని సిబ్బంది గురువారం ఉదయం గుర్తించారు.

వెంటనే గవర్నరుపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని స్కూటీని పరిశీలించారు.

రాధా కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న స్వీట్స్‌ షాపు నుంచి ఒక వ్యక్తి పోలీసుల వద్దకు వెళ్లి ఆ స్కూటీ తమ షాపులో పనిచేసిన వ్యక్తిదని వివరించారు.

సంబంధిత ధ్రువీకరణ పత్రాలను చూపించాలంటూ పోలీసులు వాహనాన్ని స్టేషన్‌కు తరలించారు.

ఆ స్వీట్‌ షాపులో గతంలో పనిచేసిన కాశీరాజు ప్రస్తుతం ఓ బేకరీలో పనిచేస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం బీసెంట్‌ రోడ్డుకు వచ్చిన కాశీరాజు... వాహనం పాడైపోవడంతో స్కూటీని స్వీట్‌ షాపు వద్ద పార్క్‌ చేసి తాళం వేశాడు.

ఈ విషయం షాపు వర్కర్లు రాధా కార్యాలయ సిబ్బందికి చెప్పకపోవడంతో వారు అనుమానం వ్యక్తంచేశారు. వరుస సంచలనాల వెలుగులో టీడీపీ నేతలు గుంటూరు జిల్లా తాడేపల్లిలో ఉంటున్న రాధా ఇంటికి వెళ్లి పరామర్శించారు.

విజయవాడ తూర్పు ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్‌, పెనమలూరు మాజీ ఎమ్మెల్యే బోడె ప్రసాద్‌ తదితరులు రాధాతో భేటీ అయ్యారు.

జరుగుతున్న పరిణామాలపై చర్చించారు. మరోపక్క ఎంజీ రోడ్డులోని రాధా కార్యాలయం వద్ద పోలీసు బందోబస్తు కొనసాగుతున్నట్లు'' ఆంధ్రజ్యోతి పేర్కొంది.

తమిళనాడులో భారీ వర్షం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

తమిళనాడులో కుండపోత

తమిళనాడులోని నాలుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తుండటంతో రెడ్ అలర్ట్ జారీ చేసినట్లు 'వెలుగు' తెలిపింది.

''గురువారం మధ్యాహ్నం నుంచి ఏకధాటిగా కురిసిన వర్షాలతో నగరం నీట మునిగింది. సిటీలోని పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి. దీంతో భారీగా ట్రాఫిక్ స్తంభించింది.

గంటల వ్యవధిలోనే 18సెంటీమీటర్ల వర్షం కురియడంతో లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. పలు ప్రాంతాల్లో రోడ్లన్నీ వరదనీటితో నిండిపోయాయి.

భారీగా వరద నీరు వచ్చి చేరడంతో రోడ్లపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఇటీవల నగరంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు తాత్కాలిక మరమ్మత్తులు చేయడంతో ఆ గుంతల్లో వర్షపు నీరు నిలిచిపోయింది.

మరోవైపు మెట్రో పనులు కూడా జరుగుతుండటంతో వడపళనిలో వరదనీరు భారీగా వచ్చి చేరింది. ఎగ్మూర్, సెంట్రల్, పురసైవాక్కం, గిండి తదితర ప్రాంతాల్లో రోడ్లన్నీ కాలువలను తలపించాయి.

బంగాళాఖాతంలో తూర్పు వైపు దిశగా గాలులు వేగంగా దూసుకుస్తున్నాయని... తీరం వెంబడి నగరాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెబుతోంది.

రాబోయే రెండు రోజుల్లో కోస్తా జిల్లాలు, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ పరిసర జిల్లాల్లో కూడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపినట్లు'' వెలుగు స్పష్టం చేసింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)