చిరు ధాన్యాలు: మన తాత ముత్తాతలు తిన్న జొన్నలు, సజ్జలు, రాగులు ఇప్పుడు స్మార్ట్‌ ఫుడ్ ఎలా అయ్యాయి?

జొన్న రొట్టెలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, జొన్న రొట్టెలు
    • రచయిత, గీతా పాండే
    • హోదా, బీబీసీ న్యూస్

చిన్నప్పుడు ఉత్తర్ ప్రదేశ్‌లోని మా సొంతూరుకి వెళ్ళినప్పుడు మా నానమ్మ జొన్న లేదా సామలతో చేసిన రొట్టెలు తినడం చూస్తూ ఉండేదానిని.

ఆమె రొట్టె పిండిని నీటితో కలిపి ముద్దగా చేసి, వాటిని చిన్న చిన్న ముద్దలుగా విడదీసి, వాటితో రొట్టెలు చేసి కర్రల పొయ్యి మీద మట్టి పెనం పై కాలుస్తూ ఉండేవారు.

ఆ రొట్టెలు నాకు తినమని ఇచ్చినప్పుడు, ముక్కుపుటాలు ఎగరేసి వద్దని తిరస్కరించేదానిని. పలచగా, తినడానికి రుచిగా ఉండే గోధుమ రొట్టెలకు బదులు ఆమె అవెందుకు తినేవారో నాకర్ధమయ్యేది కాదు.

కానీ, కొన్నేళ్ల కిందటి నుంచి నేను కూడా నాడు మా నానమ్మ తినే ఆహారాన్నే తినడం మొదలుపెట్టాను.

చిరుధాన్యాలు ఆరోగ్యకరమైనవనే రిపోర్టులు చూడటంతో, మా వంటింట్లో గోధుమ పిండి స్థానాన్ని సామ పిండి ఆక్రమించేసింది.

ఈ రొట్టెలను కాస్త శ్రమతో నమలాల్సి వస్తోంది కానీ, అవి తినడం వల్ల కాస్త ఆరోగ్యంగా అనిపించడంతో ఇక నేను ఆపలేదు.

ఇలా చేస్తున్నది నేనొక్కదానిని మాత్రమే కాదు. జనం ‘మర్చిపోయిన ఆహారాలు’ తిరిగి పొలాల్లోకి, పంటల్లోకి , ఆఖరుకు మన అన్నంప్లేట్ లోకి మళ్లీ చేరుతున్నాయని వ్యవసాయ నిపుణులు కూడా చెబుతున్నారు.

"చిరుధాన్యాల ఉనికిని తిరిగి తీసుకొచ్చేందుకు కొంత కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా కృషి జరుగుతోంది" అని ఇక్రిశాట్ (ఇంటర్నేషనల్ క్రాప్స్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఫర్ ది సెమీ ఆరిడ్ ట్రాపిక్స్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ జ్యాక్‌లీన్ హ్యూస్ చెప్పారు.

వీడియో క్యాప్షన్, విదేశీ పక్షుల విడిది తేలినీలాపురం
చిరుధాన్యాల పొలంలో మహిళా రైతు

ఫొటో సోర్స్, L Vidyasagar/Icrisat

ఫొటో క్యాప్షన్, చిరుధాన్యాల పొలంలో మహిళా రైతు

మళ్లీ ఆదరణ

భారతదేశం 2018ని చిరుధాన్యాల సంవత్సరంగా జరుపుకుంది. మార్చిలో ఐక్య రాజ్య సమితి కూడా 2023ను అంతర్జాతీయ చిరు ధాన్యాల సంవత్సరంగా జరిపేందుకు దిల్లీ చేసిన ప్రతిపాదనను అంగీకరించింది.

ఆ సంవత్సరంలో చిరు ధాన్యాలు ఆరోగ్యానికి చేసే మేలు గురించి, అనువైన సాగు పద్ధతుల గురించి అవగాహన కలిగించేందుకు పని చేస్తారని నివేదికలు చెబుతున్నాయి. ఒక వైపు ప్రపంచం గ్లోబల్ వార్మింగ్ ఎదుర్కొంటున్న నేపథ్యంలో, వీటిని సారవంతం కాని భూముల్లో, అతి తక్కువ ఎరువులను వాడి కూడా సాగు చేయవచ్చు.

చిరుధాన్యాలు భూ గ్రహానికి, రైతుకు, ఆరోగ్యానికి కూడా మేలు చేసేవి కావడంతో వాటిని స్మార్ట్ ఫుడ్‌గా గుర్తిస్తున్నట్లు హ్యూస్ చెప్పారు.

"వాటి సాగుకు చాలా తక్కువ నీరు అవసరమవుతుంది. వీటిని అధిక ఉష్ణోగ్రతల్లో కూడా పండించవచ్చు.కఠినమైన వాతావరణ పరిస్థితులను, కొన్నికీటకాల నుంచి వచ్చే రోగాలను కూడా తట్టుకోగలవు. రైతుకు కూడా లాభదాయకంగా ఉండటంతో పాటు పోషకాలు ఉంటాయి. చిరు ధాన్యాలు తినడం వల్ల మధుమేహం లాంటి రోగాలు నియంత్రణలో ఉంటాయని, కొలెస్టరాల్ స్థాయిలు మెరుగుపడతాయని, కాల్షియం శాతాన్ని పెంచుతాయని, జింక్, ఐరన్ కొరతను పూరిస్తాయని అధ్యయనాలు కూడా చెబుతున్నాయి. వీటిలో గ్లూటెన్ కూడా ఉండదు" అని చెప్పారు.

భారతదేశంలో ఆరోగ్య నిపుణులు కూడా చిరుధాన్యాల వైపు ఆసక్తిగా చూస్తున్నారు.

దేశంలో ఇప్పటికే 8 కోట్ల మంది మధుమేహ వ్యాధిగ్రస్తులున్నారు. 1.7 కోట్ల మంది ప్రతీ సంవత్సరం గుండె సంబంధిత రోగాలతో మరణిస్తున్నారు. 30లక్షల మందికి పైగా పిల్లలు పోషకాహార లోపంతో బాధపడుతున్నారు. అందులో సగం మంది తీవ్ర పోషకాహార లోపంతో బాధపడుతున్నారు.

దేశంలోని పోషకాహార లోపాన్ని తరిమి కొట్టడానికి చిరుధాన్యాల విప్లవం రావాలని ప్రధాని మోదీ కూడా అన్నారు.

అయితే, భారతదేశంలో కొన్ని శతాబ్దాలుగా చిరుధాన్యాలు ప్రధాన ఆహారంగా ఉండటంతో ఇది కష్టమైన పని కూడా కాదని నిపుణులు అంటున్నారు.

"చిరుధాన్యాలు మానవ జాతికి తెలిసిన అత్యంత ప్రాచీన ధాన్యాలు" అని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ డైరెక్టర్ విలాస్ టోనాపి అన్నారు.

వీటిని సుమారు క్రీస్తు పూర్వం 3000లో ఇండస్ వ్యాలీ నాగరికతలో పండించారు. వీటిని వివిధ రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో వారి సంస్కృతిలో, మతపరమైన ఆచారాల్లో భాగంగా ఉండే రకరకాల చిరుధాన్యాలను 21 రాష్ట్రాల్లో పండిస్తున్నారు.

ఏడాదికి 1.6 కోట్ల టన్నుల దిగుబడితో భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక శాతం చిరుధాన్యాలను ఉత్పత్తి చేస్తోంది. కానీ, గత 50 సంవత్సరాల్లో చిరు ధాన్యాలు పండించే సాగు భూమి 3.8 కోట్ల హెక్టార్ల నుంచి 1.3 కోట్ల హెక్టార్లకు పడిపోయింది.

దీంతో, చిరుధాన్యాల ఉత్పత్తిలో ప్రపంచంలో 1960లలో 20% శాతం ఉండే భారత్ వాటా నేడు 6 శాతానికి పడిపోయింది.

"1969-70లలో చిరుధాన్యాలను పడించడం తగ్గడం మొదలయింది" అని డాక్టర్ టోనాపి అన్నారు.

"అప్పటి వరకు భారతదేశంలో జనాభా ఆహార సరఫరాకు ఇతర దేశాల నుంచి పెద్ద మొత్తంలో ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకుంటూ ఉండేది. కానీ, ఆహార ఉత్పత్తిలో స్వయం ప్రతిపత్తి సాధించేందుకు, ఆకలిని పారదోలేందుకు, ప్రభుత్వం హరిత విప్లవానికి నాంది పలికింది. దాంతో, అధిక దిగుబడి వచ్చే వరి, గోధుమ ఆహారపంటల్లోకి ప్రవేశించాయి.

1960- 2015 మధ్యలో గోధుమ ఉత్పత్తి మూడింతలయింది. వరి ఉత్పత్తి 800 శాతం పెరిగింది. చిరుధాన్యాల ఉత్పత్తి చాలా తక్కువ శాతంలో నిలకడగా ఉండిపోయింది.

వీడియో క్యాప్షన్, పుంగనూరు పొట్టి ఆవు ధర రూ. 5 లక్షలకు పైమాటే... ఎందుకో తెలుసా?
చిరుధాన్యాల సాగు

ఫొటో సోర్స్, P Srujan/Icrisat

ఫొటో క్యాప్షన్, చిరుధాన్యాల సాగు

గోధుమ, వరి ఆధిపత్యం

1960ల నుంచి గోధుమ, వరి ఉత్పత్తి చిరుధాన్యాల ఉత్పత్తిని అధిగమించాయి.

"గోధుమ, వరి పై పెట్టిన అధిక దృష్టితో చిరుధాన్యాల పై నిర్లక్ష్యం వహించడం మొదలయింది. దీంతో, చాలా సంప్రదాయ తరహా ఆహార పదార్ధాలు పక్కకి వెళ్లిపోయాయి" డాక్టర్ హ్యూస్ చెప్పారు. ఆమె ఈ ఏడాది మొదట్లో మరుగున పడిపోయిన ఆహార పదార్ధాల జాబితాతో గ్లోబల్ మ్యానిఫెస్టో రూపొందించడంలో భాగస్వామ్యం వహించారు.

"చిరుధాన్యాలు ఆధునిక రుచులకు అనుగుణంగా లేకపోవడం, వండేందుకు సులభం కాకపోవడంతో వాటి వాడకం బాగా తగ్గి కొన్ని దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి లోనవ్వడం మొదలయింది. కానీ, మన పళ్లెంలో విభిన్న ఆహార పదార్ధాలుండటం చాలా అవసరం" అని ఆమె అన్నారు.

ఆ విభిన్నత చేకూరాలంటే, మర్చిపోయిన పంటలకు కూడా వరి, గోధుమ, ఇతర వాణిజ్య పంటలకిచ్చినంత ప్రాధాన్యత ఇవ్వాలి. చిరుధాన్యాల విషయంలో కనీసం ఒక ప్రారంభమైనా జరగాలని నిపుణులంటున్నారు.

ఇప్పటికే, వాటిని పునరుద్ధరించేందుకు వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించిన అనేక వ్యూహాలు ఫలితాలను చూపించడం మొదలుపెట్టాయి. గత రెండేళ్లలో చిరుధాన్యాల డిమాండ్ 146 % పెరిగిందని డాక్టర్ టోనాపి చెప్పారు.

మిల్లెట్ బిస్కట్లు, కుకీలు, చిప్స్, పఫ్స్ లాంటివి సూపర్ మార్కెట్ లలో, ఆన్ లైన్ స్టోర్ లలో కనిపిస్తున్నాయి.

ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా ప్రభుత్వం కూడా చిరుధాన్యాలను కేజీ రూ.1 కి కొన్ని లక్షల మందికి అందిస్తోంది. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకంలో మిలెట్లను చేర్చారు.

ఈ చిరుధాన్యాల పై కొత్తగా పుట్టిన ఆసక్తి కొన్ని గిరిజన తెగల వారికొక వెలుగులా అవతరించింది, ముఖ్యంగా తెలంగాణాలో ఉత్తర జిల్లాల్లో.

ఆసిఫాబాద్‌లో గ్రామీణ ప్రాంతాల్లో పిల్లల డే కేర్ కేంద్రాల్లో ఆహారాన్ని వండేందుకు ఇక్రిశాట్ శిక్షణ ఇచ్చిన పది మంది గిరిజన మహిళల్లో పి.ఐలా ఒకరు.

ఆమె వండే ఆహారంలో వాడే పదార్ధాలు, మసాలాలను ఆమె ఫోన్‌లో మాట్లాడుతూ వివరించారు. ఆగస్టులో జొన్నలతో 12 టన్నుల మిఠాయిని, పిండివంటలను తయారు చేసినట్లు చెప్పారు.

ఆమె ఆహారంలో ఎప్పటి నుంచో భాగంగా ఉన్న ఈ చిరుధాన్యం పట్ల ఇతరులకు కలుగుతున్న ఆసక్తి గురించి ఆమెకింకా పూర్తిగా అర్ధం కాలేదు. కానీ, అదిప్పుడు విభిన్న ప్రాంతాలకు విస్తరించడం పట్ల ఆనందంగా ఉన్నానని ఆమె నాతో చెప్పారు.

వీడియో క్యాప్షన్, వరంగల్: తరగతి గదిలో పీరియడ్స్ పాఠాలు బోధిస్తున్న టీచర్

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)