వైఎస్ షర్మిల: ఏపీలోనూ పార్టీ పెడితే తప్పేంటి - ప్రెస్ రివ్యూ

ఫొటో సోర్స్, facebook/YSSharmilaReddy
తెలంగాణలో ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే కోవిడ్ నిబంధనలు తీసుకొస్తున్నారని వైఎస్ షర్మిల అన్నారని 'ఈనాడు' వార్తాకథనం రాసింది.
'సోమవారం లోటస్ పాండ్‌లో షర్మిల విలేకరులతో మాట్లాడారు. టీఆర్ఎస్ నిర్వహించే రైతుబంధు పండుగలకు కోవిడ్ నిబంధనలు అడ్డురావని.. వైఎస్సార్ తెలంగాణ పార్టీ రైతు ఆవేదన యాత్ర నిర్వహించుకుంటామంటే మాత్రం అనుమతి లేదంటున్నారని విమర్శించారు.
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌లో కూడా పార్టీ ప్రారంభిస్తారన్న ఊహాగానాలపై షర్మిల స్పందించారు. 'రాజకీయాల్లో భాగంగా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు. ఏపీలో పెట్టకూడదని నిబంధన ఏమీ లేదు కదా. మేం ఒక మార్గాన్ని ఎంచుకున్నాం' అని అన్నారు.
బీజేపీ, కేసీఆర్ దొందూ దొందేనని.. రాష్ట్ర సమస్యల నుంచి దృష్టి మళ్లించేందుకు బీజేపీ లక్ష్యంగా కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని ఆమె అన్నారు'' అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
విజయవాడలో మత్తు మందుల అక్రమ రవాణా కలకలం
విజయవాడ నుంచి చెన్నైకి గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న మందులను చెన్నై పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారని సాక్షి పత్రిక ఓ కథనాన్ని ప్రచురించింది.
వివరాల్లోకెళ్తే.. మత్తు కలిగించే రూ.4 లక్షల విలువైన టైడాల్ (టెపడడాల్) మందులను ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా కొరియర్ ద్వారా చెన్నైలో 10 మందికి పంపారు. ఈ సమాచారం తెలుసుకున్న చెన్నై పోలీసులు అవి విజయవాడ నుంచి వస్తున్నట్లు నిర్ధారించుకుని ఇక్కడకు వచ్చారు.
స్థానిక పోలీసులు, డ్రగ్స్ కంట్రోల్ అధికారులతో కలసి తనిఖీలు నిర్వహించారు. నక్కల రోడ్డులోని సత్య డ్రగ్ హౌస్, పుష్పా హోటల్ సెంటర్‌లోని శ్రీ వెంకటాద్రి ఫార్మాలో తనిఖీలు చేశారు. ఈ సందర్భంగా చెన్నైకి మందులు సరఫరా చేసినట్లు బిల్లులు లభించాయి. వాటిని స్వాధీనం చేసుకున్న పోలీసులు రెండు షాపుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు.
నొప్పి నివారణకు వాడే టెపడడాల్ మందులను బిల్లులు లేకుండా చెన్నై తరలించడంతో అక్కడి పోలీసులు పట్టుకున్నారని డ్రగ్ ఇన్‌స్పెక్టర్ శ్రీరామమూర్తి తెలిపారు.

ఫొటో సోర్స్, BANDI SANJAY
బండి సంజయ్‌కు 14 రోజుల రిమాండ్, ఈటల హౌస్ అరెస్ట్
కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించడంతోపాటు పోలీసులపై కార్యకర్తలతో దాడి చేయించారనే ఆరోపణలతో నమోదైన కేసుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి కరీంనగర్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ కస్టడీ విధించిందని ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది.
ఈ మేరకు ఎక్సైజ్ మెజిస్ర్టేట్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆయనను జిల్లా జైలుకు తరలించారు. ఉపాధ్యాయుల బదిలీలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 317ను సవరించాలంటూ కరీంనగర్‌లో జాగరణ దీక్షకు పూనుకున్న సంజయ్‌ని పోలీసులు ఆదివారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత మధ్య అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనతోపాటు మరో 16 మంది బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేసి, కేసు నమోదు చేశారు.
సోమవారం మధ్యాహ్నం బండి సంజయ్‌తోపాటు పార్టీ నాయకులు పెద్దపల్లి జితేందర్, పుప్పాల రఘు, కచ్చు రవి, మర్రి సతీశ్‌ను కోర్టులో హాజరుపరిచారు. దీంతో వారికి మెజిస్ట్రేట్ ఈ నెల 17 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. మరికొందరు నిందితులు తప్పించుకున్నారని, వారిని కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
బండి సంజయ్ అరెస్టును బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తీవ్రంగా ఖండించారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే అరెస్టు చేశారని ఆరోపించారు. కేసీఆర్ ప్రభుత్వం అనుసరిస్తున్న రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు బీజేపీ భయపడబోదని తెలిపారు.
విపత్తు చట్టం విపక్షాలకే వర్తిస్తుందా? సీఎం కేసీఆర్ కుటుంబానికి వర్తించదా? అని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ప్రశ్నించారు. టీఆర్‌ఎస్‌కు ఒక నీతి, మిగతా పార్టీలకు మరో నీతా? అని నిలదీశారు. బండి సంజయ్ అరెస్టును నిరసిస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళన చేపట్టాయి.
బండి సంజయ్ అరెస్టుకు నిరసనగా ఆందోళనలు చేపట్టకుండా బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ను సోమవారం మేడ్చల్ జిల్లా దేవరయంజాల్‌లోని ఆయన నివాసంలో పోలీసులు హౌస్ అరెస్టు చేశారు.

ఫొటో సోర్స్, DR. HARDIK RUGHWANI/TWITTER
వ్యాక్సిన్ మిక్సింగ్‌తో అధికంగా యాంటిబాడీల ఉత్పత్తి.. హైదరాబాద్ ఏఐజీ దవాఖాన అధ్యయనం
ఒక డోసు కొవిషీల్డ్ వేసుకొన్నవారు, ఇంకో డోస్ కొవాగ్జిన్ వేసుకోవచ్చా? రెండు వేర్వేరు వ్యాక్సిన్లు వేసుకొంటే ఇబ్బందవుతుందా? అంటే.. భేషుగ్గా, ఎలాంటి భయం లేకుండా, నిరభ్యంతరంగా వ్యాక్సిన్ మిక్సింగ్ చేయవచ్చని చెప్తున్నారు హైదరాబాద్‌లోని ఏఐజీ దవాఖాన శాస్త్రవేత్తలు అంటూ నమస్తే తెలంగాణ ఒక కథనాన్ని ప్రచురించింది.
సాధారణంగా ప్రతి ఒక్కరు ఒకే రకమైన రెండు డోసుల కరోనా టీకా తీసుకోవాలి. కానీ, రెండు వేర్వేరు టీకాలు తీసుకోవటం కూడా సురక్షితమేనని ఏఐజీ హాస్పిటల్ జరిపిన అధ్యయనంలో తేలిందని దవాఖాన చైర్మన్ డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. మిక్స్‌డ్ వ్యాక్సిన్ సురక్షితమే కాకుండా ఒకే రకమైన టీకాలు తీసుకొన్న వారిలో కంటే వేర్వేరు రకాల టీకాలు తీసుకొన్నవారిలో ప్రతిరోధకాల స్పందన అధికంగా ఉన్నట్టు ఆయన వివరించారు.
టీకా వేయించుకోని, కరోనా వ్యాధి సోకని 330మంది ఆరోగ్యవంతులపై అధ్యయనం జరపగా 44మందికి ‘సీరో నెగెటివ్’ వచ్చినట్టు తేలిందని వివరించారు. వేర్వేరు రకాల రెండు డోసు లు ఇచ్చిన ఏ ఒక్కరిలోనూ ప్రతికూల ప్రభావాలు కనిపించలేదని వెల్లడించారు.
ఒకే రకమైన వ్యాక్సిన్ తీసుకొన్న వారితో పోల్చితే వేర్వేరు రకాల వ్యాక్సిన్‌లు తీసుకొన్న వారిలో స్పైక్ ప్రొటీన్‌ను తటస్థీకరించే ప్రతిరోధకాల సంఖ్య అధికంగా ఉన్నట్టు ఈ అధ్యయనం ద్వారా స్పష్టమైందని డాక్టర్ నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఒకే రకమైన టీకా తీసుకొన్నవారి కంటే వేర్వేరు వ్యాక్సిన్లు తీసుకొన్న వారిలో ప్రతిరోధకాల ప్రతిస్పందన నాలుగు రెట్లు అధికంగా ఉన్నదని వెల్లడించారు.
స్పైక్ ప్రొటీన్‌ను తటస్థీకరించే ప్రతిరోధకాలు వైరస్‌ను అంతం చేయటం వల్ల వ్యాధి ఒకరి నుంచి మరొకరికి వ్యాపించే స్వభావం తగ్గిపోతుందని వివరించారు. ఈ నెల 10నుంచి ప్రారంభమయ్యే ప్రికాషన్ డోసులో వ్యాక్సిన్ మిక్సింగ్‌ను సూచనప్రాయ అధ్యయనంగా పరిగణించాలని ఐసీఎంఆర్‌ను ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి:
- మొబైల్ ఫోన్ కొనేటప్పుడు గుర్తుంచుకోవలసిన ఏడు విషయాలు
- హరగోవింద్ ఖురానా, సుబ్రమణ్యం చంద్రశేఖర్.. ఈ నోబెల్ గ్రహీతలకూ పాకిస్తాన్‌కు ఉన్న కనెక్షన్ ఏంటి?
- బుల్లీ బాయి-సుల్లీ డీల్స్ ఏంటి? యాప్‌లో భారతీయ ముస్లిం యువతుల వేలంపై పోలీసులు ఏమంటున్నారు?
- గల్వాన్ లోయలో చైనా జెండా.. ఫొటోలు, వీడియో విడుదల చేసిన చైనా సైన్యం.. మోదీ సమాధానం చెప్పాలన్న రాహుల్
- శవాల మధ్య దాక్కుని ప్రాణాలు కాపాడుకున్న 9 మంది మహిళలు
- పాకిస్తాన్ అమ్మాయిలు ఎవరికీ కనిపించని భాగాల్లో టాటూలు వేయించుకుంటున్నారు ఎందుకు?
- తన చిన్ననాటి జ్ఞాపకాలతో గ్రామం మ్యాప్ గీశాడు.. కిడ్నాప్ అయిన 30 ఏళ్ల తర్వాత కన్నతల్లిని కలిశాడు
- చరిత్రలో మొట్టమొదటి రివెంజ్ పోర్న్ కేసు.. భార్య నగ్న చిత్రాలు బయటపెట్టిన భర్త.. ఏం జరిగింది?
- ఆంధ్రప్రదేశ్: ఇద్దరు గిరిజన బాలికలపై నకిలీ పోలీసు అఘాయిత్యం.. అత్యాచారం కేసు నమోదు
- RRR విడుదల వాయిదా: కోవిడ్‌తో దెబ్బతిన్న సినిమా థియేటర్ల భవిష్యత్తు ఏంటి... ఓటీటీల ప్రభావం ఎంత?
- హైదరాబాద్‌లో పెరిగిన పెళ్లిళ్లు.. అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచే బిల్లు గురించి తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)














