హైదరాబాద్‌లో పెరిగిన పెళ్లిళ్లు.. అమ్మాయిల వివాహ వయస్సు 21 ఏళ్లకు పెంచే బిల్లు గురించి తల్లిదండ్రులు ఎందుకు భయపడుతున్నారు?

ఫొటో సోర్స్, UNIVERAL IMAGES GROUP VIA GETTY
- రచయిత, ఇమ్రాన్ ఖురేషీ
- హోదా, బీబీసీ కోసం
అమ్మాయిల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచాలనే చట్టం త్వరలో అమల్లోకి వచ్చే అవకాశం ఉంది.
ఒకవేళ ఈ చట్టం అమల్లోకి వస్తే, ఇప్పటికే నిశ్చయమైన వివాహాలు మరికొన్నేళ్ల పాటు వాయిదా పడే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితిని తప్పించుకోవడానికి 18 నుంచి 20 ఏళ్ల వయస్సున్న తమ కూతుర్లకు వీలైనంత త్వరగా పెళ్లి చేసేందుకు హైదరాబాద్‌లోని చాలా కుటుంబాలు హడావిడిగా ఏర్పాట్లు చేస్తున్నాయి.
ఒక్కసారిగా పెళ్లిళ్లలో వేగం పెరిగిందని ఖాజీలు కూడా ఒప్పుకుంటున్నారు.
పేద కుటుంబాలకు చెందిన వారే ఎక్కువగా ఈ విధంగా ఆలోచిస్తున్నారు. పేద కుటుంబాలకు చెందిన ఆడపిల్లల పెళ్లిళ్లకు ప్రభుత్వం ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. తొందరగా పెళ్లి చేయాలని ఆలోచించడానికి బహుశా ఇది కూడా ఒక కారణం కావచ్చు.
''అమ్మాయిల వివాహ వయస్సు పెంపుపై ప్రతిపాదించిన చట్టం గురించి హైదరాబాద్‌తో పాటు దేశంలోని ప్రతీ చోటా ముస్లిం కుటుంబాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. మరో మూడేళ్లపాటు తమ కూతుర్లకు పెళ్లి చేయకుండా ఉండేందుకు నిరుపేద కుటుంబాలకు చెందిన తల్లిదండ్రులు ఇష్టపడట్లేదు. అందుకే వారు అమ్మాయిల పెళ్లి చేసేందుకు తొందరపడుతున్నారు'' అని బీబీసీతో మౌలానా సయీద్ ఉల్ ఖాద్రి పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అమ్మాయిల వివాహ వయస్సు పెంపు ప్రతిపాదన
ఇటీవల ముగిసిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం సవరణ చట్టాన్ని ప్రవేశపెట్టింది.
అబ్బాయిలతో సమానంగా అమ్మాయిల పెళ్లి వయస్సును కూడా 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని పేర్కొంటూ బాల్య వివాహాల నిషేధ సవరణ బిల్లును ప్రతిపాదించింది.
ఈ సవరణ బిల్లుపై అనేక ప్రశ్నలు తలెత్తడంతో, ప్రస్తుతం ఈ బిల్లును లోక్‌సభ సెలెక్ట్ కమిటీకి ప్రభుత్వం అప్పగించింది. దీనిపై నివేదిక వచ్చిన తర్వాతే, ప్రభుత్వం ఈ అంశంలో ముందుకు వెళ్లే అవకాశం ఉంది.
ఇప్పటికే సంబంధం కుదిరి మరో సంవత్సరం, రెండేళ్లలో పెళ్లి చేయాలని ప్రణాళికలు చేసుకున్న చాలా కుటుంబాలు ఉన్నాయి. కానీ, తాజాగా అమ్మాయిల పెళ్లి వయస్సును 21 ఏళ్లకు పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో, అనుకున్న సమయాని కంటే ముందే వారంతా పెళ్లి చేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తింది.
తౌఫీక్ కుటుంబాన్ని ఉదాహరణగా తీసుకుంటే, ఆయన రెండో కూతురు కేవలం ఒకరోజు వ్యవధిలోనే పెళ్లి పీటలు ఎక్కాల్సి వచ్చింది. ''పెళ్లి చూపుల తర్వాత ఎంగేజ్‌మెంట్‌ను మరో నాలుగైదు నెలల్లో చేయాలని అనుకున్నాం. ఆ తర్వాత పెళ్లి కోసం మరో ఏడాది లేదా ఏడాదిన్నర ఆగాలని నిర్ణయించుకున్నాం'' అని తౌఫీక్ చెప్పారు.
''ఒకవేళ కొత్త చట్టం తొందరగా అమల్లోకి వస్తే మరో మూడేళ్ల పాటు మా కూతురికి పెళ్లి చేయడం కుదరదని మా కుటుంబానికి తెలిసింది. దీంతో ఒక రోజులోనే పెళ్లి చేసుకోవాలని మా అమ్మాయిపై ఒత్తిడి తెచ్చి చివరకు ఒప్పించాం. మా అమ్మాయికి 18 ఏళ్లే. ఆమె పదో తరగతి పాసైంది'' అని ఆయన చెప్పారు.
అమ్మాయి పెళ్లి కోసం తౌఫీక్ అప్పు తీసుకోవాల్సి వచ్చింది. ''కరోనా వల్ల మాకు ఎటువంటి ఆదాయం రాలేదు. మేం కారు లోను కట్టాల్సి ఉంది. కరోనా వల్ల అది కూడా కట్టలేకపోయాం. వచ్చే ఏడాది, ఏడాదిన్నర కాలంలో కొంత డబ్బు కూడబెట్టాక వారి పెళ్లి చేయాలని తొలుత అనుకున్నాం'' అని ఆయన చెప్పుకొచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
సంబంధాలు విడిపోయే ప్రమాదం
''అబ్బాయి, యునాని మెడికల్ స్టోర్‌లో పని చేస్తాడు. ఇప్పుడు మేం వివాహం జరిపించకపోతే, కొత్త చట్టం ప్రకారం మరో మూడేళ్ల పాటు ఆగాల్సి ఉంటుంది. అప్పటివరకు ఇరు వర్గాల మధ్య ఇప్పుడున్నంత అనుబంధం ఉంటుందని ఆశించలేం. ఇంకా మా అమ్మాయికి అప్పగింతలు ఇవ్వలేదు. ఆ కార్యక్రమం తర్వాత చేస్తాం'' అని ఆయన అన్నారు.
దీని గురించి మౌలానా సయీద్ మాట్లాడారు. ''పాశ్చాత్య, అరబ్ దేశాల తరహాలో మన దగ్గర అమ్మాయి, అబ్బాయిలు కలిసి తిరగరు. వారిలా పెళ్లి చేసుకోరు. భారతదేశంలో వివాహం అంటే కేవలం వధువు, వరుడికి సంబంధించిన అంశం మాత్రమే కాదు... అది సంస్కృతి, సంప్రదాయాలు, ఆచారవ్యవహారాలు, రెండు కుటుంబాల మధ్య ఏర్పడే బంధానికి సంబంధించినది. అందుకే పెళ్లి విషయంలో బాగా ఆలోచించి, చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటారు. అలాంటి పెళ్లిళ్ల కోసం రెండు, మూడేళ్లు ఆగలేం'' అని ఆయన అన్నారు.
గత కొన్ని రోజుల్లోనే చాలా మందికి వివాహాలు జరిపించిన ఖాజీ అస్మతుల్లా ఖాద్రీ, బీబీసీ హిందీతో దీని గురించి మాట్లాడారు.
''పేద కుటుంబాలకు చెందినవారే కాదు, మధ్యతరగతి, సంపన్న వర్గాలకు చెందిన చాలా కుటుంబాలు... కొత్త చట్టానికి భయపడి తమ అమ్మాయిల వివాహాన్ని హడావిడిగా జరిపిస్తున్నారు. అమ్మాయిలకు 18 ఏళ్లలోనే పెళ్లి చేయాలనేది హైదరాబాద్‌లో ఆచారంగా ఉంది. మధ్యతరగతి వారితో పాటు ధనికులు కూడా మూడేళ్ల పాటు ఎదురుచూసి కుదిరిన సంబంధాన్ని చెడగొట్టుకోవడానికి ఇష్టపడరు. ఇక పేదవారి విషయానికొస్తే, మరో మూడేళ్ల పాటు కూతురు భారాన్ని మోయాల్సి ఉంటుందని వారు భావిస్తున్నారు'' అని ఆయన చెప్పుకొచ్చారు.
''మా బంధువులు, స్నేహితుల ఇళ్లలోనే ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయి. కొత్త చట్టం వల్ల కూతురి పెళ్లికి మరో మూడేళ్లు ఆగాల్సి వస్తుందనే భయమే ఇందుకు ప్రధాన కారణం'' అని తౌఫీక్ పేర్కొన్నారు.
ఆలస్యంగా వివాహం చేసుకోవడం వల్ల మంచి బంధాలు విచ్ఛిన్నమయ్యే అవకాశముందని మౌలానా సయీద్ తెలిపారు.
అయితే, హడావిడిగా పెళ్లిళ్లు చేసే ఈ తంతు కేవలం హైదరాబాద్‌లోనే ఎక్కువగా కనబడుతోంది. బెంగళూరు లాంటి నగరాల్లో ఈ తరహా వాతావరణం కనిపించడం లేదు.
జామియా మసీదుకు చెందిన మౌలానా మసూద్ ఇమ్రాన్, ఈ అంశంపై బీబీసీ హిందీతో మాట్లాడారు. ''బెంగళూరులో కూడా ఇలాంటి వివాహాలు జరుగుతున్నాయి. కానీ మిగతా నగరాలతో పోలిస్తే ఇక్కడ చాలా తక్కువగా జరుగుతున్నాయి. కర్ణాటకలో ఉండే పరిస్థితులు కాస్త భిన్నం' అని చెప్పారు.
''ముఖ్యంగా బాగా కష్టపడి పనిచేసే వేతన జీవులు...సుదీర్ఘ సమయం పాటు పని చేయడం వల్ల శక్తిని కోల్పోతున్నారు. అందుకే వీలైనంత త్వరగా తమ పిల్లలు కూడా పని చేయడం ప్రారంభించాలని ఆ తల్లిదండ్రులు కోరుకుంటున్నారు'' అని కర్ణాటకకు చెందిన ఒక అధికారి చెప్పారు. ఆయన తన పేరును గోప్యంగా ఉంచాలని కోరారు.
ఇవి కూడా చదవండి:
- పాకిస్తాన్: ఇమ్రాన్ ఖాన్ ప్రభుత్వానికి ఇన్ని కష్టాలా?
- ఒమిక్రాన్: భారత్‌లో కేసుల పెరుగుదల, థర్డ్ వేవ్ సంకేతమా?
- అన్నవరం ప్రసాదం ఎందుకంత రుచిగా ఉంటుంది... ఏమిటా రహస్యం?
- భీమా కోరేగావ్: హింసాత్మక ఘర్షణలకు నేటితో నాలుగేళ్లు.. ఇప్పటి వరకూ ఈ కేసులో ఏం జరిగింది?
- జమ్మూ కశ్మీర్: మాతా వైష్ణోదేవీ ఆలయంలో తొక్కిసలాట, 12 మంది మృతి
- కోవిడ్-19: 2021 చివరికల్లా 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని భారత్ ఎందుకు సాధించలేకపోయింది?
- చైనా: షియాన్ నగరంలో కఠిన లాక్డౌన్.. ఆహారం అందక ప్రజల ఆకలి కేకలు
- జార్ఖండ్: లీటరు పెట్రోలుకు రూ.25 తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. సబ్సిడీ నిబంధనలు ఏంటంటే..
- 2021 వైరల్ వీడియోలు: సోషల్ మీడియాను కదిలించిన 5 వీడియోలను ఇక్కడ చూసేయండి...
- పిల్లలకు కోవిడ్19 వ్యాక్సీన్: టీకా ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - 7 ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)














