మలాలా యూసఫ్‌జాయ్: అసర్ మలిక్‌తో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత నిఖా

మలాలా, అసర్ మలిక్

ఫొటో సోర్స్, Malin Fezehai

ఫొటో క్యాప్షన్, మలాలా, అసర్ మలిక్

నోబెల్ శాంతి బహుమతి గ్రహీత మలాలా యూసఫ్‌జాయి పెళ్లి చేసుకున్నారు. బర్మింగ్‌హామ్‌లో ఇస్లాం సంప్రదాయంలో అసర్ మలిక్‌తో ఆమె నిఖా జరిగింది. వధూవరులిద్దరూ ఈ పెళ్ళి తమకు సమ్మతమే అని చెబుతూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు.

"ఇది నా జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజు" అని మలాలా అన్నారు. పాకిస్తాన్‌కు చెందిన ఈ మానవ హక్కుల కార్యకర్త 2012లో తాలిబాన్ల దాడికి గురైన తరువాత వెస్ట్ మిడ్‌ల్యాండ్స్‌లో ఆశ్రయం పొందుతున్నారు.

"అసర్, నేను పెళ్లి చేసుకున్నాం" అని ఆమె మంగళవారం నాడు ట్వీట్ చేశారు. కుటుంబ సభ్యుల మధ్య నిరాడంబరంగా ఈ పెళ్లి జరిగిందని ఆమె తెలిపారు.

"ఇకపై జీవితంలో మేమిద్దరం కలిసి ప్రయాణించబోతున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది" అని 24 ఏళ్ల మలాలా చెప్పారు. తాలిబాన్ల దాడికి గురైనప్పుడు ఆమె వయసు 15 ఏళ్లు.

మలాలా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు

ఫొటో సోర్స్, Malin Fezehai

ఫొటో క్యాప్షన్, మలాలా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు

వాయవ్య పాకిస్తానలోని స్వాత్ లోయలో మిలిటెంట్లు స్కూల్ బస్సులోకి ఎక్కి కాల్పులు జరిపినప్పుడు మలాలా అందులో ఉన్నారు. ఆ దాడిలో మలాలాతో పాటు మరో ఇద్దరు విద్యార్థినులు గాయపడ్డారు. తీవ్రమైన గాయాలతో ఆమె మృత్యువుతో పోరాడి గెలిచారు. ఆ తరువాత ఆమె కుటుంబం బర్మింగ్‌హామ్‌కు వెళ్లి స్థిరపడింది. "ఇది నా రెండో ఇల్లు" అని మలాలా అంటారు.

మలాలా 17 ఏళ్ల వయసులో నోబెల్ బహుమతి గెల్చుకున్నారు. ఆ పురస్కారం అందుకున్న అతి పిన్న వయస్కురాలు ఆమే. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకుని ఆ తరువాత ఆమె మానవ హక్కుల ఉద్యమకారిణిగా మారారు.

డిగ్రీ పూర్తి చేసినప్పటి నుంచి ఆమె అఫ్గాన్ శరణార్థులకు మద్దతుగా నిలిచారు. ఆపిల్ టీవీ ప్లస్‌తో ఒప్పందాన్ని కుదుర్చుకుని డాక్యుమెంటరీలు తీశారు. బ్రిటిష్ వోగ్ పత్రిక ముఖచిత్రంగా ప్రత్యక్షమయ్యారు. బాలికలకు చదువుకునే అవకాశాలను మెరుగు పరచాలంటూ ఆమె నాటి నుంచి ఉద్యమిస్తూనే ఉన్నారు.

మలాలా, అసర్ మలిక్

ఫొటో సోర్స్, Malin Fezehai

మలాలా గతంలో పెళ్లి గురించి భిన్నమైన అభిప్రాయాలు వ్యక్తం చేశారు. జూలై నెలలో వోగ్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె, "మనుషులు ఎందుకు పెళ్లి చేసుకోవాలో నాకు ఇప్పటికీ అర్థం కాదు. జీవితంలో ఒక వ్యక్తి తోడు కావాలనుకున్నప్పుడు పెళ్లి పత్రాల మీద సంతకాలు చేస్తే సరిపోతుందిగా? అదొక భాగస్వామ్యంగా ఎందుకు కొనసాగకూడదు" అని ఆమె అన్నారు.

"మా అమ్మ మాత్రం... 'అలా ఎప్పుడూ మాట్లాడే సాహసం చేయకు! నీవు పెళ్లి చేసుకోవాలి. పెళ్లి ఎంతో బాగుంటుంది' అనేవారు" అని మలాలా చెప్పారు.

ఆమె వివాహ వార్తకు అభిమానులు లక్షల సంఖ్యలో స్పందించారు. ఈ జంట సంతోషంగా ఉండాలని ఆశీస్సులు తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఈ గాలీ, ఈ నేలా, ఇక్కడి వాతావరణం నాకెంతో ఇష్టం!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)