మలాలాతో క్యూబెక్ విద్యాశాఖ మంత్రి దిగిన ఈ ఫొటో మీద విమర్శలు ఎందుకు వస్తున్నాయి?

ఫొటో సోర్స్, TWITTER/@JFROBERGEQC
కెనడాలోని క్యూబెక్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి.. విద్యారంగ ఉద్యమకారిణిగా ప్రసిద్ధి చెందిన మలాలా యూసఫ్‌జాయ్‌తో ఇలా ఫొటో దిగినందుకు విమర్శలు ఎదుర్కొంటున్నారు.
నోబెల్ బహుమతి గ్రహీత అయిన మలాలా తల మీద స్కార్ఫ్ ధరిస్తారు. ఆమె అలా క్యూబెక్ రాష్ట్రంలో పాఠాలు చెప్పలేరు.
ఎందుకంటే, క్యూబెక్ ఇటీవల ఒక వివాదాస్పద చట్టం చేసింది. ఉపాధ్యాయులు సహా పౌర సేవకులు అంటే ప్రభుత్వ సిబ్బంది ఎవరూ పని ప్రదేశంలో మత చిహ్నాలు ధరించరాదని నిషేధిస్తూ చేసిన చట్టం అది.
బాలికలకు విద్య అందుబాటు, ప్రపంచ అభివృద్ధి అంశాలపై తాను మలాలాతో చర్చించినట్లు క్యూబెక్ విద్యా మంత్రి జీన్ ఫ్రాంకో రోబర్జ్ చెప్పారు.
పాకిస్తాన్‌లోని ఛాందసవాద ప్రాబల్యమున్న ప్రాంతంలో బాలికలకు విద్యావకాశాలు అవసరమని గళమెత్తుతూ.. పాఠశాలకు వెళ్లటానికి ధైర్యం చేసిన మలాలా మీద 2012లో తాలిబన్ మిలిటెంట్లు కాల్పులు జరిపారు. ఆమె తలకు తూటా గాయాలయ్యాయి. సుదీర్ఘ చికిత్స అనంతరం ప్రాణాలతో బయటపడ్డారు.

ఫొటో సోర్స్, BIRMINGHAM HOSPITALS TRUST
అప్పటి నుంచీ బాలికల విద్యా హక్కు కోసం ఆమె చేస్తున్న ఉద్యమానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది.
అధికారిక పదవులు, ఉద్యోగాల్లో ఉన్న పౌర సేవకులు కృపాణం, తలపాగా, హిజాబ్ వంటి మత చిహ్నాలను పని ప్రదేశాల్లో ధరించరాదని నిషేధిస్తూ క్యూబెక్ జూన్ నెలలో లౌకిక చట్టం చేసింది.
న్యాయమూర్తులు, పోలీస్ అధికారులు, ఉపాధ్యాయులు తదితర ప్రభుత్వ ప్రతినిధులు ఈ జాబితాలో ఉంటారు.
ఈ చట్టం మీద విమర్శలు వచ్చాయి. రాష్ట్రంలో చాలా చర్చ జరిగింది.
క్యూబెక్‌లో ప్రభుత్వం నుంచి మతాన్ని ముఖ్యంగా చర్చిని వేరు చేసే దిశగా ఈ చట్టం ముందడుగు అని మద్దతుదారులు అంటున్నారు.

ఫొటో సోర్స్, COURTESY MANDEEP KAUR BAL
ఈ చట్టంలో ఏ మతాన్ని నిర్దిష్టంగా ప్రస్తావించకపోయినప్పటికీ, ఇది వివక్షా పూరితమని, రాష్ట్రంలో హిజాబ్ ధరించే ముస్లిం మహిళలను అన్యాయంగా లక్ష్యం చేసుకుందని విమర్శకులు వాదిస్తున్నారు.
ఈ నేపథ్యంలో మలాలాతో ఇలా ఫొటో దిగిన విద్యా మంత్రి మీద ఆన్‌లైన్‌లో కొందరు విమర్శించారు.
ఫ్రాన్స్ పర్యటనకు వెళ్లినపుడు మలాలాను కలిసిన రోబెర్జ్... తమ రాష్ట్రం చేసిన లౌకిక చట్టాన్ని సమర్థించారు.
'తాను క్యూబెక్‌లో ఉపాధ్యాయురాలిగా పాఠాలు బోధించాలని మలాలా కోరితే మీరెలా స్పందిస్తార'ని సలీమ్ నదీమ్ వాల్జీ అనే జర్నలిస్ట్ ట్విటర్‌లో అడిగిన ప్రశ్నకు, ''అది క్యూబెక్‌కు పెద్ద గౌరవం'' అని చెప్తానని బదులిచ్చారు. అంతేకాదు, ''ఫ్రాన్స్ తదితర సహనశీల దేశాల తరహాలోనే క్యూబెక్‌లో కూడా ఉపాధ్యాయులు తమ విధుల్లో ఉన్నపుడు మతపరమైన చిహ్నాలు ధరించటానికి కుదరదు అని కూడా ఆమెకు కచ్చితంగా చెప్తా'' అని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- తిరుమలలో తన మతం గురించి సోనియా ఏం చెప్పారు?
- "మతాంతర వివాహం చేసుకోవడమే మా తప్పా?"
- భారత్‌లో కులం-మతం లేకుండా సర్టిఫికెట్ పొందిన మొట్ట మొదటి మహిళ
- బందరు పోర్టును తెలంగాణకు అప్పగిస్తున్నారా? అసలు వివాదం ఏమిటి? ఏపీ ప్రభుత్వ మౌనం ఎందుకు?
- #INDvSL మ్యాచ్ చూస్తుంటే విమానం శబ్ధం వినిపిస్తోందా? ఆ విమానం ఇదే
- ఆంధ్రా సరిహద్దులో అరుదైన ఆదివాసీ తెగ 'రీనో'
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









