కోవిడ్-19: 2021 చివరికల్లా 100 శాతం వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని భారత్ ఎందుకు సాధించలేకపోయింది?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, శ్రు తి మీనన్
- హోదా, బీబీసీ రియాలిటీ చెక్
దేశంలోని మొత్తం 94 కోట్ల మంది వయోజనులకూ 2021 చివరికల్లా రెండు డోసుల కోవిడ్ వ్యాక్సినేషన్ పూర్తి చేయాలన్న లక్ష్యాన్ని భారత్ పూర్తిచేయలేకపోయింది.
2021 మే నెలలో అప్పుడు కేంద్ర మంత్రిగా ఉన్న ప్రకాశ్ జావదేకర్ ఈ లక్ష్యాన్ని ప్రకటించారు. ‘‘2021 డిసెంబర్ నాటికి భారతదేశంలో వ్యాక్సినేషన్‌ను పూర్తిచేస్తాం’’ అని చెప్పారాయన.
వ్యాక్సీన్ కార్యక్రమం ఎక్కడి దాకా వచ్చింది?
2021 డిసెంబర్ 30వ తేదీ నాటికి భారతదేశంలోని వయోజనుల్లో 64 శాతం మందికి రెండు డోసుల వ్యాక్సీన్ పూర్తవగా.. సుమారు 90 శాతం మంది మొదటి డోసు తీసుకున్నారు.
అందరికీ పూర్తి వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని సాధించటానికి మరింత ఎక్కువ కాలం పడుతుందని నిపుణులు చెప్పారు.
ప్రభుత్వం ప్రకటించిన లక్ష్యం అవాస్తవికంగా ఉందని.. ఎందుకంటే నూరు శాతం వ్యాక్సీన్ కవరేజీని అందుకోవటం ఎన్నడూ సాధ్యం కాదని ఆరోగ్యవ్యవస్థల నిపుణుడు, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ చంద్రకాంత్ లహారియా చెప్తున్నారు.
‘‘వివిధ కారణాల వల్ల వ్యాక్సీన్ తీసుకోవటానికి నిరాకరించే జనం ఎల్లప్పుడూ ఉంటారు’’ అన్నారాయన.

ఫొటో సోర్స్, AFP
డిసెంబర్ మొదటి వారం నుంచి వ్యాక్సినేషన్లు మందగించాయని.. భారత వ్యాక్సీన్ డాష్‌బోర్డ్ కోవిన్ చెప్తోంది.
అక్టోబర్ మధ్య కాలం నుంచి మొదటి డోసు కన్నా ఎక్కువగా రెండో డోసు వ్యాక్సీన్లు ఇస్తున్నారు.
రోజు వారీ వ్యాక్సినేషన్ల సంఖ్య ఎగుడుదిగుడుగా సాగుతోంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పుట్టినరోజైన సెప్టెంబర్ 17వ తేదీన అత్యధిక సంఖ్యలో వ్యాక్సినేషన్లు తీసుకున్నారు.
ఆ రోజు రెండు కోట్లకు పైగా టీకాలు వేశారు. కానీ ఆ తర్వాత మళ్లీ ఏ రోజూ ఆ సంఖ్యను చేరుకోలేదు.
సెప్టెంబర్ నెలలో సగటున రోజుకు 81 లక్షల డోసులు ఇవ్వగా.. అక్టోబర్‌లో అది రోజుకు 54 లక్షలకు, నవంబర్ నెలలో రోజుకు 57 లక్షలకు పడిపోయింది.
సెప్టెంబర్ స్థాయి కొనసాగినట్లయితే భారతదేశం తన లక్ష్యానికి దగ్గరగా వచ్చివుండేదని నిపుణులు చెప్తున్నారు. కానీ వ్యాక్సీన్ కోసం డిమాండ్ ఆ తర్వాత పడిపోయింది.
2021 జనవరిలో మొదలైన వ్యాక్సినేషన్ కార్యక్రమానికి పలు సవాళ్లు ఎదురయ్యాయి. ముడి సరకుల కొరత, మౌలిక సదుపాయాల సమస్యల వల్ల పంపిణీకి అవరోధాలు తలెత్తటం, చాలా చోట్ల జనం వ్యాక్సీన్ తీసుకోవటానికి విముఖత చూపటం వంటి సమస్యలు వచ్చాయి.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అయితే ఈ ఏడాది రెండో అర్థభాగంలో పంపిణీ అవరోధాలు పరిష్కారమయ్యాయి.
ఇప్పుడు సరఫరా సమస్య పరిష్కారం కాగా.. డిమాండ్ లేకపోవటం సవాలుగా మారింది.
‘‘వ్యాక్సీన్ తీసుకోవటానికి జనం సందేహిస్తున్నారు కాబట్టి ఇప్పుడు వ్యాక్సినేషన్ కార్యక్రమం నెమ్మదించింది’’ అంటారు డాక్టర్ లహారియా.
ప్రజలకు వాళ్ల ఇంటి దగ్గరే వ్యాక్సినేషన్ ఇచ్చే కార్యక్రమాన్ని కూడా ప్రభుత్వం నవంబర్ మూడో తేదీన ప్రారంభించింది.
ఈ కార్యక్రమాన్ని ప్రకటించిన నెల రోజుల తర్వాత.. మొదటి డోస్ కవరేజి 6 శాతం, రెండో డోసు కవరేజీ 12 శాతం మాత్రమే పెరిగాయి.
ప్రస్తుతం ఒమిక్రాన్ భయాలు పెరుగుతున్న నేపథ్యంలో.. వ్యాక్సినేషన్ తక్కువగా ఉన్న జిల్లాల్లో ఈ కార్యక్రమాన్ని ముమ్మరం చేయాలని ప్రధాని మోదీ రాష్ట్రాలను కోరారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ గత కొన్ని నెలల్లో వంద శాతం లక్ష్యం గురించి ఏ మీడియా సమావేశంలోనూ ప్రస్తావించలేదు.
వ్యాక్సినేషన్ లక్ష్యాన్ని చేరుకోకపోవటం గురించి మంత్రిత్వశాఖ వివరణ కోరాం. కానీ అటునుంచి ఎలాంటి స్పందనా లభించలేదు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ దగ్గర సరిపోయినన్ని వ్యాక్సీన్లు ఉన్నాయా?
భారతదేశం ప్రస్తుతం దేశీయంగా తయారు చేసిన రెండో కోవిడ్ వ్యాక్సీన్లు కోవిషీల్డ్, కోవాక్జిన్‌తో పాటు.. రష్యా వ్యాక్సీన్ స్పుత్నిక్‌ను కూడా అందిస్తోంది.
భారతదేశపు అతిపెద్ద వ్యాక్సీన్ తయారీదారు సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా నెలకు 25 కోట్ల డోసుల కోవిషీల్డ్ వ్యాక్సీన్లను ఉత్పత్తి చేస్తోంది. అయితే ఆర్డర్లు లేకపోవటం వల్ల ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు ఈ డిసెంబర్‌లో ప్రకటించింది.
ప్రస్తుతం ఆ సంస్థ నెలకు 12.5 కోట్ల నుంచి 15 కోట్ల వరకూ డోసులను తయారు చేస్తోంది.
ఇక కోవాక్జిన్ తయారీదారైన భారత్ బయోటెక్ నెలకు 5 కోట్ల నుంచి 6 కోట్ల వరకూ డోసులను ఉత్పత్తి చేస్తోంది.
రాష్ట్రాల దగ్గర డిసెంబర్ 20వ తేదీ నాటికి 17 కోట్ల వ్యాక్సీన్ల నిల్వలు ఉన్నాయని భారత ఆరోగ్యశాఖ మంత్రి మాన్సుఖ్ మాండవియా ఇటీవల పార్లమెంటులో చెప్పారు.
ప్రస్తుతం నెలకు 31 కోట్ల డోసులుగా ఉన్న వ్యాక్సీన్ తయారీ సామర్థ్యం వచ్చే రెండు నెలల్లో 45 కోట్లకు పెరుగుతుందని కూడా ఆయన తెలిపారు.
ఇతర తయారీ సంస్థలు తయారు చేసే వ్యాక్సీన్లు కూడా ఇందులో ఉండొచ్చు. ‘‘ఆ రెండు సంస్థలూ (భారత్ బయోటెక్, సీరం ఇన్‌స్టిట్యూట్) తమ ఉత్పత్తి సామర్థ్యంలో 90 శాతం పనిచేస్తున్నాయి’’ అని ఆరోగ్యశాఖ సహాయ మంత్రి డాక్టర్ భారతి పవార్ చెప్పారు.
ఇక జనవరి నెల మొదలుకుని 15 నుంచి 18 ఏళ్ల వయసున్న పిల్లలు, వైద్య రంగంలోని ఆరోగ్య కార్యకర్తలు, 60 ఏళ్ల వయసు పైబడిన వృద్ధులకు బూస్టర్ డోసు (మూడో డోసు వ్యాక్సీన్) అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.
ప్రభుత్వం బూస్టర్ వ్యాక్సీన్ కార్యక్రమాన్ని ప్రకటించేట్లయితే.. తమ సంస్థ దగ్గర 50 కోట్ల వ్యాక్సీన్ డోసుల నిల్వలు ఉన్నాయని సీరం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అధిపతి ఆదార్ పూనావాలా డిసెంబర్ ఆరంభంలో చెప్పారు.
వ్యాక్సీన్ కార్యక్రమం మొదలైనప్పటి నుంచీ సుమారు 62 లక్షల డోసులు వృధా అయ్యాయని ఆరోగ్య మంత్రిత్వశాఖ తెలిపింది. కోవిడ్ వ్యాక్సీన్ వృధాపై ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా కన్నా ఇది చాలా తక్కువ.
కోవిడ్ నుంచి రక్షణ కల్పించటం కోసం ఉపయోగించటానికి ఇతర భారత తయారీ వ్యాక్సీన్లు కూడా ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ ఉపయోగించగల ఇతర వ్యాక్సీన్లు ఏమిటి?
అమెరికాలో అభివృద్ధి చేసిన నోవావాక్స్ వ్యాక్సీన్‌కు భారతదేశంలో కోవావ్యాక్స్ అని పేరు పెట్టారు. దీనిని సీరిం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉత్పత్తి చేస్తోంది. అత్యవసర వినియోగానికి ఈ వ్యాక్సీన్‌కు ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతించింది. దీనికి భారతదేశంలో కూడా అనుమతి లభించింది.
ఈ వ్యాక్సీన్ డోసులను తాము ప్రస్తుతం నిల్వ చేస్తున్నామని, ఈ వ్యాక్సీన్ తయారు చేయటానికి కోవిషీల్డ్‌తో సంబంధంలోని సామర్థ్యాలను ఉపయోగిస్తున్నామని సీరం ఇన్‌స్టిట్యూట్ బీబీసీతో చెప్పింది.
అలాగే.. ముక్కు రంధ్రాల ద్వారా ఇచ్చే వ్యాక్సీన్‌ను కూడా తయారు చేసిన భారత్ బయోటెక్ సంస్థ.. ఆ వ్యాక్సీన్‌ను బూస్టర్ షాట్‌గా ఉపయోగించటంపై పరీక్షలు నిర్వహించటానికి అనుమతులు పొందింది.
ఇక బయోలాజికల్-ఇ అనే సంస్థ తయారు చేసిన కోర్బివాక్స్‌కు కూడా భారతదేశంలో అనుమతి లభించింది.
అమెరికా కంపెనీ తయారు చేసిన మోడెర్నా వ్యాక్సీన్‌ను అత్యవసరంగా ఉపయోగించటానికి భారతదేశం 2021 జూన్ నెలలోనే అనుమతించింది. కానీ ఇప్పటివరకూ ఆ వ్యాక్సీన్ డోసులేవీ ఇండియాకు రాలేదు.
జాన్సన్ అండ్ జాన్సన్ సంస్థ తయారు చేసిన సింగిల్ డోస్ వ్యాక్సీన్‌కు కూడా 2021 ఆగస్టులోనే భారతదేశం ఆమోదం తెలిపినప్పటికీ.. ఇప్పటి వరకూ ఇండియాలో ఆ వ్యాక్సీన్ డోసు ఒక్కటి కూడా ఎవరికీ ఇవ్వలేదు.
విదేశీ తయారీ వ్యాక్సీన్ల సరఫరాకు చట్టపరమైన అవరోధాలు ఎదురవుతున్నాయి. ఈ వ్యాక్సీన్లను ఉపయోగించటం వల్ల తలెత్తే చట్టపరమైన వివాదాల నుంచి రక్షణ కల్పించాలని ఆయా వ్యాక్సీన్ల తయారీదారులు కోరుతుండటం దీనికి ప్రధాన కారణం. ఇటువంటి రక్షణ.. భారతదేశంలో ఇప్పటివరకూ ఏ వ్యాక్సీన్ తయారీ సంస్థలకూ లేదు.

ఫొటో సోర్స్, Getty Images
వ్యాక్సీన్ ఎగుమతుల సంగతేమిటి?
భారతదేశంలో కోవిడ్ వ్యాక్సీన్లకు డిమాండ్ తగ్గుతుండటం, రోజు వారీ కేసులు పడిపోతుండటంతో.. సీరం ఇన్‌స్టిట్యూట్ నవంబరు నెలలో కోవాక్స్ కార్యక్రమానికి వ్యాక్సీన్ డోసుల ఎగుమతులను ప్రారంభించింది.
ప్రపంచ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పర్యవేక్షించే కార్యక్రమం కోవాక్స్. భారతదేశం వ్యాక్సీన్ ఎగుమతులను 2021 ఏప్రిల్‌లో నిలిపివేయటానికి ముందు.. అల్పాదాయ, మధ్యాదాయ దేశాలకు వ్యాక్సీన్ మద్దతు ఇవ్వటానికి.. సీరం ఇన్‌స్టిట్యూట్ సరఫరా చేసే వ్యాక్సీన్ల మీదే కోవాక్స్ ఆధారపడి ఉండేది.
ఆ తర్వాత ఎగుమతులు నెమ్మదించటంతో.. అప్పటి నుంచీ కోవాక్స్ ఇతర వ్యాక్సీన్ల మీద ఆధారపడుతోంది.
కోవాక్స్ 2021 డిసెంబర్ 14వ తేదీ వరకూ 144 దేశాలకు 70 కోట్ల వ్యాక్సీన్లు అందించగా.. అందులో 4 కోట్ల డోసులను సీరం ఇన్‌స్టిట్యూట్ అందించింది. వాటిలో సుమారు 2.8 కోట్ల డోసులను 2021 జనవరి, ఏప్రిల్ మధ్య సరఫరా చేసిందని కోవాక్స్ లెక్కలు చెప్తున్నాయి.

ఇవి కూడా చదవండి:
- కోవిడ్ మహమ్మారి: 2021లో నేర్చుకున్న గుణపాఠాలేంటి, మున్ముందు ఏం చేయాలి ?
- ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కొత్త కారు ధర ఎంత? రూ.12 కోట్లు కాదంటున్న అధికారులు
- మనిషి, మొసళ్ల మధ్య మనుగడ పోరాటం
- కొంపముంచిన అలెక్సా, పదేళ్ల చిన్నారికి ప్రమాదకరమైన చాలెంజ్
- గోవాలో క్రిస్టియానో రొనాల్డో విగ్రహ ఏర్పాటుపై వివాదం
- అంతరిక్షంలోకి వెళ్లిన వ్యోమగామిని భూమిపైకి తెచ్చేందుకు డబ్బుల్లేక ప్రభుత్వం అక్కడే ఉంచేసింది
- WAN-IFRA ‘సౌత్ ఏసియా డిజిటల్ మీడియా అవార్డ్స్’లో బీబీసీకి 4 పురస్కారాలు
- స్పైడర్ మ్యాన్ జోరుకు అల్లు అర్జున్ పుష్ప, రణ్వీర్ సింగ్ 83 తగ్గక తప్పలేదా? బాక్సాఫీస్ వద్ద మార్వెల్ సినిమా కలెక్షన్ల జోరుకు కారణాలేంటి?
- మీకూ ఇలాంటి మెసేజ్ వచ్చిందా?.. ‘24 గంటల్లో డబ్బు రెట్టింపు.. 50 వేలు పెట్టుబడి పెడితే ఆరు లక్షలు’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













