ఆంధ్రప్రదేశ్: ఇద్దరు గిరిజన బాలికలపై నకిలీ పోలీసు అఘాయిత్యం.. అత్యాచారం కేసు నమోదు

బాధిత యువతులు ఇద్దరూ.. గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్నారు
ఫొటో క్యాప్షన్, బాధిత యువతులు ఇద్దరూ.. గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్నారు
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

పోలీసునంటూ బెదిరించి ఓ వ్యక్తి...ఇద్దరు గిరిజన బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డాడని పోలీసులు కేసు నమోదు చేశారు.

విజయనగరం జిల్లా కురుపాంలో జరిగిన ఈ సంఘటనపై బాధిత బాలికలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కురుపాం పోలీసులు తెలిపారు.

"కురుపాం మండంలోని గిరిజన సంక్షేమ పోస్ట్ మెట్రిక్ బాలికల హాస్టల్‌లో ఉంటూ ఇంటర్ ప్రధమ సంవత్సరం చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు తమ స్నేహితులతో కలిసి జియ్యమ్మవలస మండలంలోని వట్టిగెడ్డ రిజర్వాయర్‌ను చూసేందుకు శనివారం ఉదయం వెళ్లారు. మధ్యాహ్నం 3 గంటల తర్వాత తిరిగి హాస్టల్ కు బయలుదేరారు. అదే సమయంలో చినమేరంగికి చెందిన వెలగాడ రాంబాబు అనే వ్యక్తి వీరిని చూశాడు. వెంటనే విద్యార్థినులు వద్దకు వెళ్లి తాను పోలీసునంటూ వారి వివరాలను అడిగి తెలుసుకున్నాడు. వారి ఫోటోలను, వీడియోలను తన సెల్ ఫోన్ తో చిత్రీకరించాడు." అని పార్వతీపుపురం డీఎస్పీ సుభాష్‌ తెలిపారు.

నిందితుడ్ని పట్టుకున్న పోలీసులు

బాలికలను హాస్టల్ దగ్గర దిగబెడతానని చెప్పి

బాలికలు హాస్టల్ వార్డెన్ సీతమ్మ సహాయంతో తమ వద్దకు వచ్చి ఫిర్యాదు చేశారని...ఆ బాలికలు చెప్పిన వివరాలు, అలాగే ఆ తర్వాత హాస్టల్ వద్దకు వెళ్లి పోలీసులు సేకరించిన సమాచారం ప్రకారం..

"బాలికలతో వచ్చిన మరో ఇద్దరు విద్యార్థుల వివరాలు తీసుకున్న నిందితుడు వారిని బెదిరించి పంపించేశాడు. బాలికలు ఇద్దర్ని తాను హాస్టల్ వద్ద దింపుతానని చెప్పాడు. తాను చెప్పినట్లు వినకపోతే వారి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పెడతానని బెదిరించాడు. అనంతరం బాలికలను సమీపంలోని పామాయిల్‌తోటకు తీసుకెళ్లాడు. ఒకరి తరువాత ఒకరిపై అత్యాచారానికి ప్రయత్నించాడు. ఈ విషయాన్ని బయటకు చెబితే చంపేస్తానంటూ భయపెట్టాడు. హాస్టల్ కు చేరుకున్న తర్వాత విద్యార్థినులు ఈ విషయాన్ని హాస్టల్ వార్డెన్ మండంగి సీతమ్మకు తెలియజేశారు. ఆమె కురుపాం పోలీసులకు సమాచారం ఇచ్చారు. విషయం నాకు తెలిసింది. వెంటనే ఎల్విన్‌పేట సీఐ తిరుపతిరావు, కురుపాం ఎస్‌ఐ బి.శివప్రసాద్‌లను హాస్టల్కు వెళ్లి వివరాలు సేకరించమని చెప్పాను. ఆ వివరాలను జిల్లా ఎస్పీకి అందించాను" అని డీఎస్సీ సుభాష్ తెలిపారు.

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది. చిత్రంలో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ కూడా ఉన్నారు
ఫొటో క్యాప్షన్, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పుష్ప శ్రీవాణి నియోజకవర్గంలో ఈ సంఘటన జరిగింది. చిత్రంలో జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ కూడా ఉన్నారు

‘సెంటిఫిక్ ఎవిడెన్స్ సేకరిస్తున్నాం’

‘‘ఈ సంఘటన చాలా దారుణం. బాధితులు చెప్పిన సమచారంతో పోలీసు బృందాలను ఏర్పాటు చేసి నిందితుడిని వెంటనే అరెస్ట్ చేశాం. అతడిపై 13 కేసులున్నాయి. ఈ సంఘటనకు సంబంధించిన సమాచారం రాగానే ఆ రాత్రే నిందితుడిని అరెస్ట్ చేశాం. కేసు దర్యాప్తు పూర్తి చేసి...సెంటిఫిక్ ఎవిడెన్స్ సహాయంతో అతడికి శిక్షపడేలా చూస్తాం. పోక్సో యాక్ట్, ఐపీసీ సెక్షన్లు 376, 506 ప్రకారం కేసు నమోదు చేశాం. ప్రస్తుతం బాలికలిద్దరిని వైద్య పరీక్షలు కోసం పార్వతీపురం ఆసుపత్రికి తరలించారు. హాస్టల్, స్కూల్స్ లో పిల్లల రక్షణకు పోలీసులతో సహకరించాలి. అవగాహన కార్యక్రమాలు తరచూ నిర్వహించాలి" అని జిల్లా ఎస్పీ దీపికా పాటిల్ తెలిపారు.

నిందితుడి వాహనంపై పోలీసు, ప్రెస్ స్టిక్కర్లు

కురుపాంలో జరిగిన సంఘటన దారుణమని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి అన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామని చెప్పారు.

"నిందితుడిని బాధితులైన విద్యార్థినులు గుర్తించారు. అతడిపై గతంలో 13 కేసులతో పాటు రౌడీ షీట్ కూడా ఉంది. అతను వాడుతున్న ద్విచక్ర వాహనంపై పోలీసు, ప్రెస్ అని స్టిక్కర్లు ఉన్నాయి. నిందితుడు తప్పు చేయడానికి వ్యవస్థలను సైతం వాడుకున్నాడు. పోలీసులు ఈ విషయంలో వెంటనే స్పందించి నిందితుడిని పట్లుకున్నారు. బాధితులకు పూర్తిగా సహాయ సహాకారాలు అందిస్తాం." అని పుష్సా శ్రీవాణి చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)