వాట్సాప్ మెసేజ్‌లో లింక్ క్లిక్ చేయమన్నారు... రెండున్నర లక్షలు కొల్లగొట్టారు - ప్రెస్‌రివ్యూ

సైబర్ నేరాలు

ఫొటో సోర్స్, Getty Images

'అకౌంట్‌ బ్లాక్‌ అయింది. లింక్‌ను క్లిక్‌ చేయండి' అంటూ వాట్సాప్‌లో వచ్చిన లింక్‌ మెసేజ్‌ను క్లిక్ చేయడం ద్వారా ఓ వ్యక్తి రెండున్నర లక్షలకు పైగా డబ్బును కోల్పోయాడని 'సాక్షి' ఒక వార్తలో తెలిపింది.

''పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలంలోని దుంపగడప గ్రామ శివారు పల్లెపాలెం వాసి కొల్లేటి హరిబాబుకు ఈ ఘటన ఎదురైంది. దీంతో శనివారం ఆకివీడు పోలీసులకు బాధితుడు ఫిర్యాదు చేశాడు.

పోలీసుల కథనం మేరకు..హరిబాబుకు స్థానిక స్టేట్‌బ్యాంకులో ఖాతా ఉంది. 'ఎకౌంట్‌ బ్లాక్‌ అయింది. లింక్‌ను క్లిక్‌ చేయండి' అంటూ డిసెంబర్‌ 15న మెసేజ్‌ రావడంతో ఆ లింక్‌ను క్లిక్‌ చేశాడు.

అనంతరం అతని ఖాతాలో ఉన్న రూ.2,67,928 నగదు వేరే ఖాతాకు జమ అయినట్లు మెసేజ్‌ వచ్చింది. దీంతో అతడు బ్యాంకు అధికారులను సంప్రదించాడు.

అక్కడి నుంచి సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ కేసు దర్యాప్తు వేగవంతం చేయాలని కోరుతూ స్థానిక పోలీస్‌స్టేషన్‌కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు చెప్పాడు.

ఈ ఘటనపై కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ బీవై కిరణ్‌కుమార్‌ తెలిపారు. ఇటువంటి మెసేజ్‌లను ఓపెన్‌ చేయవద్దని, లింక్‌లను నమ్మవద్దని, వ్యక్తిగత వివరాలు ఇవ్వవద్దని ప్రజలకు ఆయన సూచించినట్లు'' సాక్షి వార్తలో పేర్కొంది.

టీఎస్‌ఆర్టీసీ

ఫొటో సోర్స్, TSRTCHQ/FACEBOOK

'సంక్రాంతికి సాధారణ చార్జీలే, ఆర్టీసీ బస్సుల్లో 12 ఏళ్లలోపు వారికి ఉచితం'

ఆర్టీసీ బస్సుల్లో ఆక్యుపెన్సీని పెంచే ప్రయత్నాల్లో భాగంగా 12 ఏళ్లలోపు పిల్లలకు ఉచితంగా ప్రయాణం చేసే అవకాశం కల్పించాలని యోచిస్తున్నట్లు టీఎస్ఆర్టీసీ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ తెలిపినట్లు 'ఆంధ్రజ్యోతి' కథనం తెలిపింది.

''తల్లిదండ్రులతో కలిసి ప్రయాణం చేసే పిల్లలకు ఈ అవకాశం కల్పించే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. తద్వారా తల్లిదండ్రులు బస్సుల్లో ప్రయాణిస్తారని, ఈ రూపంలో సంస్థకు ఆదాయం వస్తుందని అన్నారు.

శనివారం నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌ భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాజిరెడ్డి మాట్లాడారు.

ఆర్టీసీలో ఆర్థిక సమస్యలను క్రమక్రమంగా పరిష్కరించుకుంటూ ఆదాయాన్ని పెంచుకునే అంశంపై దృష్టి పెట్టామన్నారు.

సంక్రాంతి పండుగ సందర్భంగా కూడా ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలను మాత్రమే వసూలు చేయాలని నిర్ణయించినట్లు చెప్పారు.

దీంతో ఆశించిన స్థాయిలో ఆక్యుపెన్సీ సాధించడం ద్వారా చార్జీల ఆదాయాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందన్నారు.

ఇక రిటైరయిన ఉద్యోగులకు బకాయిలను తక్షణమే చెల్లించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చైర్మన్‌ తెలిపారు. విధి నిర్వహణలో మృత్యువాత పడిన ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల విషయంపై ప్రభుత్వ అనుమతి తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు.

సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ మాట్లాడుతూ.. గడిచిన నాలుగు నెలలుగా ఆర్టీసీ ప్రగతి పథంలో నడుస్తోందన్నారు. ఇదే తీరులో పని చేస్తూ ఉద్యోగులు పునరంకితం కావాలని పిలుపునిచ్చినట్లు'' ఆంధ్రజ్యోతి తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ నియంత్రణ మండలి

ఫొటో సోర్స్, Getty Images

వినియోగదారులపై అభివృద్ధి బాదుడు

కొత్త కనెక్షన్లు తీసుకునే విద్యుత్‌ వినియోగదారులపై అభివృద్ధి ఛార్జీల పేరిట ఆంధ్రప్రదేశ్ విద్యుత్‌ నియంత్రణ మండలిలో (ఏపీఈఆర్‌సీ) అదనపు భారం వేయనుందని 'ఈనాడు' కథనం పేర్కొంది.

''కొత్త కనెక్షన్‌ తీసుకునేటప్పుడు వినియోగదారుల నుంచి అభివృద్ధి ఛార్జీల పేరిట వసూలు చేస్తున్న మొత్తాన్ని పెంచాలని విద్యుత్‌ పంపిణీ సంస్థలు 2019లో రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలిలో (ఏపీఈఆర్‌సీ) పిటిషన్‌ దాఖలు చేశాయి.

వాటి పరిశీలన, ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయిన తర్వాత అభివృద్ధి ఛార్జీలను పెంచుతూ ఏపీఈఆర్‌సీ తాజాగా ఉత్తర్వులు జారీచేసింది. పెంచిన ఛార్జీలు తక్షణం అమల్లోకి వస్తాయని ఈ ఉత్తర్వుల్లో పేర్కొంది.

విద్యుత్‌ కనెక్షన్‌ తీసుకునేటప్పుడు కాంట్రాక్ట్‌ లోడ్‌ (విద్యుత్‌ వినియోగ ప్రతిపాదన) ఆధారంగా అభివృద్ధి ఛార్జీలను వినియోగదారులు డిస్కంకు చెల్లించాలి.

ఈ ఛార్జీల పెంపుతో గృహ, వాణిజ్య వినియోగదారులపై కిలోవాట్‌కు రూ.200 నుంచి 600 వరకు అదనపు భారం పడనుంది.

అదనపు లోడ్‌కు వసూలుచేసే అభివృద్ధి ఛార్జీలనూ డిస్కంలు భారీగా పెంచాయి. కొత్త విద్యుత్‌ కనెక్షన్ల కోసం ఏటా సుమారు లక్ష దరఖాస్తులు వస్తాయని డిస్కంలు తెలిపాయి.

ఇప్పటికే విద్యుత్‌ కనెక్షన్‌ పొందిన వినియోగదారులు కూడా అదనపు లోడ్‌ కోసం చేసుకునే దరఖాస్తులకు కొత్త అభివృద్ధి ఛార్జీల ప్రకారం చెల్లించాలని డిస్కంలు తెలిపాయి.

వ్యవసాయ విద్యుత్‌ కనెక్షన్లకు కిలో వాట్‌కు ప్రస్తుతం రూ.1,200 అభివృద్ధి ఛార్జీల కింద డిస్కంలు వసూలు చేస్తున్నాయి. కొత్త ఛార్జీల ప్రకారం కిలోవాట్‌కు రూ.1,500 చెల్లించాల్సి ఉంటుందని'' ఈనాడు కథనంలో రాసుకొచ్చింది.

తమిళిసై సౌందరరాజన్

ఫొటో సోర్స్, FACEBOOK/DRTAMILISAIBJP

తెలంగాణ రాజ్‌భవన్ ఎదుట కంప్లయింట్ బాక్స్

రాజ్‌భవన్ బయట కంప్లయింట్ బాక్స్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిపై ప్రకటించారని 'వెలుగు' తెలిపింది.

''ప్రజలు రాతపూర్వకంగా తమ సలహాలు, సూచనలు ఇవ్వొచ్చని, ఫిర్యాదులు చేయొచ్చని ఆమె చెప్పారు.

'పబ్లిక్ సమస్యలు పరిష్కారమయ్యేలా ప్రభుత్వం, అధికారుల దృష్టికి తీసుకెళ్తాను. ఆర్థిక సాయం వంటి సమస్యలపైనా నా వంతు సాయం చేస్తాను' అని ఆమె తెలిపారు.

శనివారం న్యూ ఇయర్ సందర్భగా రాజ్ భవన్‌లో జరిగిన కార్యక్రమంలో మీడియాతో మాట్లాడారు.

'కరోనా నేపథ్యంలో అందరూ భౌతిక దూరంతో పాటు మాస్క్ ను ధరించాలి. ఒమిక్రాన్ రాకుండా ఉండాలంటే మంచి పోషక ఆహారం తీసుకోవాలి.

100 శాతం మొదటి డోస్ వ్యాక్సినేషన్ పూర్తి చేసినందుకు రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను. కరోనా విషయంలో రాష్ట్ర వైద్యారోగ్యా శాఖ కృషి అభినందనీయం.

కరోనా నేపథ్యంలో రాజ్ భవన్‌లో సలహాలు, ఫిర్యాదుల కోసం ప్రత్యేక బాక్స్ లను ఏర్పాటుచేస్తున్నాం. రాజ్ భవన్ మెయిన్ గేట్ వద్ద కూడా బాక్స్ ఏర్పాటు చేస్తున్నాం. ప్రజలు ఫిర్యాదులు చేయొచ్చు, సలహాలు ఇవ్వచ్చు. వ్యక్తి గత, ప్రజా సంబంధ సమస్యలపై బాక్స్‌లో ఫిర్యాదులు చేయొచ్చు' అని ఆమె పేర్కొన్నారు.

20 మంది పేద విద్యార్థులకు ల్యాప్ టాప్‌లను అందజేసేందుకు... ల్యాప్ టాప్‌లు సమకూర్చిన ఇంటర్నేషనల్ సంస్థ ప్రతినిధులకు ఆమె అభినందనలు. మారుమూల గ్రామాల విద్యార్థుల భవిష్యత్తుకు చాలా ఉపయోగపడతాయి'' అని గవర్నర్ పేర్కొన్నట్లు వెలుగు కథనం తెలిపింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)