సూర్యాపేట: కుప్పకూలిన స్టేడియం గ్యాలరీ.. జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ప్రమాదం.. 20 మంది పరిస్థితి విషమం - Newsreel

ఘటన స్థలంలో పోలీసులు

సూర్యాపేటలో 47వ జాతీయ జూనియర్ కబడ్డీ పోటీల ప్రారంభోత్సవంలో ప్రమాదం జరిగింది.

స్టేడియంలోని మూడో నెంబర్ గ్యాలరీ కుప్పకూలి పలువురికి గాయాలయ్యాయి. పదుల సంఖ్యలో ప్రేక్షకులు గాయపడ్డారు.

క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ప్రమాద సమయంలో గ్యాలరీలో 1500 మందికి పైగా ప్రేక్షకులు ఉన్నారు.

గాయపడినవారిలో 20 మంది పరిస్థితి విషమంగా ఉంది.

క్షతగాత్రులు

జాతీయ క్రీడల కోసం నిర్వాహకులు మూడు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గ్యాలరీ కుప్పకూలడంతో రెయిలింగ్‌ కింద పలువురు ప్రేక్షకులు ఇరుక్కుపోయారు.

గ్యాలరీ సామర్థ్యానికి మించి ప్రేక్షకులు కూర్చోవడంతో ఈఘటన జరిగినట్లుగా పోలీసు వర్గాలు చెప్పాయి. పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు.

పరిస్థితి విషమంగా ఉన్న వారిని మెరుగైన చికిత్స కోసం నార్కట్‌పల్లి, హైదరాబాద్ కామినేని ఆసుపత్రులకు తరలించారు.

ఈ ప్రమాదం పట్ల తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందరరాజ న్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.గాయపడిన వారంతా త్వరగా కోలుకోవాలని ఆమె ఆకాంక్షించారు.గాయపడిన వారందరికీ మెరుగైన వైద్య సేవలు అందించాలని గవర్నర్ ఆదేశించారు. ప్రమాదం జరిగిన తీరు పట్ల అధికారులను అడిగి తెలుసుకున్నారు.

తెలంగాణ పీఆర్సీ

ఫొటో సోర్స్, Telangana CMO

ఫొటో క్యాప్షన్, ఆర్థిక సమస్యలు ఎదురైనా మెరుగైన పీఆర్సీ ఇస్తున్నట్లు సీఎం కె.చంద్రశేఖర్‌ రావు వెల్లడించారు

30% ఫిట్‌మెంట్‌, రిటైర్‌మెంట్‌ వయసు 61 ఏళ్లకు పెంపు... తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు 30శాతం ఫిట్‌మెంట్‌ ఇస్తున్నామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు.

అలాగే ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసును 61 సంవత్సరాలకు పెంచామని ఆయన తెలిపారు.

ఆర్థిక వ్యవస్థ ఇపుడిపుడే తేరుకుంటున్న నేపథ్యంలో రాష్ట్రంలోని అందరు ఉద్యోగ, ఉపాధ్యాయులకు వర్తించే విధంగా మెరుగైన రీతిలో 11వ వేతన సవరణ చేస్తున్నామని సీఎం తెలిపారు.

రాష్ట్రంలోని 9,17,797 మంది ఉద్యోగులకు వేతనాల పెంపుదల వర్తింపజేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని సీఎం చెప్పారు.

సీఎం ప్రకటనలోని ముఖ్యాంశాలు

1. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 30 శాతం ఫిట్‌మెంట్. ఈ ఉత్తర్వులు ఏప్రిల్ 1, 2021 నుంచి అమలు.

2. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్ వయో పరిమితిని 61 సంవత్సరాలకు పెంపు. ఈ నిర్ణయం తక్షణం అమలు

3. ఉద్యోగ, ఉపాధ్యాయుల రిటైర్మెంట్‌ గ్రాట్యుటీ 12 నుంచి 16 లక్షలకు పెంపు

4. వేర్వేరు జిల్లాల్లో పనిచేస్తున్న భార్యాభర్తలైన ఉద్యోగ, ఉపాధ్యాయులు ఒకే జిల్లాలో పనిచేయడానికి వీలుగా అంతర్‌ జిల్లా బదిలీల ప్రక్రియ వెంటనే ప్రారంభం

5. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్‌ ఉపాధ్యాయులు, ఉద్యోగులు వారి రాష్ట్రానికి తిరిగి వెళ్లేందుకు అనుమతి ఇస్తూ త్వరలో ప్రభుత్వ ఉత్తర్వులు

6. కేజీబీవీల్లో పనిచేస్తున్న మహిళా సిబ్బందికి వేతనంతో కూడిన 180 రోజుల ప్రసూతి సెలవు సౌకర్యం

7. గతంలోని ఉమ్మడి జిల్లాల సీనియారిటీ ప్రాతిపదికన యాజమాన్యాల వారీగా (Management wise) అర్హులైన ఉపాధ్యాయులందరికీ ప్రమోషన్లు, బదిలీల ప్రక్రియ.

8. విధి నిర్వహణలో మరణించిన సీపీఎస్‌(కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ఫ్యామిలీ పెన్షన్ విధానం వర్తింపు

9.రిటైర్‌ అయిన ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయులందరికీ 15శాతం ఇచ్చే అదనపు పెన్షన్ (Additional Quantum of Pension) వయో పరిమితి 75 నుంచి 70 ఏళ్లకు తగ్గింపు

10. ప్రాథమిక పాఠశాలల్లో ప్రస్తుతం పనిచేస్తున్న ప్రధానోపాధ్యాయులతోపాటు, ఆ సంఖ్య పది వేలకు చేరే విధంగా అదనపు ప్రధానోపాధ్యాయ (స్కూల్ అసిస్టెంట్ల సమానస్థాయి) పోస్టుల మంజూరు

11. ఉద్యోగ, ఉపాధ్యాయుల పట్ల ఉన్న ప్రత్యేక అభిమానంతో పీఆర్‌సీకి సంబంధించి 12నెలల బకాయిలను చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయం. ఈ బకాయిలను రిటైర్మెంట్ బెనిఫిట్స్‌తోపాటు, కలిపి పొందేలా చర్యలు

12. పీఆర్‌సీ కమిటీ సూచనల మేరకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం (ఈహెచ్‌ఎస్‌) నూతన విధివిధానాలను ఉద్యోగ సంఘాలు, ప్రభుత్వ అధికారుల భాగస్వామ్యంతో స్టీరింగ్‌ త్వరలో కమిటీ

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)