మరోసారి రష్యా నమ్మకం గెలుచుకున్న భారత్... అమెరికాను దూరం పెడుతోందా?

ఫొటో సోర్స్, AFP
- రచయిత, రజనీష్ కుమార్
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారత విదేశాంగ విధానంలో మొదట్లో సోవియట్ యూనియన్‌కు చాలా ప్రాధాన్యం ఉండేది. యూఎస్ఎస్ఆర్ విచ్ఛిన్నమైన తర్వాత కూడా రష్యాకు అంతే ప్రాధాన్యం కొనసాగుతోంది.
ప్రచ్ఛన్న యుద్ధం సమయంలో ప్రపంచం మొత్తం సోవియట్ యూనియన్, అమెరికా నాయకత్వంలో రెండుగా గ్రూపులుగా విడిపోయినప్పుడు కూడా, అలీనోద్యమంలో ఉన్నప్పటికీ భారత్ సైద్ధాంతిక పరంగా సోవియట్ యూనియన్‌కు దగ్గరగా నిలిచింది.
1971లో భారత్ పాకిస్తాన్ మధ్య 13రోజుల యుద్ధం జరిగింది. తూర్పు పాకిస్తాన్‌లో తలెత్తిన మానవతా సంక్షోభం వల్ల ఈ యుద్ధం జరిగింది. ఆ యుద్ధం తర్వాత తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్‌గా అవతరించింది.
అంతకు ముందే తూర్పు పాకిస్తాన్‌లో పశ్చిమ పాకిస్తాన్ ఆధిపత్యం గురించి భారత్ మొత్తం ప్రపంచానికి తెలియజేయాలని ప్రయత్నిస్తూ వచ్చింది.
ఆ సమయంలో తూర్పు పాకిస్తాన్ నుంచి శరణార్థులు భారీగా భారత్ తరలివస్తున్నారు. పశ్చిమ, తూర్పు పాకిస్తాన్ల మధ్య ఎలాంటి రాజకీయ పరిష్కారం జరిగే అవకాశాలే కనిపించడం లేదు. అలాంటి పరిస్థితుల్లో భారత్ మొర ఆలకించిన ఒకే ఒక్క దేశం సోవియట్ యూనియన్.
1971 ఆగస్టులో అప్పటి భారత ప్రధానమంత్రి ఇందిరాగాంధీ 'ఇండియా-సోవియట్ ట్రీటీ ఆఫ్ పీస్, ఫ్రెండ్షిప్ అండ్ కోఆపరేషన్' మీద సంతకాలు చేశారు.
ఈ ఒప్పందం ప్రకారం యుద్ధం లాంటి స్థితి వస్తే, దౌత్యపరంగా, ఆయుధపరంగా సాయం అందిస్తామని సోవియట్ యూనియన్ భారత్‌కు హామీ ఇచ్చింది.
అప్పట్లో మాస్కో భారత్‌కు ఒక విశ్వసనీయ భాగస్వామిగా నిలిస్తే, మరోవైపు అమెరికా.. భారత్ కంటే ఎక్కువగా పాకిస్తాన్‌కు ప్రాధాన్యం ఇస్తూ వచ్చింది.
తూర్పు పాకిస్తాన్‌లో సంక్షోభం మొదలైన సమయంలో అమెరికా దానిని పట్టించుకోలేదు. చైనాతో తమ సంబంధాలు ముందుకు తీసుకెళ్లడానికి అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ జాతీయ భద్రతా సలహాదారు హెన్రీ కిసింజర్ పాకిస్తాన్‌ను కీలక భాగస్వామిగా చూసేవారని విశ్లేషకులు చెబుతారు.
కానీ, భారత్, రష్యా స్నేహం ప్రారంభమైంది 1971లో కాదు, నెహ్రూ సమయంలోనే భారత అభివృద్ధికి సోవియట్ యూనియన్ చాలా రకాలుగా సాయం అదించేది
ఇప్పుడు, రష్యా, భారత్ మధ్య బంధం మళ్లీ బలపడుతోంది. ఆ బంధం ప్రస్తుతం మోదీ ప్రభుత్వం.. అమెరికా ప్రభుత్వాన్ని కూడా లెక్కచేయని స్థాయిలో ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
2021 డిసెంబర్ 6న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనకు వచ్చారు. పుతిన్ విదేశాంగ విధానాన్ని నిశితంగా గమనించే నిపుణులు ఈ పర్యటనకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
భారత్‌కు ప్రాధాన్యం
థింక్ ట్యాంక్ 'కార్నెగీ మాస్కో సెంటర్' డైరెక్టర్ దమిత్రీ తరెనిన్ పుతిన్ భారత పర్యటన గురించి డిసెంబర్ 6న మాస్కో టైమ్స్‌లో ఒక ఆర్టికల్ రాశారు.
"2021లో పుతిన్ రెండు విదేశీ పర్యటనలకే వెళ్లారు. ఒకటి భారత్ వెళ్లడం, అంతకు ముందు జూన్‌లో జెనీవాలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌తో సమావేశానికి హాజరవడం".
"జీ-20, COP26 సమావేశానికి కూడా పుతిన్ హాజరు కాలేదు. కోవిడ్‌తో చైనా పర్యటనను కూడా వాయిదా వేసుకున్నారు. కానీ, ఆయన భారత్ వెళ్లాలని మాత్రం నిర్ణయించారు. దానిని బట్టి పుతిన్‌కు ఈ పర్యటన రష్యా, భారత్ సంప్రదాయ బంధాన్ని మించిదనేది స్పష్టమవుతుంది.
"ప్రధానమంత్రి మోదీ, అధ్యక్షుడు పుతిన్ మధ్య వ్యక్తిగత సంబంధాలు కూడా బాగున్నాయి. భారత్ కూడా అమెరికా ఒత్తిడిని పట్టించుకోకుండా రష్యా నుంచి ఎస్-400 క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేసింది" అని దమిత్రి చెప్పారు.
భారత్ మాత్రం మా అవసరాలను బట్టి తాము నిర్ణయాలు తీసుకుంటామని చెప్పింది. మరోవైపు రష్యా నుంచి ఎస్-400 మిసైల్ సిస్టమ్ ఒప్పందంపై అమెరికా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అక్టోబర్‌లో భారత పర్యటనకు వచ్చిన అమెరికా డిప్యూటీ విదేశాంగ మంత్రి వెండీ షర్మన్ రష్యాతో ఈ ఒప్పందాన్ని ప్రమాదకరంగా వర్ణించారు.
2016 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యం చేసుకుందంటూ దానికి శిక్షగా, 2017లో 'కౌంటరింగ్ అమెరికాజ్ అడ్వెర్సరీజ్ త్రూ శాంక్షన్ యాక్ట్(CAATSA)'ను ఆమోదిచారు.
ఈ చట్టంలో రష్యా నుంచి ఏ దేశమైనా ఆయుధాలు కొనుగోలు చేస్తే ఆ దేశంపై ఆంక్షలు విధించే నిబంధనలను చేర్చారు. కానీ, భారత్ దానిని పట్టించుకోకుండా, ఎస్-400 ఒప్పందాన్ని పూర్తి చేసింది.
భారత్ ఈ వైఖరిని రష్యా విదేశాంగ మంత్రి సెర్గాయి లావరోఫ్ ప్రశంసించారు. భారత్ ఒక సౌర్వభౌమాధికార దేశంలాగే నిర్ణయం తీసుకుంది అన్నారు. రష్యా అత్యున్నత గౌరవం 'సెయింట్ ఆండ్రూ పురస్కారం' పొందిన ప్రపంచంలోని నలుగురు విదేశీ నేతల్లో మోదీ కూడా ఒకరుగా నిలిచారు.

ఫొటో సోర్స్, Getty Images
అమెరికాపై తగ్గిన నమ్మకం
దిల్లీ జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలోని రష్యా, మధ్య ఆసియా అధ్యయన కేంద్రంలో రాజన్ కుమార్ అసోసియేట్ ప్రొఫెసర్‌గా ఉన్నారు.
రష్యాతో సంబంధాల కోసం భారత్ అమెరికాను కూడా నిర్లక్ష్యం చేస్తోందా అని బీబీసీ ఆయన్ను ప్రశ్నించింది.
"ఈ మధ్య అమెరికా మీద భారత్ నమ్మకం తగ్గుతూ వస్తోంది. అఫ్గానిస్తాన్ నుంచి తన సైనికులను వెనక్కు పిలిపించిన ప్రక్రియలో అమెరికా భారత్ పూర్తిగా ఏకాకిని చేసింది. అఫ్గానిస్తాన్‌లో భారత్ పెట్టిన మొత్తం పెట్టుబడులు ప్రమాదంలో పడేలా చేసింది".
"అమెరికా బ్రిటన్, ఆస్ట్రేలియాతో కలిసి ఆక్స్ రక్షణ ఒప్పందం చేసుకుంది. దీని కింద ఆస్ట్రేలియాకు అణ్వాయుధ సహిత జలాంతర్గామి ఇవ్వనుంది. ఈ ఒప్పందాన్ని ఇండో-పసిఫిక్‌లో పెరుగుతున్న చైనా ప్రభావాన్ని అడ్డుకునే వ్యూహంగా చూస్తున్నారు. కానీ, దీని ఫలితంగా ఆస్ట్రేలియా ఫ్రాన్స్‌తో జలాంతర్గామి కోసం చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చింది".
"ఫ్రాన్స్ దీనికి స్పందనగా అమెరికాపై విరుచుకుపడింది, తమకు వెన్నుపోటు పొడిచారని ఆరోపించింది. నాటో సభ్య దేశం అయిన ఫ్రాన్స్‌కే అమెరికా అలా చేసినపుడు, దానికి భారత్ ఎంత అనే ఒక సందేశం కూడా ఉంది."
రష్యాతో సంబంధాలను పణంగా పెట్టి భారత్ అమెరికాతో తన బంధాన్ని బలోపేతం చేసుకోవాలని భావించదని రాజన్ కుమార్ అన్నారు.
"భారత్ మల్టీ ఎంగేజ్‌మెంట్ పాలసీ ఆధారంగా ముందుకెళ్తోంది. ఇది వాస్తవ విధానం అనిపిస్తోంది. ప్రస్తుత ప్రపంచంలో అలయన్స్ విదేశాంగ విధానం నడవదు. సమస్యల ఆధారంగా సహకారంతోనే ముందుకు వెళ్లవచ్చు. భారత్ బ్రిక్స్, ఎస్ఎసీఓ, లోక్వాడ్‌లో కూడా ఉంది. అందులో ఏ తప్పులేదు. ఒకరి అధీనంలో తన విదేశాంగ విధానం ఉండాలని భారత్ కోరుకోదు".

ఫొటో సోర్స్, Getty Images
మధ్య ఆసియాలో భారత్ ప్రవేశం
రష్యా ద్వారా భారత్ మధ్య ఆసియాలోకి చేరుకోగలదు. భారత్‌కు ఇరాన్ కూడా అవసరమైన దేశమే. పాకిస్తాన్‌ను బైపాస్ చేసి చాబహార్ ద్వారా మధ్య ఆసియాలోకి చేరుకోవాలంటే ఇరాన్ ఉపయోగపడుతుంది. అమెరికా ప్రతిఘటన వల్ల ఇరాన్ భారత్‌కు దగ్గర కాలేకపోతోంది.
దీనికి కూడా భారత్‌కు రష్యా అవసరం ఉంది. భారత్‌ను మధ్య ఆసియాలో అడుగు పెట్టనివ్వకూడదని రష్యా అనుకుంటే అది అలా చేయగలదు. రష్యా ద్వారా భారత సైనిక అవసరాలు మాత్రమే తీరడం లేదు. అంతర్జాతీయ వేదికలపై కూడా దాని నుంచి సాయం లభిస్తోంది. అమెరికాతో పోలిస్తే రష్యా భారత్‌కు మొదటి నుంచీ అండగా నిలిచిన దేశం..
గత నెలలోనే డిసెంబర్ 25న రష్యా-ఇండియా-చైనా అంటే ఆర్ఐసీ 18వ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఈ మూడు దేశాల విదేశాంగ మంత్రులు పాల్గొన్నారు. బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్ క్రీడలు నిర్వహించడాన్ని భారత్ ఇదే సమావేశంలో సమర్థించింది. చైనా కొత్త సంవత్సరంలో మార్చి 4 నుంచి మార్చి 13 వరకూ వింటర్ ఒలింపిక్స్, పారాలింపిక్స్‌కు ఆతిథ్యం ఇవ్వబోతోంది.
చైనాలో వింటర్ ఒలింపిక్ క్రీడలను అమెరికా, జపాన్, కెనడా, ఆస్ట్రేలియా దౌత్యపరంగా బహిష్కరించాయి. అంటే ఈ నాలుగు దేశాలు వింటర్ ఒలింపిక్స్ కోసం తమ ప్రతినిధి బృందాలను పంపించవు. క్వాడ్ గ్రూప్‌లో వింటర్ ఒలింపిక్ క్రీడల విషయంలో చైనాకు మద్దతివ్వాలని నిర్ణయించిన ఏకైక దేశం భారత్ ఒక్కటే. రష్యా వల్లే భారత్ చైనాకు ఈ విషయంలో మద్దతిచ్చిందని చెబుతున్నారు.
భారత్ వింటర్ ఒలింపిక్ క్రీడలకు చైనాకు మద్దతివ్వడంపై చైనా కమ్యూనిస్ట్ పార్టీ మౌత్‌పీస్‌గా చెప్పుకునే గ్లోబల్ టైమ్స్ నవంబర్ 28న ఒక ఆర్టికల్ రాసింది.
"అమెరికా, జపాన్, ఆస్ట్రేలియాలతో బలమైన సంబంధాలు ఉన్నప్పటికీ చైనా, రష్యా, షాంఘై సహకార సంస్థతోపాటూ బ్రిక్స్ సభ్య దేశాలతో కూడా సంబంధాలు ముందుకు తీసుకెళ్లడాన్ని భారత్ కొనసాగించింది. అది తన విదేశాంగ విధానాన్ని ఉదారంగా ఉంచాలని కోరుకుంటోంది. తమ సంబంధాలను ఏ శిబిరానికీ పరిమితం చేయకూడదని భావిస్తోందని దీని ద్వారా స్పష్టం అవుతోంది" అని చెప్పింది.

ఫొటో సోర్స్, Getty Images
భారత్ సరైన నిర్ణయం
సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతలు ఉన్న సమయంలో వింటర్ ఒలింపిక్ క్రీడలను క్వాడ్ మిగతా మూడు దేశాల్లా భారత్ దౌత్య బహిష్కరణ ఎందుకు చేయలేదు. కింగ్స్ కాలేజ్ లండన్‌లో అంతర్జాతీయ సంబంధాల ప్రొఫెసర్ హర్ష్ పంత్ దానిని వివరించారు.
"అది, చాలా ప్రతీకాత్మక నిరసన లేదా మద్దతు. క్రీడలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించిన దేశాల ఆటగాళ్లు అక్కడకు వెళ్తున్నారు. దౌత్య ప్రతినిధి బృందం మాత్రం వెళ్లదు. అసలు, అంతకు ముందు ఇలా ఒక ప్రతినిధి బృందం క్రీడలకు వెళ్తుందనే విషయం కూడా ఎవరికీ తెలీదు".
"భారత్ ఒక దేశ అంతర్గత అంశాల గురించి ఇలాంటి నిర్ణయాలు తీసుకోదు. చైనాలో మానవహక్కుల ఉల్లంఘన విషయంలో అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, జపాన్ దానిని బహిష్కరించాలని నిర్ణయం తీసుకున్నాయి. ఇలాంటి మానవ హక్కుల గురించి ప్రశ్నలు భారత్‌లో కూడా ఉన్నాయి. అందుకే భారత్ దౌత్యపరంగా బహిష్కరించడం వల్ల ఒరిగేదేమీ ఉండదు. మియన్మార్‌లో సైనిక తిరుగుబాటు జరిగినా, భారత్ దానిని వ్యతిరేకించకపోవడం కూడా ఇలాంటిదే" అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
డిసెంబర్ 6న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ న్యూదిల్లీ వచ్చారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతోకలిసి ఆయన సైనిక ఒప్పందాల సహా మొత్తం 28 ఒప్పందాలపై సంతకాలు చేశారు. అధ్యక్షుడు పుతిన్ పర్యటన ముగిసి కొన్ని రోజులే అయ్యింది. రెండు దేశాలు మధ్య ఆసియా రక్షణ సహకారానికి సంబంధించిన ఒక ఒప్పందంపై అంగీకారానికి కూడా వచ్చాయి.
ఈ ఒప్పంద పత్రాల్లో సోవియట్ యూనియన్‌లో భాగంగా ఉన్న కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్‌లో సంయుక్తంగా రక్షణ పరికరాల ఉత్పత్తితోపాటూ, రెండు దేశాల ఉమ్మడి సైనిక అభ్యాసాల విషయం కూడా ఉంది.
ఎకనామిక్ టైమ్స్ దీనిపై ప్రచురించిన ఒక రిపోర్ట్‌ను భారత్‌లో రష్యా రాయబార కార్యాలయం అధికారిక ట్విటర్ హ్యాండిల్లో ట్వీట్ చేశారు.
పుతిన్ మంగళవారం తజకిస్తాన్ అధ్యక్షుడు ఇమోమాలీ రహమోన్‌తో సెయింట్ పీటర్స్‌బర్గ్‌లో సమావేశమయ్యారు. తాలిబాన్ పాలిత అఫ్గానిస్తాన్‌పై ఒక కన్నేసి ఉంచేలా.. రష్యా, భారత్ ఉమ్మడిగా అఫ్గానిస్తాన్ సరిహద్దులకు ఆనుకుని ఉన్న దేశాలపై తమ ప్రభావం పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయని కూడా చెబుతున్నారు.

ఫొటో సోర్స్, Getty Images
అఫ్గానిస్తాన్‌పై ఉమ్మడి విధానం
అఫ్గానిస్తాన్‌కు ఆనుకుని ఉన్న మధ్య ఆసియా దేశాల్లో రష్యా, భారత్ మధ్య ఈ సహకారం గురించి ఆందోళన కూడా వ్యక్తం అవుతోంది.
అఫ్గానిస్తాన్‌లో అధికారం చేజిక్కించుకోవడంపై రష్యా జరిపిన చర్చల్లో చైనా, అమెరికా, తాలిబాన్లు, పాకిస్తాన్‌కు స్థానం ఇచ్చింది. వాటికి భారత్‌ను ఆహ్వానించలేదు.
విశ్లేషకులు ఆ సమయంలో అమెరికా, భారత్ మధ్య పెరుగుతున్న సాన్నిహిత్యం గురించి రష్యా ఆందోళనలో ఉన్నట్లు చెప్పారు. రష్యా క్వాడ్ గురించి కూడా తన ఆందోళన వ్యక్తం చేసింది.
ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల అధికారంలోకి రావడం, మధ్య ఆసియాలో చైనా ప్రభావం పెరగడం, ఆ ప్రాంతంలో అమెరికా పాత్ర గురించి ఉన్న ఆందోళనకు గురైన ఈ రెండు దేశాలూ ఏకమయినట్టు భావిస్తున్నారు.
తాలిబాన్లు వచ్చిన తర్వాత మధ్య ఆసియాలో ఇస్లామిక్ స్టేట్, అల్ ఖైదా బలోపేతం అవుతుందని రష్యా భావిస్తోంది. అటు భారత్ కూడా అఫ్గానిస్తాన్‌లో మూడు బిలియన్ల డాలర్ల పెట్టుబడులు పెట్టింది. దానితోపాటూ కశ్మీర్‌లో తీవ్రవాదం గురించి కూడా భారత్ ఆందోళనలో ఉంది.
ఇదే ఏడాది నవంబర్ మొదట్లో అఫ్గానిస్తాన్ గురించి చర్చలు జరపడానికి కజకిస్తాన్, కిర్గిస్తాన్, తజకిస్తాన్, తుర్కెమినిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, రష్యా జాతీయ భద్రతా సలహాదారులు న్యూదిల్లీలో వచ్చారు. వీటిలో చాలా దేశాల సరిహద్దులు అఫ్గానిస్తాన్‌కు ఆనుకుని ఉన్నాయి.

ఫొటో సోర్స్, Getty Images
మధ్య ఆసియాలోని ఐదు దేశాల విదేశాంగ మంత్రులు గతవారమే న్యూ దిల్లీకి ఇండియా సెంట్రల్ ఏసియా చర్చల కోసం భారత్ వచ్చారు. ఈ ఐదు దేశాల నేతలను భారత్ గణతంత్ర దినోత్సవాలకు ముఖ్య అతిథులుగా ఆహ్వానించినట్లు చెబుతున్నారు.
అఫ్గానిస్తాన్ గురించి రష్యా, భారత్ మధ్య సహకారం హఠాత్తుగా ఎందుకు పెరగడం మొదలైంది.
తాలిబాన్ల ప్రభుత్వం దేశంలో అందరినీ కలుపుకోవడంలో విఫలమైందని రష్యాకు అనిపించడం మొదలైంది. ఈ పరిస్థితుల్లో అది అఫ్గానిస్తాన్ గురించి పునరాలోచిస్తోందని హర్ష్ పంత్ చెప్పారు.
"తాలిబాన్ ప్రభుత్వం తాజిక్, హజారా సమాజాలకు ప్రభుత్వంలో చోటు కల్పించలేదు. బాలికలు స్కూలుకు కూడా వెళ్లలేకపోతున్నారు. తాలిబాన్ల పట్ల భారత్ వైఖరి వాస్తవాలకు దగ్గరగా ఉందని రష్యాకు అనిపించింది. తాలిబాన్లు అందరినీ కలుపుకుపోలేదంటే, అఫ్గానిస్తాన్‌లో అస్థిరత ఉందని అర్థం. అందుకే అఫ్గానిస్తాన్ విషయంలో రష్యా భారత్ వెంట నిలవడం అనేది మరింత ఆచరణాత్మక విధానం"
భాగస్వామ్యం
"భారత్‌కు రష్యా ఒక పాత భాగస్వామే. అమెరికా భారత్ కణితిపై తుపాకీ పెట్టి రష్యాకు దూరంగా ఉండు అని చెప్పినా అది సాధ్యం కాదు. గత ఏడాది చైనాతో సరిహద్దుల దగ్గర ఘర్షణలు జరిగినపుడు కూడా రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ రష్యా వెళ్లారు. రష్యా కావాలనుకుంటే ఆయుధాల సరఫరా ఆపేయగలదు. కానీ అలా చేయలేదు" అంటారు హర్ష్ పంత్.
అమెరికాకు వ్యతిరేకంగా రష్యా చైనాతో స్నేహంగా ఉండచ్చు. కానీ, అది భారత్‌కు వ్యతిరేకంగా చైనాతో ఉండదు. అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరు ఎవరితో ఉన్నారనేది శాశ్వతం కాదు. ఎవరు ఎవరిపై నమ్మకం ఉంచారు అనేది కూడా పెద్ద సమస్య కాదు. ఎవరు ఎవరి ప్రయోజనాలు కల్పిస్తున్నారు అనేదే అసలు అంశం. ఒకప్పుడు కోల్డ్ వార్ సమయంలో చైనా, అమెరికాకు సన్నిహితంగా ఉండేది, ఇప్పుడు చైనా, రష్యా కలిసున్నాయి.
గత ఏడాది తూర్పు లద్దాఖ్‌లో ఎల్ఏసీ దగ్గర భారత్, చైనా సైనికుల మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. మరోవైపు 2014లో ఉక్రెయిన్ గురించి అమెరికా నుంచి రష్యా మధ్య ఉద్రిక్తత మొదలైంది.

ఫొటో సోర్స్, Getty Images
ఇక్కడ ప్రస్తుతం ఎలాంటి పరిస్థితి నెలకొందంటే రెండు దేశాలకూ వారి బెస్ట్ ఫ్రెండ్, వారికి శత్రువులతో స్నేహ సంబంధాలు కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అంటే రష్యా చైనాతో, భారత్ అమెరికాతో దోస్తీ ఉంది.
భారత్, రష్యా సంబంధాల్లో కొన్ని చిక్కులు కూడా ఉన్నాయి. రష్యా, భారత్ మధ్య అణు శక్తి నుంచి అంతరిక్షం వరకూ సహకారం ఉంది.
కానీ చాలా అంశాల్లో సమస్యలు కూడా ఉన్నాయి. అమెరికా, చైనా సంబంధాలు అత్యంత ఘోర స్థితిలో ఉన్నాయి. కానీ, ఆ రెండు దేశాలతో భారత ద్వైపాక్షిక వాణిజ్యం వంద బిలియన్ డాలర్లు దాటింది.
భారత ఆర్థిక వ్యవస్థలో మెజారిటీ వాటా ప్రైవేటు రంగం చేతుల్లో ఉంది. అయితే, భారత్, రష్యా ఆర్థిక ఒప్పందాలు మాత్రం ఇప్పటికీ ప్రభుత్వాల స్థాయిలోనే ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- జార్ఖండ్: లీటరు పెట్రోలుకు రూ.25 తగ్గించిన రాష్ట్ర ప్రభుత్వం.. సబ్సిడీ నిబంధనలు ఏంటంటే..
- పిల్లలకు కోవిడ్19 వ్యాక్సీన్: టీకా ఇచ్చే ముందు, ఇచ్చిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? - 7 ముఖ్యమైన ప్రశ్నలు - జవాబులు
- డిసెంబర్ 31 రాత్రి ‘డ్రంకెన్ డ్రైవ్’ తనిఖీలు చేస్తే కరోనా వ్యాపిస్తుందా
- పాశ్చాత్య దేశాలతో యుద్ధానికి రష్యా, చైనా రిహార్సల్స్ .. భవిష్యత్ యుద్ధాలు, ఆయుధాలు ఎలా ఉంటాయి?
- జనవరి 1 నుంచి ఏమేం మారతాయి... మీరేం చేయగలరు, ఏం చేయలేరు?
- మన తాత ముత్తాతలు తిన్న జొన్నలు, సజ్జలు, రాగులు ఇప్పుడు స్మార్ట్ ఫుడ్ ఎలా అయ్యాయి?
- జొమాటో, స్విగ్గీ ఆర్డర్లపై పన్ను భారం: 5 శాతం జీఎస్టీ విధించాలని కేంద్రం నిర్ణయం - ప్రెస్‌రివ్యూ
- జుగాడ్ జీప్: 'లీటర్ పెట్రోల్‌కు 50KM మైలేజ్. ఆనంద్ మహీంద్రాకు దీన్ని ఇవ్వలేను.. కొత్తది తయారు చేసి ఇస్తా'
- నడి రోడ్డుపైనే ఉమ్మేసే జనం తీరు మారేదెప్పుడు..
- ‘జుగాడ్’ విధానంలో ఉద్ధభ్ భరలి వినూత్న ఆవిష్కరణలు
- చిన్న వయసులోనే జుట్టు ఎందుకు తెల్లబడుతుంది? దానికి పరిష్కారమేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













