కొత్త ఏడాదిలో కాస్త హేతుబద్ధంగా ఉందామా... ఇవిగో మూడు మార్గాలు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, ప్రొఫెసర్ స్టీవెన్ పింకర్
- హోదా, హార్వర్డ్ విశ్వవిద్యాలయం
కొత్త సంవత్సరం రాబోతోందనగానే చాలామంది కొత్త లక్ష్యాల జాబితా తయారు చేసుకుంటారు.
జీవితాన్ని మరింత హేతుబద్ధంగా గడపడానికి, మరిన్ని ప్రయోజనాలు పొందే విధంగా నడుచుకునేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకుంటారు. అయితే, వీటిని ఆచరణలో పెట్టడం అంత సులభమేమీ కాదు.
మూఢత్వం ఉచ్చులో పడకుండా జీవితాన్ని హేతుబద్ధంగా గడపడానికి నేను సూచించే మూడు సూత్రాలివి.
1. భవిష్యత్తులో మీరు
మన "ఆలోచనలకు", అనుభూతులకు" మధ్య విబేధం పొడజూపుతోందంటే, దానర్థం మన తక్షణ, దీర్ఘకాలిక ఆనందాలకు మధ్య వ్యత్యాసం ఉన్నదని. ఉదాహరణకు ఈ క్షణం రుచికరమైన విందుభోజనం చేయడం అనుభూతి కలిగిస్తుంది. మన ఆలోచనలు మాత్రం భవిష్యత్తులో నాజూకైన శరీరం కావాలని కోరుకుంటాయి. ఈ రాత్రికి మధురానుభూతి పొందాలనిపించవచ్చు. తొమ్మిది నెలల తరువాత దాని పర్యవసానం మన ఆలోచనల్లోకి వస్తుంది. ఇప్పటికి ఓ గొలుసో, గాజులో కొనుక్కోవాలనిపించవచ్చు. కానీ, ఆ డబ్బు దాచుకుని రేపు అద్దె కట్టాలన్న ఆలోచనలు మన బుర్రలో తిరుగుతుంటాయి.
కాలాల మధ్య వ్యత్యాసం మనలోని భిన్న పార్శ్వాల మధ్య పోరాటంలా అనిపిస్తుంది. ఒక పక్క హాయిగా కూర్చుని టీవీ చూస్తే బావుంటుందనిపిస్తుంది. మరో పక్క చదువుకుని పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకోవాలనిపిస్తుంది. ఈ రెండు పార్శ్వాల మధ్య నిరంతరం యుద్ధం జరుగుతుంటుది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఇలాంటప్పుడే మనకు ఒక ప్రశ్న వస్తుంటుంది. భవిష్యత్తు కోసం మనం వర్తమానాన్ని త్యాగం చేస్తున్నామా?
అలాగని చెప్పలేం. దీన్నే "డిస్కౌంటింగ్ ది ఫ్యూచర్" అంటారు ఆర్థికశాస్త్రవేత్తలు. ఇది కొంతవరకూ హేతబద్దమైనదే. బ్యాంకులో డబ్బులు దాచుకుంటే వడ్డీ ఇస్తారు కదా. ఇప్పుడు డబ్బును వదులుకుని, భవిష్యత్తులో తీసుకునేందుకు బ్యాకు మనకి వడ్డీ చెల్లిస్తుంది. ఇదీ అలాంటిదే.. భవిష్యత్తుకు డిస్కౌంట్ ఇవ్వడం.
అయితే, ఇప్పటి త్యాగాలకు ఎలాంటి ప్రయోజనాలూ పొందకుండా మనం చనిపోవచ్చు. అందుకే "జీవితం చిన్నది, ముందు తీపి పదార్థాలు తినేయండి" అని చెబుతుంటారు.
మనం కోరుకున్న ప్రయోజనాలు ఎప్పటికీ అందకపోవచ్చు. అంతే కాకుండా, ఈ వయసు మళ్లీ రాదు. డబ్బులు దాచి పెట్టి ఎప్పుడో మంచి సౌండ్ సిస్టం కొనుక్కోవాలనుకుంటాం. కానీ, అప్పటికి మన చెవులు ఎంతవరకు పనిచేస్తాయో తెలీదు. మామూలు సౌండ్ సిస్టంకు, మంచిదానికి తేడా తెలియకపోవచ్చు.
అంటే ఇక్కడ మన సమస్య భవిష్యత్తుకు డిస్కౌంట్ ఇవ్వడం కాదు. దాన్ని ఎలా ఇస్తున్నామన్నదే ముఖ్యం.
ముందుచూపు లేకుండా వర్తమానంలో తినడం, తాగడం, తిరగడం చేస్తూ ఎంజాయ్ చేసేస్తే జేబులు తొందరగా ఖాళీ అయిపోతాయి. భవిష్యత్తులో వర్షం పడుతుంటే ఓ గొడుగు కొనుక్కోవడానికి కూడా చేతిలో చిల్లి గవ్వ లేకపోవచ్చు.
వర్తమానంలో చిన్న చిన్న ఆనందాలకు, భవిష్యత్తులో పొందే పెద్ద ప్రయోజనాలకు మధ్య పోరాటం మానవ జీవితంలో ఓ భాగమైపోయింది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
మన సంస్కృతి, కళలు, పురాణగాథల్లో కూడా ఈ వైరుధ్యాలు కనిపిస్తాయి. చీమలు, మిడత కథ మనందరికీ తెలిసినే. భవిష్యత్తు కోసం చీమలు శ్రమతో అన్ని ఏర్పాట్లు చేసుకుంటాయి. కానీ, మిడత వర్తమానంలో విలాసవంతంగా గడుపుతుంది. వేసవి పోయి చలికాలం వచ్చేసరికి మిడతకు ఆహారం దొరకదు. చీమలు దూరదృష్టితో దాచిపెట్టుకున్న ఆహారం తిని జీవిస్తాయి.
అలాగే, బైబిల్‌లో ఆడం, ఈవ్ కథ. ఆపిల్ తినొద్దని, తింటే స్వర్గాన్ని కోల్పోతారని భగవంతుడు హెచ్చరించినా తక్షణ అనుభూతి కోసం ఈవ్ ఆపిల్ తింటుంది.
మరో పక్క, పురాణాల్లో స్వీయ నియంత్రణ గురించి కథలు కూడా ఉన్నాయి. వర్తమానంలో మన కోరికలను నియంత్రించుకుంటే భవిష్యత్తులో ప్రయోజనాలను అందుకుంటామని చెప్పిన కథలూ ఉన్నాయి.
కడుపు నిండినప్పుడు, చాక్లేట్ తినాలని కోరిక ఉన్నా నియంత్రించుకుంటే, ఆకలేసినప్పుడు ఆ చాక్లేటే ఆదుకుంటుంది. అందుకే, ఉద్యోగంలో చేరాక రిటైర్‌మెంట్ అవసరాలకు తగినట్టు డబ్బు ఆదా చేసే ప్రణాళికలను ఏర్పాటు చేసుకున్నాం.
ఆకర్షణను నియంత్రించుకోవడానికి ఇదొక దారి. పూర్తి స్వీయ నియంత్రణ కాకుండా, ఆకర్షణను కొంతవరకు తగ్గించుకుంటూ, భవిష్యత్తు కోసం దాచుకోవడం మేలు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
2. యాదృచ్ఛికతకు కారణాలు వెతకడం
మనం అప్పుడప్పుడూ ఆకాశంలోకి చూస్తూ మబ్బుల్లో ఏదో ఒక ఆకారాన్ని గుర్తుపట్టడానికి ప్రయత్నిస్తుంటాం. గుర్రం, నెమలి, చంటిపాప ఇలా ఏవో ఒక ఆకారాలను గుర్తించడానికి ప్రయత్నిస్తాం. చంద్రుడిలో కుందెలు ఉందని, బామ్మ రాట్నం వడుకుతోందని ఊహిస్తాం. ఇది చాలామందికి ఉండే అలవాటు. ఏమీ లేనిచోట ఏదో ఉందని ఊహించడం. ఒక క్రమాన్ని, ఆకారాన్ని ఒడిసిపట్టుకునే ప్రయత్నం చేస్తుంటాం.
అలాగే, ఎప్పుడూ ఒక అనుమానపు దృష్టితో కూడా చూస్తుంటాం. ఫలానా దాని వెనుక లొసుగులేమైనా ఉన్నాయా, రహస్య ఎజెండాలు, కారణాలు ఉన్నాయా అని వెతుకుతుంటాం. ఏమీ లేని చోట కూడా ఏదైనా ఉందేమోనని అనుమానిస్తుంటాం. దీని వల్ల నకిలీ కారణాలు పుట్టుకొచ్చి మనకు భ్రాంతి కలిగిస్తాయి.
యాదృచ్ఛిక సంఘటనలు జరిగినప్పుడు అనుమానాలు కలుగుతుంటాయి. ఫలానా సంఖ్య మంచిది కాదని, ఫలానా ఘడియ అశుభం అని, నష్ట జాతకమని, దేవుడు మనల్ని పరీక్షిస్తున్నాడని ఏవేవో నమ్మకాలు మొదలవుతాయి.
ఈ "యాదృచ్ఛికత"లోనే ప్రమాదం పొంచి ఉంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది.
ఏ కారణం లేకుండా ఏదో ఒకటి జరగడం. రూపాయి కాసు ఎగరేస్తే బొమ్మో, బొరుసో ఏదో ఒకటి పడుతుంది. ఆటల్లో పాచికలు (డైస్) విసిరితే ఏదో ఒక అంకె పడుతుంది.
ఒక్కోసారి ఇలాంటి యాధృచ్ఛికత గుడ్డి నమ్మకాలకు దారి తీస్తుంది. బొమ్మ, బొరుసు, బొమ్మ, బొమ్మ, బొరుసు, బొమ్మ...ఇలా ఒక క్రమం లేకుండా పడితే ఫరవాలేదు. కానీ, బొమ్మ బొమ్మ బొమ్మ, బొరుసు, బొరుసు, బొరుసు పడితే ఒక క్రమం వచ్చేస్తుంది. వరుసగా మూడుసార్లు బొమ్మ, మూడుసార్లు బొరుసు అని గుర్తుపెట్టుకుంటాం. అక్కడి నుంచి మన అంచనాలు మొదలవుతాయి. గ్యాంబ్లింగ్ మొదలుపెడతాం.
యాదృచ్ఛిక ప్రక్రియ యాదృచ్ఛికంగా కనిపించే డేటాను లేదా క్రమాన్ని సృష్టంచగలదని మనం గమనించం. అందులో ఉన్న అందాన్ని అభినందించడం మర్చిపోతాం. కాలక్రమంలో ఈ డేటా తయారయి తీరుతుంది. యాదృచ్చిక సంఘటనలు మనల్ని ఆకర్షిస్తాయిగానీ అవి సంభవించడానికి ఎన్ని మార్గాలున్నాయన్నది మనం పట్టించుకోం.
ఒక పార్టీలో రెండు డజన్ల మంది ఉన్నారు. వారిలో ఒకేరోజు పుట్టినవాళ్లు ఎంతమంది ఉండవచ్చు?
50-50 కావొచ్చు. అంతకన్నా ఎక్కువ కావొచ్చు. అదే ఒక 60 మందిలో అలా ఉండే అవకాశం 99 శాతం ఉంటుంది.
మన పుట్టినరోజు మరొకరితో మ్యాచ్ అవ్వగానే భలే ఉత్సాహపడతాం. పార్టీలో ఉన్న 20 మందిలో ఏ ఇద్దరి పుట్టినరోజులు ఒకటైనా సరదాపడతాం. కానీ, మొత్తం 365 రోజుల్లో ఇలా యాదృచ్చికంగా పుట్టినరోజు ఒకటే అయ్యే అవకాశాలు ఎన్ని ఉంటాయో పరిశీలించం. ఈ అవకాశాలు పరిమితం. అది మనం గమనించం. ఇలాంటివి రోజులో ఎన్నో జరుగుతుంటాయి. మన ముందు వెళ్తున్న కారు నంబర్ ప్లేటు మీద మన సెల్ ఫోన్ నంబరులో సగం నంబర్లు ఉండవచ్చు. యాదృచ్ఛికంగా మనకొచ్చిన ఒక కల నిజం కావొచ్చు.
అయితే, ఈ యాదృచ్ఛికతకు ఎప్పుడైతే కారణాలు వెతకడం మొదలెడతామో అప్పుడు మనం ప్రమాదంలో పడినట్టే. యాదృచ్ఛికతకు ఒక కారణాన్ని అంటగట్టడంలోనే ఉంది ముప్పంతా. తుపాకీతో గోడ మీద కాల్చి, రంధ్రం పడినచోట ఓ సున్నా చుట్టి లక్ష్యానికే గుర్తిపెట్టామన్న భ్రమ కలిగించడం. దీన్నే టెక్సాస్ షార్ప్‌షూటర్ ఫాలసీ అంటారు.
యాదృచ్ఛికతను అతిగా వివరించడానికి ప్రయత్నించడం మేలు చేయదు. ప్రతీది ఒక కారణంతో జరుగుతుందని భావించడం, ఉనికిలో లేని కారణాలను పట్టుకుని వ్యక్తిగత ఇష్టాయిష్టాలను ఏర్పరచుకోవడం మానేస్తే జీవితాన్ని మరింత బాగా ఆస్వాదించవచ్చు.

ఫొటో సోర్స్, Getty Images
3. నమ్మకాలు శాశ్వత సత్యాలు కావు. వాటిని పరీక్షకు పెట్టగలగాలి
మనం ఏదైనా ఒక మేధాపరమైన చర్చలో పాల్గొన్నప్పుడల్లా సత్యానికి కట్టుబడి ఉండేందుకు ప్రయత్నిస్తుంటాం. అయితే, మనుషులకు ఆధిపత్యం అంటే ఇష్టం. చర్చల్లో కూడా ఆధిపత్యం సాధించాలని చూస్తుంటారు.
మాటల ద్వారానే కాకుండా కూర్చునే పద్ధతి, చూసే చూపు, గొంతు, ఎవరైనా మాట్లాడుతుంటే అదే పనిగా అంతరాయం కలిగించడం లాంటివి ఎన్నో చేస్తుంటారు.
అలాగే, అవతలివారిని బలహీనంగా లేదా మూర్ఖుడిగా నిరూపించేందుకు ట్రిక్స్ ప్లే చేయడం లాంటివి కూడా చేస్తుంటారు. చర్చలోని అంశాన్ని పక్కకు పెట్టి వ్యక్తిగతంగా దాడి చేయడం, మాటలను వక్రీకరించడం, లేదా వేరే విషయాలు తీసుకొచ్చి నోరుమూయించడం లాంటివి.
మన లక్ష్యం వాదనలో గెలవడమా, ఆధిపత్యాన్ని ప్రదర్శించడమా? వాదనలో గెలవడమే అయితే పైన చెప్పిన విషయాలన్నింటినీ నియంత్రించుకోవాల్సి ఉంటుంది.
మేధాపరమైన చర్చల తీరును మార్చడం ద్వారా రీజనింగ్ (కారణాలు)కు పెద్దపీట వేయవచ్చు.
దానివల్ల, మనుషుల నమ్మకాలను పరీక్షకు పెట్టే అలవాటు వస్తుంది. వాటిని శాశ్వత సత్యాల్లాగా భావించి సమర్థించుకోకుండా పరీక్షకు పెట్టడం అనేది ప్రారంభమవుతుంది.
స్టీవెన్ పింకర్ హార్వర్డ్ యూనివర్సిటీలో సైకాలజీ ప్రొఫెసర్. ‘రేషనాలిటీ: వాట్ ఇట్ ఈజ్, వై ఇట్ సీమ్స్ స్కేర్స్, వై ఇట్ మ్యాటర్స్’ పుస్తక రచయిత. బీబీసీ 4లో వచ్చే ‘థింక్ విత్ పింకర్’ అనే కార్యక్రమానికి వ్యాఖ్యాతగా కూడా వ్యవహరిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
- ఒంటి చేత్తో బాడీ బిల్డింగ్ పోటీల్లో విజేతగా నిలిచిన యువతి.. ‘అప్పుడు నా జీవితం ముగిసిపోయిందనుకున్నా.. ఇప్పుడు ఇంకా సాధించగలనని నమ్ముతున్నా’
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి?
- మగవాళ్లు ఏడవకూడదా? ఏడ్చే మగాళ్లను నమ్మకూడదా? - ఇంటర్నేషనల్ మెన్స్ డే
- షిఫ్టు డ్యూటీల్లో పని చేసేవారి శరీరంలో ఏం జరుగుతుంది? ఆరోగ్యం దెబ్బతినకుండా తీసుకోవాల్సిన 5 జాగ్రత్తలు
- మెదడుపై ధ్యానం ఎలా పనిచేస్తుంది? మెమరీ బూస్టర్స్ కంటే ధ్యానం మేలా?
- ఆత్మహత్య చేసుకోవాలనుందని ఎవరైనా అంటే మనం ఏం చేయాలి?
- చిరు ధాన్యాలు: మన తాత ముత్తాతలు తిన్న జొన్నలు, సజ్జలు, రాగులు ఇప్పుడు స్మార్ట్ ఫుడ్ ఎలా అయ్యాయి?
- ఎవరు ఎక్కువ ఆరోగ్యవంతులు.. మగవాళ్లా లేక ఆడవాళ్లా?
- జోల పాటలు, లాలి పాటలతో తల్లికి కూడా లాభమే!
- త్వరగా పడుకుని, త్వరగా నిద్ర లేస్తే నిజంగానే ఆరోగ్యంగా ఉంటామా?
- మందులు ఇవ్వకుండా మానసిక చికిత్స.. సైన్స్‌ని తిరగరాస్తున్నారా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











