ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాలెండర్‌పై వివాదం ఎందుకు? ఆర్యులు భారత్‌పై దాడులు చేశారనేది కల్పితమేనా? చరిత్రను తప్పుదోవ పట్టించారా?

ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాలెండర్

ఫొటో సోర్స్, IIT KHARAGPUR

    • రచయిత, ప్రభాకర్ మణి తివారి
    • హోదా, కోల్‌కతా నుంచి, బీబీసీ కోసం

పశ్చిమ బెంగాల్‌, ఖరగ్‌పూర్‌లో ఉన్న దేశంలోనే అత్యంత పురాతన భారత సాంకేతిక సంస్థ(ఐఐటీ) 2021 చివరి నెలలో పతాక శీర్షికల్లో నిలిచింది.

తన 70 ఏళ్ల చరిత్రలో అత్యధిక ప్లేస్‌మెంట్లతో రికార్డ్ సృష్టించి వార్తల్లో నిలిచిన ఐఐటీ, డిసెంబర్ మొదటి రెండు వారాల్లో ఇన్‌స్టిట్యూట్ రూపొందించిన క్యాలెండర్‌తో వివాదాల్లోకి ఎక్కింది.

ఇంతకు ముందు కోల్‌కతా హౌరాలోని కేంద్ర సంస్థ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వర్చువల్ వర్క్‌షాప్‌లో కూడా గీతాపఠనం చేయడం వివాదాస్పదమైంది.

కానీ, తాజాగా ఈ క్యాలెండర్ వివాదం ఐఐటీ రికార్డ్ ప్లేస్‌మెంట్ ఘనతను కూడా వెనక్కు నెట్టింది.

అయితే, సంస్థ ఈ క్యాలెండర్‌ను తయారు చేసిన సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ మాత్రం అందులో తప్పేమీ లేదని, అది ఆర్యుల దాడుల గురించి ఉన్న అపోహలను తొలగించడానికి చేసిన ప్రయత్నం అని చెప్పింది.

కానీ, హిందుత్వ ప్రచారం కోసం ఐఐటీ చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తోందని చాలా మంది విద్యావేత్తలు ఆరోపిస్తున్నారు.

అంతే కాదు, క్యాలెండర్ గురించి వివాదం రాజుకుంటున్న సమయంలో ఇదే సంస్థ వాస్తు విద్య(ఆర్కిటెక్చర్), పరివేష్ విద్య(పర్యావరణ అధ్యయనం), ఆర్థికశాస్త్రం, గణితంలో అండర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ కోర్సులును కూడా ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.

ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాలెండర్

ఫొటో సోర్స్, IIT KHARAGPUR

క్యాలెండర్ ఎలా ఉంది

వివాదాస్పదమైన ఈ క్యాలెండర్‌ను సంస్థ వార్షిక స్నాతకోత్సవంలో విడుదల చేశారు. ఆ సమయంలో అక్కడ కేంద్ర విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ కూడా ఉన్నారు.

అయితే, అంత వివాదం రేగేలా క్యాలెండర్‌లో అలా ఏముంది.

'రికవరీ ఆఫ్ ద ఫౌండేషన్ ఆఫ్ ఇండియా నాలెడ్జ్ సిస్టమ్' శీర్షికతో ఉన్న ఈ క్యాలెండర్‌లో భారత సంప్రదాయ అధ్యయన విధానాన్ని వర్ణించారు.

ఈ క్యాలెండర్ ప్రతి నెలనూ ప్రచురించిన పేజిలో ప్రపంచ ప్రముఖుల చిత్రాలు ఉన్నాయి. దీనిపై అంశాలను భారత గణిత భాషలో రాశారు.

ఉదాహరణకు ఆగస్టు నెల పేజీలో విష్ణు పురాణం నుంచి తీసుకున్న సప్త రుషులను చూపించారు. వారిని భారతీయ విజ్ఞానానికి ఆద్యులుగా వర్ణించారు,

అలాగే మార్చి నెల పేజీలో బీజగణితం, జామెట్రీ గురించి రాశారు. దానితోపాటూ ప్రముఖ సైంటిస్ట్ ఆల్బర్ట్ ఐన్‌స్టీన్ చిత్రం ప్రచురించారు.

ఈ క్యాలెండర్లో ఆర్యుల దాడులు కల్పితమని చెప్పారు. హిందువులను కించపరచడానికి ద్రవిడులు స్థానికులని, ఆర్యులు వారిపై దాడులు చేశారనే సిద్ధాంతాన్ని సృష్టించారని తెలిపారు.

ఆర్యుల దాడుల గురించి చెప్పినవన్నీ కల్పిత కథలంటూ క్యాలెండర్‌లో కొట్టిపారేశారు. మొత్తం క్యాలెండర్‌ అంతా వేదాలు, పురాణాల గురించి వర్ణిస్తూ, భారత నాగరికత, సంస్కృతి గురించి ప్రస్తావిస్తూ, తమ వాదనలకు మద్దతుగా రుషి అరవింద్, స్వామి వివేకానంద లాంటి మహాపురుషులు చెప్పిన మాటలను కూడా ఉదహరించారు.

ఈ క్యాలెండర్‌లో సలహాదారుల టీమ్‌ సభ్యులుగా సంస్థ డైరెక్టర్ వీరేంద్ర కుమార్ తివారీ, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అధ్యక్షులు అనిల్ డి.సహస్రబుద్ధే, ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆర్థిక సలహాదారు సంజీవ్ సాన్యాల్ పేర్లు ఉన్నాయి.

ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాలెండర్

ఫొటో సోర్స్, SANJAY DAS

వివాదం, వ్యతిరేకత

ఐఐటీ ప్రచురించిన ఈ క్యాలెండర్ బయటకు రాగానే, వివిధ సంస్థలు దీన్ని వ్యతిరేకించడం మొదలుపెట్టాయి.

దేశ అత్యున్నత సాంకేతిక సంస్థకు క్యాలెండర్లో వివరించిన అంశాలకు అసలు సంబంధం ఏముందని అందరూ ప్రశ్నిస్తున్నారు.

ఈ క్యాలెండరుకు వ్యతిరేకంగా సంస్థ గేటు దగ్గర నిరసనలు కూడా చేశారు.

"ఐఐటీ క్యాలెండర్ ప్రచురించడం.. చరిత్ర, వాస్తవాలను వక్రీకరించే ప్రయత్నం. దానిలో ఆర్యుల దాడులను కల్పితం అని చెప్పారు. చరిత్రను చెరిపేసే ప్రయత్నం చేశారు. దానిని సమర్థిస్తూ అశాస్త్రీయమైన, పేలవ వాదనలు చేశారు. సంస్థ మేమేజ్‌మెంట్, కొందరు ప్రొఫెసర్లు ఆర్ఎస్ఎస్, బీజేపీ కనుసన్నల్లో కేంద్రం ఎజెండాను అమలు చేయాలని ప్రయత్నిస్తున్నారు" అని సేవ్ ఎడ్యుకేషన్ కమిటీకి చెందిన తపన్ దాస్ ఆరోపించారు.

ఈ క్యాలెండర్ ఆర్ఎస్ఎస్ హిందుత్వవాద భావనను బలపరుస్తోందని ఐఐటీ ఎదుట నిరసనలకు దిగిన అఖిల భారత శిక్షా బచావో సమితి ఆరోపించింది.

"ఈ క్యాలెండర్‌లో ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్ పేరుతో వివిధ పురాణాలను, చరిత్ర బయటి విషయాలను సైన్స్‌గా, చరిత్రగా చెబుతూ అందించారు. ఇది దేశంలోని సైన్స్ ఎడ్యుకేషన్‌ను ఒక కళంకిత అధ్యాయంగా చెబుతుంది" అని ఈ సమితి పశ్చిమ బెంగాల్ కార్యదర్శి తరుణ్ నస్కర్ అన్నారు.

ఇది హిందుత్వను రుద్దే, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం అంటూ చాలా సంస్థలు ఈ క్యాలెండర్‌ను విమర్శించాయి.

సీపీఎం అధికారవాణి గణశక్తిలో దీనికి వ్యతిరేక వార్తలను ప్రముఖంగా ప్రచురించారు. పశ్చిమ బెంగాల్ విజ్ఞాన మంచ్ కూడా దీనిని విమర్శించింది.

ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాలెండర్

ఫొటో సోర్స్, IIT KHARAGPUR

ఆర్యుల గురించి వాదన

ఈ క్యాలెండర్ ద్వారా వివిధ కల్పిత వాదనలను చరిత్రగా అందించే ప్రయత్నాలు చేశారని మంచ్ అధ్యక్షుడు తపన్ సాహా అన్నారు.

"సింధూ, ఆర్యుల నాగరికతపై పరిశోధన పేరుతో అందించిన వాస్తవాలన్నీ నిరాధారమైనవి. ఈ క్యాలెండర్ ద్వారా హిందుత్వను రుద్దడానికి ప్రయత్నించారు. ఈ ప్రయత్నానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మద్దతు ఉంది" అన్నారు.

ఐఐటీ చర్యలను ఒక రాజకీయ క్రీడగా, చరిత్రను వక్రీకరించే ప్రయత్నంగా బీబీసీతో మాట్లాడిన కోల్‌కతా రవీంద్ర భారతి విశ్వవిద్యాలయం చరిత్ర ప్రొఫెసర్ డాక్టర్ సుస్నాత్ దాస్ చెబుతున్నారు.

"ఐఐటీలో ఇంజనీర్లు, శాస్త్రవేత్తలు తయారవుతారు. వారికి సోషల్ సైన్స్, సాహిత్యం, చరిత్ర గురించి పెద్దగా అవగాహన ఉండదు. ఇలాంటి వాదనల ద్వారా వారికి చరిత్ర గురించి తప్పుడు సమాచారం అందించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇది విద్యను కాషాయీకరణ చేసే, చరిత్రను వక్రీకరించే ప్రయత్నం. ఇందులో కేంద్రంలో అధికార పార్టీ ఆమోదం కూడా ఉంది" అన్నారు.

వీడియో క్యాప్షన్, ‘‘మేం.. అసలైన ఆర్యులం...’’

"ప్రముఖ చరిత్రకారులందరూ ప్రాచీన నాగరికతపై ఎన్నో పరిశోధనలు చేసిన తర్వాతే దానిపై ఒక నిర్ధరణకు వచ్చారు. ఆర్యుల దాడి ఒక నిరూపితమైన, అంగీకరించిన వాస్తవం. ఆర్యులు మధ్య ఆసియా నుంచి భారత్ వచ్చారు. వందేళ్లకు పైగా ఉన్న ఇలాంటి వాస్తవాలను, ఇప్పుడు ఈ క్యాలెండర్ ద్వారా కొట్టిపారేయడం" హాస్యాస్పదం అన్నారు.

"ఐఐటీ ఆర్యుల దాడులు కల్పితం అంటూ, మొత్తం ఆ భావనను తప్పుగా నిరూపించే ప్రయత్నం చేస్తోంది. భారత్‌పై దాడులు చేసింది ముస్లింలు మాత్రమే, ఆర్యులు కాదు అని చెప్పే ఉద్దేశంతోనే ఇలా చేశారు" అంటారు సుస్నాత్ దాస్.

"ఆర్యుల దాడుల చరిత్ర చాలా పురాతనమైనది. ఆ చరిత్రను కేవలం ఒక క్యాలెండర్‌తో కొట్టిపారేయలేం" అని చరిత్ర మాజీ ప్రొఫసర్ రంజన్ కుమార్ దాస్ కూడా చెప్పారు.

ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాలెండర్

ఫొటో సోర్స్, IIT KHARAGPUR

సంతకాల సేకరణ

మరోవైపు ఈ ఐఐటీ మాజీ విద్యార్థి ఆశిష్ రంజన్ ఈ క్యాలెండర్‌కు వ్యతిరేకంగా సంతకాల సేకరణ ప్రారంభించారు.

ఆయన, ఐఐటీ డైరెక్టర్‌కు పంపిన ఒక పిటిషన్‌లో క్యాలెండర్‌లో ఉన్న వాదనలను వ్యతిరేకిస్తూ తన వాదనలను సమర్థించేలా ఇటీవలి ఒక శాస్త్రీయ పరిశోధనను కూడా ఉదహరించారు.

'ద ఫార్మేషన్ ఆఫ్ హ్యూమన్ పాపులేషన్ ఇన్ సౌత్ అండ్ సెంట్రల్ ఏసియా' శీర్షికతో ఉన్న పరిశోధనా పత్రం గురించి చెప్పిన ఆయన "భారత్‌లో మనుషులు 60 వేల ఏళ్ల క్రితం వచ్చారు. వారే మెల్లమెల్లగా ఉపఖండం అంతటా వ్యాపించారు. ఆ తర్వాత క్రీ.పూ. 4 వేల ఏళ్ల క్రితం ఇరాన్ నుంచి మరింత మంది మనుషులు వచ్చారు" అన్నారు.

"ఇరాన్ నుంచి మనుషులు భారత్ రావడం అనే అంశంపై ప్రపంచమంతా ఏకాభిప్రాయం ఉంది. కానీ ఈ క్యాలెండర్ ద్వారా ఏ ఏకాభిప్రాయం లేని అంశాలను నిరూపించాలని ప్రయత్నిస్తున్నారు. వాటిని సమర్థిస్తూ ఎలాంటి పరిశోధనలు, ఆధారాలు కూడా లేవు" అని ఆశిష్ రంజన్ బీబీసీతో అన్నారు.

ఇలాంటి ప్రచారం వల్ల దేశంలోనే అత్యంత పురాతనమైన ఈ ఐఐటీ బ్రాండ్ ఇమేజ్‌కు చాలా నష్టం కలుగుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రస్తుత పరిస్థితుల్లో ఒక క్యాలెండర్ రూపంలో ఐఐటీ ఖరగ్‌పూర్ తమకు సంబంధం లేని ఇలాంటి అంశాలపై తమ అభిప్రాయాలను ప్రచురించడం సమర్థనీయం కాదని ఆయన భావించారు.

వారి దగ్గర వాటిని సమర్థించడానికి ఎలాంటి ఆధారాలు కూడా లేవన్న ఆయన మాజీ విద్యార్థుల తరఫున ఐఐటీ చర్యలను ఖండించారు.

ఆశీష్ వివరాల ప్రకారం ఇప్పటివరకూ వెయ్యి మందికి పైగా విద్యార్థులు డైరెక్టర్‌కు తమ లేఖలు రాశారు.

ఐఐటీ ఖరగ్‌పూర్ క్యాలెండర్

ఫొటో సోర్స్, IIT KHARAGPUR

ఐఐటీ ఏం చెబుతోంది

క్యాలండర్‌కు కంటెంట్, దాని డిజైన్‌ను ఐఐటీకి చెందిన 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్స్' హెడ్ ప్రొఫెసర్ జయ్ సేన్ రూపొందించారు.

"ఈ క్యాలెండర్ ఉద్దేశం నిజాలను వెలుగులోకి తీసుకురావడం. సోషల్ మీడియాలో ఎక్కువమంది ఈ ప్రయత్నాన్ని ప్రశంసించారు" అని ఆయన చెప్పారు..

"క్యాలెండర్‌లో మేం ఎలాంటి వివాదాస్పద అంశాల గురించీ ప్రస్తావించలేదు. ఆర్యులు దాడులు చేశారంటూ కల్పితాలతో భారత చరిత్రను తప్పుదోవ పట్టించారు. క్యాలెండర్ దానికి వ్యతిరేకంగా నిరసనను తెలియజేశాం. దీనిలోని మొత్తం 12 పేజీల్లోనూ శాస్త్రీయ వాదనలతోపాటూ వాటిని సమర్థించే 12 ఆధారాలు కూడా ఇచ్చాం" అని జయసేన్ తెలిపారు.

"ఈ క్యాలెండర్ ఇలా వార్తల్లో నిలుస్తుందని మేం అసలు అనుకోలేదు. దీనిని ముద్రించిన తర్వాత ఇప్పటివరకూ మాకు వచ్చిన కొన్ని వేల ఈ-మెయిళ్లలో ఎక్కువగా ఈ ప్రయత్నాన్ని ప్రశంసిస్తూ వచ్చినవే ఉన్నాయి. యూరప్, అమెరికాలోని ఎన్నో శిక్షణా సంస్థలు ఈ క్యాలెండర్ ప్రతి పేజి మీదా రకరకాల వర్క్‌షాపులు నిర్వహించాలనే ఆకాంక్షను కూడా వ్యక్తం చేశాయి" అంటారు ప్రొఫెసర్ సేన్.

వీడియో క్యాప్షన్, పీరో ప్రేమణ్‌: 'నేను ముస్లింను కాదు, హిందువును కాదు... కుల వ్యవస్థపై నాకు నమ్మకం లేదు'

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)