జేమ్స్ బాండ్: డేనియల్ క్రెయిగ్ స్థానంలో వచ్చే కొత్త హీరో ఎవరు?

డేనియల్ క్రెయిగ్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, డేనియల్ క్రెయిగ్
    • రచయిత, స్టీవెన్ మెకింతోష్
    • హోదా, ఎంటర్‌టైన్మెంట్ రిపోర్టర్

పదహారేళ్లలో ఐదు సినిమాల్లో జేమ్స్ బాండ్‌గా నటించాడు డేనియల్ క్రెయిగ్. ఈ బ్రిటిష్ గూఢచారి పాత్రలో ఆయన నటన ఈ ఏడాది ఆరంభంలో ముగిసింది.

క్వాంటమ్ ఆఫ్ సొలేస్ అంటే ఏమిటో మనకు పూర్తిగా అర్థంకాకపోయినప్పటికీ, జేమ్స్ బాండ్ సినిమాల్లో క్రెయిగ్ కొన్ని మంచి చిత్రాలను అందించాడు. ఆయన తర్వాత వచ్చేవారు ఆ స్థాయి ప్రదర్శన చూపించడం కష్టమే అనుకోవచ్చు.

బాండ్ పాత్రకు నటుడి ఎంపిక చాలా ముఖ్యమైన నిర్ణయం. ఎందుకంటే, బాక్సాఫీస్ వసూళ్లు చాలా వరకూ ఈ పాత్రకు ఎన్నుకునే నటుడిపై కూడా ఆధారపడి ఉంటాయి.

"రెడ్ కార్పెట్ మీద నడిచే వారిలో ఎవరో ఒకరిని కొత్త బాండ్‌గా ఎంపికచేయటం కుదరదు" అని ‘క్యాచింగ్ బుల్లెట్స్: మెమోయిర్స్ ఆఫ్ ఎ బాండ్ ఫ్యాన్’ రచయిత మార్క్ ఓ కానెల్ చెప్పారు. "అతను తప్పనిసరిగా మూవీ స్టార్ అయి ఉండాలి. ఈ సినిమా సిరీస్‌కు రాయబారిగా ఉండగలగాలి. మీడియా డిప్లొమాట్ అయి ఉండాలి, బ్రిటిష్ సంస్కృతికి వారసుడిగా ఉండాలి. కోట్లాది డాలర్ల ఉత్పత్తులను ప్రొమోట్ చేయగలిగే ముఖచిత్రం ఉండాలి’’ అని ఆయన అన్నారు.

ఇంకా, "అతను జేమ్స్ బాండ్ అని ప్రపంచ మూలమూల్లో తక్షణమే గుర్తించగలిగేలా ఉండాలి. అందంగా ఉండాలి, ఫుట్‌బాల్ పిచ్ పరిమాణంలోని సినిమా స్క్రీన్లను డామినేట్ చేయగలిగేలా ఉండాలి. కొత్తగా బాండ్ పాత్ర పోషించే నటుడు ఎవరైనా తన కంటే ముందు ఆ పాత్ర పోషించిన వారిని గౌరవించాలనే అనుకుంటారు. కానీ, తన సొంత లక్షణాలను ఆ పాత్రకు తీసుకువస్తారు" అని ఓకానెల్ వివరించారు.

"అతడు హీరోగానే నటిస్తూ ఉండాల్సిన అవసరం లేదు. 2005లో డేనియల్ క్రెయిగ్ ఈ పాత్రకు ఎంపికైనపుడు అతడు హీరో పాత్రల్లో నటించటం లేదు. అయితే, అప్పటికే అతడు హీరో పాత్రలు పోషించటానికి సంసిద్ధమయ్యాడు. నిర్మాత బార్బరా బ్రోకలీ.. బాండ్ పాత్రను పోషించాలంటూ ఏడాదికి పైగా ఆయనతో మాట్లాడి ఒప్పించాల్సి వచ్చింది" అని ఆయన తెలిపారు.

టామ్ హార్డీ

ఫొటో సోర్స్, PA Media

ఫొటో క్యాప్షన్, బాండ్ పాత్రకు పరిశీలనలో ఉన్న టామ్ హార్డీ

మరి ఇప్పుడు కొత్త బాండ్ ఎవరు?

బాండ్ పాత్ర చేపడుతారంటూ ఇటీవలి కాలంలో అనేక మంది అభ్యర్థుల పేర్లు వినిపించాయి. కొత్త జేమ్స్ బాండ్ కూడా మరో పురుషుడేననేది మనకు కచ్చితంగా తెలుసు.

"జేమ్స్ బాండ్ ఏ రంగు వ్యక్తి అయినా కావచ్చు.. కానీ, అతడు మగాడు" అని నిర్మాత బార్బరా బ్రోకలీ 2020లో చెప్పారు. "మహిళల కోసం కొత్త పాత్రలను - బలమైన మహిళా పాత్రలను సృష్టించాలని నేను నమ్ముతున్నా. ఒక మగ పాత్రలో ఒక మహిళ నటించటం పట్ల నాకు ఆసక్తి లేదు’’ అని ఆమె స్పష్టంచేశారు.

ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుంటే, స్క్రీన్ మీద టఫ్‌గా కనిపించే నటుడు టామ్ హార్డీ కంటే మొనగాడు మనకు కనిపించడు. లెజెండ్‌లో క్రే కవలల పాత్రలు రెండూ అతడే పోషించాడు. వీనంలో, డంకర్క్‌లో, మ్యాడ్ మ్యాక్స్: ఫ్యురీ రోడ్‌లో అతడు నటించాడు.

అలాంటి పాత్రలు చేసిన హార్డీ.. కొంతకాలం పాటు బుకీల ఫేవరెట్‌గా ఎందుకున్నాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

‘‘(టెనెట్ దర్శకుడు) క్రిస్టోఫర్ నోలన్‌తో.. బాండ్ కానీ, మరో పాత్ర కానీ చేయటానికి ఇష్టపడతాను. అది అద్భుతంగా ఉంటుంది’’ అని హార్డీ 2012లోనే చెప్పాడు.

అయితే, అతడికి ఇప్పటికే 44 ఏళ్ళు నిండాయి. కాబట్టి బాండ్ అవకాశం అతడు కోల్పోయి ఉండవచ్చు. ఈ పాత్రలో డేనియల్ క్రెయిగ్ 15 ఏళ్ల పాటు పని చేశాడని మనం గుర్తుంచుకోవాలి. టామ్ హార్డీ అంతకాలం పాటు ఈ పాత్ర చేయాలంటే అప్పటికి ఆయన వయసు 60 ఏళ్లు అవుతుంది.

ది వైర్ చిత్రంలో స్ట్రింగర్ బెల్ పాత్రలో నటనతో ఎంతో ప్రజాదరణ పొందిన ఇద్రిస్ ఎల్బా.. పదేళ్ల పాటు బాండ్ పాత్రకు ఫేవరేట్‌గా ఉన్నాడు. కానీ, ఇప్పుడు 49 ఏళ్లున్న ఆయనకు కూడా వయసు అవరోధం అవుతుందని భావిస్తున్నారు.

"కార్లు, లేడీస్, మార్టినిలు. అదంతా ఎవరు చేయాలనుకుంటున్నారు? వినటానికే టెరిబుల్‌గా ఉంది" అని ఎల్బా 2016లో జోక్ చేశారు. అయితే, ఆ పాత్ర చేపట్టటానికి తన వయసు మించిపోయి ఉండొచ్చునని కూడా ఆయన అంగీకరించాడు.

"కానరీ, లాజెన్బీలు ఈ పాత్రకు ఎంపికైనపుడు వారిద్దరి వయసూ 30 ఏళ్లు కూడా నిండలేదు. ఈ యాక్షన్ సినిమా అంచనాల మేరకు బాండ్ పాత్రలో నటించటం కష్టమని క్రెయిగ్, అతడికి అయిన గాయాలు చెప్తాయి. ఇది ఓ యువ ఏజెంట్ గేమ్" అని ఓకానెల్ పేర్కొన్నారు.

రెగె-జీన్ పేజ్

ఫొటో సోర్స్, Reuters

ఫొటో క్యాప్షన్, బ్రిడ్జర్టన్‌లో నటించిన స్టార్ రెగె-జీన్ పేజ్

కాబట్టి ఫ్రేమ్‌లో ఏ యువ ఏజెంట్లు ఉండొచ్చు?

బ్రిడ్జర్టన్‌లో నటించిన స్టార్ రెగె-జీన్ పేజ్ వయసు 33 ఏళ్లు. అతడిని ఎంపిక చేసే అవకాశం ఉందని ఊహించటం తప్పుకాకపోవచ్చు. అతుడు ఈ ఏడాది రెడ్ కార్పెట్ మీద అడుగుపెట్టిన ప్రతిసారీ 007 కోసం ఆడిషన్ చేస్తున్నట్లుగానే కనిపించాడు. అతడు "అద్భుతమైన" బాండ్ అవుతాడని మాజీ జేమ్స్ బాండ్ పియర్స్ బ్రాస్నన్ కూడా వ్యాఖ్యానించాడు.

అయితే, ఈ వదంతులతో పేజ్ రెచ్చిపోలేదు. ‘‘మనం బ్రిటష్ వాళ్లం అయి ఉండి, జనం ఆదరించే, పేరు తెచ్చే పని ఏదైనా చేస్తే.. జనం బాండ్ పదం వాడటం మొదలెడతారు’’ అని ఆయన ఈ ఏడాది ఆరంభంలో ది టునైట్ షోతో చెప్పాడు.

"అది ఒక మెరిట్ బ్యాడ్జ్ లాంటిది. ఆ బ్యాడ్జ్ లభించినందుకు నేను చాలా చాలా సంతోషిస్తున్నాను. ఆ బ్యాడ్జ్ ఉన్న అద్భుత వ్యక్తుల సమక్షంలో ఉండటం నాకు సంతోషాన్నిస్తోంది. కానీ అది ఒక బ్యాడ్జ్" అన్నారాయన.

గేమ్ ఆఫ్ థ్రోన్స్ స్టార్ రిచర్డ్ మాడెన్ కూడా ఈ పోటీలో ఉండొచ్చు. బీబీసీ డ్రామా బాడీగార్డ్‌లో అతడు పోషించిన పాత్రలో.. టక్సేడో ధరించడం, తుపాకీ కాల్పుల నుంచి కారును రివర్స్ చేసి తప్పించటం, గన్ ఉపయోగించటం తెలియటం ఆయనకు అలవడ్డాయి.

ఇక నిర్మాతలు.. కొందరు కొత్త స్కాటిష్ నటుల ప్రతిభను పరిగణనలోకి తీసుకుంటారనుకోవటమూ సరైనదే. జేమ్స్ బాండ్ మూవీ సిరీస్‌లో నటించిన మొదటి నటుడు సీన్ కానరీ అనేది గుర్తుంచుకోవాలి.

కానీ ఈ ఊహాగానాలను 35 ఏళ్ల మాడెన్ కొట్టివేశారు. బాండ్‌తో ముడిపెట్టి మాట్లాడటం పొగడ్త కంటే ఎక్కువ కిక్కు ఇస్తోందని, అయితే ‘‘ఈ విషయంలో అందరూ వదంతులను చాలా ఇష్టపడతారు. ఇప్పుడు ఆ వదంతుల్లో నేనున్నాను. అంతే. వచ్చే వారం వేరే వ్యక్తి ఉంటారు’’ అని ఆయన 2018లో వ్యాఖ్యానించాడు.

‘‘బాండ్ అనేది ఒక పెద్ద ఐకన్. చాలా మందికి చాలా గొప్ప విషయం. కాబట్టి అనివార్యంగా ఎన్నో ఊహాగానాలు ఉంటాయి. కానీ, అవి ఊహాగానాలు. చాలా గౌరవప్రదమైన ఊహాగానాలు’’ అని మెక్మాఫియా స్టార్, మరో బాండ్ అభిమాని జేమ్స్ నార్టన్ పేర్కొన్నారు.

లషానా లించ్

ఫొటో సోర్స్, Nicole Dove

ఫొటో క్యాప్షన్, నో టైమ్ టు డై చిత్రంలో లషానా లించ్ 007 టైటిల్ అందుకున్నారు. కానీ, బాండ్ ఎప్పుడూ మగవాడేనని నిర్మాతలు స్పష్టం చేశారు

ఈ నటుల్లో కొంత మంది బుకీలకు ఫేవరేట్లు. అది మంచిదేగా అనిపించవచ్చు. కానీ, నిర్మాతలు గతంలో ఎంపిక చేసిన వారిలో బుకీలకు ఇష్టుల లిస్టులో ఉన్నవారు చాలా తక్కువ. బహుశా ఉద్దేశపూర్వకంగా అలా చేసి ఉండవచ్చు.

"పియర్స్ బ్రాస్నన్ చివరి బాండ్ సినిమా (2002 నాటి డై అనదర్ డే) తర్వాత.. రెండేళ్లలో వినిపించిన ‘బుకీల ఫేవరెట్’ హెడ్లైన్స్‌లో డేనియల్ క్రెయిగ్ అనే వ్యక్తి పేరు ఎప్పుడూ కనిపించలేదు. వారు క్లైవ్ ఓవెన్ మీద మక్కువ చూపారు. ఎందుకంటే ఆయన ఒక సినిమాలో టక్సెడో ధరించారు’’ అని ఓకానెల్ వ్యాఖ్యానించారు.

"బుకీల ఫేవరేట్’’ అనేది ఎప్పుడూ ఉంటుంది. వారాంతంలో కొత్త టెలివిజన్ షోని ప్రారంభించే ఓ అందమైన, ఇటువంటి ఊహాగానాలను సృష్టించే తెలివైన పీఆర్ టీమ్ గల నటుడు సాధారణంగా ఆ ఫేవరేట్‌ అవుతుంటాడు. గత కొన్నేళ్లుగా వస్తున్న ఊహాగానాలన్నీ ఆదివారం రాత్రి టీవీ డ్రామాలకు ప్రీతిపాత్రమైన వాడేనని ఆయన చెప్పారు. "జేమ్స్ బాండ్ ఎన్నడూ ఆదివారం రాత్రి ప్రీతిపాత్రుడు కాడు" అన్నారాయన.

మరైతే.. ఐడాన్ టర్నర్, టామ్ హిడిల్స్టన్, సిలియన్ మర్ఫీ వంటి టీవీ డ్రామా ఫేవరేట్లకు బాండ్ అవకాశం ఉండదా? ఉండకపోవచ్చు. అయితే వారిలో ఎవరినీ కొట్టిపారేయలేం.

అలాగే మీరు ఇంతకు ముందు టామ్ హాప్పర్ గురించి విని ఉండకపోవచ్చు. అయితే గేమ్ ఆఫ్ థ్రోన్స్ సహనటుడైన హాప్పర్ పట్ల అక్టోబరులో బుకీల ఆసక్తి కనబడింది.

దానికి ముందు, బాండ్ అయ్యే అవకాశాలు ఈయనకు 100లో ఒకటిగా ఉండొచ్చునని పందెం కాయొచ్చు. అక్టోబర్ చివరి నాటికి, బ్రోకలీ తయారు చేసిన షార్ట్ లిస్ట్లో అతడి పేరు ఉందని ఊహాగానాలు రావటంతో.. బాండ్ పాత్రకు అతడు ఎంపికయ్యే అవకాశాలు మూడింట ఒకటిగా ఉన్నాయని పెరిగిపోయాయి.

టామ్ హాపర్

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, బాండ్ పాత్రకు బుకీల ఫేవరేట్‌గా మారిన టామ్ హాపర్

ప్రస్తుతం 36 ఏళ్ల టామ్ హాప్పర్.. క్యాజువాలిటీ, డాక్టర్స్, ది అంబ్రెల్లా అకాడమీ వంటి టీవీ సిరీస్‌లలో పాత్రలు పోషించాడు. 2018లో ఐ ఫీల్ ప్రెట్టీలో అమీ షుమెర్‌తో కలిసి నటించాడు.

ఇక.. ఐరిష్ నటుడు జామీ డోర్నన్.. ఫిఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే మొదలుకుని బెల్ ఫాస్ట్‌లో ఆస్కార్ నామినేషన్ నటన వరకు మంచి ప్రదర్శన చూపాడు. అతడు రేసులో లేడని అనుకోవద్దు.

టీవీ సిరీస్ టేకెన్ నటుడు క్లైవ్ స్టాండెన్, క్రేజీ రిచ్ ఆసియన్స్ నటుడు హెన్రీ గోల్డింగ్ కూడా బరిలో ఉన్నట్లు చాలా మంది చెప్తున్నారు.

నిజానికి సూపర్ మ్యాన్ నటుడు హెన్రీ కావిల్ గతసారి బాండ్‌ పాత్ర ఎంపిక పోటీలో ఉన్నాడు. ఆ పోటీలో డేనియల్ క్రెయిగ్ తర్వాత ఇతడే రన్నరప్‌గా నిలిచాడని చాలా మంది భావించారు.

రిచర్డ్ మాడెన్

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, రిచర్డ్ మాడెన్

అయితే.. అప్పటికి కావిల్ వయసు 20ల ప్రారంభంలో ఉండేదని.. బాండ్ పాత్రకు ఆ వయసు సరిపోయి ఉండకపోవచ్చునని గుర్తుంచుకోవాలి. అంటే ఈసారి అతడి అవకాశాలు మెరుగై ఉండొచ్చు.

"ఇప్పటికైతే అంతా ఊహాగానాలుగానే ఉంది. ఏం జరుగుతుందో చూద్దాం. కానీ బాండ్ పాత్ర పోషించటం నాకు చాలా ఇష్టం. అది చాలా చాలా ఉద్విగ్నభరితంగా ఉంటుంది" అని కావిల్ 2020లో చెప్పాడు.

"తదుపరి బాండ్ మనందరికీ తెలిసిన వ్యక్తే అవుతాడని నేను ఎప్పుడూ చెబుతూనే ఉన్నాను. కానీ ఎవరూ ప్రస్తావించాలని అనుకోలేదు. నేను పోటీదారుల మార్టినిలో చేర్చే పేర్లు.. ఆలివర్ జాక్సన్-కోహెన్ (ది ఇన్విజిబుల్ మ్యాన్), హారిస్ డికిన్సన్ (ది కింగ్స్ మ్యాన్), జార్జ్ మాకే (1917), మాట్ స్మిత్ (లాస్ట్ నైట్ ఇన్ సోహో), పాల్ మెస్కల్ (నార్మల్ పీపుల్), నికోలస్ హౌల్ట్ (ది గ్రేట్)" అంటూ ఓ'కానెల్ ముగించారు.

ఊహాగానాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే మనం కచ్చితంగా చెప్పగలిగేది ఒకే ఒక్కటి ఉంది. నో టైమ్ టు డై సినిమా క్రెడిట్స్ ముగింపులో ప్రేక్షకులకు చెప్పినట్లు.. జేమ్స్ బాండ్ తిరిగొస్తాడు.

వీడియో క్యాప్షన్, కరోనాతో నష్టాల్లో ఉన్న సినిమా పరిశ్రమకు జేమ్స్‌ బాండ్‌ కొత్త సినిమా ఉత్తేజాన్నిస్తుందా?

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)