Taste The TV - తాకే తెర కాదు.. నాకే తెర: ఈ టీవీ తెరను నాకుతూ వంటకాల రుచి చూడొచ్చు.. దీని ధర ఎంత? ఇది ఎందుకు?

వీడియో క్యాప్షన్, తాకే తెర కాదు.. నాకే తెర: ఈ టీవీ తెరను నాకుతూ వంటకాల రుచి చూడొచ్చు..

టీవీలో వంటకాలను చూపిస్తున్నప్పుడు, వాటిని రుచి చూస్తే ఎంత బాగుంటుందో అనిపిస్తుంది. అందుకే, ఒక జపాన్ ప్రొఫెసర్ అలా రుచి చూసేందుకు వీలు కల్పించే టీవీని తయారు చేశారు.

ఈ టీవీ ఏంటి?

నాలుకతో టీవీ తెరను తాకగానే, రుచులను తెలిపే ఒక ప్రొటోటైప్ టీవీ స్క్రీన్‌ను ఆయన తయారు చేశారని రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది.

'టేస్ట్ ది టీవీ' అనే ఈ టీవీ తెరపై వీక్షకులు నాకడానికి వీలుగా ఒక పరిశుభ్రమైన ప్లాస్టిక్ పొరను అతికిస్తారు. టీవీలోని పది క్యాన్లు ఆ పొరపై రుచులను స్ప్రే చేస్తుంటాయి.

ఎందుకు? ధర ఎంత?

వంటలు చేసేవారికి లేదా వెయిటర్లకు శిక్షణ ఇవ్వడానికి ఈ టీవీని ఉపయోగించవచ్చని మెయిజీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హోమెయ్ మియాషిటా చెబుతున్నారు.

దీనిని కమర్షియల్‌గా తయారు చేయాలనుకుంటే ఒక టీవీ తయారీకి 65 వేల రూపాయలకు పైగా ఖర్చవుతుందని ఆయన అంచనా వేశారు.

ప్రపంచానికి అవతలవైపు ఉన్న రెస్టారెంట్లలో తినడం లాంటి అనుభవాలను ప్రజలు తమ ఇంట్లో ఉంటూనే పొందేలా చేయడమే లక్ష్యంగా దీన్ని తయారు చేశానని ఆయన రాయిటర్స్‌తో చెప్పారు.

తర్వాత ఏంటి?

ఒక టోస్ట్‌కు రుచిని జోడించినట్లు, రకరకాల రుచులను స్ప్రే చేసే ఈ టెక్నాలజీకి సంబంధించిన మిగతా అప్లికేషన్ల గురించి తయారీదారులతో చర్చలు జరుపుతున్నానని ఆయన తెలిపారు.

ఈ ప్రొఫెసర్ డౌన్‌లోడ్ చేసుకోడానికి వీలుగా ఉండే రుచుల ప్రపంచాన్ని ఊహించుకున్నారు. కోవిడ్-19 సమయంలో ప్రజలు బయటి ప్రపంచంతో కనెక్ట్ కావడాన్ని ఇలాంటి టెక్నాలజీ మరింత మెరుగుపరుస్తుందని ప్రొఫెసర్ మియాషిటా అభిప్రాయపడ్డారు.

గతంలోనూ..

ప్రొఫెసర్ మియాషిటా, తన విద్యార్థులతో కలిసి గతంలో కూడా రుచికి సంబంధించిన ఎన్నో పరికరాలు తయారు చేశారు. వీటిలో ఆహారాన్ని మరింత రుచిగా మార్చే ఫోర్క్ కూడా ఉంది.

మీడియా ముందు ఆయన తన టేస్ట్ ది టీవీని ప్రదర్శించినపుడు ఒక విద్యార్థిని దానిని రుచి చూశారు. తనకు స్వీట్ చాక్లెట్ కావాలని ఆమె ఆ టీవీకి చెప్పారు. కొన్నిసార్లు ఆర్డర్ చేసిన తర్వాత ఆమె అడిగిన రుచి ప్లాస్టిక్ ఫిల్మ్ పొర మీద స్ప్రే అయ్యింది.

దానిని రుచిచూసిన ఆమె "ఇది మిల్క్ చాక్లెట్‌లా ఉంది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)