బుల్లీబాయి, సుల్లీ డీల్స్: సోషల్ మీడియాలో ముస్లిం మహిళల వేలం గురించి మనం అర్ధం చేసుకోవాల్సిందేంటి?

ఒక వర్గం మహిళలను టార్గెట్‌గా చేసుకుని ఫొటోల వేలంపాట నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి

ఫొటో సోర్స్, JILLA DASTMALCHI/BBC

ఫొటో క్యాప్షన్, ఒక వర్గం మహిళలను టార్గెట్‌గా చేసుకుని ఫొటోల వేలంపాట నిర్వహిస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి
    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

'బుల్లీబాయి, 'సుల్లీ డీల్స్' పేరుతో కొందరు ముస్లిం మహిళలను వేలం వేయడానికి నెల రోజుల ముందు కూడా సానియా సయ్యద్‌కు సోషల్ మీడియాలో వేధింపులు ఎదురయ్యాయి. ఏడాదిగా ఆమెకు ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయి.

జనవరి 2022 లో బుల్లీబాయి, 2021 జూలైలో సుల్లీ డీల్స్ యాప్‌లు సానియాతో సహా డజన్ల కొద్దీ ముస్లిం మహిళల ఫొటోలను యాప్‌ ద్వారా వేలానికి పెట్టారు. ఈ కేసుపై విమర్శలు వెల్లువెత్తడంతో అధికారులు నలుగురిని అరెస్టు చేశారు.

అయితే, ఇంతకు ముందు నుంచీ తనకు వేధింపులు కొనసాగుతున్నాయని సానియా చెప్పారు. 2020 నవంబర్‌లో కొందరు వ్యక్తులు తన ఫొటోలను నగ్న చిత్రాలతో మార్ఫింగ్ చేసి ట్విటర్‌లో పెట్టారని ఆమె తెలిపారు.

''నా ఫొటోను, నా పేరున్న జర్నలిస్టు మిత్రురాలి ఫొటోను ట్విటర్‌లో పెట్టి ఇద్దరిలో మీరు ఎవరిని ఇష్టపడతారు అని ఓటింగ్ పెట్టారు. వాటికి వందమంది ఓటేశారు. తర్వాత డైరెక్ట్‌గా మెసేజ్‌లు పంపడం మొదలుపెట్టారు. సెక్స్‌లో పాల్గొనడం, డర్టీవర్క్ చేయడం గురించి వాళ్లు నాకు మెసేజ్‌లు పెట్టేవారు'' అని సానియా వివరించారు.

సానియా అహ్మద్ ముంబైలో ఉంటారు. టీవీ సీరియల్స్‌కి స్క్రీన్‌ ప్లే రాసే సానియా ట్విట్టర్‌లో గళంవిప్పారు. ఆమె తన మనసులోని మాటను బైటికి చెప్పడానికి ఎప్పుడూ వెనకాడరు. అందుకే రైటిస్ట్ కార్యకర్తలు తనను టార్గెట్ చేశారని, వేధింపులకు దిగారని ఆమె చెప్పారు.

"నేను చాలా డర్టీ ట్రోలింగ్‌లను పట్టించుకోలేదు. కానీ కొన్ని ఖాతాలపై పోలీస్ రిపోర్ట్ ఇవ్వడంతో వారు నన్ను లక్ష్యంగా చేసుకున్నారు. మళ్లీ రిపోర్ట్ చేసి ఉండొచ్చు. మళ్లీ వాటిని సస్పెండ్ చేసి ఉండొచ్చు. కానీ, వాళ్లు మళ్లీ కొత్త కొత్త ఎకౌంట్లతో మొదలు పెడతారు. ఇలా సంవత్సరం నుంచి నడుస్తూనే ఉంది'' అని బీబీసీకి ఫోన్ ద్వారా ఇచ్చిన ఇంటర్వ్యూలో సానియా అహ్మద్‌ వెల్లడించారు.

గతంలో సుల్లీడీల్స్ యాప్, తాజాగా బుల్లీబాయి యాప్ వివాదానికి కేంద్రంగా మారాయి

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, గతంలో సుల్లీడీల్స్ యాప్, తాజాగా బుల్లీబాయి యాప్ వివాదానికి కేంద్రంగా మారాయి

గొంతెత్తిన ఫలితం

2020 మే లో పాకిస్తాన్‌ లో ఈద్ పండుగ జరుపుకునే రోజు. పాకిస్థానీ ముస్లిం మహిళల చిత్రాలను ఉపయోగించి భారతదేశంలోని యూట్యూబ్ ఛానెల్‌లో కొందరు వేలంపాట నిర్వహించారు. ఇప్పుడు ఒకరిద్దరు మహిళలు కాదు చాలామందిని లక్ష్యంగా చేసుకున్నారు.

ఆ ఛానెల్‌ పై కూడా కేసు పెట్టారు. ఎకౌంట్‌ రద్దయింది. కానీ, మరో రూపంలో మళ్లీ ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని సానియా అన్నారు.

2020 జూలైలో 'సుల్లీ డీల్స్' అనే యాప్‌ను రూపొందించారు. సానియా, ఆమె స్నేహితురాలు సానియాతో సహా డజన్ల కొద్దీ ముస్లిం మహిళల ఫొటోలను అందులో పెట్టి వేలం వేశారు.

వివిధ వృత్తుల నుండి వచ్చిన ఈ మహిళల్లో చాలామంది సోషల్ మీడియాలో ఎప్పుడూ తమ అభిప్రాయాలను రాయనివారు కూడా ఉన్నారు. చాలామందికి ఫాలోయర్లు కూడా లేరు. కానీ, కేవలం ముస్లిం మహిళలైనందున వారు వేధింపులకు, వేలానికి గురవుతున్నారు.

వీడియో క్యాప్షన్, పాకిస్తాన్ అమ్మాయిలు ఎవరికీ కనిపించని భాగాల్లోనే టాటూలు వేయించుకుంటున్నారు ఎందుకు?

సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో ఫొటోలను వేలానికి పెట్టినంత మాత్రాన మునిగిపోయేది ఏముందని చాలామంది అడుగుతుంటారు.

ఇలా జరిగే వేలం నిజమైన వేలం కాదు. దీనికి ప్రాముఖ్యత లేదు. ఎవరూ పట్టించుకోకపోతే ఇది బైటికి కూడా రాదు. పైగా వాటిలో మహిళ నిజమైన అశ్లీల చిత్రాలేమీ లేవు. దీన్ని జోక్‌గా తీసుకోవచ్చు కదా అని కొందరు అంటుంటారు.

''అది తప్పు కాదనడానికి వీల్లేదు. అందుకే మహిలు గొంతెత్తుతున్నారు. కేసులు పెడుతున్నారు''అని సానియా అన్నారు.

సోషల్ మీడియాలో మహిళల ఫొటోలు సేకరించి యాప్‌లో వేలానికి పెడుతున్నారు

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, సోషల్ మీడియాలో మహిళల ఫొటోలు సేకరించి యాప్‌లో వేలానికి పెడుతున్నారు

విచారణలో జాప్యం ఎందుకు?

సానియా స్నేహితురాలు సానియాతో పాటు కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ కన్వీనర్ హసీబా అమీన్, పైలట్ హనా మొహ్సిన్ ఖాన్, రచయిత్రి నబియా ఖాన్ కూడా దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో ఉన్నారు.

కానీ వారి వేదనను ఎవరూ పట్టించుకోలేదు. నెలలు గడుస్తున్నా పోలీసులు చర్యలు మొదలు పెట్టలేదు. నేటికీ మహిళా, శిశు సంక్షేమ శాఖమంత్రి స్మృతి ఇరానీ దీనిపై దృష్టి సారించలేదు.

ఈ ఆలస్యానికి కారణమేంటని నేను దిల్లీ పోలీస్ శాఖ పీఆర్‌ఓకు ప్రశ్నలు పంపాను. ఈ యాప్‌కు అంతర్జాతీయ సంస్థ అయిన గిట్‌హబ్‌ హోస్ట్ అయినందున ఆలస్యమవుతోందని పోలీస్ శాఖ నుంచి సమాధానం వచ్చింది.

''అంతర్జాతీయ సంస్థలపై కేసులు నమోదు చేయడానికి, విచారించడానికి మేం స్లాట్(SLAT) అనే అంతర్జాతీయ ఒప్పందం ద్వారా వారిని సంప్రదించాల్సి ఉంటుంది. అప్పుడే మాకు పూర్తి డేటా లభిస్తుంది. ఆ ఒప్పందం కోసం మాకు ఇటీవలే అనుమతి లభించింది. చర్యలు తీసుకుంటాం'' అని డీసీపీ చిన్మయ్ బిస్వాల్ అన్నారు.

అంతర్జాతీయ నిబంధనల పేరుతో బుల్లీబాయి, సుల్లీడీల్స్ కేసుల్లో జాప్యం సరికాదు. ఈ తరహా కేసుల్లో విమర్శలు పెరగడానికి ఇది కారణం కాదా అని నేను డీసీపీ బిస్వాల్‌ను ప్రశ్నించాను.

''సోషల్ మీడియాలో నిరసనలు, విమర్శల ఆధారంగా మేం కేసులను డీల్ చేయం. నేరస్తులను పట్టుకునేందుకు మా వంతుగా ప్రయత్నాలు చేస్తున్నాం. కచ్చితంగా త్వరలోనే వారిని పట్టుకుంటాం. కొన్ని కేసుల్లో వివిధ కారణాల కారణంగా ఆలస్యం కావడం సహజం'' అని బిస్వాల్ అన్నారు.

''చర్యలు తీసుకోవడంలో ఆలస్యం కారణంగా నిందితులు మరింత రెచ్చిపోతున్నారు. వారు సోషల్ మీడియాలో నేరుగా మమ్మల్ని ట్యాగ్ చేస్తూ, రేప్ చేస్తామని బెదిరించడం మొదలు పెట్టారు'' అన్నారు సానియా.

''మా మతం కారణంగా మాపై దాడులు జరుగుతున్నాయి. ఎవరూ పట్టించుకోరు. ఏమీ కాదని, సైలెంట్‌గా ఉండమని చెబుతుంటారు. మేం సైలెంట్‌గా ఉన్నా వాళ్లు ఊరుకోరు'' అన్నారామె.

ఆన్‌లైన్‌ లో మహిళ వేలంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి

ఫొటో సోర్స్, SOCIAL MEDIA

ఫొటో క్యాప్షన్, ఆన్‌లైన్‌ లో మహిళ వేలంపై ఫిర్యాదులు పెరుగుతున్నాయి

ఏం చేయాలి?

సుల్లీ డీల్స్ యాప్ తర్వాత 2022 జనవరిలో వచ్చిన బుల్లీబాయి యాప్‌లో తనతోపాటు తన స్నేహితురాలు సానియా ఫొటో కూడా పెట్టడంతో జర్నలిస్ట్ సానియా ట్విటర్‌లో స్పందించారు.

''రెండు సంవత్సరాలుగా వేధింపులు, బెదిరింపుల తరువాత, ఈసారి నేను మళ్లీ నా ఫొటోని చూశాను. కానీ, నాకు ఏమీ అనిపించలేదు. రాయిలా కొయ్యబారిపోలేదు. షాకింగ్ అనిపించలేదు. అనిపించదు కూడా'' అన్నారామె.

కశ్మీర్‌కు చెందిన జర్నలిస్ట్ ఖురతులైన్ రహ్బర్ కూడా అదే అనుభవాన్ని వెల్లడించారు. సుల్లీ డీల్స్ సంఘటన తర్వాత, రహ్బర్ చాలామంది మహిళలను ఇంటర్వ్యూ చేసి, ఒక వ్యాసం రాశారు. ఇప్పుడు రహ్బర్ ఫొటోను కూడా బుల్లీబాయి లిస్టులో చేర్చారు.

వీడియో క్యాప్షన్, గాలిపటంతో పాటు గాల్లోకి ఎగిరిన యువకుడు

"నేను ముస్లిం మహిళనే కాదు, కశ్మీరీని కూడా. ఇలాంటి సైబర్ హింసకు నేను ఎవరి నుంచి న్యాయం కోరాలి? ప్రతిరోజూ నా గుర్తింపు పత్రాలను అడిగే పోలీసుల వద్దకు వెళ్లగలనని నేను అనుకోలేదు. ఎందుకంటే నేను ఎప్పుడైనా పాకిస్తాన్‌కు వెళ్లానా లేదా అని అడుగుతూ, నా కుటుంబం గురించి, ఇరుగు పొరుగు వారి నుంచి వివరాలు ఆరా తీస్తారు'' అని ఫోన్‌లో రహ్బర్ నాతో చెప్పారు.

కశ్మీర్‌లో మహిళా జర్నలిస్టుల సంఖ్య చాలా తక్కువ. ప్రమాదాల దృష్ట్యా చాలా కుటుంబాలు తమ ఇళ్లలోని ఆడపిల్లలను జర్నలిజం వృత్తిలోకి పంపడానికి ఇష్టపడవు. అటువంటి పరిస్థితిలో, లైంగిక వేధింపుల గురించి మాట్లాడటం మరింత కష్టమవుతుంది.

నెట్‌వర్క్ ఫర్ ఉమెన్ ఇన్ మీడియా ఇండియా, జర్నలిస్ట్స్ ఫెడరేషన్ ఆఫ్ కశ్మీర్, రిపోర్టర్స్ వితౌట్ బోర్డర్స్ సంస్థలు ఈ యాప్‌ల వ్యవహారాన్ని తీవ్రంగా ఖండించాయి.

బాధితులైన మహిళలు చాలామంది దీనిపై మాట్లాడటానికి, ఫిర్యాదులు చేయడానికి ముందుకొచ్చారు. సానియా లాంటి వారి ఫొటోలు గతంలో వచ్చిన సుల్లీ డీల్స్ యాప్‌తోపాటు తాజాగా వచ్చి బుల్లీబాయి యాప్‌లో కూడా ఉపయోగించారు.

అయితే, లేటెస్ట్‌గా వచ్చిన బుల్లీబాయి యాప్‌లో అనేకమంది కొత్త మహిళలు ఉన్నారు. సుప్రసిద్ధ రేడియో జాకీ శ్యామా, జర్నలిస్ట్ రాణా అయూబ్, సామాజిక కార్యకర్త ఖలీదా పర్వీన్‌లాంటి వీరిలో కొందరు. వీరిలో చాలామంది 60ఏళ్లు దాటిన వారే.

ఆన్‌లైన్‌ వేధింపులను ముస్లిం మహిళలపై జరుగుతున్న కుట్రగా కొందరు చెబుతున్నారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ఆన్‌లైన్‌ వేధింపులను ముస్లిం మహిళలపై జరుగుతున్న కుట్రగా కొందరు చెబుతున్నారు

ఆన్‌లైన్‌లో వేధింపులు- ఆఫ్‌లైన్ హింస

బుల్లీబాయి బాధితుల్లో మొట్టమొదటగా ట్విటర్‌లో గొంతు విప్పినవారు, పోలీసులకు ఫిర్యాదు చేసిన వారిలో మొదటి వరసలో ఉంటారు జర్నలిస్ట్ ఇస్మత్ ఆరా.

''మాది సామూహిక ఆగ్రహం. రైట్ వింగ్ ట్రోలర్లు అరవై డెబ్బై ఏళ్ల ముసలి వాళ్లను కూడా వదిలిపెట్టరు. వాళ్లను అలా వదిలేస్తే మరింత రెచ్చిపోతారు. జర్నలిజం వృత్తిలో ఉండటం కూడా కష్టమైపోతుంది'' అన్నారామె.

అయితే సైబర్ బెదిరింపులు, మతం ఆధారంగా వేధింపులపై ఫిర్యాదులు చేస్తే అవి భౌతిక దాడులకు కూడా కారణం కావచ్చన్న ఆందోళన ఉంది. ఇస్మత్ తన ఫిర్యాదులో 'ముస్లిం మహిళలపై కుట్ర' అనే పదాన్ని ఉపయోగించారు.

''గతంలో ఒకరిద్దరు ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకున్న వారు ఇప్పుడు క్రమపద్ధతిలో చాలామందిని టార్గెట్ చేస్తున్నారు. కాబట్టి దీనిని ముస్లిం మహిళలపై జరుగుతున్న కుట్రగా చూడాల్సిన అవసరం ఉంది'' అని ఇస్మత్ వ్యాఖ్యానించారు.

ఇస్మత్ ఆరా తర్వాత బాధితులైన చాలామంది ముస్లిం మహిళలు ట్విట్టర్‌లో తమ గొంతు వినిపించడం ప్రారంభించారు. యాప్‌లో 15-16 ఏళ్ల బాలికల ఫొటోలను కూడా పెట్టినట్లు కొందరు మహిళలు ఆరోపించారు. కానీ, అవి ఎక్కడా కనిపించకపోవడంతో వాటిని నిర్ధారించడం కష్టం.

ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు

ఫొటో సోర్స్, KHALIDAPARVEEN

ఫొటో క్యాప్షన్, ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు

అరెస్టులు వారిని ఆపుతాయా?

భయం, నిరాశ, కోపం నిండిన పరిస్థితుల్లో బాధితులైన ముస్లిం మహిళలు 'బుల్లీబాయి' యాప్ గురించి ముంబై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్టులు కూడా ప్రారంభమయ్యాయి.

శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది కూడా ఈ అంశాన్ని లేవనెత్తారు. ఈ వేలం వెనుక ఉన్న 18 నుంచి 21 ఏళ్ల మధ్య వయసున్న ముగ్గురిని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. అస్సాంకు చెందిన ఓ వ్యక్తిని దిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆయనే ఈ మొత్తం వ్యవహారంలో 'మాస్టర్ మైండ్'గా భావిస్తున్నారు. ఈ అరెస్టులన్నీ 'బుల్లీబాయి' యాప్‌కు సంబంధించినవి.

కాంగ్రెస్ సోషల్ మీడియా టీమ్ కన్వీనర్ హసీబా అమీన్ 'సుల్లీ డీల్స్' యాప్ సమయంలో దిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

"ఇలాంటి పనులు చేసేవారిని ఆపడంలో రాజకీయ సంకల్పం లేదు. ఉంటే అరెస్టులు ఎప్పుడో జరిగేవి. ఆడవాళ్లను వేలం ప్రక్రియలో పంచుకునే వస్తువుగా మార్చేశారు'' అన్నారు హసీబా.

శివసేన ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న ముంబై పోలీసులు, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హయాంలో పనిచేస్తున్న దిల్లీ పోలీసుల పై కలుగుతున్న సందేహాలను నేను దిల్లీ పోలీస్‌ల ముందుంచాను. దీనికి డీసీపీ చిన్మయ్ బిస్వాల్ స్పందించారు.

''రాజకీయ ఆరోపణలు నిరాధారం. గత ఆరునెలల్లో ప్రభుత్వాలు మారిపోలేదు. బుల్లీబాయి కేసులో సూత్రధారులను అరెస్ట్ చేశాం. ఈ రోజు విమర్శించిన వారే రేపు మెచ్చుకుంటారు'' అన్నారు బిస్వాల్.

'సుల్లీ డీల్స్' జాబితాలో పేరున్న నబియా ఖాన్, తాను ఐదు నెలల కిందట ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ యాప్‌లో ఫొటోలు రావడంతో చాలామంది ముస్లిం మహిళలు ట్విటర్‌ను వదిలేశారని సానియా సయ్యద్ అన్నారు.

కొలంబియా యూనివర్శిటీలో చదువుతున్న మాజీ జర్నలిస్ట్ హిబా బేగ్ ఫొటో రెండు యాప్‌ల వేలంలోనూ ఉపయోగించారు.

''మొదటిసారి నా పేరు వచ్చినప్పుడే నేను ఇక మాట్లాడటం మానేశాను. నన్ను నేను సెన్సార్ చేసుకున్నాను. బుల్లీబాయి యాప్‌లో కూడా నా ఫొటోలు వచ్చాక నాలో అభద్రతా భావం పెరిగింది'' అన్నారామె.

మీడియా రిపోర్టుల ప్రకారం ముగ్గురిని అరెస్టు చేసిన తర్వాత, ఆ ముగ్గురు అమాయకులని కొందరు ట్విటర్‌లో వారిని వెనకేసుకొస్తున్నారు. ట్విటర్ హ్యాండిల్‌లో బుల్లీబాయి 2.0 పేరుతో కొందరు తనను వేధించడం ప్రారంభించారని సానియా అహ్మద్ ట్వీట్ చేశారు.

''అరెస్టయిన వాళ్లు విడుదలవుతారు. వాళ్లపై ఎలాంటి చర్యలుండవు. మళ్లీ ముస్లిం మహిళలను లక్ష్యంగా చేసుకుంటారు. కొన్ని నెలల తర్వాత మరో వేలం వార్త వస్తే ఆశ్చర్యపోవాల్సిందేమీ లేదు'' అన్నారు సానియా.

వీడియో క్యాప్షన్, పుష్ప సినిమా రియల్ స్టోరీ... ఎర్ర చందనం స్మగ్లింగ్ ఎలా జరుగుతుందంటే

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)