అమరావతి: క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ వ్యవహారం మళ్లీ ఎందుకు ముందుకొచ్చింది?

అమరావతిలో బుద్ధుడి విగ్రహం
ఫొటో క్యాప్షన్, అమరావతిలో బుద్ధుడి విగ్రహం
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

ఆంధ్రప్రదేశ్ రాజధాని నగరంగా పేర్కొన్న అమరావతి ప్రాంతంలో ఇటీవల నిర్మాణ పనులు మళ్లీ మొదలయ్యాయి. గత రెండున్నరేళ్లుగా నిలిచిపోయిన అమరావతి నగర నిర్మాణంలో కొన్ని పనులను మళ్లీ మొదలు పెట్టారు.

అంతకు ముందే మూడు రాజధానులకు సంబంధించి తీసుకొచ్చిన పాలనా వికేంద్రీకరణ చట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వం దానికి అనుగుణంగా నిర్ణయం తీసుకుని సభ ఆమోదం కూడా పొందింది.

అయితే, ఆ చట్టాలను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లు ఏపీ హైకోర్టులో ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి.

తాజాగా ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో రద్దు చేసిన సీఆర్డీయే ఇటీవల మళ్లీ మనుగడలోకి రావడంతో తాజాగా అమరావతి క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు కోసం ప్రయత్నాలు ప్రారంభించింది.

వీడియో క్యాప్షన్, ‘మండలి రద్దు’ను వైఎస్ జగన్ ఎందుకు రద్దు చేశారు?

ఈ నగర పాలక సంస్థ ఏర్పాటు ప్రతిపాదనను గత ఏడాది కూడా ఓసారి ప్రభుత్వం చేసింది. కానీ దానికి ప్రజల నుంచి వ్యతిరేకత రావడంతో అడుగు ముందుకు పడలేదు.

అదే సమయంలో మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. రెండు పురపాలక సంఘాలతో పాటుగా సమీపంలోని పలు గ్రామాలను కలుపుతూ ఈ కార్పొరేషన్ ఏర్పడింది.

దాని పరిధిలోకి సీఆర్డీయేలో ఉన్న కొన్ని గ్రామాలను కూడా కలిపేయడం కీలక పరిణామం.

ఇప్పుడు కొత్తగా ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోకి రావాల్సిన గ్రామాలను విడదీసి కొన్ని మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ లో కలిపేశారంటూ ఆమరావతి పరిరక్షణ సమితి చెబుతోంది. దాంతో తాజా ప్రతిపాదనను వ్యతిరేకిస్తున్నట్టు ప్రకటించింది.

ప్రభుత్వం మాత్రం కొత్త స్వరూపంతో అమరావతి నగర నిర్మాణంలో కీలకమైన ప్రజాభిప్రాయ సేకరణకు శ్రీకారం చుడుతోంది. జనవరి 5 బుధవారం నుంచి మొదట మంగళగిరి మండలంలో ఇవి ప్రారంభ కాబోతున్న తరుణంలో కొత్త నగర రూపురేఖలు వివాదాస్పదమవుతున్నాయి.

అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు
ఫొటో క్యాప్షన్, అమరావతి ప్రాంతంలో నిర్మాణాలు

అమరావతి నగర మొదటి స్వరూపం ఏమిటి

అమరావతి రాజధానిగా 2015 అక్టోబర్ 22న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. అప్పటి చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు విజయవాడ, గుంటూరు నగరాల మధ్యలో కృష్ణా నది తీరానికి ఆనుకుని కొత్త రాజధాని నగర నిర్మాణానికి పునాదులు పడ్డాయి.

తుళ్లూరు, మంగళగిరి, తాడేపల్లి మండలాల పరిధిలోని 25 పంచాయతీలను కలిపి అమరావతి నగరంగా అభివృద్ధి చేసేందుకు అప్పట్లో ప్రణాళికలు వేశారు.

29 గ్రామాలను కలిపి రాజధాని ప్రాంతంగా ప్రకటించారు. 217.23 చ. కి.మీల పరిధిలో ఈ నగర విస్తరణ ఉంటుందని ప్రభుత్వం తెలిపింది. ప్రస్తుతం 27వేల కుటుంబాలకు చెందిన లక్ష మంది జనాభా అమరావతి పరిధిలో ఉంటారని వెల్లడించింది.

రాజధాని పరిధిలో నవ నగరాల పేరుతో చంద్రబాబు ప్రభుత్వం హడావిడి చేసింది. పరిపాలనా నగరం, హెల్త్ సిటీ, ఎడ్యుకేషన్ సిటీ, మీడియా సిటీ, స్పోర్ట్స్ సిటీ ఇలా 9 ప్రాంతాలుగా విడగొట్టి అమరావతి ని అభివృద్ధి చేస్తామని తెలిపింది.

వీడియో క్యాప్షన్, ‘ఏపీలో క్లారిటీ ఉన్న నాయకుడు వైఎస్ జగనే’ - మంత్రి కన్నబాబు

దానికి అనుగుణంగా రైతుల నుంచి సేకరించిన 33వేల ఎకరాలు, ప్రభుత్వ భూములు కలుపుకుని 53,748

ఎకరాల్లో రాజధాని అమరావతి నగర విస్తీర్ణం ఉంటుందని పలు దఫాలుగా డిజైన్లు రూపొందించారు

అందులో 27,885 ఎకరాలను రోడ్లు, డ్రైనేజీలు, పార్కులు, ఇతర ప్రజావసరాలకు అనుగుణంగా వినియోగించాలని అంచనా వేశారు. అమరావతి నిర్మాణం కోసం భూములిచ్చిన రైతులకు వారి వాటా కింద ఫ్లాటుల నిర్మాణం, ఇతర అవసరాలకు 11,826 ఎకరాలు అవసరమని భావించారు.

ఇతర అభివృద్ధి కార్యక్రమాలకు 14,037లను లెక్కలేశారు.

అమరావతి

ఫొటో సోర్స్, AMARAVATI.GOV.IN

ఫొటో క్యాప్షన్, అమరావతి

అంచనాలు ఘనం, ఆచరణ నామమాత్రం

2050ల నాటి అవసరాలకు అనుగుణంగా అమరావతి నగరాన్ని రూపొందించబోతున్నట్టు నాటి ముఖ్యమంత్రి పదే పదే ప్రకటించారు. దాంతో అంచనాలు భారీగా ఉండేవి. అందుకు తగ్గట్టుగా ఆచరణ కనిపించలేదు. రాజధాని నగర నిర్మాణం కోసం వేసిన అంచనాల్లో పదో వంతు ప్రాంతంలో కూడా పనులు ప్రారంభం కాలేదు.

సచివాలయం, సెక్రటేరియేట్, హైకోర్ట్ భవనాలను 2017 నాటికి అందుబాటులోకి తీసుకొచ్చారు. అయితే వాటిని తాత్కాలిక భవనాలుగా అప్పటి ప్రభుత్వం పేర్కొంది. ఇక ప్రజా ప్రతినిధులు, న్యాయాధికారులు, ప్రభుత్వ ఉన్నతాధికారులతో పాటుగా సిబ్బంది కోసం నిర్మించిన భవనాలు వివిధ దశల్లో ఉన్నాయి.

ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్స్ వంటివి 90 శాతం వరకూ పనులు పూర్తికాగా కొన్ని ప్రాధమిక దశలోనే మిగిలాయి.

వీడియో క్యాప్షన్, అమరావతి: మూడు రాజధానుల ప్రకటన, రైతుల ఆందోళనకు ఏడాది

సీడ్ యాక్సెస్ రోడ్డు వంటి విశాలమైన 8 లైన్ల రోడ్ల నిర్మాణం కూడా కొంతమేరకే ముందుకు సాగింది. ప్రైవేటు విద్యాసంస్థలు ఎస్.ఆర్.ఎం, విట్ వంటివి అమరావతి ప్రాంతంలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇతర ప్రతిపాదనలన్నీ అంచనాలుగానే మిగిలాయి.

దాంతో అంచనాలకు, అసలు వాస్తవానికి పొంతనలేదంటూ అమరావతి నగర నిర్మాణం విషయంలో 2019 ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్ వెనకడుగు వేసింది. పనులన్నీ ఎక్కడిక్కడ నిలిచిపోయాయి. దాదాపు పూర్తయ్యే దశలో ఉన్న భవనాల జోలికి కూడా పోలేదు. దాంతో అంతా సందిగ్ధం ఏర్పడింది.

చివరకు 2019 డిసెంబర్ లో మూడు రాజధానుల ప్రతిపాదన ముందుకొచ్చింది. కానీ అప్పుడు కూడా అమరావతిని శాసన రాజధానిగా ప్రకటించినప్పటికీ నగర నిర్మాణం ఏ రీతిలో ముందుకు తీసుకెళతారన్నది ప్రభుత్వం స్పష్టం చేయలేదు. సీఆర్డీయే స్థానంలో ఏఎంఆర్డీయే ఏర్పడినా ఒక్క అడుగు కూడా పడలేదు.

రాజధాని విభజనకు సంబంధించిన చట్టం మీద అభ్యంతరాలు, కోర్టు కేసులు, అదే సమయంలో రాజధాని ప్రాంతంలో అమరావతి పరిక్షణ సమితి ఉద్యమం వంటివి రెండేళ్లుగా నడుస్తున్నాయి. ఈ నేపథ్యంలో అమరావతి నగరం ఓరూపు దాల్చేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది.

అమరావతిలో భవనాలు
ఫొటో క్యాప్షన్, అమరావతిలో భవనాలు

ఇప్పుడు ప్రభుత్వం ఏమంటోంది..

ఇటీవల ఏపీ ప్రభుత్వం రాజధానిలో మౌలిక సదుపాయాల కల్పన కోసం రూ.11,000 కోట్ల అప్పు కోసం ప్రయత్నిస్తోందంటూ కథనాలు వచ్చాయి. రాజధాని భూములను అమ్మకానికి పెట్టి ఆదాయం సమకూర్చేయత్నంలో ఉందని విపక్షాలు విమర్శలు కూడా చేశాయి. ఏపీ ప్రభుత్వం గానీ, సీఆర్డీయే గానీ వాటిని తోసిపుచ్చలేదు.

అదే సమయంలో నిర్మాణం పూర్తయ్యే దశలో నిలిచిపోయిన కొన్ని పనులను ఇటీవల మళ్లీ చేపట్టారు. ఎమ్మెల్సీ క్వార్టర్స్‌లో కాంక్రీట్ పనులు పూర్తి కాగా, ఇతర పనులు మొదలయ్యాయి. దీనికి తోడు తాజాగా అమరావతి క్యాపిటల్ సిటీ మునిసిపల్ కార్పొరేషన్ కోసం నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు.

గత నెల 16న గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ నుంచి గుంటూరు జిల్లా కలెక్టర్ కి ఆదేశాలు రావడంతో ఈనెల 29న గుంటూరు కలెక్టర్ ఉత్తర్వులు విడుదల చేశారు. మంగళగిరి మండలంలో మూడు గ్రామాలు, తుళ్లూరు మండలంలో 16 గ్రామాలు కలిపి కొత్త కార్పొరేషన్ ఏర్పాటు చేసేందుకు ప్రక్రియ ప్రారంభించారు.

వీడియో క్యాప్షన్, అమరావతి శంకుస్థాపనకు ఐదేళ్లు.. భవిష్యత్తేమిటి?

వివిధ గ్రామాల్లో ప్రజాభిప్రాయ సేకరణకు గ్రామ సభల షెడ్యూల్ విడుదల చేశారు. జనవరి 5 నుంచి అవి ప్రారంభమై 12వ తేదీ వరకూ జరుగుతాయి.

మంగళగిరి మండలం నీరుకొండ నుంచి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. తుళ్లూరులో జరిగే గ్రామసభతో ప్రజాభిప్రాయ సేకరణ పూర్తవుతుంది.

''అమరావతి అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం. ప్రతిపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా శాసనరాజధానిగా అమరావతి నగరాభివృద్ధి బాధ్యతను ప్రభుత్వం తీసుకుంది. దానికి తగ్గట్టుగానే మంగళగిరి- తాడేపల్లి కార్పొరేషన్ ఏర్పాటు చేశాం. అమరావతి నగరం కూడా అదే రీతిలో అభివృద్ధి చేస్తాం. స్మార్ట్ సిటీగా కూడా నిధులు వస్తాయి. ప్రజాభిప్రాయ సేకరణ తర్వాత ప్రక్రియ పూర్తి చేసి వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి పాలన నగర పాలక సంస్థల పరిధిలోకి తీసుకొస్తాం'' అని పట్టణాభివృద్ధి, మునిసిపల్ శాఖా మంత్రి బొత్స సత్యన్నారాయణ తెలిపారు.

మూడు రాజధానులను సమాంతరంగా అభివృద్ధి చేస్తామని, అందులో భాగంగా అమరావతి నగరానికి కూడా ప్రాధాన్యతనిస్తున్నామని ఆయన బీబీసీతో అన్నారు.

రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఏడాదిపాటు రైతులు ఆందోళన నిర్వహించారు
ఫొటో క్యాప్షన్, రాజధాని వికేంద్రీకరణకు వ్యతిరేకంగా ఏడాదిపాటు రైతులు ఆందోళన నిర్వహించారు

అభ్యంతరాలు ఎందుకొస్తున్నాయి

''అమరావతి నగరం అంటే 29 గ్రామాలు. ల్యాండ్ ఫూలింగ్‌లో రైతుల నుంచి భూములు తీసుకున్నప్పుడు గానీ, సీఆర్డీయే చట్టంలో కూడా అదే ఉంది. సీఆర్డీయే చట్టం అమలులో ఉండగా, ఆ చట్ట పరిధిలోని గ్రామాలను ఎలా విభజిస్తారు'' అని అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ పువ్వాడ సుధాకర్ ప్రశ్నించారు.

ప్రభుత్వం అమరావతి ప్రాంతం మీద కక్ష గట్టినట్టు వ్యవహరించకూడదని ఆయన అన్నారు. రెండున్నరేళ్లు కాలయాపన చేసి, ఇప్పుడు రాజధాని ప్రాంతంలో భూముల కోసం ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోందని సుధాకర్ విమర్శించారు.

''అమరావతి నగరాన్ని 13 జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని గతంలో నిర్ణయం జరిగింది. కానీ ఇప్పుడు ఉండవల్లి, పెనుమాకతో పాటుగా మంగళగిరి మండలంలోని ఎర్రబాలెం, నవులూరు, నిడమర్రు, బేతపూడి పంచాయతీలను అమరావతి కార్పొరేషన్ ని విడదీయడం అసంబద్ధ నిర్ణయాలకు నిదర్శనం'' అని ఆయన అభిప్రాయపడ్డారు.

ప్రజాభిప్రాయ సేకరణలో నిరసన తెలపుతామని ఆయన బీబీసీతో అన్నారు.

'ఏకపక్షంగా వ్యవహరించడం సమంజసం కాదు..'

అమరావతి మునిసిపల్ కార్పొరేషన్ కోసం ప్రస్తుతం చేసిన ప్రతిపాదన ఆమోదయోగ్యం కాదని పలువురు ప్రజా సంఘాల నాయకులు అంటున్నారు.

''ప్రభుత్వం ఏకపక్షంగా వెళుతోంది. రాజధాని నగరం అభివృద్ధి చేస్తే అది రాష్ట్రానికి మేలు చేస్తుంది. మూడు రాజధానులంటూ మూడేళ్లు కాలయాపన చేసేశారు. ఇప్పుడు అమరావతి నగర పాలక సంస్థ విషయంలోనూ దోబూచులాడుతున్నారు. ఈ తీరు మార్చుకోవాలి. కొందరి మీద కక్షతో రాష్ట్ర భవిష్యత్తుని దెబ్బతీసేలా వ్యవహరించడం సమజసం కాదు'' అని పట్టణ ప్రజల సమాఖ్య రాష్ట్ర కన్వీనర్ సీహెచ్ బాబూరావు బీబీసీతో అన్నారు.

అమరావతిలో కౌలు చెల్లింపు, పేదలకు పెన్షన్ల పెంపుదల వంటివి సజావుగా సాగడం లేదన్నారు. అమరావతి కార్పొరేషన్ ఏర్పాటు చేసి, గతంలో ఇచ్చిన హామీ మేరకు కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాలని ఆయన కోరారు.

వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

ఫొటో సోర్స్, FACEBOOK/ANDHRAPRADESHCM

ఫొటో క్యాప్షన్, వై.ఎస్. జగన్మోహన్ రెడ్డి

'అమరావతి అభివృద్ధికి తోడ్పడుతుంది'

మంగళగిరి-తాడేపల్లి మునిసిపల్ కార్పొరేషన్ గత ఏడాది మార్చి 23న ఏర్పాటయ్యింది. ప్రస్తుతం ఏపీలో గ్రేటర్ విశాఖ తర్వాత విస్తీర్ణం పరంగా ఈ కార్పొరేషన్ పెద్దది కావడం విశేషం.

''ఇప్పటికే కొన్ని రాజధాని గ్రామాలు ఈ కార్పొరేషన్ పరిధిలో కలిసిన నేపథ్యంలో మిగిలిన గ్రామాలతో అమరావతి నగర పాలక సంస్థ ఏర్పాటు అభివృద్ధికి తోడ్పడుతుంది'' అని మూడు రాజధానులకు అనుకూలంగా ఆందోళన నిర్వహిస్తున్న జేఏసీ నేత పి.మునిరత్నం అన్నారు.

అమరావతి చుట్టూ ఉన్న సందిగ్ధత తొలగిపోవాలని, ఈ ప్రాంతం అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను స్వాగతిస్తామని ఆయన వెల్లడించారు.

భారీ అంచనాలతో మొదలయిన అమరావతి ప్రాజెక్టు అర్థాంతరంగా ఆగిపోవడం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి మీద ప్రభావం చూపింది. ఇప్పుడు మళ్లీ నెమ్మదిగానయినా ఆగిపోయిన పనులు ప్రారంభం కావడం, అమరావతి రాజధాని నగర మునిసిపల్ కార్పొరేషన్‌కి అడుగులు పడుతుండడం అన్నీ కొత్త ఆశలకు ఆస్కారమిస్తున్నాయి.

అయితే విపక్షాలు మాత్రం ఇదంతా ప్రభుత్వం అమరావతి భూముల మీద అప్పుల కోసం చేస్తున్న ప్రయత్నాలుగా భావిస్తున్న తరుణంలో ఏపీ రాజధాని ప్రాంతం అభివృద్ధి ఎటు మళ్లుతుందో చూడాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)