ఆధునిక చీర కట్టు ఏ రాష్ట్రానికి చెందినది? ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చీరకు నష్టం చేస్తున్నాయా?

అనిత

ఫొటో సోర్స్, KANAKAVALLI SILKS

ఫొటో క్యాప్షన్, అనిత
    • రచయిత, పద్మ మీనాక్షి
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నేను లండన్ ఆక్స్‌ఫర్డ్ స్ట్రీట్‌‌లో భోజనం చేసేందుకు ఒక రెస్టారంట్‌కి వెళ్ళినప్పుడు అక్కడ అందరి కళ్ళూ ఒకేసారి నా వైపు తిరిగాయి. ఒక్క క్షణం ఎందుకలా జరిగిందో అర్ధం కాలేదు. పక్కనే ఉన్న నా స్నేహితురాలు, వారు చూస్తున్నది నిన్ను కాదు, నీ ఇక్కత్ చీరను అని చెబుతూ పజిల్ సాల్వ్ చేసింది.

నవ్వుకుంటూ భోజనం ముగించి, బిల్ పే చేసేందుకు కౌంటర్ దగ్గరకు వెళితే, కౌంటర్‌లో ఉన్న అబ్బాయి నా చీర వైపు చూస్తూ తిరిగి ఇవ్వాల్సిన దాని కంటే ఎక్కువ చిల్లర చేతిలో పెట్టాడు. మేమే లెక్క చూసుకుని మిగిలిన చిల్లర డబ్బులను తిరిగి ఇచ్చాం.

ఇక్కడ చెప్పేది మాకు జరిగిన సంఘటన గురించి కాదు.చాలా మంది భారతీయ మహిళలు రోజువారీ ధరించే ఈ ఆరు గజాల చీర ఉనికిని గురించి.

"చీర నేను శ్వాస తీసుకునేటప్పుడు గాలిలోకి రెపరెపలాడుతూ ఎగురుతుంది, కన్నీరు వచ్చినప్పుడు కొంగుతో తుడుస్తుంది, అర చేతిలో, అగ్గిపెట్టెలో కూడా ఒద్దికగా ఇమిడి పోతుంది" - అని చాలా మంది వర్ణించారు.

భారతదేశంలో స్త్రీలు ఒకప్పుడు ఏకవస్త్రం ధరించేవారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

భారతదేశంలో ఉన్న వివిధ రాష్ట్రాల్లో, ప్రాంతాల్లో విభిన్న రకాలైన చీర కట్టు పద్దతులున్నాయి. ఒక్కొక్కరిదీ ఒక్కొక్క శైలి. అయితే, దేశవ్యాప్తంగా మహిళలు సాధారణంగా కట్టుకునే చీర కట్టు ఏ రాష్ట్రానికి చెందింది?

తెలుగు నాట ఇదే కట్టు ఎక్కువగా కట్టుకోవడంతో, ఇది తెలుగు రాష్ట్రాల వారి కట్టు అని అనుకుంటూ ఉంటారు. కానీ, ప్రస్తుతం ఉద్యోగాలు చేసే మహిళలు, గృహిణులు, మిల్లీనియల్స్ కడుతున్న చీర తీరు, దేశంలో ఏ ఒక్క రాష్ట్రానికీ చెందింది కాదంటే నమ్ముతారా?

ఒంటి చుట్టూ ఏకవస్త్రం కప్పుకునే రోజుల నుంచి ఆధునిక తీరులో చీర కట్టేవరకూ చీర కట్టు మారుతూ వచ్చిన తీరు తెలుసుకునేందుకు బీబీసీ పలువురు కాస్ట్యూమ్ డిజైనర్లు, నాట్య కళాకారిణులు, ఫ్యాషన్ డిజైనర్లతో, క్యురేటర్లతో మాట్లాడింది.

భారతదేశంలోనే వేర్వేరు రాష్ట్రాలు, వేర్వేరు ప్రాంతాల్లో ఆయా సంస్కృతులకనుగుణంగా చీర కట్టు రూపాంతరం చెందింది. కవులు, రచయతలు తమ పాటలు, కవితల్లో రక రకాల చీర;లను, దేశంలో ఉన్న నేత తీరులను వర్ణించారు. చీర చుట్టూ తిరిగిన తెలుగు సినిమా పాటలు కూడా ఉన్నాయి.

తమిళ మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, తమిళ మహిళలు

ఏకవస్త్రం చుట్టుకునే మహిళలు

మైథిలి సంస్కృతిలో ఈ ఆరు గజాల చీర ఒకప్పుడు ఏకవస్త్రంగా ఉండేదని, దిల్లీ యూనివర్సిటీకి చెందిన చరిత్ర ప్రొఫెసర్ సవిత కుమారి ఝా అన్నారు. భారతీయ సమాజం ప్రముఖంగా స్త్రీతత్వ సంస్కృతి అని, ఈ విధమైన సంస్కృతిలో వినియోగ సంస్కృతి తక్కువగా ఉంటుందని అన్నారు.

"ఏకవస్త్రం అనేది ఏ ఒక్క రాష్ట్రానికి పరిమితం కాదని మన్నార్ గుడి రాజగోపాల్ పెరుమాళ్ కు ఏకవస్త్రమే ధరింపచేస్తారు" అని స్త్రీ క్రియేటివ్స్‌కు చెందిన డిజైనర్ శ్రీమతి అంటారు.

"చీర ఒక ఉనికిని సూచిస్తుంది. చీర కట్టే తీరు ప్రాంతీయతకు సంకేతంగా నిలుస్తుంది. చాలా చోట్ల ఒక్కొక్క వర్గానికి ఒక్కొక్క రకమైన చీర కట్టులు ఉన్నాయి. తమిళనాడులో మడిసార, ఐయ్యర్ తరహా మాదిరిగా రకరకాల చీర కట్టే తీరులున్నాయి. ఆయా ప్రాంతాల్లో మహిళలు చేసే పని, వాతావరణం, సౌకర్యానికనుగుణంగా చీర కట్టే తీరు మారింది" అని ఆమె అంటారు.

అయితే, కేరళ, రాజస్తాన్, గుజరాత్ రాష్ట్రాల్లో మహిళల వస్త్రధారణను పరిశీలిస్తే రెండు మూడు వేర్వేరు వస్త్రాలను ధరించడం కనిపిస్తుందని, దీంతో దేశవ్యాప్తంగా మహిళలు ఏకవస్త్రమే ధరించారని చెప్పడానికి లేదని, వివిధ చీర కట్టు తీరులను పొందుపరిచిన "సారీస్, ట్రెడిషన్ అండ్ బియాండ్ అనే పుస్తకంలో ఆర్ కపూర్ చిష్టీ పేర్కొన్నారు.

నాట్యం చేసే మహిళలు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నాట్యం చేసే మహిళలు

"భారతీయ మహిళలు అయిదు గజాలుండే ముదురు రంగుల్లో ఉన్న పలుచని కాటన్ లేదా సిల్క్ వస్త్రాలను నడుము కింది భాగంలో, మరొకటి నడుం పై భాగాన్ని, భుజాల చుట్టూ కప్పుకునేందుకు వాడేవారు" అని 1500లలో ఒక పోర్చుగీస్ పర్యటకుడు పేర్కొన్నారు.

"భారతదేశంలో ఆలయాల పై శిల్ప కళా సంపదను చూస్తే , కచ్చా కట్టుకున్న స్త్రీలు, శరీరం పై భాగాన్ని పలుచటి వస్త్రంతో కప్పుకున్నట్లుగా కనిపిస్తాయి. ఆధునిక తరహాలో చీర కట్టుకున్న శిల్పాలు ఎక్కడా కనిపించవు" అని నాట్య కళాకారిణి అనిత రత్నం అన్నారు.

ఇటువంటి కచ్చా తరహా కట్టును బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ పాత్రకు డిజైన్ చేసిన కాస్ట్యూమ్స్‌లో కూడా చూడవచ్చు. ఈ రకమైన చీరల కోసం సుమారు 11-13 గజాల చీరలు వాడినట్లు ఈ సినిమాకు కాస్ట్యూమ్స్ డిజైన్ చేసిన ప్రశాంతి త్రిపిర్‌నేని ది హిందూ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు.

మాజీ బ్రిటన్ ప్రధాని హారొల్ద్ విల్సన్‌తో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మాజీ బ్రిటన్ ప్రధాని హారొల్ద్ విల్సన్‌తో భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ

ఆధునిక కట్టుకు శ్రీకారం చుట్టిందెవరు?

"భారత మాజీ ప్రధాని ఇందిరా గాంధీకి చీర ఒక ఆయుధం" అని ఇందిర - ది మోస్ట్ పవర్‌ఫుల్ ప్రైమ్ మినిస్టర్" పుస్తక రచయత సాగరిక ఘోష్ 2018లో జరిగిన జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో పేర్కొన్నారు.

ఈ సందర్భంగా ఇందిరకు చీరల పైనున్న పరిజ్ఞానం, ఇష్టం గురించి చెబుతూ, ఆమె ఒక ప్రచారానికి వెళ్ళినప్పుడు గుంపులో కనిపించిన అమ్మాయి కట్టుకున్న చీరేమిటని ఇంటలిజెన్స్ అధికారిని అడిగినట్లు చెప్పారు. ఆ అధికారి అది సిల్క్ చీరేమో అంటూ అనుమానంగా చెప్పేసరికి, ఇదేనా మీరు సేకరిస్తున్న ఇంటెలిజెన్స్ అని ఆమె అన్నారు. అది కోయంబత్తూరు కాటన్ చీర" అని ఇందిర సమాధానమిచ్చారు. ఈ విషయాన్ని హిందూస్తాన్ టైమ్స్ కథనంలో పేర్కొంది.

అయితే, "ప్రస్తుత కాలంలో రాజకీయ నాయకుల నుంచి సాధారణ గృహిణుల వరకు చీర కట్టుకునే ఆధునిక తీరును 'నివీ' తరహా అంటారని శ్రీమతి చెప్పారు.

ఈ చీర కట్టుకు రవీంద్రనాథ్ ఠాగూర్ వదిన గ్యానోదానందిని ప్రాచుర్యం కల్పించారని ఆర్ కపూర్ చిష్టీ రాసిన పుస్తకంలో పేర్కొన్నారు. ఆమె తానా బానా అనే బ్రాండ్ ను నిర్వహిస్తున్నారు.

ఆధునిక రీతిలో చీర కట్టు

ఫొటో సోర్స్, ANITA RATNAM

ఫొటో క్యాప్షన్, ఆధునిక రీతిలో చీర కట్టు

1870ల తర్వాత ఆధునిక రీతిలో చీర కట్టు కనిపించడం మొదలయిందని 1970లో చిత్ర దేవి రచించిన ఠాకూర్ బరీర్ ఒండెర్ మహల్ అనే బెంగాలీ పుస్తకంలో రాశారు. దీనిని రితెన్ మజుందార్ అనువాదం చేశారు.

సివిల్ సర్వీసెస్‌లో పని చేసే భర్తతో కలిసి గ్యానోదానందిని 1870లో ముంబయి వెళ్ళినప్పుడు, బెంగాలీ సంప్రదాయంలో చీర కట్టు సౌకర్యవంతంగా ఉండకపోవడంతో పార్సీ తరహాలో చీరను కట్టడం మొదలుపెట్టారు. ఆమె తిరిగి కోల్‌కతా వెళ్ళినప్పుడు ఈ తరహాను భరీర్ ఠాకూర్ శైలి అని పిలుస్తూ ఉన్నత వర్గాల్లో చీర కట్టుకు ప్రాచుర్యం కల్పించారని చిష్టీ తన పుస్తకంలో రాశారు.

జాకెట్, పెటీకోట్‌తో కలిపి చీర కట్టును నేర్పిస్తానని ఆమె ప్రకటించడంతో ఆధునిక చీర కట్టు ప్రాచుర్యం పొందిందని పేర్కొన్నారు.

ఈ చీర కట్టును నెమ్మదిగా కొంత మంది ప్రముఖ మహిళలు ఒక ఫ్యాషన్ ట్రెండ్‌గా మార్చారని ఫ్యాషన్ డిజైనర్లు అంటారు.

వీడియో క్యాప్షన్, చీర కట్టుకుని జిమ్‌లో కసరత్తులు చేస్తున్న మహిళ

రాచరిక కుటుంబాల్లో మహిళలు ఫ్యాషన్ ట్రెండ్ సృష్టించారా?

"రాచరిక కుటుంబాలకు చెందిన రాణి గాయత్రీ దేవి, ఉదయ్ పూర్, జోధ్ పూర్ మహారాణుల లాంటి వారు కూడా తాము ధరించిన చీరల ద్వారా ఒక ప్రత్యేక ప్రక్రియకు, షిఫాన్, చందేరీ చీరలకు శ్రీకారం చుట్టి ఒక ట్రెండ్ సృష్టించారు" అని హైదరాబాద్‌కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ అభిప్రాయపడ్డారు. ఆయన సినీ నటి సమంతకు కూడా దుస్తుల డిజైనింగ్ చేస్తారు.

రాధ, దమయంతి, ఇతర దేవతా విగ్రహాలను సరికొత్త రీతిలో భారతీయులకు పరిచయం చేసిన ప్రముఖ చిత్రకారుడు రవివర్మ కూడా చీర కట్టులో దాగిన సౌందర్యాన్ని మరో స్థాయికి తీసుకుని వెళ్లారనే చెప్పవచ్చు.

ఆయన గీసిన 'దేర్ కమ్స్ పాపా' ఇతర దేవతా చిత్రాలలో ముఖాలు ఆయన కూతురు మహాప్రభను పోలి ఉంటాయని మను పిళ్ళై రాసిన ఐవరీ థ్రోన్ అనే పుస్తకంలో పేర్కొన్నారు.

లక్ష్మీదేవి, రాజా రవివర్మ

ఫొటో సోర్స్, Sachin kaluskar

అయితే, ఆయన చిత్రించిన చీర కట్టు పూర్తిగా ఆధునిక చీర కట్టు తరహా అని చెప్పలేమని అనిత రత్నం అన్నారు.

ఆయన చిత్రాల్లో రాచరిక స్త్రీలు, ముఖ్యంగా ఉత్తరాది, పశ్చిమ ప్రాంతాల వారి తరహాలో ఉంటాయి కానీ, కేరళ స్త్రీల పోలికలు కనిపించవని అనిత అంటారు.

ఆయన బరోడా, మైసూరు రాజ ఆస్థానాల్లో చిత్రాలను గీసే పని చేసేవారని ఐవరీ థ్రోన్‌లో పేర్కొన్నారు. ఈ రాచరిక మహిళల ప్రభావం ఆయన చిత్రాల పై పడి ఉంటుందని అనిత అన్నారు.

భారతదేశంలో స్త్రీలు ఒకప్పుడు ఏకవస్త్రం ధరించేవారు

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, భారతదేశంలో స్త్రీలు ఒకప్పుడు ఏకవస్త్రం ధరించేవారు

జాకెట్ ధరించే సంస్కృతి ఎప్పటి నుంచి మొదలయింది?

''మన దగ్గర మహిళలు మొదట్లో చీర మాత్రమే కట్టుకునేవారు. టైలరింగ్ అనే కాన్సెప్ట్ ముస్లింల నుంచి వచ్చింది. మా చిన్నప్పుడు గిరిజన సంథాల్ మహిళలు సాధారణంగా తమ రొమ్ములను వస్త్రాలతో కప్పుకునేవారు కాదు''అని ప్రముఖ రచయిత, పద్మశ్రీ అవార్డు గ్రహీత ఉషా కిరణ్ ఖాన్ బీబీసీతో మరొక కథనం సందర్భంగా మాట్లాడుతూ చెప్పారు.

అయితే, (తయ్యల్ కాలుంగర్) టైలర్ ప్రస్తావన సంగం సంస్కృతిలో కనిపిస్తుందని, అది ముస్లింల నుంచి వచ్చింది కాదని శ్రీమతి అంటారు. దక్షిణాదిలో జాకెట్టు ధరించడం కొత్త పద్ధతి కాదని అన్నారు.

అయితే, ఇప్పటికీ దేశంలో కొన్ని గ్రామీణ ప్రాంతాల్లో, గిరిజన తెగల్లో జాకెట్ లేకుండానే చీరను ధరిస్తారు.

బ్రా, లంగా ధరించడం కూడా భారతీయ సంస్కృతిలో భాగం కాదని, ఇవన్నీ బ్రిటిష్ వారి రాకతో వచ్చిన పరిణామాలని అనిత రత్నం అంటారు.

"మారుతున్న కాలంలో షర్టులు, టీ షర్టులు, క్రాప్ టాప్‌లు వేసి కూడా చీరలు కట్టుకోవచ్చు" అని ప్రీతమ్ జుకల్కర్ అంటారు.

వీడియో క్యాప్షన్, షాక్ అవ్వొద్దు.. ఇది కేకు

మహమ్మద్ అలీ జిన్నా భార్య రతన్ భాయ్ జిన్నా ధరించే షిఫాన్ చీరలు, స్లీవ్‌లెస్ బ్లౌజ్‌‌ విషయంలో పాటించే ఫ్యాషన్ గురించి బాగా మాట్లాడుకునేవారని అంటారు.

ఈ సందర్భంగా ఆమెకు అప్పటి బొంబాయి గవర్నర్ లార్డ్ విల్లింగ్‌టన్ ఏర్పాటు చేసిన విందులో ఎదురైన అనుభవం గురించి మిస్టర్ అండ్ మిస్సెస్ జిన్నా పుస్తక రచయత షీలా రెడ్డి 2018 జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్‌లో ప్రస్తావించారు.

"లేడీ విల్లింగ్‌టన్‌కు మిసెస్ జిన్నా వస్త్రధారణ నచ్చక, సేవకులను పిలిచి, ఆమెకు చలిగా ఉన్నట్లుంది, కప్పుకోవడానికి ఏదైనా తెచ్చివ్వండి" అని అన్నారు.

"ఆ మాటకు స్పందించిన జిన్నా నా భార్యకు చలి వేస్తే మీకు చెబుతుంది అని అంటూ వడి వడిగా లేచి వెళ్లిపోయారు" అని షీలా రెడ్డి లిటరేచర్ ఫెస్టివల్‌లో చెప్పారు.

నటి మాథుర్ జాఫ్రీ

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, నటి మాథుర్ జాఫ్రీ

ఆధునిక తరహా చీర కట్టు ఎలా మారుతూ వచ్చింది?

వివిధ ప్రాంతాల్లో చీరలు ధరించే తీరు వేరైనా అది దేశాన్నంతటినీ కలిపే సాధనంగా ఉండేదని ఫ్యాషన్ డిజైనర్లు అంటారు.

భారతదేశంలో నేత సంస్కృతిని డాక్యుమెంట్ చేసే ఉద్దేశంతో బార్డర్ అండ్ ఫాల్ అనే స్వచ్చంద సంస్థ భారతదేశంలో విభిన్న తరహాలో ఉన్న చీర కట్టు విధానాలను ఒక షార్ట్ ఫిల్మ్ ద్వారా రూపొందించింది.

కాలానుగుణంగా చీర కట్టు అనేక మార్పులు సంతరించుకుంటూ వస్తోంది. మొదట్లో పైట కొంగు చిన్నగా ఉండటంతో, తలను కప్పుకునేందుకు వేరే వస్త్రాన్ని వాడేవారని చిష్టీ తన పుస్తకంలో రాశారు.

కూచ్ బిహార్ మహారాణి సునీతి దేవి తల పై ముసుగును ధరించడానికి ఇష్టపడేవారని అంటారు.

ఆ తర్వాత గ్యానోదా కూతురు ఇందిరా దేవి చీర పవిటతోనే తలను కప్పుకునే కట్టును ప్రాచుర్యం చేశారు.

ఆమె చెల్లెలు మయూర్ భంజ్ మహారాణి సుచారు దేవి ఆధునిక తరహాలో చీర కట్టుకుని 1903లో దిల్లీ దర్బార్ లో కనిపించారు. కచ్చా వేసి కట్టుకున్న చీరతో ఝాన్సీ రాణి లాంటి వారు యుద్ధాలు చేసేవారని, ఈత కొట్టేవారని , ఈ తరహా చీరలు మధ్య ప్రదేశ్, షాజ్ పూర్, ఆంధ్రప్రదేశ్‌లోని కొత్తపల్లి ప్రాంతాల్లో కట్టేవారని ఇదే పుస్తకంలో పేర్కొన్నారు.

"నివీ తరహా చీర కట్టు కట్టుకునేందుకు సులభంగా ఉండటం వల్ల ఈ కట్టుకు మరింత ఆదరణ పెరిగింది" అని దిల్లీకి చెందిన కాస్ట్యూమ్ డిజైనర్, టెక్స్‌టైల్ రివైవలిస్ట్ సంధ్య రామన్ అభిప్రాయపడ్డారు.

టెక్స్‌టైల్ రివైవలిస్ట్ సంధ్య రామన్

ఫొటో సోర్స్, SANDHYA RAMAN

ఫొటో క్యాప్షన్, టెక్స్‌టైల్ రివైవలిస్ట్ సంధ్య రామన్

సోషల్ మీడియా కూడా చీరలకు ప్రాచుర్యం కల్పించిందా?

"ఇందిర, రతన్ భాయ్ జిన్నా లాంటి మహిళలు చీరకు కల్పించిన సాధికారతనే నేటి సోషల్ మీడియా చీరల హ్యాండిళ్లు కొనసాగిస్తున్నాయి" అని సాగరిక అంటారు.

ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా యాప్‌లు కూడా సారీ స్పీక్, సారీ సిస్టర్స్ లాంటి హ్యాండిళ్లతో చీరలకు మరింత ప్రాచుర్యాన్ని తీసుకొచ్చాయి అని అనిత రత్నం అన్నారు.

అయితే, ఆన్‌లైన్‌లో ఏది నిజమైన హ్యాండ్‌లూమ్ వస్త్రమో, ఏది కాదో తేల్చుకోవడం కష్టమవుతుందని సంధ్య రామన్ అంటారు.

చేనేత ఖరీదైన ఉత్పత్తిగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చేనేత ఖరీదైన ఉత్పత్తిగా మారింది.

హ్యాండ్లూమ్ లగ్జరీగా ఎందుకు మారింది?

ప్రాచీన కాలంలో వివాహాల్లో వరకట్నంగా గాని, యుద్ధంలో ఓడిపోయినప్పుడు గానీ నేత పని వారిని ఒక రాజ్యం నుంచి మరొక రాజ్యానికి పంపించే వారని చెబుతారు. వీరెక్కడికి వెళ్లినా వారితో పాటు తమ నేత పని నైపుణ్యాన్ని వెంట తీసుకుని వెళ్లి కొత్త ప్రాంతాల వారసత్వ సంపదకు తోడ్పడేవారని చిష్టీ తన పుస్తకంలో పేర్కొన్నారు.

"భారతదేశంలో ఒక్క గోవాలో మాత్రం పోర్చుగీస్ పాలకులు నేత పనిని నిషేధించారు. దాంతో, తమ నేత మగ్గాలను భూగర్భంలో దాచేందుకు నేత పని వారు కష్టాలు పడేవారు. వారి పై ఎన్ని నిషేధాలు విధించినప్పటికీ వారి నేత పనిని కొనసాగించారు" అని చిష్టీ తన పుస్తకంలో పేర్కొన్నారు.

సాధారణ నూలు వస్త్రం నేడు సంపన్న వర్గాల వారు మాత్రమే కొనుక్కోగలిగే ఫ్యాషన్‌గా మారిపోయింది. హ్యాండ్లూమ్ చీరల ఖరీదు రూ. 5,000 నుంచి రూ.5లక్షల వరకు ఉంటుంది.

"నేత పని ఖరీదు పెరిగింది. కానీ, వినియోగదారులు చెల్లిస్తున్న ధరలో ఎంత శాతం నేత పని వారికి వెళుతుందో లేదో తెలియదు. ఇదే నేత పని వారి పిల్లలు అదే వృత్తిలో కొనసాగేందుకు ఆసక్తి చూపించకపోవడానికి ప్రధాన కారణం" అని సంధ్య అంటారు.

గుజరాత్‌లో వచ్చిన యాంత్రిక విప్లవం చాలా వరకు నేత మగ్గాలను మింగేసిందని ఒక్క రిద్రోల్, మహేశానా జిల్లాల్లో 1960ల తర్వాత 300 మగ్గాలు 3కి తగ్గిపోయయని చిష్టీ తన పుస్తకంలో రాశారు.

చేనేత ఖరీదైన ఉత్పత్తిగా మారింది.

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, చేనేత ఖరీదైన ఉత్పత్తిగా మారింది.

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులు చీరకు నష్టం చేస్తున్నాయా?

ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సుల్లో పాశ్చాత్య శరీరాకృతులకు సంబంధించిన కొలతలు, పాశ్చాత్య దుస్తుల శైలిని డిజైన్ చేసే విధానాలే ఎక్కువగా పొందుపర్చడంతో, స్వదేశీ తరహా దుస్తులను రూపొందించేందుకు కాలేజీ పూర్తి చేసుకుని వచ్చిన డిజైనింగ్ విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని హైదరాబాద్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ జాషువా అంటారు. ఆయన ఆనంద్, గోదావరి చిత్రాలకు కాస్ట్యూమ్ డిజైనింగ్ చేశారు.

పవర్ లూమ్‌ల ఆవిర్భావం, ఆదరణ తగ్గడం, నేత పని వారికి పనికి తగ్గ పారితోషికం లభించకపోవడం, దీంతో పాటు మధ్య తరగతి వారు కొనుక్కోలేని స్థాయికి హ్యాండ్లూమ్ చేరడంతో వీటి ఖరీదు కూడా పెరిగింది" అని అరవింద్ అన్నారు.

1990లలో ఆర్ధిక సంస్కరణలు రావడంతో వస్త్ర పరిశ్రమలో సాంకేతిక విప్లవానికి దారి తీసి పవర్ లూమ్‌ల రాకకు తెర తీసింది.

"హ్యాండ్‌లూమ్స్‌ను తరచుగా ఉత్పత్తి చేయాలి కానీ, భారీగా ఉత్పత్తి చేసేందుకు చూడకూడదు. హ్యాండ్ లూమ్స్ ధరించడం వల్ల పర్యావరణానికి కూడా హాని చేయకుండా ఉంటాం" అని సంధ్య అన్నారు.

పాకెట్ చీరలు

ఫొటో సోర్స్, TAARINI SHARAF

ఫొటో క్యాప్షన్, పాకెట్ చీరలు

ఏకవస్త్రం నుంచి నేటి పాకెట్ చీరల వరకు

చీరను మహిళలకు సాధికారత ఇచ్చే వస్త్రంలా చూడాలంటే చీరకు కూడా జేబు ఉండాలనే ఆలోచన వచ్చిందని అంటారు కోల్‌కతాకు చెందిన 18సంవత్సరాల తారిణి షరాఫ్. ఆమె జేబుతో కూడిన చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు యువర్ పాకెట్. ఓఆర్‌జి అనే స్వచ్చంద సంస్థ ద్వారా కొత్త తరహా ఉద్యమాన్ని నిర్వహిస్తున్నారు.

"అబ్బాయిలు పాకెట్‌లో డబ్బులు, కళ్లద్దాలు, తాళాలు ఏమైనా పెట్టుకుంటారు. కానీ, అదే అమ్మాయిల విషయానికొస్తే వారి వస్తువులు పెట్టుకోవడానికి చీర కట్టుకుంటే, ఒక హ్యాండ్ బ్యాగ్ పట్టుకుని వెళ్లాల్సిందే. చీరకెందుకు జేబు ఉండకూడదనే ఆలోచనతోనే ఈ కొత్త తరహా చీరలను రూపొందించాను" అని తారిణి బీబీసీకి చెప్పారు.

ఇదే తరహా పాకెట్ కలెక్షన్ ను ప్రీతమ్ జుకల్కర్ కూడా రూపొందించినట్లు తెలిపారు.

ఈ పాకెట్ చీరలకు ప్రాచుర్యం కల్పించేందుకు కొంత మంది పాకెట్ పద్యాలు, పాటలు రచించారు. కొంత మంది మీమ్స్ తయారు చేశారు" అని తారిణి తెలిపారు.

"శానిటరీ ప్యాడ్ ఇన్ మై పాకెట్" అనే ప్రాజెక్ట్ కూడా రూపొందించినట్లు చెప్పారు.

అమెరికా నటి షర్లీ మాక్ లైన్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (1967)

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, అమెరికా నటి షర్లీ మాక్ లైన్, మాజీ ప్రధాని ఇందిరా గాంధీ (1967)

మగ్గం నుంచి బోర్డు రూమ్‌ల వరకు

ఒకప్పుడు పెళ్లి చీర అంటే, తెలుపు రంగులోనే ఉండేదని, నెమ్మదిగా రసాయన రంగులు రావడంతో చీరలు కూడా రంగు రంగులవి రావడం మొదలుపెట్టాయి.

ఇన్ని రూపాంతరాలు చెందిన ఆరు గజాల చీర నేడు మల్టీ నేషనల్ కంపెనీ బోర్డు రూముల్లోకి, లా చాంబర్స్‌లోకి, వ్యాపార వర్గాల్లోకి, సాధికారత సాధించిన వృత్తుల్లోకి వచ్చి తన ఉనికిని చాటుకుంటోంది అని అనిత అన్నారు.

1960లలో ఎయిర్ ఇండియా హోస్టెస్‌లకు కూడా ప్రత్యేక సాఫ్ట్ ప్యూర్ సిల్క్ చీరలను డ్రెస్‌గా చేసి చీరకు మరింత ప్రాచుర్యం కల్పించారని అనిత అన్నారు.

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి కూడా చీరలు ఒక సాధనం, రూపకం అని సామాజిక కార్యకర్త, ఫ్యాషన్ డిజైనర్, దస్తకార్ వ్యవస్థాపకురాలు లైలా త్యాబ్జీ ది వీక్‌కు రాసిన వ్యాసంలో పేర్కొన్నారు. ఆమె సోనియా గాంధీకి చీరలను ఎంపిక చేస్తారు. ఆమెకు సంప్రదాయ హ్యాండ్లూమ్ చీరలంటే ప్రీతి అని చెబుతూ ముఖ్యంగా తెలంగాణ ఇక్కత్ చీరలు, ఢాకా జమదని చీరలను ఎక్కువగా ఇష్టపడతారని పేర్కొన్నారు.

భారతీయ సంప్రదాయ నేత వస్త్రాలను ధరించడం, వాటిని ఆదరించడం చేయడం వల్ల భారతీయ డిజైన్లను ప్రపంచ వేదికల పైకి తీసుకుని వెళ్లవచ్చని ప్రీతమ్ అంటారు.

వీడియో క్యాప్షన్, చీర కట్టుకుని స్కై డైవింగ్!

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)