చైనా ప్రజల కష్టాలు: షియాన్ నగరంలో బియ్యం కోసం గాడ్జెట్లు, క్యాబేజీ కోసం సిగరెట్లు మార్పిడి

వస్తుమార్పిడి

ఫొటో సోర్స్, WEIBO

చైనాలోని షియాన్ నగరంలో లాక్‌డౌన్‌లో మగ్గిపోతున్న ప్రజలు ఆహారం, ఇతర నిత్యావసరాల కోసం వస్తుమార్పిడికి సిద్ధమవుతున్నారు.

స్థానికులు ఆహార పదార్థాల కోసం సిగరెట్లు, టెక్ గాడ్జెట్లను మార్చుకుంటున్న దృశ్యాలు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి.

ఈ నగరంలో దాదాపు కోటీ 30 లక్షల మందిని డిసెంబర్ 23 నుంచి వారి ఇళ్లకే పరిమితం చేశారు.

వచ్చే నెలలో చైనీస్ కొత్త సంవత్సరం రానుండడం, బీజింగ్‌లో వింటర్ ఒలింపిక్స్ జరగనుండడంతో అధికారులు కఠిన చర్యలు చేపడుతున్నారు.

యుజౌ నగరంలో ఎలాంటి లక్షణాలూ లేని మూడు కరోనా కేసులు బయటడడంతో అధికారులు రాత్రికి రాత్రే అక్కడ ప్రజా రవాణాను నిలిపివేశారు. సినిమా హాళ్లు, ఇతర ఎంటర్‌టైన్మెంట్ వేదికలను మూసివేశారు. రహదారులపై దాదాపు అన్ని రకాల వాహనాల రాకపోకలూ నిలిపివేశారు.

ఈ నగరంలో కోటీ పది లక్షల మంది ఉన్నారు.

అత్యవసర సరుకులు విక్రయించే షాపులు మినహా అన్ని దుకాణాలూ మూసివేశారు. మహమ్మారి నియంత్రణా చర్యల్లో ఉన్న సిబ్బందిని మాత్రమే బయటకు అనుమతిస్తున్నారు.

వైరస్‌తో కలిసి జీవించే ప్రయత్నాలు చేయకుండా, అధికారులు దానిని అరికట్టడానికి జీరో కోవిడ్ వ్యూహం అనుసరిస్తుండడంతో పశ్చిమ చైనాలోని ఒక పెద్ద నగరంలో ఇలాంటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది.

షియాన్‌లో అధికారులు నగర ప్రజలకు ఉచిత ఆహారం అందిస్తున్నారు. కానీ అధికారుల సరఫరాపై సోషల్ మీడియాలో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

వస్తుమార్పిడి

ఫొటో సోర్స్, Getty Images

సోషల్ మీడియా వీబోలో కొందరు క్యాబేజీ కోసం సిగరెట్లు మార్చుకోవడం, ఆపిల్స్ ఇచ్చి డిష్ వాష్ లిక్విడ్ తీసుకోవడం, కూరగాయల కోసం శానిటరీ నాప్‌కిన్లు ఇవ్వడం కనిపిస్తోంది.

ఒక వీడియోలో ఒక వ్యక్తి తన నింటెండో స్విచ్ కన్సోల్‌‌ను(ఇదొక గేమింగ్ పరికరం.. భారత్‌లో కొత్త పరికరం ధర రూ.20 వేల పైనే ఉంటుంది) ఒక పాకెట్ ఇన్‌స్టంట్ నూడుల్స్, రెండు బన్నుల కోసం మార్చుకోవడం కనిపిస్తోంది.

"జనాలు తమ దగ్గర ఉన్న వస్తువులను అదే భవనంలో ఉంటున్న వారితో మార్చుకుంటున్నారు. ఎందుకంటే వారి దగ్గర ఉన్న ఆహారం ఎక్కువ రోజులు వచ్చేలా లేదు" అని వాంగ్ రేడియో ఫ్రీ ఆసియాకు చెప్పాడు.

మరొకరు బియ్యం కోసం తన స్మార్ట్‌ఫోన్, టాబ్లెట్‌ మార్చుకున్నాడని ఆ రేడియో చెప్పింది.

"నిస్సహాయ స్థితిలో ఉన్న పౌరులు వస్తుమార్పిడి యుగంలోకి వచ్చేశారు. బంగాళాదుంపలను ఇయర్ బడ్స్ కోసం మార్చుకుంటున్నారు" అని ఒక వీబో యూజర్ చెబితే, "మేం మళ్లీ ఆదిమ మానవుల సమాజంలోకి చేరుకున్నాం" అని మరో యూజర్ అన్నాడు.

అయితే కొంత మంది పక్కింటివాళ్లు వారి దగ్గరున్న సరుకులను తమతో పంచుకోవడం మనసు కదిలించిందని చెప్పారు.

ప్రస్తుతం వ్యాపించిన కోవిడ్ మహమ్మారికి షియాన్ కేంద్రంగా నిలిచింది.

గుండెపోటు వచ్చిన తన తండ్రిని కోవిడ్ పరిస్థితి వల్ల ఆస్పత్రిలో చేర్చుకోకపోవడంతో, ఆయన చనిపోయినట్లు షియాన్‌లో ఒక వ్యక్తి సోషల్ మీడియాలో చెప్పాడు. కానీ దీనిపై ఆస్పత్రి వర్గాలు ఇంకా స్పందించలేదు.

వీడియో క్యాప్షన్, కోవిడ్‌ను జయించిన 90 ఏళ్ల బామ్మ ఇప్పుడు కొండలు ఎక్కుతున్నారు...
લાઇન

జీరో కోవిడ్ వ్యూహం ఫలిస్తుందా?

రాబిన్ బ్రాంట్, షాంఘై ప్రతినిధి విశ్లేషణ

కోవిడ్ మొదట చైనాలో కనిపించింది. గత కొన్ని వారాల వరకూ ప్రభుత్వం ఎంత బాగా మేనేజ్ చేసిందంటే.. దేశంలో కొత్త కేసులు పెద్దగా లేవు, ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే వారిలోనే బయటపడేవి.

చైనా డైనమిక్ జీరో కోవిడ్ వ్యూహంలో సామూహిక వ్యాక్సినేషన్, పరీక్షలు నిరంతరం జరిగేలా చూడడం, దేశవ్యాప్తంగా ప్రజల కదలికలపై ఒక కన్నేసి ఉంచడం లాంటివి ఉన్నాయి.

టెంపరేచర్ చెక్ చేయడం, ముప్పు లేదని నిరూపించడానికి ఫోన్ యాప్స్ ప్రవేశపెట్టడం ఉంది. వీటన్నిటి ద్వారా ఏదైనా కొత్త వేరియంట్ వ్యాపిస్తే చాలా అప్రమత్తంగా ఉండాలని చూస్తోంది. ఎవరిలోనైనా అది గుర్తించినపుడు స్పందన చాలా తీవ్రంగా ఉంటోంది.

చైనా ప్రారంభం నుంచీ ఇలాంటి విధానానికి కట్టుబడి ఉంది. ఎందుకంటే కేసులు, మరణాల సంఖ్యను తక్కువగా చూపిస్తే అది బహుశా రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా ఆమోదయోగ్యం కాకపోవచ్చు అని షీ జిన్‌పింగ్ నుంచి కింది స్థాయి నేతల వరకూ భావించి ఉండచ్చు.

వైరస్ చైనా సరిహద్దులు దాటి వ్యాపించిన తర్వాత, అధికార కమ్యూనిస్ట్ పార్టీ వైరస్‌ను త్వరగా నియంత్రించిన ఘనత తమదేనంటోంది. ఇప్పుడు ఆ పరిస్థితి మారడం వల్ల దాని విశ్వసనీయత దెబ్బతింటుంది.

దశాబ్దాలుగా తాము ప్రజారోగ్య వ్యవస్థపై ఎక్కువగా ఆధారపడడం లేదని భావిస్తున్న చాలా మంది చైనీయుల్లో ప్రస్తుత విధానం, కఠిన నియంత్రణలు విస్తృత ఆమోదాన్ని తీసుకురావచ్చు.

అందుకే అనారోగ్యం, ఉద్యోగాలు కోల్పోయే అవకాశం లాంటివి పక్కన పెడితే అసలు ఉనికే భయంకరంగా ఉంది.

దీనికితోడు కొన్ని వారాల్లో మరో ఒలింపిక్ క్రీడలకు సురక్షితంగా ఆతిథ్యం వహించి పరువు కాపాడుకోవాలి. మరోవైపు చైనా కొత్త సంవత్సరం సందర్భంగా దేశవ్యాప్తంగా ప్రజలు భారీ ఎత్తున వలసలు వెళ్లే సమయం వేగంగా సమీపిస్తోంది. అందుకే సమీప భవిష్యత్తులో ప్రభుత్వం జీరో కోవిడ్ వ్యూహానికి కట్టుబడి ఉంటుందా అనేది కాస్త సందేహమే.

వీడియో క్యాప్షన్, చైనా స్పాంజ్ సిటీలు.. ఈ నగరాలు వరదలకు భయపడవు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)