బుల్లీబాయి, సుల్లీ డీల్స్ యాప్స్ కేసులను ముంబయి, దిల్లీ పోలీసులు ఎలా డీల్ చేశారు?

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, మయాంక్ భాగవత్
    • హోదా, బీబీసీ మరాఠీ

వివాదాస్పదమైన బుల్లీ బాయి యాప్ కేసులో ఇప్పటివరకు నలుగురు అరెస్టయ్యారు. ముంబయి పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. దిల్లీ పోలీసు స్పెషల్ సెల్ అధికారులు గురువారం నాడు 21 ఏళ్ల నీరజ్ బిష్ణోయిని అరెస్ట్ చేశారు.

వివిధ పార్టీలకు చెందిన రాజకీయ నాయకులు, సోషల్ మీడియా నుంచి వచ్చిన ఒత్తిడితో ముంబయి పోలీసులు అనుమానితులను 24 గంటల్లో కనిపెట్టి కేసు నమోదు చేశారు. ఈ కేసులో వారు బెంగళూరుకు చెందిన విశాల్ కుమార్, ఉత్తరాఖండ్‌కు చెందిన శ్వేత సింగ్, మయాంక్ రావల్‌ను అరెస్ట్ చేశారు.

ముంబయి పోలీసులులు ఈ కేసును 2022 జనవరి 2న నమోదు చేసి, జనవరి 3న ఒక నిందితుడిని అరెస్టు చేశారు. ఒక బృందం బెంగళూరు, మరొక బృందం ఉత్తరాఖండ్ వెళ్లి నిందితులను అరెస్ట్ చేసింది. ఈ కేసులో సబ్ ఇన్‌స్పెక్టర్ స్థాయిలో ఉన్న అధికారులు క్షేత్ర స్థాయిలో పని చేస్తున్నారు.

అయితే, ఆరు నెలల క్రితం ఇలాంటి తరహాలోనే చోటు చేసుకున్న సుల్లీ డీల్స్‌ యాప్ కేసులో దిల్లీ పోలీసులు విచారణను ముందుకు తీసుకుని వెళ్ళకపోవడం పట్ల ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

దిల్లీ పోలీసులు సుల్లీ డీల్స్ కేసును విచారణ చేస్తున్నారు. దిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ జులై 08, 2021న మహిళ గౌరవాన్ని భంగపరిచినందుకు సెక్షన్ 354 (ఏ) కింద ఎఫ్ ఐ ఆర్ నమోదు చేశారు. ఈ యాప్ తయారీ వెనుక ఉన్న అస్సాంకు చెందిన నీరజ్ బిష్ణోయిని దిల్లీ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

అయితే, ఈ రెండు కేసుల మధ్య సంబంధం ఉందో లేదో అప్పుడే చెప్పలేమని ముంబయి పోలీసులు అంటున్నారు.

బుల్లీబాయి యాప్‌పై ఫిర్యాదు చేసిన ఖలీదా పర్వీన్

ఫొటో సోర్స్, Khalidaparveen

ఫొటో క్యాప్షన్, బుల్లీబాయి యాప్‌పై ఫిర్యాదు చేసిన ఖలీదా పర్వీన్

సుల్లీ డీల్స్ కేసు విషయంలో దిల్లీ పోలీసులేం చెబుతున్నారు?

గత ఏడాది జులై 2021లో, సుల్లీ డీల్స్ అనే ఆన్‌లైన్ యాప్‌కు సంబంధించి దిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు.

ఈ ఆన్ లైన్ వేదికలో ముస్లిం మతానికి చెందిన ప్రముఖ మహిళల ఫోటోలను ఉంచి ఈ యాప్ ద్వారా సదరు మహిళలతో డీల్ చేసుకోవచ్చని అందులో చెబుతున్నారు.

ఈ విచారణ ప్రారంభమై 6 నెలలు కావస్తోంది. కానీ, ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయలేదు.

ఈ యాప్ హోస్టింగ్ ప్లాట్‌ఫాం విదేశాల్లో ఉంది. దీనిని విచారించేందుకు మ్యూచువల్ లీగల్ అసిస్టెన్స్ ట్రీటీ ఇన్ క్రిమినల్ మ్యాటర్స్ (ఎంఎల్ ఏటి) ఆమోదం పొందినట్లు దిల్లీ అడిషినల్ కమీషనర్ ఆఫ్ పోలీస్ చిన్మయ్ బిస్వాల్ ఏఎన్‌ఐ వార్తా సంస్థకు తెలిపారు. కేసు విచారణ కొనసాగుతున్నట్లు తెలిపారు.

కానీ, బుల్లీ బాయి యాప్ నిర్వాహకులపై ముంబయి పోలీసులు తీసుకున్న సత్వర చర్యల తర్వాత, దిల్లీ పోలీసులు అదే తరహా కేసులో ప్రదర్శిస్తున్న అలసత్వంపై ప్రశ్నలు ఎదురవుతున్నాయి.

"ఈ యాప్‌ను ప్రోత్సహించిన వారిని ముంబయి పోలీసులు అరెస్ట్ చేశారు. వారు ఆ యాప్‌ను సృష్టించిన వారు కాదు. మేం యాప్ తయారు చేసిన వాళ్ళను పట్టుకోవాలని అనుకుంటున్నాం" అని దిల్లీలో పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ పోలీస్ అధికారి చెప్పారు.

ఈ విషయమై దిల్లీ పోలీస్ పీఆర్‌ఓను బీబీసీ సంప్రదించినప్పటికీ, ఎటువంటి ఎలాంటి సమాధానం లభించలేదు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

బుల్లీ బాయి, సుల్లీ డీల్స్ మధ్య సంబంధముందా?

బుల్లీ బాయి, సుల్లీ డీల్స్ యాప్ లు రెండూ గిట్‌హబ్ అనే ప్లాట్‌ఫాంలో అందుబాటులో ఉన్నాయి. నివేదికల ప్రకారం గిట్‌హబ్ అనేది ఒక ఓపెన్ సోర్స్ ప్లాట్‌ఫాం. ఇది యూజర్లు అప్లికేషన్ క్రియేట్ చేయడానికి, షేర్ చేసుకోడాన్ని అనుమతిస్తుంది. గిట్‌హబ్‌లో ఎవరైనా వ్యక్తిగత లేదా సంస్థ పేరుతో యాప్ డిజైన్ చేసుకోవచ్చు. దీనికి తోడు మనం ఆ యాప్‌ను గిట్‌హబ్ మార్కెట్ ప్లేస్‌లో అమ్మవచ్చు లేదా షేర్ చేసుకోవచ్చు.

"ఈ రెండు కేసులకు ఒకదానితో ఒకటి సంబంధం ఉందో లేదో ప్రస్తుతం ఏమి చెప్పలేం. మా విచారణ ప్రాథమిక దశలోనే ఉంది" అని ముంబయి పోలీస్ కమీషనర్ హేమంత్ నగ్రలే బీబీసీ మరాఠీకి చెప్పారు.

కానీ, బుల్లీ బాయి కేసులో అరెస్ట్ అయినా ఒక వ్యక్తికి సుల్లీ డీల్స్ కేసుతో కూడా సంబంధం ఉండి ఉండవచ్చని ముంబయి పోలీస్ సైబర్ సెల్ కు చెందిన అధికారులు చెబుతున్నారు.

విశాల్ కూడా సుల్లీ డీల్స్ యాప్‌లో ఒక ఫాలోవర్‌గా ఉన్నట్లు పేరు చెప్పేందుకు ఇష్టపడని ఒక సైబర్ సెల్ అధికారి చెప్పారు. ఇప్పటి వరకు బలమైన ఆధారాలు దొరకలేదని చెప్పారు.

ప్రతీకాత్మక చిత్రం

ఫొటో సోర్స్, JILLA DASTMALCHI/BBC

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం

దిల్లీ పోలీసులు చేస్తున్న విచారణలో జాప్యం గురించి ప్రశ్నించినప్పుడు, ఈ విషయం పై కామెంట్ చేయనని హేమంత్ నగ్రలే చెప్పారు.

ఆరు నెలలుగా దిల్లీ పోలీసులు ఒక్క అరెస్టు కూడా చేయనప్పటికీ, ముంబయి పోలీసులు మాత్రం 24 గంటల్లో నిందితులను అరెస్ట్ చేశారు. దిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేస్తారు. ముంబయి పోలీసులు మహారాష్ట్ర ప్రభుత్వానికి రిపోర్ట్ చేస్తారు.

దిల్లీ, ముంబయి పోలీసు వ్యవస్థల దగ్గర విచారణకు కావల్సిన వనరులు సమృద్ధిగా ఉన్నాయి. రెండు పోలీసు వ్యవస్థలు స్పందించిన తీరు గురించి ఒక రిటైర్డ్ జడ్జిని, రిటైర్డ్ పోలీసు అధికారిని అడిగాం.

"దిల్లీ పోలీసులు కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు రిపోర్ట్ చేస్తారు. వారు చర్యలు తీసుకోకపోవడంలో ఆశ్చర్యపోవాల్సిన విషయం ఏమీ లేదు" అని రిటైర్డ్ న్యాయమూర్తి బీజీ కోల్సే పాటిల్ అన్నారు.

కానీ, ఈ విషయంలో భారత ప్రభుత్వం దిల్లీ, మహారాష్ట్ర పోలీసులతో కలిసి పని చేస్తోందని కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ బుల్లీ డీల్స్ యాప్ వివాదం తర్వాత ప్రకటించారు.

నిందితులను పట్టుకునేందుకు ముంబయి పోలీసులు సత్వరమే స్పందించిన తీరును ప్రశంసించాలని కోల్సే పాటిల్ అన్నారు.

ఇటువంటి నేరాలకు పాల్పడుతున్న వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

"ముస్లింలకు వ్యతిరేకంగా ద్వేషాన్ని రగులుస్తున్నారు. ముంబయి పోలీసులు తీసుకున్న చర్యలను స్వాగతించాలి" అని ఆయన అన్నారు.

ఏదైనా కేసుకు ఎంత ప్రాముఖ్యం ఇస్తారనేది పూర్తిగా విచారణ సంస్థ పై ఆధారపడి ఉంటుందని, మాజీ పోలీస్ అధికారి పీకే జైన్ చెప్పారు.

"సైబర్ క్రైం నేరాలు చాలా రూపాలు సంతరించుకున్నాయి. ఏ రకమైన ఫిర్యాదుకు ఎటువంటి ప్రాధాన్యం ఇస్తాయనేది పూర్తిగా విచారణ సంస్థల పై ఆధారపడి ఉంటుంది" అని అన్నారు.

"ఈ కేసును దిల్లీ పోలీసులు తీవ్రంగా పరిగణించలేదు. టెక్నాలజీ సహాయంతో వీటిని సులభంగా పరిష్కరించవచ్చు" అని అన్నారు.

దేశంలో ఉన్న సైబర్ కేంద్రాలకు ఏటా కొన్ని వేల ఫిర్యాదులు వస్తున్నాయి. అన్నిటినీ ఒకే స్థాయిలో విచారణ చేయడం సాధ్యం కాదని నిపుణులు అంటున్నారు.

"పోలీసు సిబ్బంది ఎంత మంది ఉన్నారు? ఈ కేసు వల్ల శాంతి భద్రతల అంశాలేమైనా తలెత్తుతాయా? ఇలాంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని పోలీసులు విచారణ నిర్వహిస్తారు" అని జైన్ చెప్పారు.

"సోషల్ మీడియా వేదికల సహకారంపైనా కేసు పరిష్కారం ఆధారపడి ఉంటుంది. భారత ప్రభుత్వం సైబర్ చట్టాలను బలపరుస్తోంది. కానీ, సమాచారం సేకరించేందుకు కొంత సమయం పడుతుంది. కొన్ని సార్లు యాప్ లు విచారణ సంస్థలకు స్పందించవు" అని అన్నారు.

SulliDeals

ఫొటో సోర్స్, Social Media

ఫొటో క్యాప్షన్, SulliDeals

ముంబయి పోలీసులు బుల్లీ బాయి కేసును ఎలా ఛేదించారు

ముంబయి పోలీసులు బుల్లీ బాయి యాప్‌కు వ్యతిరేకంగా జనవరి 1, 2022న కేసు నమోదు చేశారు.

"పోలీసులు బుల్లీ బాయి ట్విటర్ అకౌంట్‌ను, ఆ యాప్‌ను అనుసరిస్తున్న ఫాలోవర్లను గమనించారు. ఆ అకౌంట్‌కు ఐదుగురు ఫాలోవర్లు ఉన్నారు" అని ముంబయి పోలీసులు చెప్పారు.

ఈ యాప్‌ను ఫాలో అయిన ఒక వ్యక్తి ఖల్సా మద్దతుదారుగా కనిపిస్తున్నట్లు గమనించారు.

ఆ సమాచారం ఆధారంగా విశాల్ కుమార్ ఝాను అరెస్ట్ చేసినట్లు ముంబయి జాయింట్ కమిషనర్ ఆఫ్ క్రైమ్ మిలింద్ భారంబే చెప్పారు.

"ఖలిస్థాన్ వాదాన్ని సమర్ధించే వారే ఈ యాప్‌లు సృష్టిస్తున్నట్లు నమ్మించాలని వారు ప్రయత్నాలు చేశారు" అని ముంబయి పోలీస్ కమీషనర్ చెప్పారు.

పోలీసులు పట్టుకోకుండా ఉండేందుకు విశాల్ ఖల్సా మద్దతుదారునిగా తప్పుడు ఉనికిని సృష్టించుకున్నారు.

"ఈ కేసును విచారిస్తున్న వారంతా కాస్త సున్నితంగా వ్యవహరించాలి" అని రిటైర్డ్ పోలీస్ అధికారి మీరా బోరావాంకర్ చెప్పారు.

"పోలీసులు మాత్రమే కాకుండా, విచారణ అధికారులు, న్యాయాధికారులు కూడా సున్నితంగా వ్యవహరించాలి. సైబర్ నేరస్థులను కనిపెట్టేందుకు ఫోరెన్సిక్ సామర్ధ్యం పెంచేందుకు దృష్టి పెట్టాలి. వారు చాలా తెలివిగా వ్యవహరిస్తూ, అమ్మాయిలు, మహిళలు, పిల్లల జీవితాల్లో కల్లోలం సృష్టిస్తారు. ఈ కేసుల విచారణను ఒక కొలిక్కి తీసుకుని రావల్సిన అవసరముంది. సైబర్ నేరస్థుల చర్యలను అణిచివేయాలంటే క్రిమినల్ జస్టిస్ వ్యవస్థలో ఉన్న అన్ని విభాగాలు సమన్వయంతో వ్యవహరించడం అవసరం" అని రిటైర్డ్ ఐపిఎస్ అధికారి మీరా బోరావాంకర్ చెప్పారు.

"సైబర్ బుల్లీయింగ్, బెదిరింపులు, మార్ఫింగ్, బ్లాక్ మెయిల్ కార్యకలాపాలను నిరోధించడం చాలా ముఖ్యం . ఇటువంటి చర్యలు మహిళలకు, వారి కుటుంబాలకు చాలా ఒత్తిడి కలుగచేస్తున్నాయి. పిల్లలను కూడా బాధితులుగా చేస్తున్నారు.

కానీ, ఈ నేరాల పట్ల అవగాహన లేకపోవడం, పరువు పోతుందేమోననే భయంతో బాధితులు సమస్య చెప్పేందుకు ముందుకు రావడం లేదు. దీంతో, సైబర్ నేరస్థుల కార్యకలాపాలకు అడ్డుకట్ట ఉండటం లేదు" అని అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)