‘మోదీ.. బీజేపీ సంస్కారం ఇదేనా.. నాకే క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. త‌ల దించుకున్నంత ప‌ని అయింది’ - కేసీఆర్ - ప్రెస్‌రివ్యూ

kcr

ఫొటో సోర్స్, facebook/KCR

కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై అస్సాం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలను తెలంగాణ సీఎం కేసీఆర్ తప్పుపట్టారని ‘నమస్తే తెలంగాణ’ కథనం రాసింది.

‘‘అస్సాం ముఖ్య‌మంత్రిగా ఉన్న వ్య‌క్తి... రాహుల్ గాంధీ, నువ్వు ఏ అయ్య‌కు పుట్టిన‌వో అడిగిన‌మా మేము అని అంటారా.. ఈ మాట అనొచ్చునా.. ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ.. బీజేపీ సంస్కారం ఇదేనా.. మ‌న‌ హిందూ ధ‌ర్మం ఇదేనా.. మ‌న దేశం మ‌ర్యాద ఇదేనా.. ఒక నేత‌ను ప‌ట్టుకొని ఏం మాట‌లు మాట్లాడున్నారు.. ముఖ్య‌మంత్రి అలాంటివి అడుగుతారా? అని సీఎం కేసీఆర్ ప్ర‌శ్నించారు.

యాదాద్రి భువనగిరి జిల్లాలోని రాయ‌గిరిలో జ‌రిగిన భారీ బ‌హిరంగ స‌భ‌లో పాల్గొన్న సీఎం కేసీఆర్.. కాంగ్రెస్ నేత‌, ఎంపీ రాహుల్ గాంధీకి జ‌రిగిన అవ‌మానం గురించి ప్ర‌స్తావించారు.

రాహుల్ గాంధీ అనే ఎంపీ.. కాంగ్రెస్ పార్టీ నాయ‌కుడు. ఆయ‌న‌తో నాకు సంబంధం లేదు. కానీ.. వాళ్ల నాయ‌న‌మ్మ‌, నాన్న ఈ దేశం కోసం చ‌నిపోయారు.

వాళ్ల తాత స్వ‌తంత్ర పోరాటం చేసి అనేక సంవ‌త్స‌రాలు ప్ర‌ధాన మంత్రిగా ప‌ని చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఎంపీగా ఉన్నాడు.

రాజకీయాల్లో ఉన్న‌ప్పుడు మాట్లాడుతం. చ‌ర్చ జ‌రుగుత‌ది. ఇది ప్ర‌జాస్వామ్యం. ప్ర‌జ‌లు అడుగుత‌రు. ప్ర‌జ‌ల త‌రుపున ప్ర‌జాప్ర‌తినిధులు కూడా అడుగుత‌రు.

రాహుల్ గాంధీ ఏదో అడిగితే.. అస్సాం బీజేపీ ముఖ్య‌మంత్రి ఏం మాట్లాడారండి.. ద‌య‌చేసి మీరు ఆలోచించాలి.. నాకే క‌ళ్ల‌లో నీళ్లు తిరిగాయి. త‌ల దించుకున్నంత ప‌ని అయింది.

ఒక ఎంపీని ప‌ట్టుకొని మీ పార్టీకి చెందిన ముఖ్య‌మంత్రి ఇలాంటి మాట‌లు మాట్లాడొచ్చా. మ‌హాభార‌తం, రామ‌య‌ణం, భగ‌వద్గీత‌ నుంచి మ‌నం నేర్చుకున్న‌ది ఇదేనా. హిందు ధర్మాన్ని అడ్డం పెట్టుకొని మీరు ఓట్లు రాల్చుకుంటున్నారు. బీజేపీ అధ్య‌క్షుడినే నేను అడుగుతున్నా. ఇదేనా మీ సంస్కారం. వెంట‌నే అస్సాం ముఖ్య‌మంత్రిని బ‌ర్త‌ర‌ఫ్ చేయండి.. అని సీఎం కేసీఆర్ డిమాండ్ చేశారు’’ అని ఆ కథనంలో రాశారు.

రాందాస్ అథవాలె

ఫొటో సోర్స్, facebook/ramdasathawale

ఏపీలో మూడు రాజధానుల నిర్మాణం కష్టమైన పని : కేంద్రమంత్రి

ఆంధ్రప్రదేశ్‌కు మూడు రాజధానులు అని కాకుండా వైసీపీ ప్రభుత్వం అమరావతిని అభివృద్ధి చేయడమే మేలని కేంద్ర సామాజిక, సాధికారతశాఖ మంత్రి రామ్‌దాస్‌ అఠవాలే సూచించారని ‘ఆంధ్రజ్యోతి’ కథనంలో తెలిపింది.

‘‘రాజధాని అమరావతిలో అభివృద్ధి ఆగిపోయిందన్నారు. విజయవాడలోని ఓ హోటల్‌లో తమ శాఖకు సంబంధించిన రాష్ట్ర అధికారులతో శనివారం ఆయన సమీక్ష నిర్వహించారు.

అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఏపీలో మూడు రాజధానుల ఏర్పాటు సరికాదని అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఒక్క రాజధాని కూడా అభివృద్ధి కాలేదని గుర్తు చేశారు. మూడు రాజధానులు పెడితే ఎక్కడకు రావాలని ప్రశ్నించారు.

అన్నీ ప్రాంతాలను అభివృద్ధి చేయడం మంచిదే కానీ దేనికైనా నిధులు ముఖ్యమన్నారు. విభజన సమయంలోనే రాజధానికి నిధులివ్వాల్సిందని, అవి లేకనే అభివృద్ధి జరగలేదన్నారు.

అప్పటి యూపీఏ ప్రభుత్వం దానిని విస్మరించిందన్నారు. మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం నిధులిచ్చే అంశాన్ని పరిశీలిస్తోందన్నారు. ఏపీలో ఎస్సీ, ఎస్టీ ఆట్రాసిటీ కేసులకు సంబంధించి పరిహారం, పెన్షన్లు, పోస్టుమెట్రిక్‌, ప్రీమెట్రిక్‌ పెన్షన్ల అమలుపై రాష్ట్ర అధికారులతో సమీక్షించామన్నారు.

సామాజిక, సాధికారిత శాఖ ద్వారా రాష్ట్రానికి కేటాయించిన నిధులు, సబ్‌ప్లాన్‌ కేటాయింపులు తదితర అంశాలు పరిశీలించినట్లు కేంద్ర మంత్రి చెప్పారు’’ అని ఆ కథనంలో రాశారు.

కండ్లకోయలో నిర్మించతలపెట్టిన ఐటీ పార్క్ నమూనా

ఫొటో సోర్స్, Eenadu.net

ఫొటో క్యాప్షన్, కండ్లకోయలో నిర్మించతలపెట్టిన ఐటీ పార్క్ నమూనా

రూ. 100 కోట్లతో ఐటీ పార్క్

తెలంగాణలో భారీ ఐటీ పార్కును మేడ్చల్ జిల్లా కండ్లకోయలో ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించిందని ‘ఈనాడు’ కథనం తెలిపింది.

''తెలంగాణ గేట్ వే పేరిట 10 ఎకరాల్లో రూ. 100 కోట్ల ఇది నిర్మించనున్నారు. దీన్ని దాదాపు 100 సంస్థలకు కేటాయించనున్నారు.

ఈ ఐటీ పార్కు ద్వారా 50 వేల మందికి పైగా ఉద్యోగాలు వస్తాయని చెబుతున్నారు.

సీఎం కేసీఆర్ పుట్టిన రోజైన 17న మంత్రి కేటీఆర్ దీనికి శంకుస్థాపన చేయనున్నారు.

ఈ ఐటీ పార్క్ నిర్మాణ బాధ్యతను టీఎస్ఐఐసీకి అప్పగించింది ప్రభుత్వం. ఇప్పటికే 70కిపైగా సంస్థలు ఇందులో కార్యాలయ స్థలాల కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

శిశువు

ఫొటో సోర్స్, Getty Images

అబార్షన్‌లను నియంత్రిస్తేనే ఆడపుట్టుక

ఏపీలో బర్త్‌ రేషియో చూస్తే అమ్మాయిల సంఖ్య ఇప్పటికీ తక్కువగానే ఉందని ‘సాక్షి’ పత్రిక కథనం తెలిపింది.

‘‘కొన్ని జిల్లాల్లో అబ్బాయిలు అమ్మాయిల మధ్య రేషియో భారీగా వ్యత్యాసం కనిపిస్తోంది. గడిచిన ఏడాది డిసెంబర్‌ వరకు చూస్తే సగటున వెయ్యి మంది అబ్బాయిలు పుడుతుంటే అమ్మాయిల సంఖ్య మాత్రం 937 మాత్రమే ఉంది. గడిచిన మూడు దశాబ్దాల నుంచీ ఇదే పరిస్థితి నెలకొని ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మొత్తం 13 జిల్లాల్లో గతేడాది సగటున ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు 992 మంది అమ్మాయిలున్నది ఒక్క గుంటూరు జిల్లాలో మాత్రమే.

ఈ జిల్లాలో గడచిన రెండేళ్లలో అమ్మాయిల సంఖ్య బాగా పెరుగుతున్నట్టు వెల్లడైంది.

అన్నిజిల్లాల కంటే అనంతపురం జిల్లాలో అమ్మాయిల సంఖ్య మరీ దారుణంగా ఉన్నట్టు వెల్లడైంది.

అనంతపురం జిల్లాలో 1,000 మంది అబ్బాయిలు పుడితే అమ్మాయిలు 902 మంది పుడుతున్నారు. రమారమి ప్రతి వెయ్యిమంది అబ్బాయిలకు వందమంది అమ్మాయిలు తక్కువగా పుడుతున్నట్టు లెక్క.

కర్నూలు జిల్లాలోనూ కేవలం 908 అమ్మాయిలు పుడుతున్నట్టు వెల్లడైంది. ఇప్పటికీ కొన్ని జిల్లాల్లో లింగనిర్ధారణ పరీక్షలు చేయడం, అమ్మాయి అనగానే అబార్షన్‌ చేయించడం జరుగుతున్నట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో పీసీ పీ అండ్‌ డీటీ (లింగనిర్ధారణ నిరోధక చట్టం) పకడ్బందీగా అమలు చేస్తున్నారు. ఎక్కడైనా లింగనిర్ధారణ చేసినట్లు తెలిస్తే తీవ్ర చర్యలుంటాయని ఇప్పటికే స్కానింగ్‌ సెంటర్ల యాజమాన్యాలను హెచ్చరించారు. స్కానింగ్‌ సెంటర్‌ వైద్యులు (రేడియాలజిస్ట్‌/సోనాలజిస్ట్‌) పట్టాలు రద్దు చేయడాకైనా వెనుకాడేది లేదని చెప్పారు.

కొంతమంది గైనకాలజిస్ట్‌లు, రేడియాలజిస్ట్‌లు కుమ్మక్కై లింగనిర్ధారణ చేస్తూ, అబార్షన్లు నిర్వహిస్తున్నట్టు అనుమానాలున్నాయి.

అన్ని జిల్లాలో అధికారులు స్కానింగ్‌ సెంటర్లపై నింఘా ఉంచాలని ఇప్పటికే రాష్ట్ర విజిలెన్స్‌ అండ్‌ టాస్క్‌ ఫోర్స్‌ కమిటీ జిల్లా వైద్యాధికారులను ఆదేశించింది’’ అని ఆ కథనంలో పేర్కొన్నారు.

ISWOTY

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)