యుక్రెయిన్ ఉద్రిక్తతలు: 'రష్యా ఏ క్షణంలోనైనా దాడి చేయవచ్చు' - అమెరికా హెచ్చరిక

ఫొటో సోర్స్, EPA
రష్యా ఏ క్షణంలోనైనా యుక్రెయిన్‌పై దాడికి తెగబడవచ్చని, అమెరికా పౌరులు తక్షణమే యుక్రెయిన్ నుంచి వెళ్లిపోవాలని అమెరికా హెచ్చరికలు జారీ చేసింది.
విమానాల నుంచి బాంబులను జారవిడవడం ద్వారా ఈ దాడి ప్రారంభం కావచ్చని, అదే జరిగితే విమాన ప్రయాణం కష్టం కావడంతో పాటు పౌరులు తీవ్ర ప్రమాదంలో చిక్కుకుంటారని శుక్రవారం వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి.
యుక్రెయిన్ సరిహద్దుల్లో లక్షకు పైగా భద్రతా బలగాలను మోహరించిన రష్యా... యుక్రెయిన్‌పై ముట్టడి ఆరోపణలను పదే పదే ఖండిస్తోంది.
అమెరికా హెచ్చరికల నేపథ్యలో యుక్రెయిన్‌లో నివసిస్తోన్న తమ దేశ పౌరుల భద్రత గురించి ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు తాజా హెచ్చరికలను జారీ చేస్తున్నాయి.
వీలైనంత త్వరగా యుక్రెయిన్‌ను విడిచిపెట్టాలని యూకే, ఆస్ట్రేలియా, కెనడా, నెదర్లాండ్స్ దేశాలు తమ పౌరులకు విజ్ఞప్తి చేస్తున్నాయి.
యుక్రెయిన్ రాజధాని కీవ్ నుంచి తమ దౌత్య సిబ్బందిని అమెరికా, రష్యా దేశాలు తరలిస్తున్నాయని మీడియా నివేదికలు చెబుతున్నాయి.
దేశానికి పశ్చిమాన ఉన్న పోలాండ్ సరిహద్దు సమీపానికి యూఎస్ రాయబార కార్యాలయ సిబ్బంది వెళ్లనున్నట్లు వార్తా సంస్థ 'ద అసోసియేటెడ్ ప్రెస్' పేర్కొంది.
రష్యా ప్రభుత్వ వార్తా సంస్థ ఆర్ఐఏ నోవోస్టీ ప్రకారం, కొంతమంది రష్యా దౌత్యవేత్తలు యుక్రెయిన్‌లోని తమ రాయబార కార్యాలయం నుంచి వెళ్లిపోతున్నారు. కానీ ఈ వార్తలను ఇరు దేశాలు అధికారికంగా ఇంకా ధ్రువీకరించలేదు.
దీని గురించి యుక్రెయిన్‌లో యునైటెడ్ కింగ్‌డమ్ రాయబారి మెలిండా సిమన్స్ ట్వీట్ చేశారు. 'నేను, మా ప్రధాన దౌత్య బృందం కీవ్‌లోనే ఉంటున్నాం'' అని ఆమె ట్వీట్‌లో పేర్కొన్నారు.
దౌత్యపరమైన చర్చల ద్వారా ఈ ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలు శనివారం కూడా కొనసాగనున్నాయి. దీని గురించి రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్ పుతిన్‌తో ఫోన్‌లో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయేల్ మాక్రాన్ చర్చించనున్నారు.
మరోవైపు పాశ్చాత్య దేశాలు, ప్రజల భావోద్వేగాలను రెచ్చగొడుతున్నాయని రష్యా ఆరోపించింది.
''ఒక భారీ సైనిక చర్యను చేపట్టగలిగే స్థితిలో రష్యా దళాలు ఉన్నాయి'' అని అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ అన్నారు.
''మనం, భవిష్యత్‌ను ఊహించలేం. భవిష్యత్‌లో కచ్చితంగా ఏం జరుగనుందో మనకు తెలియదు. కానీ ప్రమాదం పొంచి ఉందని మాత్రం చెప్పగలం. అందుకే తక్షణమే అక్కడ నుంచి బయటపడటం చాలా ఉత్తమం'' అని ఆయన పేర్కొన్నారు.

ఫొటో సోర్స్, Reuters
''యుక్రెయిన్‌పై దాడికి రష్యా అధ్యక్షుడు పుతిన్ తుది నిర్ణయం తీసుకున్నారో లేదో ఇంకా స్పష్టంగా తెలియదు. కానీ సైనిక చర్యను సమర్థించుకునేందుకు ఒక సాకు కోసం క్రెమ్లిన్ చూస్తోంది. భారీ వైమానిక దాడితో ఈ చర్య ప్రారంభం కావొచ్చు'' అని ఆయన వివరించారు.
గత వారం రోజులుగా యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యా భద్రతా బలగాలను మరింతగా పెంచడంతో పాటు, రాబోయే రోజుల్లో నల్లసముద్రంలో సైనిక ప్రయోగాలను నిర్వహించాలని రష్యా యోచిస్తున్నట్లు అమెరికా అధికారులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో జేక్ ఈ వ్యాఖ్యలు చేశారు.
రష్యా సైనిక చర్య ప్రారంభిస్తే, అక్కడ చిక్కుకుపోయిన పౌరులను కాపాడేందుకు తాము రక్షక దళాలను పంపబోమని అమెరికా అధ్యక్షుడు బైడెన్ చెప్పారు.
అమెరికా అధ్యక్షుడు బైడెన్ శుక్రవారం ట్రాన్స్‌అట్లాంటిక్ నేతలతో వీడియో కాల్ ద్వారా సమావేశమయ్యారు. ఆ సమావేశంలో, ఒకవేళ యుక్రెయిన్‌పై రష్యా దాడికి పాల్పడితే ఎదురయ్యే తీవ్రమైన ఆర్థిక పర్యావసానాలను సమష్టిగా ఎదుర్కొనే చర్యకు వారు అంగీకారం తెలిపారు.
నార్త్ కరోలినాలోని ఫోర్ట్ బ్రాగ్ నుంచి పోలాండ్ వరకు అదనంగా 3000 భద్రతా దళాలను మోహరిస్తున్నట్లు అమెరికా తెలిపింది. వచ్చే వారం ఈ సైనికులు అక్కడికి చేరుకుంటారని చెప్పింది. ఈ దళాలు, యుక్రెయిన్ యుద్ధంలో పోరాడవు, కానీ అమెరికా మిత్రదేశాలకు రక్షణగా నిలుస్తాయని అమెరికా పేర్కొంది.
బార్బారా ప్లీట్ ఉషెర్ విశ్లేషణ
బీబీసీ స్టేట్ డిపార్ట్‌మెంట్ కరెస్పాండెంట్
యుక్రెయిన్‌పై రష్యా దాడి చేసే అవకాశం ఉందనే హెచ్చరికలు జారీ చేసిన అమెరికా, ఈ విషయంలో దాని యూరోపియన్ మిత్రదేశాల కంటే ముందు నిలిచింది.
యుక్రెయిన్ సరిహద్దుల్లో రష్యన్ సేనలు నిరంతరం పెరిగిపోతుండటం, వారిని మోహరించిన తీరు, దాడికి ప్రారంభ సూచకంగా ఉపయోగపడే సైనిక విన్యాసాల పట్ల అమెరికన్లు ఆందోళన చెందుతున్నారు.
అమెరికా జాతీయ భద్రతా సలహాదారు జేక్ సులివాన్ ప్రకారం... రష్యా అధ్యక్షుడు త్వరలోనే యుక్రెయిన్‌పై దాడికి ఆదేశించవచ్చనే ఇంటెలిజెన్స్ అంచనాల నేపథ్యలోనే శుక్రవారం అమెరికా అధ్యక్షుడు బైడెన్, మిత్రదేశాలతో సమావేశమయ్యారు.

ఫొటో సోర్స్, EPA
అంతేకాకుండా బైడెన్ టాప్ మిలిటరీ అడ్వైజర్, జనరల్ మార్క్ మిల్లే... రష్యా, కెనడా, యూకే, యూరప్ దేశాలకు చెందిన మిలటరీ అధికారులకు వరుసగా అసాధారణ సంఖ్యలో ఫోన్ కాల్స్ చేశారు.
శుక్రవారం, క్రిమియాలో రష్యా నావిక దళాల కసరత్తులు జరిగాయి. యుక్రెయిన్‌కు ఉత్తరాన ఉన్న బెలారస్‌లో పది రోజులుగా సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. మరోవైపు సముద్రంలోకి తమ ప్రవేశాన్ని రష్యా అడ్డుకుంటోందని యుక్రెయిన్ ఆరోపించింది.
యుక్రెయిన్ రాజధాని కీవ్‌కు సమీపంలోనే రష్యన్ మిలిటరీ దళాల కసరత్తులు జరుగుతున్నాయి. ఒకవేళ ఈ సమయంలో యుక్రెయిన్‌పై రష్యా దాడి చేయాలని ప్రయత్నిస్తే, యుక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి చొచ్చుకెళ్లడం రష్యాకు మరింత సులభంగా మారుతుందని అందరూ భయపడుతున్నారు. కానీ రష్యా మాత్రం, డ్రిల్స్ పూర్తయిన తర్వాత తమ సేనలు తిరిగి శాశ్వత స్థావరాల (రష్యా)కే చేరుకుంటాయని చెబుతోంది.

ఇవి కూడా చదవండి:
- ఏపీ, తెలంగాణ విభజన సమస్యలపై ముగ్గురు సభ్యుల కమిటీ
- ఆయనకు 49, ఆమెకు 18.. పాకిస్తాన్ ఎంపీ మూడో పెళ్లి
- పురిటి బిడ్డకి మొదటి స్నానం ఎప్పుడు చేయించాలి.. ఎలా చేయించాలి.. తీసుకోవలసిన జాగ్రత్తలేంటి
- బస్సు, రైలు, విమానాల్లో పెంపుడు జంతువులతో ప్రయాణించాలంటే నిబంధనలు ఇవీ..
- PM CARES: ఈ ఫండ్ మీద కేంద్ర ప్రభుత్వం ఏం చెబుతోంది, అనుమానాలు ఎందుకు వస్తున్నాయి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













