యుక్రెయిన్‌ను ఆక్రమించుకునేందుకు రష్యా అన్ని ఏర్పాట్లు చేసుకుంటోంది: అమెరికా

యుక్రెయిన్ ఉద్రిక్తతలు

ఫొటో సోర్స్, TASS/GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, యుక్రెయిన్ ఉద్రిక్తతలు

యుక్రెయిన్‌ను రాబోయే వారాల్లో పూర్తి స్థాయిలో ఆక్రమించటానికి అవసరమైన సైనిక సామర్థ్యంలో దాదాపు 70 శాతాన్ని రష్యా సిద్ధం చేసుకుందని అమెరికా అధికారులు చెప్తున్నారు.

వాతావరణం రీత్యా ఫిబ్రవరి మధ్య నుంచి అక్కడ భూమి గడ్డకట్టి గట్టిపడుతుందని, దీంతో రష్యా మరింతగా భారీ యుద్ధసామగ్రిని అక్కడికి తేవటానికి వీలుకలుగుతుందని పేర్లు వెల్లడించని అధికారులు చెప్పారు.

యుక్రెయిన్ సరిహద్దుల వెంట రష్యా లక్ష మందికి పైగా సైనికులను మోహరించింది. అయితే దాడికి రష్యా ప్రణాళిక రచిస్తోందన్న ఆరోపణలను ఆ దేశం తిరస్కరిస్తోంది.

మరోవైపు దాడి చేయటానికి రష్యా 70 శాతం సన్నద్ధంగా ఉందన్న అమెరికా అధికారులు తమ అంచనాలకు ఆధారాలేవీ అందించలేదు.

ఇది నిఘా సమాచారమని వారు చెప్పారని, ఇది సున్నిత వ్యవహారమైనందున మరిన్ని వివరాలు అందించలేకపోయారని అమెరికా మీడియా కథనాలు చెప్పాయి.

సరిహద్దుల్లో రష్యా సైనికుడు

ఫొటో సోర్స్, Getty Images

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ యుక్రెయిన్ మీద దాడి చేయాలని నిర్ణయం తీసుకున్నారా లేదా అన్నది తమకు తెలియదని సదరు అధికారులు పేర్కొన్నారు. ఈ ఉద్రిక్తతలను దౌత్యపరంగా పరిష్కరించటానికి ఇంకా అవకాశముందన్నారు.

అమెరికా అధికారులు ఇద్దరు తమ వివరాలు వెల్లడించరాదన్న షరతు మీద రాయిటర్స్ వార్తా సంస్థతో మాట్లాడుతూ.. రష్యా మరింత యుద్ధ సామగ్రిని ఇంకా ముందుకు కదిలించటానికి సుమారు ఫిబ్రవరి 15వ తేదీ నుంచి మార్చి చివరి వరకూ వాతావరణ పరిస్థితులు అనుకూలిస్తాయని చెప్పారు.

యుక్రెయిన్ మీద రష్యా సైనిక దాడి చేసినట్లయితే దాదాపు 50,000 మంది పౌరుల మరణాలు సంభవిస్తాయని అధికారులు హెచ్చరించినట్లు వార్తలు వచ్చాయి. అలాంటి దాడి జరిగితే యుక్రెయిన్ రాజధాని కీవ్ కొన్ని రోజుల్లోనే రష్యా హస్తగతమవుతుందని.. దానివల్ల లక్షలాది మంది ప్రజలు పారిపోయే పరిస్థితుల్లో యూరప్‌లో శరణార్థి సంక్షోభం తలెత్తుతుందని కూడా వారు అంచనా వేశారు.

మరోవైపు.. ఈ ప్రాంతంలో పశ్చిమ దేశాల సైనిక కూటమి నాటో బలగాలను బలోపేతం చేయటంలో భాగంగా అదనపు అమెరికా సైనిక బలగాలు పోలండ్ చేరుకుంటున్నాయి. తూర్పు యూరప్‌కు అదనంగా దాదాపు 3,000 మంది సైనికులను పంపిస్తామని జో బైడెన్ ప్రభుత్వం కొన్ని రోజుల కిందట ప్రకటించింది.

రష్యా సైనికులు

ఫొటో సోర్స్, EPA

ఇదిలావుంటే.. తన బలగాలు సైనిక విన్యాసాల్లో భాగంగా ఆ ప్రాంతంలో ఉన్నాయని రష్యా చెప్తోంది. కానీ దాడి ప్రారంభించటానికి రష్యా ప్రణాళిక రచిస్తోందని యుక్రెయిన్, దాని మిత్రపక్షాలైన పశ్చిమ దేశాలు ఆందోళన చెందుతున్నాయి.

యుక్రెయిన్‌లో అంతర్భాగంగా దక్షిణాన ఉన్న క్రిమియా ద్వీపకల్పాన్ని రష్యా తనలో కలుపుకొన్న దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత ఇక్కడ మళ్లీ ఉద్రిక్తతలు పెరిగిపోతున్నాయి.

యుక్రెయిన్‌ తూర్పు భాగంలో శాంతి పునరుద్ధరణ కోసం జరిగిన అంతర్జాతీయ ఒప్పందం మిన్సిక్ అగ్రిమెంట్‌ను అమలు చేయటంలో యుక్రెయిన్ ప్రభుత్వం విఫలమైందని రష్యా ఆరోపిస్తోంది. ఆ ప్రాంతంలో అత్యధిక భూభాగాన్ని రష్యా మద్దతున్న తిరుగుబాటుదారులు నియంత్రణిస్తున్నారు. అక్కడ 2014 నుంచి కనీసం 14,000 మంది చనిపోయారు.

అలాగే.. నాటోలో యుక్రెయిన్‌ను చేర్చుకోరాదని కూడా రష్యా పట్టుపడుతోంది.

ఇప్పటికీ ప్రపంచంలో అత్యధిక అణ్వస్త్రాలున్న దేశమైన రష్యాకు, అమెరికాకు మధ్య శత్రుత్వం ప్రచ్ఛన్న యుద్ధం నుంచీ ఉంది. అప్పుడు యుక్రెయిన్.. కమ్యూనిస్టు దేశమైన సోవియట్ రష్యాలో కీలక భాగంగా ఉండింది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)