ఇరాన్ భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇజ్రాయెల్ గూఢచార సంస్థ గుప్పిట్లో చిక్కుకున్నాయా

అణు శాస్త్రవేత్త మొహసిన్ ఫఖ్రిజాదే హత్యకు గురైన స్థలం

ఫొటో సోర్స్, EPA

ఫొటో క్యాప్షన్, అణు శాస్త్రవేత్త మొహసిన్ ఫఖ్రిజాదే హత్యలో ఇజ్రాయెల్ గూఢచర్య సంస్థ ప్రమేయం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి
    • రచయిత, జియార్ గోల్
    • హోదా, బీబీసీ పర్షియన్

ఇరాన్‌కు చెందిన ప్రముఖ అణు శాస్త్రవేత్త మొహసిన్ ఫఖ్రిజాదే ప్రయాణిస్తున్న కాన్వాయ్‌పై 2020 నవంబర్‌లో కాల్పులు జరిగాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో రిమోట్ కంట్రోల్ మెషీన్‌ గన్ ఉపయోగించి ఆయనను హత్యచేశారు.

కదులుతున్న లక్ష్యంపై దాడిచేసి.. పౌరులెవరూ చనిపోకుండా ఇంత కచ్చితత్వంతో హత్య చేయాలంటే క్షేత్రస్థాయిలో ప్రత్యక్ష నిఘా సమాచారం అవసరమవుతుంది.

ఫఖ్రిజాదే హత్యకు కుట్ర జరుగుతోందని, ఆయన్ను అదే చోట కాల్చి చంపే ప్లాను వేశారని.. తాను రెండు నెలల ముందుగానే భద్రతా బలగాలను హెచ్చరించానని.. అతడి హత్యానంతరం ఇరాన్ ఇంటెలిజెన్స్ మినిస్టర్ మహ్మద్ అలావి చెప్పారు.

ఈ హత్యకు కుట్ర పన్నిన వ్యక్తి ‘‘భద్రతా బలగాల సభ్యుడు. భద్రతా బలగాలపై మేం నిఘా కార్యకలాపాలు నిర్వహించలేకపోయాం’’ అని అలావీ పేర్కొన్నారు.

మొహసిన్ ఫఖ్రిజాదే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొహసిన్ ఫఖ్రిజాదే

అయితే.. హంతకుడు ఇరాన్‌ అత్యాధునిక సైనిక విభాగమైన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కోర్ (ఐఆర్‌జీసీ) సభ్యుడని ఆయన పరోక్షంగా సూచించారు. అదే నిజమైతే ఆ మంత్రి హెచ్చరికను పక్కనపెట్టి, చెప్పిన తేదీ, సమయం, ప్రాంతంలో ప్రణాళికను అమలు చేయగలిగేంత ఉన్నత పదవిలో ఆ ఏజెంట్ ఉండిఉండాలి.

మొహసిన్ ఫఖ్రిజాదే కూడా రివల్యూషనరీ గార్డ్ సభ్యుడని ప్రపంచానికి తెలుసు.

విదేశాల తరఫున గూఢచర్యం నిర్వహిస్తున్నారనే ఆరోపణలతో బంధించిన వారిని టెహ్రాన్‌లోని ఎవిన్ ప్రిజన్ సెక్యూరిటీ వార్డులో ఉంచుతారు. అక్కడ ఉన్నతస్థాయి ఐఆర్‌జీసీ కమాండర్లు చాలా మందిని బంధించి ఉంచారని ఆ వార్డు వర్గాలు బీబీసీకి చెప్పాయి.

రివరల్యూషనరీ గార్డ్స్ ప్రతిష్టకు మచ్చ రాకుండా చూడటానికి.. వారి పేర్లను, వారి పదవులను ఇరాన్ ప్రభుత్వం బయటికి వెల్లడించదు.

ఇరాన్ రాయబారులు, ఐఆర్‌జీసీ కమాండర్లు చాలా మందికి వ్యతిరేకంగా విదేశీ సంస్థలు ఆధారాలు సేకరించాయని ఐఆర్‌జీసీ కుద్స్ ఫోర్స్ (విదేశీ కార్యకలాపాల విభాగం) మాజీ ఇంటెలిజెన్స్ అధికారి ఒకరు బీబీసీకి చెప్పారు.

మహిళలతో సంబంధాల వంటి సమాచారం అందులో ఉంటుందన్నారు. విదేశీ గూఢచారులకు సహకరించాలంటూ సదరు అధికారులను బ్లాక్ మెయిల్ చేయటానికి అటువంటి సమాచారాన్ని ఉపయోగించుకుంటారని ఆయన తెలిపారు.

2018 జనవరి చివర్లో ఒక రోజు అర్థరాత్రి.. దేశ రాజధాని టెహ్రాన్‌కు 30 కిలోమీటర్ల దూరంలోని పారిశ్రామిక జిల్లాలో గల ఒక స్టోరేజి స్థావరంలోకి డజను మంది చొరబడ్డారు.

మొహసిన్ ఫఖ్రిజాదే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, వీధుల్లో మొహసిన్ ఫఖ్రిజాదే ఫ్లెక్సీలు

అందులో 32 బీరువాలు ఉన్నాయి. కానీ వాటిలో ఏ సేఫ్‌లో అత్యంత విలువైన పదార్థాలు ఉన్నాయో వారికి తెలుసు. ఏడు గంటల లోపు వారు 27 సేఫ్ తాళాలను కరిగించివేసి.. వాటి లోపలున్న అర టన్ను రహస్య అణుపత్రాలను తస్కరించి, చిన్న ఆచూకీ కూడా వదలకుండా తప్పించుకుపోయారు.

ఇరాన్ చరిత్రలో అత్యంత నిర్భయంగా జరిగిన దోపిడీ అది. కానీ అధికారులు మౌనంగా ఉన్నారు.

అక్కడ దొంగిలించిన పత్రాలు.. మూడు నెలల తర్వాత 2,000 కిలోమీటర్ల దూరంలో ఇజ్రాయెల్ రాజధాని టెల్ అవీవ్‌లో ప్రత్యక్షమయ్యాయి.

మొసాద్ ఆపరేషన్ ఫలితంగా తమ చేతికి చిక్కాయంటూ ఆ పత్రాలను ప్రదర్శించారు అప్పటి ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు. ఆ పత్రాలు బూటకమని, అలాంటి సంఘటనేదీ జరగలేదని ఇరాన్ అధికారులు ఆ సమయంలో కొట్టివేశారు.

అయితే.. ఇరాన్ అణు పత్రాలను ఇజ్రాయెల్ దొంగిలించిందని, వాటిని అమెరికా అధ్యక్షుడు డోనల్డ్ ట్రంప్‌కు చూపించిందని ఇరాన్ అధ్యక్షుడు హసన్ రోహాని 2021 ఆగస్టులో తన పదవి చివరి రోజున నిర్ధరించారు.

2018 ఏప్రిల్‌లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పాత్రికేయ సమావేశంలో నెతన్యాహు ఆ పత్రాలను విడుదల చేస్తూ ఇరాన్ అప్రకటిత అణ్వస్త్ర కార్యక్రమంలో మొహసిన్ ఫఖ్రిజాదే పాత్రను ప్రధానంగా ప్రస్తావించారు.

‘‘డాక్టర్ మొహసిన్ ఫఖ్రిజాదే... ఆ పేరును గుర్తుపెట్టుకోండి’’ అని ఆయన ఉద్ఘాటించారు. రెండేళ్ల తర్వాత ఫఖ్రిజాదే హత్యకు గురయ్యారు.

మొహసిన్ ఫఖ్రిజాదే

ఫొటో సోర్స్, Getty Images

ఫొటో క్యాప్షన్, మొహసిన్ ఫఖ్రిజాదే హత్య తరువాత ఇరాన్‌లో నిరసనలు

గడచిన రెండు దశాబ్దాల్లో ఇరాన్‌కు చెందిన అతి ముఖ్యమైన అణు శాస్త్రవేత్తలు అనేకమంది హత్యకు గురయ్యారు. ఇరాన్ అణు, సైనిక స్థావరాలపై అనేకసార్లు విద్రోహ దాడులు జరిగాయి. కానీ ఇప్పటివరకూ ఇరాన్ భద్రతా బలగాలు ఈ హంతకులను, కుట్రదారులను, దాడిచేసిన వారిని నివారించటంలో లేదా పట్టుకోవటంలో విఫలమయ్యాయి.

మొహమ్మద్ అహ్మదినెజాద్ అధ్యక్ష పదవీ కాలం చివరి సంవత్సరమైన 2013లో.. మొసాద్ కోసం గూఢచర్యం చేస్తున్నారన్న ఆరోపణలతో ఐఆర్‌జీసీ కమాండర్లు, ఇంటెలిజెన్స్ ఆఫీసర్లతో పాటు, మతాధికారులను సైతం అరెస్ట్ చేశారని వదంతులు వచ్చాయి. కానీ ఆ ఆరోపణలను ఎన్నడూ అధికారికంగా ధ్రువీకరించలేదు.

ఈ ఆరోపణలు వచ్చిన వారిలో ఇరాన్‌ నిఘా మంత్రిత్వశాఖలో.. ఇజ్రాయెల్‌ మీద కౌంటర్ ఇంటలెజిన్స్ విభాగానికి ఇన్‌చార్జ్‌గా ఉన్న ఒక అధికారి మీద కూడా ఉన్నారు. ఇరాన్ రివల్యూషనరీ కోర్టు ఎలాంటి ప్రచారం లేకుండా.. అతడిని రహస్యంగా విచారించి, దోషిగా నిర్ధారించి, మరణశిక్ష విధించి, అమలు చేసింది.

తన నిఘా మంత్రిత్వశాఖలోకి మొసాద్ రహస్యంగా చొరబడిందని అహ్మదినెజాద్ గత ఏడాదిలో ధ్రువీకరించారు. ‘‘ఇరాన్‌లో ఇజ్రాయెలీ గూఢచారులను నియంత్రించాల్సిన, ఇరాన్‌లో ఇజ్రాయెలీ కుట్రలను ఎదుర్కోవలసిన బాధ్యత గల అత్యంత సీనియర్ ఆఫీసర్.. స్వయంగా తానే ఇజ్రాయెలీ ఏజెంట్‌గా తేలటం మామూలు విషయమా?’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మొహసిన్ ఫఖ్రిజాదే హత్య తరువాత భద్రత బలగాలు

ఫొటో సోర్స్, Getty Images

మొసాద్ కార్యకలాపాల గురించి ఇజ్రాయెల్ చాలా అరుదుగా స్పందిస్తుంది. అందుకు ఒక మంచి కారణముందని.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐఢీఎఫ్) మాజీ జనరల్, రక్షణ మంత్రిత్వశాఖ మాజీ అధికారి అమోస్ గిలాడ్ బీబీసీతో పేర్కొన్నారు.

‘‘ఎలాంటి ప్రచారానికైనా నేను వ్యతిరేకం. షూట్ చేయాలనుకుంటే షూట్ చేయ్.. మాటలొద్దు... మొస్సాద్ ప్రతిష్ట.. అద్భుతమైన ఆపరేషన్లను రహస్యంగా, ప్రచారం లేకుండా నిర్వహించటం’’ అని ఆయన వ్యాఖ్యానించారు.

మొసాద్ ఇప్పుడు ఇరాన్ భద్రతా సంస్థలు, ఇంటెలిజెన్స్ సంస్థల్లో ఉన్నత స్థానాలకు చేరుకుందని ఇరాన్ మాజీ అధికారులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

ఇరాన్ నిఘా మంత్రిత్వశాఖ మాజీ మంత్రి, అధ్యక్షుడు రోహనికి ఉన్నతస్థాయి సలహాదారుడు అయిన అలీ యునేసీ ఒక ఇంటర్వ్యూలో ఈ హెచ్చరిక జారీ చేశారు: ‘‘దేశంలోని చాలా ప్రాంతాల్లో మొసాద్ ప్రభావం ఎంత విస్తారంగా ఉందంటే.. ఇరాన్ నాయకత్వంలోని ప్రతి ఒక్క సభ్యుడి ప్రాణాలకూ, భద్రతకూ ముప్పుంది.’’

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)