గల్ఫ్ స్కై: యూఏఈలో అదృశ్యమైన ఈ నౌక ఇరాన్‌కు ఎలా చేరింది, నావికులు ఏం చెబుతున్నారు?

ఫొటో సోర్స్, JOGINGER SINGH
- రచయిత, జోషువా చీథం
- హోదా, బీబీసీ న్యూస్
2020 జులైలో ఆయిల్ ట్యాంకర్ 'గల్ఫ్ స్కై', దానిలోని సిబ్బందితో సహా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ సముద్ర జలాల్లో కనిపించకుండా పోయింది.
కొన్ని రోజుల తర్వాత అదే నౌక ఇరాన్‌లో ప్రత్యక్షమైంది.
ఆంక్షలను ఉల్లంఘిస్తూ ఇరాన్ ఈ నౌకలో చమురు తరలిస్తోందనే అనుమానం వ్యక్తమవుతోంది. నౌక ఆచూకీపై అందులో పని చేసిన ఎనిమిది మంది మాజీ సిబ్బంది బీబీసీ దగ్గర తొలిసారి పెదవి విప్పారు.
ఓడ కెప్టెన్ మినహా, మిగతా వారెవరూ ప్రాణ భయంతో తమ పేర్లు చెప్పడానికి ఇష్టపడలేదు. వాళ్లు చెప్పిన వివరాల ప్రకారం..
యూఏఈ తీరంలో సూర్యాస్తమయం అవుతోంది.
తీరంలో ది గల్ఫ్ స్కై నౌక లంగరు వేసుంది. దానికి కెప్టెన్ జోగీందర్ సింగ్. దాని పాత, కొత్త యజమానుల మధ్య తలెత్తిన న్యాయపరమైన వివాదం ఆ ఓడను తీరానికి పరిమితం చేసింది.
నౌకకు కెప్టెన్‌గా ఉండాలని తనకు పిలుపు వచ్చినప్పుడు, గల్ఫ్ స్కై త్వరలోనే సముద్రయానం చేస్తుందని హామీ ఇచ్చినట్లు కెప్టెన్ జోగీందర్ సింగ్ వెల్లడించారు.
కానీ ఆ ఎదురుచూపులు వారాల నుంచి నెలలకు మారాయి.
అదే సమయంలో కరోనా మహమ్మారి విజృంభించింది. ఫలితంగా ఓడలో ఉన్న నావికులు (అందరూ భారతీయులే) నేలకు దూరంగా, నౌకలోనే ఉండాల్సి వచ్చింది.
ఆ సమయంలో తగినంత ఆహారం, నీళ్లు లేక ఇబ్బందులు పడ్డామని, ఇంటర్నెట్ కూడా సరిగ్గా అందుబాటులో ఉండేది కాదని వారు చెప్పారు. ఏప్రిల్ నెల నుంచి జీతాలు ఇవ్వడం కూడా ఆపేశారని వాపోయారు.
జులై 5న సాయంత్రం అంతా కొత్తగా మొదలవుతుందని కెప్టెన్ భావించారు. నౌక యజమానులు కొత్త పని కోసం ట్యాంకర్ పరిస్థితిని అంచనా వేయడానికి సర్వేయర్ల బృందాన్ని నియమించినట్లు వారికి తెలిసింది.
ఓ చిన్న పడవ చీకటిని చీల్చుకుంటూ ఓడ వైపుగా వచ్చింది. అప్పటికే అలసిపోయిన అధికారి, గ్యాంగ్‌వేను దించమని ఆదేశించి, ఆ ఓడలోని వారిని కలవడానికి వెళ్లారు.
మొదట్లో అంతా మామూలుగానే అనిపించిందని కెప్టెన్ చెప్పారు. పూర్తిగా నీలి రంగు దుస్తులు ధరించి, చేతిలో క్లిప్ బోర్డులతో ఉన్న ఏడుగురు ఓడను తనిఖీ చేయడానికి నావికులతో కలిసి వెళ్లారు.
ఓ గంట తర్వాత వారి సర్వే పూర్తయింది. ఆ గ్రూప్‌కు నాయకుడుగా వచ్చిన 60 ఏళ్ల వ్యక్తి చాలా కలుపుగోలుగా ఉన్నారు. ఆయన ఓడలోని 28 మంది నావికులను భోజనశాలలో సమావేశం కావాలని కోరినట్లు తెలిపారు.
ఓడను ఆయిల్ స్టోరేజ్ కంటైనర్‌గా మార్చబోతున్నట్లు చీఫ్ సర్వేయర్ వెల్లడించారు. కెప్టెన్, సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం మరికొన్ని నెలల పాటు ఓడలోనే ఉండాలని వారు కోరారు. అందుకు అదనపు జీతం చెల్లిస్తామన్నారు. దీనికి కేవలం ఇద్దరు నావికులు మాత్రమే సుముఖత వ్యక్తం చేశారు.
అర్ధరాత్రి కావొస్తుండటంతో కెప్టెన్ అందరినీ పడుకోమని చెప్పారు. ఆయన తన గది తలుపు తీస్తుండగానే నల్ల దుస్తులు వేసుకున్న ముగ్గురు తుపాకులతో లోపలికి దూసుకొచ్చారు. అందరూ నేలపై పడుకోవాలని వాళ్లు గట్టిగా అరిచారని కెప్టెన్ చెప్పారు.
"మేం మిమ్మల్ని బాధపెట్టాలని అనుకోవడం లేదు. కానీ అలా చేయాల్సివస్తే మేం ఆలోచించం. అమెరికా ఈ నౌకను దొంగిలించింది. మేం దాన్ని తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాం" అని చీఫ్ సర్వేయర్ గట్టిగా చెప్పాడని కెప్టెన్, మిగతా నావికులు తెలిపారు.

ఫొటో సోర్స్, HUMAN RIGHTS AT SEA
'మా దయతోనే మీరింకా ఉన్నారు'
"మొదట వాళ్లు సముద్రపు దొంగలని మేం అనుకున్నాం. వాళ్లకు అందులో నైపుణ్యం ఉందనేది అర్థమైంది. వారు ఏం చేస్తున్నారో వాళ్లకు స్పష్టంగా తెలుసు' అని ఓ నావికుడు చెప్పారు.
"కింద పడుకున్న సిబ్బంది చేతులను వెనక్కు కట్టేశారు. జేబుల్లో ఉన్న వస్తువులు తీసుకున్నారు. తమను ఏం చేయొద్దంటూ గట్టిగా ఏడుస్తూ వేడుకున్న వారిని అరవొద్దంటూ వాళ్లు కాళ్లతో తన్నారు" అని వారు వివరించారు.
ఒక గంట తర్వాత ఓడలో కదలిక మొదలైంది. నౌక ఇంజన్ స్టార్ట్ చేసి, లంగరు తొలగించారని నావికులు గుర్తు చేసుకున్నారు. లంగరు తొలగించిన తర్వాత 12 గంటల పాటు గల్ఫ్ స్కై ప్రయాణిస్తూనే ఉందని చెప్పారు. గమ్యం చేరుకున్న తర్వాత వారంతా కరచాలనం చేసుకున్నారని తెలిపారు. ఆ తర్వాత కార్డు బోర్డులు అడ్డంగా పెట్టివున్న అధికారుల భోజనశాలలోకి తామంతా వెళ్లామని చెప్పారు.
గార్డులు కొన్ని రోజుల పాటు తమపై నిఘా పెట్టారని, వారు ఒకరితో ఒకరు అరబిక్‌లో మాట్లాడుకున్నారని నావికులు వెల్లడించారు. బాత్ రూంని వాడుకోడానికి లేదా వంట చేసుకోడానికి కిచెన్‌కు పంపినప్పుడు ఓడలో కొత్త ముఖాలు కనిపించాయని వివరించారు.
కిచెన్‌లో తాను ఓ వ్యక్తితో మాట్లాడానని ఒక నావికుడు తెలిపారు. తాను అజర్‌బైజాన్‌కు చెందిన వాడినని ఆయన చెప్పారు. వారంతా పార్శీ భాషలో మాట్లాడుకోవడం కూడా కొందరు నావికులు విన్నారు. నౌకను నడిపేందుకు వారు కొత్త సిబ్బందిని తెచ్చుకున్నట్లు భారత నావికులకు అనిపించింది.
నావికులు బందీలుగా ఉన్న సమయంలో 60 ఏళ్ల మరో వ్యక్తి భోజనశాలలోకి వచ్చాడు. బాగా లావుగా ఉన్న ఆయనే నౌకలో అన్నీ చూసుకుంటున్నట్లు భారత నావికులకు అనిపించింది. ఆయన సిబ్బందితో మాట్లాడలేదు. చేతిలో ఎప్పుడూ తుపాకీ పట్టుకుని ఉన్నా, ఎలాంటి దూకుడును ప్రదర్శించలేదని నావికులు వెల్లడించారు.
తమను బంధించిన మరో వ్యక్తిని కొందరు నావికులు గుర్తు చేసుకున్నారు. ఆయనకు కూడా 60 ఏళ్లుంటాయి. బట్టతల, కండలు తిరిగి ఉన్నాడు. ఇతర గార్డులకు నాయకత్వం వహించాడు. ఆయన తన పేరు చెప్పలేదు కానీ ఓడ యజమానుల కోసం పని చేస్తున్నట్లు చెప్పాడని నావికులు తెలిపారు.
'మీకు వ్యతిరేకంగా ఏదైనా చేయాలనే ఉద్దేశం మాకు లేదు' అని ఆయన అన్నట్లు ఒక నావికుడు గుర్తు చేసుకున్నారు.
"మాకు ఈ ఓడ కావాలి. మేం అందుకు డబ్బు చెల్లించాం. కానీ మధ్యలో చెల్లింపు నిలిచిపోయింది. అది మా తప్పు కాదు. సమస్య ఏంటంటే, ఏ దేశం కూడా మిమ్మల్ని తీసుకెళ్లడానికి ఇష్టపడటం లేదు. మీ సొంత దేశం కూడా. మీరు పూర్తిగా మా దయతో ఉన్నారు" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, JOGINDER SINGH
రోజులు గడిచేకొద్దీ నావికుల్లో భయం పెరిగిపోతోంది
"కొన్నిసార్లు వాళ్లు మమ్మల్ని చంపబోతున్నారని భావించాం. మా కుటుంబాలను మళ్లీ చూడలేమని అనుకున్నాం' అని ఓ నావికుడు తెలిపారు.
శబ్దం చేయొద్దని చెప్పినా, టైం పాస్ కోసం నావికులు అప్పుడప్పుడూ గార్డులతో మాట్లాడేవారు. వారిలో ఒక నావికుడికి, గార్డుతో జరిగిన సంభాషణ బాగా గుర్తుంది.
"మీరు మిగిలిన సిబ్బందితో ఎలా ఉన్నారో నేను చూశాను. మీరు చాలా మంచివాళ్లనుకుంటున్నా. కానీ మీరు ఏదైనా చెడుగా చేస్తే, వాళ్లు చెప్పినట్లు నేను చేయాల్సి ఉంటుంది' అని ఆ గార్డు తనతో అన్నాడని నావికుడు గుర్తు చేసుకున్నాడు.
"నాకు నువ్వు నచ్చావు కాబట్టి, నువ్వు ఎలా చనిపోవాలో ఎంచుకునే అవకాశం నీకే ఇవ్వగలను. నేను నీ గొంతు కోయొచ్చు లేదా తలలో బుల్లెట్ దించవచ్చు" అని ఆప్షన్ ఇచ్చాడని ఆయన తెలిపారు.
అదృష్టవశాత్తూ సిబ్బంది ఆ నిర్ణయం తీసుకోలేదు.

ఫొటో సోర్స్, JOGINDER SINGH
'అది చాలా భయంకరమైన పరిస్థితి'
జులై 14న వేకువజామున, గార్డులు నావికులను డెక్‌పైకి తీసుకెళ్లారు. కొందరు సిబ్బంది వెంటనే తీరం మీద లైట్లు గుర్తించారు. అది దక్షిణ ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు సిటీ అని గార్డులు చెబితే వాళ్లకు తెలిసింది.
నావికులందరినీ ఓ చెక్క పడవలోకి ఎక్కించారు. ఆ తర్వాత వాళ్ల కళ్లకు గంతలు కట్టారు. అంతకంటే ముందు ఓడపై ఉన్న గల్ఫ్ స్కై పేరు కనిపించకుండా నలుపు రంగు పెయింట్ వేసినట్టు కొందరు నావికులు గమనించారు.
వారిని ఒడ్డుకు తీసుకెళ్లి, విమానాశ్రయానికి తరలించారు. కళ్లకు కట్టిన గంతలు విప్పినపుడు నావికులందరూ మిలటరీ విమానంలో ఉన్నారు. అప్పటికే అది గాల్లో ఎగురుతోంది. అది వారిని టెహ్రాన్‌కు తీసుకెళ్లింది. ఆ తర్వాత వారిని ఓ బస్సులో ఎక్కించారు. ఆ బస్సు వెళ్లే రోడ్డుకు పక్కనే ఇమామ్ ఖోమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం ఉంది.
సిబ్బంది చెప్పిన వివరాల ప్రకారం, బస్సులో ఎక్కిన ముగ్గురు భారత రాయబార కార్యాలయం నుంచి వచ్చామని చెప్పారు. మీరంతా ఎందుకు ఇరాన్‌లో ఉన్నారో చెప్పాలని వారు తమను అడిగారని నావికులు చెప్పారు.
హైజాకింగ్ గురించి కెప్టెన్ సింగ్ వారికి చెప్పారు. అది విని వాళ్లు ఆశ్చర్యపోయారని, అందరూ స్వదేశానికి వెళ్లేందుకు టిక్కెట్లు ఏర్పాటు చేశారని కెప్టెన్, సిబ్బంది గుర్తు చేసుకున్నారు. ఇద్దరు నావికుల పాస్‌పోర్టుల రెన్యువల్ ఉండడంతో, వారికి మినహా మిగతా అందరికీ వారి పాస్‌పోర్టులు, బోర్డింగ్ పాసులను అందించారు.
ఆ ఇద్దరు నావికులు భారతీయ దౌత్యవేత్తలతో వెళ్తే, మిగతా నావికులు కట్టుదిట్టమైన భద్రత మధ్య సాధారణ విమానం ఎక్కేందుకు వెళ్లారు. నావికులు తాము పడిన కష్టాలన్నీ మర్చిపోయి, మిగతా ప్రయాణీకులతో కలిసి కూర్చున్నారు.
నావికులు జులై 15న న్యూదిల్లీలో అడుగుపెట్టారు. మిగిలిన ఇద్దరూ జులై 22న సురక్షితంగా స్వదేశానికి వచ్చారు.
వాళ్లందరినీ ఇళ్లకు పంపే ముందు భారత అధికారులు వారిని భద్రత కోసం ఓ హోటల్లో ఉంచారు. లోపలే ఉండాలని వారికి సూచించారు.
'మీరిప్పుడే బయటకు వెళ్లలేరు. బయట పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉంది. ఓడలోని వ్యక్తులు మీ జాడ కనుక్కోవచ్చు' అని చెప్పారని ఒక నావికుడు బీబీసీకి వివరించారు.

ఫొటో సోర్స్, HUMAN RIGHTS AT SEA
'ఇది ఇరానియన్ షిప్ అని అందరికీ తెలుసు'
ఈ నాటకీయ ఘటనలు జరిగి ఏడాదికి పైనే అయ్యింది. నౌకను ఎలా, ఎందుకు స్వాధీనం చేసుకున్నారనేది తెలుసుకోడానికి గల్ఫ్ స్కై సిబ్బంది ఇప్పటికీ సమాధానాలు వెతుకుతున్నారు.
యుఏఈలో పనిచేసినందుకు తమకు చెల్లించాల్సిన 1.46 కోట్ల రూపాయల కోసం ఈ నావికులు ఇప్పటికీ పోరాడుతున్నారు.
"నావికులు నిరాదరణకు గురయ్యారు" అని భారత నావికుల కేసును మొదటగా బయటపెట్టిన యూకే చారిటీకి చెందిన డేవిడ్ హమ్మండ్ పేర్కొన్నారు.
"అంతర్జాతీయ చట్టం ప్రకారం వారికి ప్రాథమిక హక్కులు, కార్మిక హక్కులు, రక్షణ ఉండాలి. కానీ అంతర్జాతీయ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేయడం నిరంతరం సవాలే" అని ఆయన చెప్పారు.
హైజాక్ జరిగినపుడు ఓడ మీద కామన్వెల్త్ ఆఫ్ డొమినికా జెండా ఉంది. సిబ్బంది వేతనాన్ని తిరిగి ఇప్పించడానికి కృషి చేస్తున్నట్లు ఆ దేశం వెల్లడించింది. సిబ్బందిని నియమించుకున్న కంపెనీ పేరు సెవెన్ సీస్ నావిగేషన్.
గల్ఫ్ స్కై నౌక భవిష్యత్తుపై ప్రశ్నలు ఇంకా మిగిలే ఉన్నాయి. ఓడ ఇప్పుడు ఎక్కడ ఉంది? దాన్ని దేని కోసం వినియోగిస్తున్నారన్న విషయాలపై స్పష్టత లేదు. అయితే, దాన్ని ఎందుకు హైజాక్ చేశారనే దానిపై కొంత సమాచారం మనకు అందుబాటులో ఉంది.
హైజాక్ జరిగినట్లు ఆరోపణలు వచ్చాక ఓడ ట్రాన్స్‌పాండర్లు కొన్ని వారాల పాటు స్విచ్ ఆఫ్ చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. 2020 ఆగస్టు చివర్లో, వాటిని తిరిగి ఆన్ చేశారు. ఆ సమయంలో నౌక ఇరాన్ దక్షిణ తీరంలో ప్రయాణిస్తోంది.
నౌక పేరు రీమాగా మార్చారు. డొమినికా జెండాను తొలగించి దానిపై ఇరాన్ జెండాను ఎగరేశారు. అంటే ఓడ ఇప్పుడు ఇరాన్ అధికార పరిధిలో ఉంది. ఆ నౌక పలువురి చేతులు కూడా మారింది. ప్రస్తుతం టెహ్రాన్ కేంద్రంగా నడుస్తున్న మైనింగ్ కంపెనీ మోష్‌టగ్ తేజరత్ సనత్(ఎంటీఎస్) యాజమాన్యం కింద అది పని చేస్తోంది.
2020 ఆగస్టు చివరి రోజులలో, ఈ నౌక పర్షియన్ గల్ఫ్ చుట్టూ పశ్చిమంగా ప్రయాణించింది. దాని ట్రాన్స్‌పాండర్ చివరిగా ఆగస్టు 30న బందర్ బుషెర్‌కు దక్షిణాన 60 కిలోమీటర్ల దూరంలో ఆగిపోయింది. ఇరాన్ ప్రధాన ఓడరేవు నగరాల్లో బందర్ బుషెర్ ఒకటి.
లాయిడ్స్ లిస్ట్ ఇంటెలిజెన్స్‌కు చెందిన మిచెల్ బాక్‌మన్ చెప్పిన వివరాల ప్రకారం ఈ నౌక ఇప్పటికీ ఈ ప్రాంతంలో పనిచేస్తోంది. ఆంక్షలను ఉల్లంఘిస్తూ, ప్రపంచదేశాలకు చమురు సరఫరా చేస్తున్న ఇరాన్ 'ఘోస్ట్ ఫ్లీట్'లో ఇది కూడా అంతర్భాగమైంది.
"దాని లొకేటర్ ఆన్ చేయకపోవడం వల్ల బహుశా దాన్ని 'మదర్ షిప్' అని పిలవొచ్చు. ముడి చమురుని నిల్వ చేసి, దాన్ని ఈ నౌకను ఉపయోగించి ఇతర ట్యాంకర్లకు బదిలీ చేయొచ్చు. ఇది ఇరానియన్ జలాల నుంచి బయటకు వస్తేనే దాన్ని గుర్తించగలం. అది అందరికీ ఇరానియన్ షిప్‌గానే తెలుసు" అని బాక్‌మన్ బీబీసీకి చెప్పారు.
హైజాక్ జరగకముందే, ఈ నౌకకు ఇరాన్‌తో సంబంధాలు ఉన్నాయని అమెరికా అధికారులు నమ్ముతున్నారు. ఆ సమయంలో నౌక యజమాని టైఫ్ మైనింగ్ సర్వీసెస్(టీఎంఎస్) కంపెనీ, ఈ ఓడను 2019లో ఓ గ్రీకు కంపెనీ నుంచి కొనుగోలు చేసింది. నౌకను డెలివరీ ఇచ్చిన తర్వాత అన్ని రకాల నిధులను అమెరికా స్వాధీనం చేసుకుంది.
ఆంక్షలను ఉల్లంఘిస్తూ, ఇరాన్ అధికారుల తరఫున ఇద్దరు ఇరాన్ జాతీయుల పేరుపై టీఎంఎస్ ఈ నౌకను కొనుగోలు చేయడానికి సిద్ధపడిందనే అభియోగాలతో అమెరికా ఈ చర్యకు దిగింది. ఆ ఇద్దరిలో ఒకరైన అమీర్ డయానాట్ ఎంటీఎస్‌కు మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. హైజాకింగ్ ఆరోపణల సమయంలో ఓడ కొత్త యజమాని ఈయనే.
ఈ ఆరోపణలపై టీఎంఎస్, ఎంటీఎస్‌లను సంప్రదించగా అవి స్పందించలేదు.

ఫొటో సోర్స్, HUMAN RIGHTS AT SEA
'నేను ఎక్కడా సురక్షితంగా లేను'
తమ నియంత్రణలో లేని భౌగోళిక, రాజకీయ శక్తుల ప్రమేయంతో తాము ఎలా బాధ పడుతున్నామో గల్ఫ్ స్కై మాజీ సిబ్బంది బీబీసీకి వివరించారు. వారిలో చాలా మందిని రకరకాల ప్రశ్నలు వేధిస్తూనే ఉన్నాయి.
యుఏఈ అదుపులోకి తీసుకున్నప్పటికీ, గల్ఫ్ స్కై అంత సులభంగా ఎలా బయలుదేరగలిగింది? ఇరాన్ నౌకకు తన నౌకాశ్రయంలో ఎందుకు రక్షణ కల్పించింది? ఓడ నాటి యజమాన్యం టీఎంఎస్, సర్వేయర్లను నౌకలోకి పంపింది. అంటే హైజాక్ వెనుక వారి హస్తం కూడా ఉందా?
ఓడ గల్లంతయినట్లు నివేదించడానికి యూఏఈకి ఇంత సమయం ఎందుకు పట్టిందని సెవెన్ సీస్ నావిగేషన్ ప్రశ్నించింది. హైజాక్ జరిగిన రోజు రాత్రి సిబ్బందితో తమకు సంబంధాలు తెగిపోయాయని, వారి జాడ తెలుసుకోమని డైరెక్టర్ షేక్ షకీల్ అహ్మద్ హార్బర్ అధికారులకు మెసేజ్ చేశారు.
హైజాక్ జరిగిన కొన్ని రోజుల తర్వాత కూడా గల్ఫ్ స్కై హార్బర్‌లోనే లంగరు వేసి ఉందని ఆయనకు చెప్పారు. ఆ తర్వాత మూడు రోజులకు యూఏఈ అధికారులు నౌక ఆచూకీ తెలీడం లేదని ఫిర్యాదు చేసినట్లు బీబీసీకి తెలిసింది.
నౌకాశ్రయ రాడార్ నుంచి ఓడ కనిపించకుండా పోయిన తర్వాత దాన్ని కనుగొనడానికి సరిగా తనిఖీలు చేయలేదని యూఏఈ సముద్ర రవాణా వ్యవహారాల విభాగం డైరెక్టర్ కెప్టెన్ అబ్దుల్లా అల్-హయాస్ అంగీకరించారు.
నిర్బంధించిన ఓడను తప్పించడం చాలా అరుదని కెప్టెన్ అల్-హయాస్ చెప్పారు. దానిలో ఉన్న వారు ఇకపై పని చేయడం కుదరదని ఆయన తెలిపారు.
అయితే, కొంతమంది నావికులు కూడా ఈ కుట్రలో భాగమై ఉండవచ్చని కొందరు నమ్ముతున్నారు.
"వారు ఇంటికి చేరుకున్నందుకు మాకు సంతోషంగా ఉంది. కానీ చాలా ప్రశ్నలు ఇంకా మిగిలేవున్నాయి' అని కెప్టెన్ అబ్దుల్లా అల్-హయాస్ చెప్పారు.
హైజాక్ అయిన తర్వాత ఓడ అంత త్వరగా ఎలా ప్రయాణించగలిగింది అనేది ఒక అంతుచిక్కని ప్రశ్న. సాధారణంగా నౌక ఇంజన్‌లు ఆన్ చేయడానికి, యాంకర్ పైకి ఎత్తడానికే చాలా సమయం పడుతుంది.
షిప్ ఇంజన్ కూడా శిథిలావస్థకు చేరుకుంది. అధికారికంగా కొన్ని నెలలుగా మరమ్మత్తులు చేయలేదు. హైజాకర్లకు సిబ్బంది నుంచి సహాయం అంది ఉండొచ్చు. ఇంజన్‌లను ముందే సిద్ధం చేయడానికి, గల్ఫ్ స్కై ఇరాన్‌కు సురక్షితంగా ప్రయాణించగలదా అని అంచనావేయడానికి ఇంటి దొంగలే ఎవరో సమాచారమిచ్చి ఉంటారు" అని షకీల్ అన్నారు.
అయితే, వారికి ఎలాంటి సహాయం చేయలేదని బీబీసీతో మాట్లాడిన ఓడ సిబ్బంది స్పష్టం చేశారు.
"ఇలాంటి ఆరోపణలు రావడం చాలా దారుణం. తెలివున్న ఎవరూ మాపై ఆరోపణలు చేయరు. మేము ఇరానియన్లకు సహకరిస్తే, మా జీతాల కోసం ఎందుకు పోరాడుతున్నాం" అని ఓ నావికుడు ఘాటుగా స్పందించారు.
ఓడ ఆచూకీ తెలియకపోవడం, దాని యజమానులు మౌనం వహించడంతో గల్ఫ్ స్కై మాజీ సిబ్బందికి న్యాయం జరుగుతుందా అనే అంశంలో స్పష్టత కరువయ్యింది.
ప్రస్తుతానికి, బీబీసీ ఇంటర్వ్యూ చేసిన దాదాపు అందరూ ప్రపంచవ్యాప్తంగా వివిధ నౌకల్లో పనులు చేసుకోవడానికి తిరిగి సముద్రంలోకి వెళ్లిపోయారు. కానీ అది అంత తేలికైన నిర్ణయం కాదు.
"నాకు ఆందోళనగా ఉంది. ఎక్కడా సురక్షితంగా ఉండలేం అన్నట్లు అనిపిస్తోంది. కానీ నా పిల్లలను ఎలా పోషించాలి? నాకు తెలిసిన ఏకైక పని ఇదే కదా" అంటారు కెప్టెన్ సింగ్.
ఇవి కూడా చదవండి:
- ''ప్రజలను గౌరవించండి, మనం వారి సేవకులం'' -ఫైటర్లతో తాలిబాన్
- ‘తాలిబాన్ల రాకతో శాంతి వెల్లివిరుస్తుంది’ - పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది
- ‘బుర్ఖా వేసుకుని, మారువేషంలో 11 చెక్పాయింట్లను దాటి వెళ్లా. కానీ..’
- ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన అమెరికా.. తాలిబాన్‌ను ఎందుకు ఓడించలేకపోయింది?
- తాలిబాన్లు అధికారంలోకి రావడం వల్ల ఎవరికి లాభం? ఎవరికి నష్టం
- ‘పాకిస్తాన్ మాట వినకపోతే.. ప్రపంచానికి పెద్ద సమస్య తప్పదు’ - పాక్ మంత్రి ఫవాద్
- అఫ్గానిస్తాన్: ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పాక్ సరిహద్దుల దగ్గర పడిగాపులు కాస్తున్నారు
- తాజా నర మాంసాన్ని మేలైన ఔషధంగా ప్రాచీన వైద్య నిపుణులు ఎందుకు భావించేవారు?
- 'భారత అధికారుల్ని తీసుకొస్తుంటే తాలిబాన్లు చుట్టుముట్టిన వేళ..' : తెలుగు కమాండో రాజశేఖర్ స్వానుభవం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)










