మేఫ్లవర్ వారసులు: అమెరికాకు 400 ఏళ్ల కిందట ఈ నౌకలో ప్రయాణమైన యాత్రికుల వారసులు ఇప్పుడు కోట్ల సంఖ్యలో ఉన్నారా?

ఫొటో సోర్స్, GETTY IMAGES
- రచయిత, నాథన్ గ్రోయర్
- హోదా, బీబీసీ ప్రతినిధి
సుమారు నాలుగు శతాబ్దాల క్రితం ది మేఫ్లవర్ నౌక బ్రిటన్‌లోని ప్లైమౌత్ నుంచి అమెరికా తీరానికి పయనమయింది.
అందులోని యాత్రికులు చరిత్రలో నిలిచిపోయారు. 17వ శతాబ్దంలో ఈ నౌకలో ప్రయాణించిన యాత్రీకులు నిజానికి తమ పూర్వీకులు కావొచ్చని కొంతమంది నమ్ముతారు. కానీ ఎంత మందికి?
ఈ సంఖ్య గురించి అనేక రకాల అంచనాలు ఉన్నాయి.
"ప్రపంచవ్యాప్తంగా 3.5 కోట్ల మంది మేఫ్లవర్ వారసులు" ఉండవచ్చని మేఫ్లవర్ వారసుల సొసైటీ చెబుతోంది.
ఇటీవల కాలంలో వలస వచ్చినందుకు లేదా రెండవ తరానికి చెందిన వలసదారులు అయినందుకు చాలా మంది అమెరికన్లు గర్వపడుతూ ఉంటారు. ఇది దేశాన్ని విభిన్నమైన సంస్కృతుల సమ్మేళనంగా మార్చిందని గర్వపడుతూ ఉంటారు.
కానీ తాము యూరప్ నుంచి వలసవచ్చిన వారి వారసులమని చెప్పుకోవడం మరికొంత మందికి ఆనందంగా ఉంటుంది.
"తమ కుటుంబ వారసత్వాన్ని మేఫ్లవర్‌కు చెందినట్లు చెప్పుకోవడంలో ఒక విధమైన రాజసంతో కూడిన హుందాతనం ఉంటుంది" అని ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో అమెరికాకు చెందిన చరిత్రకారుడు డాక్టర్ లారెన్ వర్కింగ్ అన్నారు.
"గత చరిత్రతో సంబంధాలున్నాయని చెప్పుకోవడంలో ప్రజలకు ఒక విధమైన అధికార భావనను కలుగచేస్తుంది. అమెరికా చాలా యువ దేశమని, ఆ దేశానికి చరిత్ర లేదని చాలా జోకులు ఉన్నాయి" అని ఆయన అన్నారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
అయితే, మేఫ్లవర్ వారసులు 3.5 కోట్ల మంది ఉన్నారనేది నిజమేనా?
లేదా కొంతమంది ఈ సంఖ్యను పెంచి చెబుతున్నారా?
ముఖ్యంగా ఆ నౌకలో ప్రయాణం చేసిన వారి సంఖ్యను చూస్తే, ఈ సంఖ్య కాస్త ఎక్కువేమోనని అనిపిస్తుంది.
1620ల్లో యూకే నుంచి ప్రయాణం మొదలుపెట్టినప్పుడు ఆ నౌకలో 102 మంది ప్రయాణీకులు, 30మంది సిబ్బంది ఉన్నారు.
అందులో కొంతమంది ఇంగ్లండ్‌లో మతపరమైన హింసను తప్పించుకోవడానికి పారిపోతుంటే, కొంతమంది అమెరికాలో కొత్త వ్యాపారాలు ప్రారంభించేందుకు వెళుతున్నారు.
అందులో కొంతమంది కుటుంబాలతో కలిసి ఉండగా, మరి కొంతమంది సమూహంగా బయలుదేరారు.
నిజానికి ఆ ప్రయాణంలో ముగ్గురు శిశువులు కూడా జన్మించారు. ఒక వ్యక్తి సముద్రంలో కొట్టుకుపోయారు.
సముద్రంపై ఈ ప్రయాణం 10 వారాల పాటు కొనసాగింది. ఇది చాలా అలసటతో కూడిన ప్రయాణం. నవంబర్ నాటికి నౌక అమెరికాకు చేరింది. వెంటనే వారు ప్లైమౌత్ అనే కాలనీని స్థాపించారు.
ఆ క్షణం చాలా ముఖ్యమైనది. ఈ ప్రయాణీకులు మొదట అడుగు పెట్టిన ప్లైమౌత్ రాక్‌ను పరిరక్షించి ఇప్పటికీ ప్రదర్శిస్తున్నారు.
"కానీ, తీరం మీద అడుగు పెట్టిన క్షణం నుంచి వారు చాలా దుర్భరమైన పరిస్థితులను ఎదుర్కొన్నారు" అని హిస్టోరియన్ మీషా ఈవెన్ చెప్పారు.
"నేలపై మంచు పేరుకుని, గట్టిగా ఉండేది. దాంతో వారు తినే ఆహారం పండించుకునే అవకాశం దొరకలేదు. దాంతో స్థానికంగా దొరికే ఆహారం కోసం వెతుకులాట మొదలుపెట్టారు. స్థానిక అమెరికన్ల నుంచి కూడా ఆహారం దోచుకునేవారు" అని ఆమె చెప్పారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ప్రయాణికుల్లో కొంతమంది అనారోగ్యం పాలయ్యారు. ఆ ఏడాది శీతాకాలం పూర్తయ్యే సరికి వచ్చిన వారిలో కేవలం 53 మంది మాత్రమే బతికారు. అందులో మహిళలు కేవలం అయిదుగురు మాత్రమే ఉన్నారు.
అంత తక్కువ మంది బతికి బయటపడితే, ఇంత ఎక్కువ సంఖ్యలో వారసులు ఎలా పుట్టుకొస్తారు? అనే సందేహం సహజంగా ఎవరికైనా వస్తుంది.
బ్రిటిష్ మ్యాథమెటీషియన్, రచయత రాబ్ ఈస్ట్అవేకు మేఫ్లవర్‌తో సంబంధం ఉంది. ఆయన భార్యకు మేఫ్లవర్‌లో ప్రయాణం చేసిన వ్యాపారి రిచర్డ్ వారెన్ వారసత్వం ఉంది.
రిచర్డ్ వారెన్‌కు ఏడుగురు పిల్లలు. ఆ రోజుల్లో అక్కడి పరిస్థితులను తట్టుకుని వారంతా యుక్త వయస్సుకు వచ్చారు.
"శీతాకాలంలో చలిని తట్టుకుని బతకడం అసాధారణమైన విషయం" అని రాబ్ అన్నారు.
"కానీ రిచర్డ్ వారెన్ ముందు తన పిల్లలను అక్కడే వదిలేసి ఒక్కరే వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు తిరిగొచ్చి కుటుంబాన్ని తీసుకెళ్లారు. ఆయన తిరిగొచ్చే సరికి ఆ పిల్లలందరికీ తిరిగి పిల్లలు పుట్టారు. ఆయన ఏడుగురు పిల్లలు.. రిచర్డ్ వారెన్‌కు మొత్తం 57 మంది మనుమలు, మనుమరాళ్లను ఇచ్చారు.
మేఫ్లవర్ యాత్రికులెవరు?
1620లో యూకే నుంచి 102 మంది యాత్రికులు, 30మంది సిబ్బంది నౌకలో ప్రయాణమయ్యారు.
అందులో 37మంది మతపరమైన హింస నుంచి విముక్తిని కోరుకుంటూ నెదర్లాండ్స్ మీదుగా వచ్చిన ఇంగ్లీష్ వారు. మిగిలిన వారు వ్యాపార అవకాశాలను వెతుక్కుంటూ బయలుదేరిన వ్యాపారవేత్తలు.
వారు ప్రస్తుత మసాచూసెట్స్ ప్రాంతంలో అడుగుపెట్టారు. అక్కడే ప్లైమౌత్ అనే కాలనీని ఏర్పాటు చేశారు.
అమెరికాలో అడుగుపెట్టిన తర్వాత తొలి శీతాకాలాన్ని తట్టుకుని కేవలం 53 మంది మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారు.
1621లో వారు పండించిన పంటలను స్థానిక అమెరికన్లతో పంచుకుని విందు చేసుకున్నారు. దాంతో వారికి నేటివ్ అమెరికన్లతో సంబంధాలు ఏర్పడ్డాయి. అదే తొలి థ్యాంక్స్ గివింగ్ విందు. అమెరికాలో ప్రస్తుతం థ్యాంక్స్ గివింగ్‌ని అతి పెద్ద జాతీయ సెలవు రోజుగా జరుపుకుంటారు.
ఆ తరువాత 1660లలో జరిగిన యుద్ధంలో కొన్ని వేల మంది నేటివ్ అమెరికన్లను చంపేశారు. కొందరిని బానిసలుగా అమ్మేశారు. మరికొందరిని ఇంగ్లీష్ కాలనీవాసులకు సేవ చేయడం కోసం పనిలో పెట్టారు.
మేఫ్లవర్ యాత్రికులు తొలి ఇంగ్లీష్ సెటిలర్లు కాదు. అంతకు 13 సంవత్సరాల క్రితమే వర్జీనియాలో జేమ్స్‌టౌన్ ఏర్పాటు చేశారు.
అప్పట్లో శిశు మరణాలు ఎక్కువగా ఉన్నాయని అనుకున్నా కూడా, ఒక్క రిచర్డ్ వారెన్ కుటుంబం నుంచే అప్పటి నుంచి ఇప్పటి వరకు 20లక్షల మంది మే ఫ్లవర్ వారసులు ఉంటారని ఈస్ట్అవే చెబుతున్నారు.
ఒక దశలో రెండు తరాలకు చెందిన వారు ప్రాణాలతో ఉన్నారని అనుకుంటే, అలాగే మేఫ్లవర్ వారసులతో కూడిన మరో 21 కుటుంబాలు ఉండి ఉంటే, వారి వారసుల సంఖ్య మూడున్నర కోట్లు ఉండటం పెద్ద విషయమేమీ కాదని చెప్పవచ్చు.
అయితే ఈ లెక్కల్లో ఒక్క సమస్య ఉంది. ఈ లెక్కలన్నీ మేఫ్లవర్ వారసుల వివాహాలు, వేరే వారసత్వానికి చెందిన వారితో అయి ఉండవచ్చనే ఊహతో గణించినవి అని రాబ్ చెబుతున్నారు.
"అర్థమయ్యేలా చెప్పాలంటే.. ఒక మే ఫ్లవర్ వ్యక్తి మరొకరిని వివాహం చేసుకుని ఇద్దరు పిల్లల్ని కంటే, తరాలు మారుతున్న కొలదీ వారి వారసులు రెట్టింపు అవుతూ ఉండి ఉండవచ్చు. ఇదంతా మేఫ్లవర్ వారసత్వం కాని వారిని వివాహం చేసుకుంటే జరిగి ఉండవచ్చు" అని అన్నారు.
"కానీ మేఫ్లవర్ వారసులు, తమ మేఫ్లవర్ వారసత్వానికి చెందిన వ్యక్తినే వివాహం చేసుకుంటే, ఆ ఇద్దరు వారసులు కేవలం వారి తల్లిదండ్రుల స్థానాన్ని భర్తీ చేస్తున్నట్లే తప్ప, వారసులు పెరిగే అవకాశం లేదు. అది నాటకీయమైన ప్రభావాన్ని చూపిస్తుంది" అని ఆయన అన్నారు.
ఈ పంథాను వంశం పతనం కావడం (పెడిగ్రీ కొలాప్స్) అని అంటారు. వారసత్వ శాస్త్రాన్ని అనుసరించి ఇద్దరు వ్యక్తుల మధ్య తెలిసో, తెలియకో పంచుకున్న వారసత్వం వల్ల వారి పిల్లల కుటుంబ వారసత్వపు వృక్షం ఉండాల్సిన దాని కంటే చిన్నదైపోవడాన్ని 'పెడిగ్రీ కొలాప్స్' అని అంటారు.
"మేఫ్లవర్ సెటిల్మెంట్ స్థాపించిన తొలినాళ్లలో ఇది చాలా ప్రముఖ పాత్ర పోషించింది. మేఫ్లవర్ తొలి తరంలో జరిగిన 27 వివాహాల్లో 16 వివాహాలు మేఫ్లవర్ ప్రయాణీకుల మధ్య గానీ లేదా వారి వారసుల మధ్య గానీ జరిగాయి. కానీ ఆ తర్వాత మేఫ్లవర్‌కు చెందని వారితో కూడిన మరిన్ని కొత్త నౌకలు కూడా వచ్చాయి. అంటే ఈ వారసుల సంఖ్య గణనీయంగా పెరిగిందని అనుకోవచ్చు" అని అన్నారు.
ఏది ఏమైనప్పటికీ, ఈ అంచనాలకు పెడిగ్రీ కొలాప్స్ అనేది ఒక ముఖ్యమైన కారకం. దీని గురించి రాబ్ కుటుంబానికి బాగా తెలుసు.
"నా భార్య కుటుంబం రిచర్డ్ వారెన్ వారసత్వానికి చెందినదని మా మామగారు కనిపెట్టారు. అంతే కాదు నా భార్య, పిల్లలు జాన్ హౌలాండ్ వారసులు. అందుకే నా కుటుంబంలోనే పెడిగ్రీ కొలాప్స్ జరిగి ఉండవచ్చు" అని అన్నారు.
అయితే నిజానికి ఈ వారసులు ఎంత మంది ఉండవచ్చు?
3 కోట్ల మంది మేఫ్లవర్ వారసులు ఉండవచ్చని రాబ్ అంచనా వేశారు.
కానీ పెడిగ్రీ కొలాప్స్ ఆధారంగా ఈ అంచనాలను లెక్కిస్తే మేఫ్లవర్ వారసుల సంఖ్య 30 లక్షల మంది మాత్రమే ఉండొచ్చని రాబ్ అన్నారు.
చెప్పిన దాని కంటే వీరి సంఖ్య తక్కువగానే ఉన్నప్పటికీ అమెరికా సంస్కృతిలో, సమాజంలో మేఫ్లవర్ కథకున్న శక్తిని మాత్రం ఏమాత్రం తగ్గించలేదు.
ఇవి కూడా చదవండి:
- తెలంగాణ: ఇప్పటివరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఇంకా ఎన్ని ఇస్తారు?
- అఖిలేశ్ యాదవ్: అసదుద్దీన్ పార్టీ వల్ల నష్టం లేదు, మైనారిటీల ఓట్లు మాకే
- పాకిస్తాన్లో అఫ్గాన్ రాయబారి కుమార్తెపై దాడి, కిడ్నాప్
- ముంబయిలో భారీ వర్షాలకు ఇళ్లు కూలి 15 మంది మృతి
- టోక్యో ఒలింపిక్స్: ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా ఉత్సవం ప్రత్యేకతలేంటి? భారత్ నుంచి ఎవరెవరు వెళ్తున్నారు?
- ప్రమాదం అని తెలిసినా చైనాలో ప్లాస్టిక్ సర్జరీల సంఖ్య ఎందుకు పెరుగుతోంది
- దానిష్ సిద్దిఖీ: పులిట్జర్ ప్రైజ్ అందుకున్న భారత ఫొటో జర్నలిస్ట్ తీసిన మరపురాని ఛాయా చిత్రాలు
- కోవిడ్ వ్యాక్సీన్: ఆరు నెలలైనా భారత్‌లో టీకా కార్యక్రమం ఎందుకు వేగవంతం కాలేదు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)










