విశాఖపట్నం: ఎవర్‌గివెన్ ఓడనే సూయెజ్ కెనాల్‌లో కదిలించారు... మరి, వైజాగ్ బీచ్‌లోని బంగ్లాదేశ్ నౌకను కదిలించడం సాధ్యం కాదా?

అది అక్టోబర్ 13, 2020. ఉదయం బీచ్‌కు వెళ్లిన విశాఖ స్థానికులకు ఒక కొత్త అనుభవం ఎదురైంది. అంతకు ముందు రోజు రాత్రే తీవ్ర వాయుగుండానికి సముద్రమంతా అల్లకల్లోలంగా మారింది. తెల్లవారే సరికి తెన్నేటి పార్కు సమీపంలో ఒక భారీ నౌక ప్రత్యక్షమైంది.
తుపాను గాలికి కొట్టుకొచ్చిన ఆ నౌక బంగ్లాదేశ్‌కు చెందినది. అది జరిగి ఇప్పటికి ఆరు నెలలు దాటింది. అప్పుడు కొట్టుకొచ్చిన ఆ ఓడ..ఇప్పటికీ అక్కడే ఉంది.
బంగ్లాదేశ్ చెందిన 'ఎంవీ మా' నౌకను ఎలాగైనా సాగరంలోకి తీసుకుని వెళ్లాలన్న ప్రయత్నాలు మాత్రం ఫలించడం లేదు.
ఈ ప్రయత్నంలో భాగంగా మెరైన్ రంగంలో అనుభవం ఉన్న ప్రత్యేక ఏజెన్సీలను నియమించారు. అలాగే, విశాఖ పోర్టు, ఎన్డీఆర్ఎఫ్,మెరైన్,సివిల్ పోలీసులు,విదేశి బృందాలు కూడా ఆపరేషన్‌లో పాల్గొన్నాయి.
నెల రోజుల పాటు ఏకధాటిగా పని చేసినా ఫలితం రాలేదు. దాంతో ఇప్పటీకి ఆరునెలలుగా ఎక్కడికైతే కొట్టుకుని వచ్చిందో అక్కడే నిలిచి ఉంది ఆ నౌక ఉంది.
అయితే ఇది తీరానికి వచ్చే పర్యాటకులకు మాత్రం కొత్త అనుభవాన్ని ఇస్తోంది. మరి సూయజ్ కాలువలో ఎవర్ గివెన్ కదిలినప్పుడు...విశాఖ తీరంలో ఈ నౌక ఎందుకు కదలడం లేదు...?

ఫొటో సోర్స్, Getty Images
'రెస్టారెంట్' సెంటిమెంట్ పని చేయలేదా ?
నౌకను తిరిగి సాగరంలోకి తీసుకెళ్లేందుకు చేసిన ప్రయత్నాలు విజయవంతం కాకపోవడంతో దాని యాజమాన్యమైన 'అడ్వాన్స్ షిప్పింగ్ లిమిటెడ్' అనే సంస్థ విశాఖ జిల్లా కలెక్టర్, విశాఖ పోర్టు అధికారులకు ఒక లేఖ రాశారు.
ఈ నౌకను సాగరంలోకి తీసుకుని వెళ్లేందుకు చాలా ఖర్చు చేశామని, ఇక చేయలేమని అందులో పేర్కొంది. ఇక ఈ నౌకని ఏం చేసుకోవాలన్నా మీ ఇష్టమని చెప్పింది.
దీంతో ఈ నౌకను రెస్టారెంట్‌గా మారిస్తే బాగుంటుందనే ఆలోచనలో ఉన్నట్లు ఏపీ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు మీడియాకు తెలిపారు. కానీ ఇప్పటీ వరకూ రెస్టారెంట్ కథ ప్రకటనకే పరిమితమైంది.
"ఇప్పటీకే తీరంలో ఉన్న కురుసుర సబ్ మెరైన్, వార్ ఫ్లైట్ టీయూ-142 లాంటివి మ్యూజిమ్‌లుగా పర్యాటకులకు సేవలందిస్తున్నాయి.
షిప్ రెస్టారెంట్ లాంటిది వస్తే విశాఖ టూరిజానికి మరింత జోష్ పెరుగుతుంది. గతంలో ఐఎన్ఎస్ విరాట్ యుద్ధ నౌకను విశాఖలో పర్యాటక ప్రాజెక్టుగా మార్చాలని ప్రయత్నించారు. కానీ దానికి రూ.వెయ్యి కోట్లు వరకూ ఖర్చవుతుందని అంచనా వేశారు.
అప్పటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నారు. ఇప్పుడు 'ఎంవీ మా' నౌక కూడా వెనక్కి వెళ్లే పరిస్థితి లేకపోవడంతో దీన్ని రెస్టారెంట్‌గా మారుస్తామని ప్రభుత్వం ప్రకటనలు చేసింది.
కానీ ఆరు నెలలైనా ఇప్పటి దాకా కనీసం ప్రపోజల్ కూడా వర్కవుట్ అయినట్లు లేదు. నౌక రెస్టారెంట్ అనే కాన్సెప్ట్ విశాఖకి సెంటిమెంట్‌గా వర్క్ అవుతున్నట్లు లేదు." అని టూరిజం శాఖ రిటైర్డ్ ఉద్యోగి ఫణికుమార్ బీబీసీతో చెప్పారు.

నష్టం రాదు..లాభమూ లేదు...
విశాఖ పోర్టు నుంచి స్టోన్, క్వార్ట్జ్, ఫ్లైయాష్ ఎగుమతి, దిగుమతుల కోసం 'ఎంవీ మా' నౌక బంగ్లాదేశ్ నుంచి రెగ్యులర్‌గా వస్తుంటుంది. సెప్టెంబర్ 19న కూడా విశాఖ పోర్టుకు అలాగే వచ్చింది.
డాక్యుమెంట్ల విషయంలో సమస్యలు తలెత్తడంతో పోర్టు అవుటర్ హార్బర్‌లోని యాంకరేజ్‌లో ఉండాల్సి వచ్చింది. అక్టోబర్ 12 రాత్రి ఏర్పడిన వాయుగుండం ప్రభావానికి యాంకరేజ్ నుంచి దాదాపు 3 నాటికల్ మైళ్ల దూరంలో ఉన్న తెన్నేటి పార్క్ ప్రాంతానికి కొట్టుకొచ్చింది.
"ప్రమాదాల కారణంగా నౌకాయాన సంస్థలు ఆర్థికంగా నష్టాల్లో కూరుకుపోతే 'పి అండ్ ఐ' (Protection and Indemnity) క్లబ్ బాధ్యత తీసుకుంటుంది.
అందులో 'ఎంవీ మా' నౌకకు సభ్యత్వం ఉంది. అంటే ఆ నౌక ఆరు నెలలుగా ఇక్కడే ఉన్నా సంస్థకు పెద్దగా నష్టం లేదు.
అయితే దీనిని అమ్మేయడమో, వదిలించుకోవడమో చేయకపోతే లాభం కూడా ఉండదు.
"గతంలో 'రివర్ ప్రిన్సెస్' నౌక కూడా ఇలాగే తుపాను సమయంలో గోవా తీరానికి కొట్టుకొచ్చింది. దాని బరువు లక్ష టన్నులు.
విశాఖ తీరంలోని బంగ్లాదేశ్ నౌక బరువు కేవలం 3 వేల టన్నుల బరువు. మరికొంత ప్రయత్నం చేసుంటే దీనిని సాగరంలోకి పంపటం పెద్ద కష్టమైన పని కాదు." అని ఫ్లాగ్ షిప్ మెరైన్ సర్వీసెస్ ప్రయివేటు లిమిటెడ్ సీఎండీ ఎం. భూపేశ్ బీబీసీకి తెలిపారు.
ఆయన నౌకను సాగరంలోకి పంపే ఆపరేషన్‌లో పాల్గొన్నారు.

'ఎవర్ గివెన్' కన్నా కష్టమా ?
సూయజ్ కాలువలో అడ్డంగా ఇరుక్కుపోయిన రెండు లక్షల టన్నుల బరువున్న 'ఎవర్ గివెన్' నౌకను టగ్స్ సహాయంతో మళ్లీ గాడిలో పెట్టారు. మరి కేవలం 3 వేల టన్నుల బరువున్న 'ఎంవీ మా' నౌకను ఎందుకు కదల్చలేకపోయారు ?
అయితే ఇది అసాధ్యమేమీ కాదని, కొన్ని కారణాల వల్ల దీనిని తీరంలోనే వదిలేయాల్సి వచ్చిందని రిటైర్డ్ నేవీ ఉద్యోగి బలరాం నాయుడు బీబీసీతో అన్నారు.
ఈ షిప్‌ను బయటకు తీసేందుకు కృషి చేసిన 'రిసాల్వ్ మెరైన్' అనే సంస్థలో బలరాం నాయుడు పని చేశారు.
''నౌక తీరంలో నేలని తాకడంతో దాని కింద భాగం డ్యామేజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. సముద్రంలోకి తీసుకుని వచ్చిన తర్వాత దెబ్బతిన్న నౌక కింది భాగానికి మరమ్మత్తులు చేసి...తిరిగి సముద్రయానానికి సిద్ధం చేయాలి.'' అని బలరాం నాయుడు చెప్పారు.
'' ఈ మరమ్మత్తులు విశాఖలోని హిందుస్థాన్ షిప్ యార్డ్‌లో జరుగుతాయి. అక్కడి వరకూ ఈ నౌకను తీసుకుని వెళ్లాలి. షిప్‌యార్డ్ లోకి నౌక వెళ్లే క్రమంలో డ్యామేజైన నౌక మధ్యలో ఆగిపోయే ప్రమాదం ఉందని పోర్టు, షిప్ యార్డ్ అధికారులు అనుమానం వ్యక్తం చేశారు.
ఒకవేళ ఆగిపోతే...షిప్ యార్డ్ మీదుగా రాకపోకలు సాగించే వ్యాపార నౌకలతో పాటు నౌకా దళానికి చెందిన షిప్‌లన్నీ ఎక్కడికక్కడ ఆగిపోతాయి. అంటే సూయజ్ కాలువలో 'ఎవర్ గివెన్' నౌక వల్ల వచ్చిన సమస్యలాంటి దాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
అలాంటి ప్రమాదమేమి ఉండదని ఇండియన్ రిజిష్ట్రార్ ఆఫ్ షిప్పింగ్ నుంచి ''sea worthy' సర్టిఫికెట్ పొందాలి. ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. అందుకే నౌకను వదిలేసేందుకు యాజమాన్యం నిర్ణయించుకుంది." అని వివరించారు బలరాంనాయుడు.
తుక్కు ఖర్చుకు కూడా రాకపోతే ఎలా ?
"నౌకను సముద్రంలోకి పంపడానికి నెల రోజులు కష్టపడ్డాం. 30 శాతం పని కూడా పూర్తయ్యింది. ఇంతలోనే నౌక యాజమాన్యం పనులు ఆపేయమంది. దీనిని రెస్టారెంట్ గా మారుస్తామని ప్రభుత్వం చెప్తోంది. మంచిదే కానీ మాకు తెలిసి ఈ షిప్‌కు ప్రభుత్వం ఇస్తున్న ఆఫర్ ధర చాలా తక్కువ.
ఈ షిప్‌ను విడిభాగాలుగా చేసి అందులోని అవసరం లేని వస్తువులున్నింటినీ స్క్రాప్ కింద లెక్కకట్టినా 15 వందల టన్నులు ఉంటుంది. ఆ ధర కూడా ఇవ్వకపోతే ఎలా?" అన్నారు భూపేశ్
"ధర విషయంలోనే యాజమాన్యానికి, ఏపీ ప్రభుత్వానికి ఏకాభిప్రాయం కుదరడం లేదు. అది సెటిల్ అయితే రెస్టారెంట్‌గా మారినట్లే" అన్నారాయన.

తీరంలో ఓడ- టేబుల్ మీద ఫైల్
నౌక తీరానికి కొట్టుకొచ్చిన ఆరు నెలలైనా, ఇది రెస్టారెంట్ గా మారుతుందా ? లేదంటే తీరంలో సందర్శకులు తీసుకునే ఫొటోల బ్యాక్‌గ్రౌండ్‌కే పరిమితమవుతుందా ? అన్న అంశంపై స్పష్టం రాలేదు.
నౌక తాజా పరిస్థితిపై ఏపీ పర్యాటకశాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావుతో బీబీసీ మాట్లాడింది.
"నౌకను సముద్రంలోకి పంపే ఆపరేషన్‌లో ప్రభుత్వం యాజమాన్యానికి ఎంతో సహకరించింది. ఖర్చులు భరించలేమంటూ వారే పనులు నిలిపేశారు. దాన్ని ఆకర్షణీయంగా తీర్చిదిద్ది టూరిజం ఎట్రాక్షన్‌గా మార్చాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ప్రస్తుతం దీని ఫైలు సీఎం దగ్గరే ఉంది. ఇది త్వరలోనే ఆమోదం పొందువచ్చు" అన్నారు.
" 'ఎంవీ మా' నౌకను సందర్శకుల కోసం మ్యూజియం తరహాలో, అలాగే తీరంలో ఒక అద్భుతమైన షిప్ రెస్టారెంట్‌గానూ ఉపయోగించుకోవచ్చు" అన్నారు మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు.
ఇప్పటికైతే 'ఎంవీ మా' నౌక విశాఖ తీరంలో సందర్శకులను బాగానే ఆకట్టుకుంటోంది. భవిష్యత్తులో అది షిప్ రెస్టారెంట్‌గా మారితే మరింత మంది పర్యాటకులు నౌక మీద కూర్చున్న అనుభవాన్ని పొందడానికి ప్రయత్నించే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి:
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- సూయజ్ కాలువలో భారీ నౌక ఇరుక్కుపోవడానికి కారణం ఈమేనంటూ వార్తలు.. అసలు నిజమేంటి
- వాంతులు ఎందుకు వస్తాయి... ప్రయాణాల్లో కడుపు తిప్పినట్లు ఎందుకవుతుంది?
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: ఎవరీ మడావి హిడ్మా... మావోయిస్టు పార్టీలో అంత త్వరగా ఎలా ఎదిగారు?
- "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"
- గోల్డెన్ బ్లడ్... ఈ రక్తం కలిగి ఉండటం చాలా ప్రమాదకరం
- కొందరికి పీరియడ్స్ సమయంలో కంటి నుంచి కూడా రక్తం వస్తుంది ఎందుకు
- ఛత్తీస్‌గఢ్ ఎన్కౌంటర్: జవాన్లపై దాడిని హైదరాబాద్ పోలీసులు ముందే ఊహించారా
- ‘ఆయన నా గదిలోకి వచ్చి నాపై అత్యాచారం చేశారు... నేను మూడు రోజుల వరకు గదిలోనే ఉండిపోయాను’
- ‘అఖండ భారతం గురించి వారు మాట్లాడుతుంటే నేను అఖండ ద్రావిడం గురించి ఎందుకు మాట్లాడకూడదు’
- సముద్రపు చేపలా, చెరువు చేపలా... ఏవి తింటే ఆరోగ్యానికి మంచిది?
- మావోయిస్టులకు పట్టున్న ప్రాంతాల్లో ఏడాదిన్నర పాటు తిరిగిన ఒక మహిళా ప్రొఫెసర్ అనుభవాలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








