Shaik Rasheed: అండర్-19 వరల్డ్ కప్‌లో టీమిండియాను చాంపియన్‌గా నిలిపిన 17 ఏళ్ల తెలుగు కుర్రాడి కథ

ఫొటో సోర్స్, twitter/BCCI
- రచయిత, వడిశెట్టి శంకర్
- హోదా, బీబీసీ కోసం
షేక్ రషీద్. అండర్-19 టీమిండియా వైస్-కెప్టెన్, వన్‌డౌన్ బ్యాటర్ కూడా. ఇటీవల టీమిండియా యువ జట్టు ఆసియా కప్ గెలవడంలోనూ, అండర్-19 ప్రపంచకప్‌ను ఐదోసారి గెలవడంలోనూ రషీద్ పాత్ర కీలకం.
ముఖ్యంగా నాకౌట్ మ్యాచుల్లో అద్భుతంగా రాణిస్తూ 17 ఏళ్ల రషీద్ అందరినీ ఆకట్టుకుంటున్నాడు.
గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం మల్లయ్యపాలెంలో రషీద్ జన్మించారు. ప్రస్తుతం గుంటూరు నగరంలో ఉంటున్నారు. ప్రైవేట్ కాలేజి లో ఇంటర్ చదువుతున్నాడు.
రషీద్ ఇప్పుడు భారత యువజట్టు తరుఫున సత్తా చాటడంలో తీవ్ర శ్రమ ఉంది.
సామాన్య కుటుంబం నుంచి వచ్చిన రషీద్, అంతర్జాతీయ క్రికెట్‌లో రాణిస్తూ తన క్రికెట్ కెరీర్‌ను మెరుగుపరుచుకుంటున్నారు.

ఫొటో సోర్స్, shaikrasheed66/insta
వరుస టోర్నీలలో విజృంభణ
షేక్ రషీద్ ఇటీవల దుబాయ్‌లో జరిగిన ఆసియా కప్ లో అద్భుతంగా రాణించాడు. ఆ టోర్నీని యువ భారత జట్టు గెలుచుకుంది. అందులో బంగ్లాదేశ్ జట్టు మీద సెమీస్ లో 90 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచారు రషీద్.
ఆ తర్వాత ఫైనల్స్ లో కూడా శ్రీలంక మీద విజయంలో రషీద్ ప్రధాన భూమిక పోషించారు. లక్ష్య ఛేదనలో 31 రన్స్ చేసిన నాటౌట్ గా నిలిచారు. అంతకు ముందు మ్యాచుల్లో ఓ మోస్తరుగా రాణించినా, కీలకమైన మ్యాచుల్లో తానేంటో నిరూపించుకున్నారు.
వెస్టిండీస్‌లో జరిగిన అండర్19 వరల్డ్ కప్‌లో కూడా రషీద్ కీలకమైన మ్యాచ్‌ల్లో సత్తా చాటి, టీమిండియా చాంపియన్‌గా నిలవడంలో కీలకపాత్ర పోషించాడు.
కంటెంట్ అందుబాటులో లేదు
మరింత సమాచారం కోసం Facebookఇతర వెబ్‌సైట్లలో సమాచారానికి బీబీసీ బాధ్యత వహించదు.పోస్ట్ of Facebook ముగిసింది
ఇప్పటి వరకూ అంతర్జాతీయ కెరీర్‌లో 8 మ్యాచుల్లో బ్యాటింగ్ చేసిన రషీద్ 334 పరుగులు చేశాడు. సగటు 55.6. అందులో బలమైన ప్రత్యర్థి ఆస్ట్రేలియాపై ప్రపంచకప్ సెమీస్‌లో ఏకంగా 94 పరుగులు చేసి జట్టు గెలుపులో కీలక భూమిక పోషించాడు.
ఓపెనర్లు త్వరగా అవుట్ అయిన తర్వాత కెప్టెన్ యష్ ధూల్ తో కలిసి భారీ భాగస్వామ్యం నెలకొల్పడం ద్వారా అండర్ 19 వరల్డ్ కప్‌లో వరుసగా నాలుగోసారి టీమిండియా ఫైనల్స్‌కి చేరడంలో దోహదపడ్డాడు.
అంతకు ముందు క్వార్టర్స్‌లో బంగ్లాదేశ్ మీద 26 పరుగులు చేశారు.
ఈ కథనంలో X అందించిన సమాచారం కూడా ఉంది. వారు కుకీలు, ఇతర టెక్నాలజీలను ఉపయోగిస్తుండొచ్చు, అందుకే సమాచారం లోడ్ అయ్యే ముందే మేం మీ అనుమతి అడుగుతాం. మీరు మీ అనుమతి ఇచ్చేముందు X కుకీ పాలసీని , ప్రైవసీ పాలసీని చదవొచ్చు. ఈ సమాచారం చూడాలనుకుంటే ‘ఆమోదించు, కొనసాగించు’ను ఎంచుకోండి.
పోస్ట్ of X ముగిసింది
ఇక ఫైనల్ మ్యాచ్‌లోనూ తన ఫామ్ కొనసాగించాడు. ఇంగ్లండ్ జరిగిన ఈ మ్యాచ్‌లో 84 బంతుల్లో ఆరు ఫోర్లు కొట్టి 50 పరుగులు చేశాడు.
ప్రపంచకప్‌లో మొత్తం నాలుగు మ్యాచ్‌ల్లో రెండు అర్థ సెంచరీలు చేయడం గమనార్హం. అంతకు ముందు ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్‌లోనూ 72 పరుగులు చేశాడు.
కీలక మ్యాచుల్లో రాణిస్తున్న రషీద్ కు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఫొటో సోర్స్, shaikrasheed66/insta
ఆంధ్రా జట్టులో చోటు దక్కలేదు
తండ్రి ప్రోత్సాహంతో రషీద్ క్రికెట్‌లో అడుగుపెట్టారు. కొడుకును టీమిండియా స్థాయి ఆటగాడిగా మార్చాలన్న లక్ష్యంలో ఆయన తండ్రి షేక్ బలీషా వలీ ఏకంగా తన ఉద్యోగం కూడా వదులుకున్నారు.
హైదరాబాద్ పంపించి క్రికెట్‌లో కోచింగ్ ఇప్పించారు. అయినప్పటికీ రషీద్ కి అవకాశాలు రాలేదు. ముఖ్యంగా అండర్ -14, అండర్ -16 సెలక్షన్‌లో రషీద్‌ని తిరస్కరించారు.
ఆంధ్రా జట్టుకి ఎంపిక కాలేకపోవడంతో కొంత నిరుత్సాహపడినప్పటికీ మళ్లీ తండ్రి నుంచి లభించిన ప్రోత్సాహంతో రషీద్ గాడిలో పడ్డారని రషీద్ స్నేహితుడు వినోద్ తెలిపారు.
‘‘రషీద్ చాలా మంచి ఆటగాడు. కుటుంబం నుంచి సహకారం ఉంది. క్రికెట్ లో రాణిస్తాడని అనుకున్నాం. మాతో కలిసి కొంతకాలం ఆడారు.
మొదట్లో కొంత తడబడ్డాడు. కానీ ఆ తర్వాత అన్ని టోర్నీలలోనూ రాణించాడు. అవకాశాలు దక్కించుకున్నాడు. ఆంధ్రా అండర్ 19 జట్టుని ముందుకు నడిపాడు. ఆ తర్వాత ఛాలెంజర్స్ ట్రోఫీ, వినూ మన్కడ్ ట్రోఫీలలో మంచి ప్రదర్శన చేయడం అందరినీ ఆకర్షించింది. బంగ్లాదేశ్ లో జరిగిన ట్రై సిరీస్ అండర్ -19 టీమిండియా జట్టుకి ఎంపిక కావడం అతని కెరీర్‌ని మార్చేసింది’’ అన్నారు వినోద్.
"ఆ తర్వాత రషీద్ వరుసగా రాణిస్తూ రాటుదేలడం మా అందరికీ సంతోషమే. కానీ ప్రారంభంలో ఆటంకాలు ఎదుర్కొని ఆ స్థాయికి చేరిన అతడు, దానిని నిలబెట్టుకోవాలని ఆశిస్తున్నాం" అని ఆయన చెప్పారు.
వినోద్ కొంతకాలం ఆంధ్రా అండర్ 16 జట్టులో ఆడారు. కుటుంబం నుంచి రషీద్‌కు లభిస్తున్న సహకారం అతడు రాణించడానికి కీలకంగా మారిందని అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, shaikrasheed66/insta
మధ్యలో డీలా
‘‘రషీద్ మంచి క్రికెటర్ కావాలని నా కోరిక. ఒకప్పుడు నేను టీమిండియాకి ఎంపిక కావాలని కోరుకునేవాడిని. కానీ నాకున్న పరిస్థితుల్లో అది సాధ్యం కాలేదు. రషీద్ ద్వారా నా కల నెరవేర్చుకునే ప్రయత్నంలో ఉన్నా’’ అని రషీద్ తండ్రి బాలీషా వలీ బీబీసీతో అన్నారు.
‘‘మొదట ప్రైవేటు బ్యాంకులో ఉద్యోగం చేసినప్పుడు రషీద్ కోచింగ్ కోసం అది వదులుకుని హైదరాబాద్ వెళ్లాం. అక్కడే రాటుదేలాడు. అయితే మొదట్లో అవకాశాలు రాకపోవడంతో కొంత నిరుత్సాహపడ్డాడు. 2015, 2016లో ఆటతీరు లయ తప్పింది. కానీ, త్వరగానే మళ్లీ గాడిలో పడ్డాడు. మెరుగ్గా రాణించడంతో ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్‌లో మంచి ప్రోత్సాహం దక్కింది. వరుసగా రెండు అంతర్జాతీయ టోర్నీలలో రాణించాడు. వీవీఎస్ లక్ష్మణ్ వంటి వారు నేరుగా టీమ్‌తో ఉండటం వెస్టిండీస్ లో జట్టు రాణించడానికి తోడ్పడింది. రషీద్ కలలు నెరవేరాలని కోరుకుంటున్నాం’’ అన్నారాయన.
గుంటూరు నగరానికి చెందిన బాలీషాకి ఇద్దరు కుమారులు. అందులో రషీద్ చిన్నవాడు. ఆటల్లో నైపుణ్యం ఉండడంతో క్రికెట్లో ప్రోత్సహించినట్టు చెబుతున్నారు.

ఫొటో సోర్స్, shaikrasheed66/insta
విరాట్ కోహ్లీ అభిమాని..
రైట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ లెగ్ బ్రేక్ బౌలింగ్ కూడా వేసే రషీద్ విరాట్ కోహ్లీ తనకు స్ఫూర్తి అంటున్నారు.
‘‘విరాట్ బ్యాటింగ్ స్టైల్ ఇష్టం. ముఖ్యంగా కవర్ డ్రైవ్‌లు బాగా నచ్చుతాయి. అండర్ 19 వరల్డ్ కప్ ద్వారానే కోహ్లీ అందరికీ పరిచయమయ్యారు. కాబట్టి నాకు కూడా అలాంటి గుర్తింపు రావాలని కోరుకుంటున్నాను’’ అని రషీద్ మీడియాతో అన్నారు.
2004 సెప్టెంబర్ 24న జన్మించిన 17 ఏళ్ల రషీద్ భవిష్యత్తులో మరింత రాణించే అవకాశాలున్నాయి. దానికి తగ్గట్టుగా కృషి చేస్తే మంచి స్థానానికి చేరుకుంటారని ఆంధ్రా క్రికెట్ సంఘం ప్రతినిధులు కూడా అభిప్రాయపడుతున్నారు.
కచ్చితమైన షాట్లు ఆడడంతోపాటూ, డిఫెన్స్, ఎటాకింగ్‌లోనూ రషీద్ ఫుట్ వర్క్, టైమింగ్ బాగుంటుందని తోటి ఆటగాళ్లు కూడా చెబుతుంటారు.

ఫొటో సోర్స్, shaikrasheed66/insta
తెలుగు నేల నుంచి మహమ్మద్ అజహరుద్దీన్, వీవీఎస్ లక్ష్మణ్ తర్వాత ఆ స్థాయిలో పేరు తెచ్చుకున్న ఆటగాళ్లు లేరు. ఒకరిద్దరు బౌలర్లు కొంత రాణించినా మెరుగైన స్థానంలో నిలవలేదు.
ప్రస్తుతం యువ భారత్ వెంట వెస్టిండీస్‌లో ఉన్న ఎన్‌సీఏ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా రషీద్ ఆటతీరుని మెచ్చుకున్నారు. అతడిలో మంచి టాలెంట్ ఉందని అభిప్రాయపడ్డారు.
ఐపీఎల్ తర్వాత ఇటీవల మహ్మద్ సిరాజ్, కేఎస్ భరత్ వంటి వారికి కొన్ని అవకాశాలు వస్తున్నాయి. ఇక రాబోయే కాలంలో రషీద్ లాంటి ఆటగాళ్లు మరింత మెరుగైతే వివిధ ఫార్మాట్లలో రాణించేందుకు మార్గం సుగమం అవుతుంది.
తండ్రి కోరికతో పాటూ తన కలలు కూడా నెరవేర్చుకోవడానికి రషీద్ అండర్ -19 వరల్డ్ కప్ లో రాణించడం శుభసూచికం అనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి:
- ఈ-పాస్‌పోర్ట్ అంటే ఏంటి, అది ఎలా పని చేస్తుంది? 10 సందేహాలకు జవాబులు
- గల్వాన్ డీకోడెడ్: 'గల్వాన్ లోయలో జరిగిన భారీ నష్టాన్ని చైనా దాచిపెడుతోంది'.. క్లాక్సన్ నివేదిక వెల్లడి
- 'సీఎం సార్.. హెల్ప్ మీ': తమిళనాడు ముఖ్యమంత్రికి తూర్పు గోదావరి విద్యార్థి వేడుకోలు
- దుబయ్: ఎడారి కాకుండా ఎలా తట్టుకుంటోంది? సారవంతమైన భూములను ఎలా కాపాడుకుంటోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













