క్రికెట్: 1985 ఇండియా, శ్రీలంక పర్యటన సమయంలో నాపై రేప్ జరిగింది: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ ఆరోపణ

1985 యూత్ టీమ్ విదేశీ పర్యటన సందర్భంగా తనపై లైంగిక దాడి జరిగిందని మిచెల్ ఆరోపించారు.

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, 1985 యూత్ టీమ్ విదేశీ పర్యటన సందర్భంగా తనపై లైంగిక దాడి జరిగిందని మిచెల్ ఆరోపించారు.

అండర్ -19 జట్టులో ఆడుతున్నప్పుడు జట్టు అధికారి ఒకరు తనపై అత్యాచారం చేశారని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ జేమీ మిచెల్ ఆరోపించారు.

1985లో విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు, చికిత్సలో భాగంగా జట్టు డాక్టరు తనకు మత్తు మందు ఇచ్చి, ఆపై లైంగిక దాడి చేశారని 55 ఏళ్ల మిచెల్ ఆరోపించారు.

ఆస్ట్రేలియన్ బ్రాడ్‌కాస్టింగ్ కార్పొరేషన్ (ఏబీసీ)కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలను వెల్లడించారు.

కాగా, ఈ విషయంలో పోలీసుల దర్యాప్తుకు తాము సహకరిస్తున్నామని క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది.

జరిగిన సంఘటన గురించి తమకు తెలిసిన విషయాలను వెల్లడించాలని మిచెల్, ఆస్ట్రేలియా క్రికెట్ పాలక మండలిని కోరారు.

ఎట్టకేలకు 1985 పర్యటనలో జరిగిన విషయాలను పరిశీలిస్తున్నందుకు తనకు ఉపశమనంగా ఉందని ఆదివారం ఇచ్చిన ఇంటర్వ్యూలో మిచెల్ తెలిపారు.

"నా క్రికెట్ జీవితంలో హైలైట్ కావాల్సిన ఆ పర్యటన అనేక ఏళ్ల పాటు నాకు వేదనను మిగిల్చింది" అని బీబీసీతో మిచెల్ చెప్పారు.

Getty Images

ఫొటో సోర్స్, GETTY IMAGES

ఫొటో క్యాప్షన్, Getty Images

ఆ రాత్రి ఏమైందంటే

ఆస్ట్రేలియా అండర్-19 జట్టు 1985లో భారత్, శ్రీలంకలలో పర్యటించింది. అప్పటికి 18 ఏళ్ల వయసున్న మిచెల్ ఆ జట్టులో ప్రముఖ బ్యాట్స్‌మన్.

ఆ టూర్ చివరి రోజు మార్చి 30న కొలొంబోలో ఉన్నప్పుడు, తనకు ఒంట్లో నలతగా అనిపిస్తే టీం డాక్టర్ దగ్గరకు వెళ్లానని, తనకు హై డోసు మత్తు మందు ఇచ్చారని, దాంతో, సుమారు 10 గంటలు నిద్రపోయాయని మిచెల్ చెప్పారు.

ఆ రాత్రి తనను పలకరించవద్దని తన సహచరులకు హెచ్చరించారని, ఆ సమయంలోనే తనపై లైంగిక దాడి జరిగిందని మిచెల్ విశ్వసిస్తున్నారు. అది ఎలా జరిగిందన్న వివరాలు ఆయన ఇంటర్వ్యూలో చెప్పలేదు.

"నా టీంమేట్స్ వెళ్లిపోయారు. ఎవరో ఒకరు వచ్చి నన్ను పలకరించాల్సింది" అని మిచెల్ బీబీసీతో అన్నారు.

"తరువాత రెండు మూడు రోజుల పాటు నేను సరిగ్గా లేనని నా సహచరులు చెప్పారు. మర్నాడు ఫ్లైట్ ఎక్కడానికి నన్ను సిద్ధం చేసేందుకు వాళ్లు నన్ను తీసుకెళ్లి షవర్ కింద నిల్చోబెట్టారు. నాకు దుస్తులు తొడిగేందుకు ప్రయత్నించారు. విమానం దిగాక నన్ను వీల్‌చెయిర్‌లో కూర్చోబెట్టి నా తల్లిదండ్రుల వద్దకు తీసుకెళ్లారు."

ఆ సమయంలో మిచెల్‌ను కలిసిన స్నేహితులు, కుటుంబ సభ్యులు ఆయన చెప్పిన కొన్ని వివరాలను ఏబీసీకి ధ్రువీకరించారు.

ఆటగాళ్లతో ఆ డాక్టర్ "గగుర్పాటు కలిగించేలా" ప్రవర్తించేవారని, జట్టు విడిది చేసే హోటల్‌కు, క్వార్టర్లకు విదేశీ పిల్లలను తీసుకొచ్చేవారని మిచెల్ సహా జట్టు మాజీ సభ్యులు కొందరు ఏబీసీకి తెలిపారు.

ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసులు కూడా ఈ ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నారని ఏబీసీ వెల్లడించింది.

ఈ అంశంపై పోలీసులతో మాట్లాడేందుకు బీబీసీ ప్రయత్నించింది. అయితే, వ్యక్తిగత కేసులపై వ్యాఖ్యానించలేమని చెబుతూ, పోలీసులు బీబీసీ ప్రశ్నలకు జవాబు ఇచ్చేందుకు నిరాకరించారు.

క్రికెట్ బ్యాట్

ఫొటో సోర్స్, Getty Images

'కుటుంబ సభ్యులు లేఖ రాసినా పట్టించుకోలేదు'

గత ఆగస్టులో జట్టు ఫొటో ఒకటి ఆన్‌లైన్‌లో కనిపించిందని, అది చూశాక ఈ సంఘటన గురించి క్రికెట్ ఆస్ట్రేలియాకు చెప్పాలని నిర్ణయించుకున్నట్లు మిచెల్ తెలిపారు. అలాగే, స్పోర్ట్స్ ఇంటిగ్రిటీ ఆస్ట్రేలియాకు కూడా ఫిర్యాదు చేశారు. వాళ్లు, ఫెడరల్ పోలీస్‌ను సంప్రదించారు.

క్రికెట్ ఆస్ట్రేలియా ఈ ఆరోపణలకు సంబంధించి తమకు తెలిసిన విషయాలను పారదర్శకంగా వెల్లడించాలని మిచెల్ సహా ఇతర క్రికెటర్లు కోరుతున్నారు.

అప్పట్లో ఈ డాక్టర్ ప్రవర్తనపై వచ్చిన నివేదికలను నిర్వాహకులు పట్టించుకోలేదని, యూత్ జట్టులో ముఖ్య అధికారిగా నియమించారని క్రికెటర్లు ఆరోపిస్తున్నారు.

ఆ అధికారి ప్రవర్తన పట్ల ఆటగాళ్ల మనోవేదనను తెలుపుతూ జట్టు కుటుంబ సభ్యులు బోర్డుకు రాసిన లేఖను కూడా పట్టించుకోలేదని, దానికి ఎలాంటి స్పందనా రాలేదని వాళ్లు అంటున్నారు.

ఆ పర్యటనకు సంబంధించి తన మెడికల్ రికార్డులను విడుదల చేయాలని మిచెల్, క్రికెట్ ఆస్ట్రేలియాను కోరారు. పర్యటన ముగిసిన వెంటనే ఆ అధికారి ప్రొఫెషనల్ క్రికెట్‌ను ఎందుకు విడిచిపెట్టారో బోర్డు వివరించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

"ఈ సమస్యను ఎదుర్కొని, సరైన చర్యలు తీసుకోవడం ద్వారా క్రికెట్ ఆస్ట్రేలియా విలక్షణమైనదిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది. అంటే నా ప్రశ్నలకు జవాబులు ఇస్తూ పారదర్శకంగా వ్యవహరించాలి."

కాగా, మిచెల్‌తో సంప్రదింపులు జరుపుతున్నట్లు క్రికెట్ ఆస్ట్రేలియా తెలిపింది. గత పర్యటనలు, మ్యాచ్‌లలో జరిగిన దాడులు, వేధింపుల ఆరోపణలకు బాధ్యత వహిస్తున్నట్లు నైన్ న్యూస్‌పేపర్స్‌కు తెలిపింది.

వేధింపులకు గురైన బాధితులకు నష్టపరిహారం చెల్లించే ఆస్ట్రేలియా జాతీయ పథకంపై క్రికెట్ ఆస్ట్రేలియా సంతకం చేయాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)