గల్వాన్ డీకోడెడ్: 'గల్వాన్ లోయలో జరిగిన భారీ నష్టాన్ని చైనా దాచిపెడుతోంది'.. క్లాక్సన్ నివేదిక వెల్లడి

ఫొటో సోర్స్, GETTY IMAGES
రెండేళ్ల క్రితం లద్దాఖ్‌లోని గల్వాన్ లోయలో భారత్, చైనాల మధ్య చోటు చేసుకున్న సంఘర్షణల్లో తమకు కలిగిన నష్టాన్ని చైనా తక్కువ చేసి చూపించిందని ఒక నివేదిక పేర్కొంది.
"గల్వాన్ ఘర్షణల్లో చైనా సైనికులు నలుగురు చనిపోయారని ఆ దేశం చెబుతోంది. కానీ, అంతకు తొమ్మిది రెట్లు ఎక్కువగా, కనీసం 38 మంది పీఎల్ఏ జవాన్లు మరణించారని" ఆస్ట్రేలియా వార్తాపత్రిక 'ది క్లాక్సన్' పరిశోధనాత్మక నివేదిక వెల్లడించినట్లు వార్తాసంస్థలు పీటీఐ, ఏఎన్ఐ పేర్కొన్నాయి.
చైనాకు చెందిన పరిశోధకులు, బ్లాగర్లను ఉటంకిస్తూ క్లాక్సన్ నివేదిక ఈ అంశాన్ని ప్రస్తావించింది. అయితే, భద్రతా కారణాల రీత్యా వారి పేర్లను వెల్లడించలేదు.
ఈ నివేదికలో అనేకమంది "వీబో యూజర్ల"ను ఉదహరించారు. ఆరోజు రాత్రి ఒక జూనియర్ సార్జెంట్ సహా కనీసం 38 మంది పీఎల్ఏ సైనికులు మునిగిపోయారు. కానీ అధికారిక గణాంకాల్లో నలుగురు చనిపోయినట్లు, ఒక సార్జంట్ మునిగిపోయినట్లు చూపించారని తెలిపారు.

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA
గల్వాన్ లోయలో హింసాత్మక ఘర్షణలు
2020లో భారత్, చైనాల మధ్య తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. 2020 మే 1న తూర్పు లద్దాఖ్‌లోని పాంగోంగ్ త్సో సరస్సు ఉత్తర గట్టున ఇరు దేశాల సైనికుల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. ఇరువైపులా పదుల సంఖ్యలో సైనికులు గాయపడ్డారు.
అనంతరం, జూన్ 15న గల్వాన్ లోయలో మరోసారి రెండు దేశాల సైనికుల మధ్య ఘర్షణ జరిగింది.
దీనికి సంబంధించి జూన్ 16న భారత సైన్యం ఒక ప్రకటన చేసింది.
"ఘటనా స్థలంలో విధుల్లో ఉన్న 17 మంది సైనికులు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయారు. ఘర్షణల్లో మరణించిన వారి సంఖ్య 20కి పెరిగింది" అని అందులో పేర్కొన్నారు.
చైనా కూడా ఒక ప్రకటన విడుదల చేసిందిగానీ సైన్య నష్టం గురించి అందులో స్పష్టంగా తెలుపలేదు. తరువాత కొన్ని నెలలకు 2021 ఫిబ్రవరిలో, గల్వాన్ ఘర్షణల్లో ప్రాణాలు కోల్పోయిన నలుగురు సైనికులకు మరణానంతర పతకాలు ప్రకటించింది.
'చైనా అనేక వాస్తవాలను దాచిపెట్టింది'
నష్టాల గురించి ఇలాంటి వాదనలు చైనాకు కొత్తేం కాదని క్లాక్సన్ నివేదిక పేర్కొంది.
చైనాకు పెద్ద నష్టమే జరిగిందని, నలుగురి కన్నా ఎక్కువమందే ప్రాణాలు కోల్పోయారని సోషల్ మీడియా పరిశోధకుల బృందం సేకరించిన ఆధారాలు చెబుతున్నాయి.
గల్వాన్ వివాదానికి తెర దించేందుకు చైనా ఎంతకైనా తెగిస్తుందని, ఆఖరికి సైనికుల మరణాల సంఖ్యను కూడా దాచిపెట్టగలదని ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి.
"గల్వాన్ లోయలో ఏం జరిగిందన్న దానిపై అనేక వాస్తవాలను చైనా దాచిపెట్టింది. చైనా చెప్పే చాలా విషయాలు కట్టుకథలే. దీనికి సంబంధించిన అనేక బ్లాగులు, పేజీలను చైనా అధికారులు తొలగించారు. కానీ, డిజిటల్ ఆర్కైవ్స్ అసలు కథ చెబుతాయి" అని క్లాక్సన్ నివేదికలో పేర్కొన్నారు.
ఈ ఘర్షణలకు సంబంధించిన చైనా మీడియా ఫుటేజీ క్లాక్సన్ దగ్గర ఉందని, నివేదికలో వెల్లడించిన విషయాలకు అది ఒక ఆధారమని ఏఎన్ఐ వార్తాసంస్థ పేర్కొంది.

ఫొటో సోర్స్, GETTY IMAGES
ఆ రోజు ఏం జరిగింది?
జూన్ 15 నాటి వివాదం ఒక తాత్కాలిక వంతెనపై చెలరేగిందని పరిశోధకులు నివేదికలో పేర్కొన్నారు. మే 22న గల్వాన్ నదికి ఒక చివర భారత సైనికులు దీనిని నిర్మించారు.
పెరుగుతున్న ఉద్రిక్తతలను తగ్గించడానికి భారత, చైనా సైనిక అధికారులు "బఫర్ జోన్"కు అంగీకరించారు. అయినప్పటికీ, ఆ ప్రాంతంలో చైనా అక్రమ కట్టడాలు నిర్మిస్తోందని, గుడారాలు వేసి తమ ఆయుధాలను తీసుకొస్తోందని భారత్ పేర్కొంది.
"ఈ ప్రాంతంలో పనిచేస్తున్న ఒక వీబో యూజర్ చెప్పిన వివరాల ప్రకారం, పీఎల్ఏ బఫర్ జోన్ ఒప్పందాన్ని ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టింది. తన పెట్రోలింగ్ జోన్ పరిధిని విస్తరిస్తూ వచ్చింది.
చైనా సైనికుల కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు వీలుగా మే 22న కల్నల్ సంతోష్ నాయకత్వంలో భారత సైన్యం ఒక తాత్కాలిక వంతెనను నిర్మించింది. స్వయంగా చైనా బఫర్ జోన్‌లో మౌలిక సదుపాయాల నిర్మాణం చేపట్టింది. కానీ, భారత సైన్యం వంతెన నిర్మించేసరికి పీఎల్ఏ తీవ్రంగా ప్రతిఘటించింది" అని నివేదికలో వెల్లడించారు.
'చైనా ఒప్పందాన్ని ఉల్లంఘించింది'
నివేదిక ప్రకారం, జూన్ 6 న 80 మంది చైనా సైనికులు వంతెనను ధ్వంసం చేయడానికి వచ్చారు. 100 మంది భారత సైనికులు దాన్ని రక్షించేందుకు పూనుకున్నారు.
జూన్ 6 నాటి ప్రతిష్టంభన తరువాత, బఫర్ జోన్ దాటి వచ్చిన సైనికులందరినీ వెనక్కు పిలిపించేందుకు ఇరు దేశాల అధికారులూ అంగీకరించారు. కానీ చైనా ఈ ఒప్పందాన్ని ఉల్లంఘించింది.
చైనా తమ కార్యక్రమాలు ఆపలేదు. దాంతో, భారత సైన్యం నిర్మించిన వంతెన ధ్వంసం అయింది.
జూన్ 15న కల్నల్ సంతోష్ సహా భారత సైన్యం గల్వాన్ లోయలో ఘటనా స్థలికి చేరుకుంది. చైనా ఆక్రమణను తొలగించడానికి ప్రయత్నించింది.
అప్పటికే సుమారు 150 మంది చైనా సైనికులు అక్కడ మోహరించారు. చర్చలకు బదులుగా, పీఎల్ఏ కల్నల్ తన సైనికులను యుద్ధానికి సిద్ధం కమ్మని ఆదేశించారు.
"గల్వాన్ డీకోడెడ్" అని పిలిచే ఈ నివేదికలో భారత, చైనా సైన్యాల మధ్య జరిగిన ఘర్షణ గురించి విస్తృతమైన సమాచారాన్ని అందించారు.

ఫొటో సోర్స్, TAUSEEF MUSTAFA/GETTYIMAGES
నాలుగు దశాబ్దాల తరువాత తీవ్ర ఘర్షణ
గత నాలుగు దశాబ్దాలలో భారత, చైనా సరిహద్దులో రేకెత్తిన అత్యంత తీవ్రమైన సంఘర్షణగా 2020 గల్వాన్ ఘర్షణలను పేర్కొన్నారు.
ఈ ఘర్షణలో 20 మంది భారత సైనికులు చనిపోయారు. తమ వైపు నష్టాన్ని భారత్ ప్రకటించింది.
చైనా మాత్రం ఆ వివరాలు స్పష్టం తెలుపలేదు. అయితే, చైనాకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని భారత్ పేర్కొంది.
గల్వాన్ వివాదం తరువాత ఇరు దేశాల ప్రతినిధుల మధ్య దశలవారీగా చర్చలు జరిగాయి. 2021 ఫిబ్రవరిలో ఇరుదేశాల విదేశాంగ మంత్రుల సమావేశం తరువాత డిసెంగేజ్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది.
ఇప్పటివరకు రెండు దేశాల మధ్య 14 రౌండ్ల సైనిక చర్చలు జరిగినా, పెద్దగా ఫలితం రాలేదు. చివరిగా జనవరి 12న చైనా చుషుల్-మోల్డో సరిహద్దుల్లో ఇరు దేశాల మధ్య కమాండర్ స్థాయి చర్చలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- పీఆర్సీకి వ్యతిరేకంగా ఈ నెల 5 నుంచి పెన్‌డౌన్, 7 నుంచి సమ్మె.. ఉద్యోగ సంఘాల నేతల ప్రకటన
- సిరియా: ఐసిస్ నాయకుడు ఖురేషీని అంతమొందించామని ప్రకటించిన అమెరికా
- క్రిప్టో కరెన్సీ ఆదాయంపై 30శాతం పన్ను.. బిట్‌కాయిన్ లీగల్ అయినట్లేనా?
- DJ Tillu-నేహా శెట్టి: ‘హీరోయిన్ ఒంటిపై ఎన్ని పుట్టుమచ్చలున్నాయో తెలుసుకున్నారా’ అంటూ జర్నలిస్టు ప్రశ్న, మండిపడుతున్న నెటిజన్లు
- పీఆర్సీకి వ్యతిరేకంగా ఈ నెల 5 నుంచి పెన్‌డౌన్, 7 నుంచి సమ్మె.. ఉద్యోగ సంఘాల నేతల ప్రకటన
- విశాఖ: చేప దాడిలో వ్యక్తి మృతి
- బలూచిస్తాన్‌లో తీవ్రవాదుల దాడి, ఏడుగురు పాకిస్తానీ సైనికులు మృతి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)















