విశాఖపట్నం: కొమ్ము కోనాం చేప దాడి.. కొమ్ముతో గుద్దడంతో వ్యక్తి మృతి

చేప

ఫొటో సోర్స్, ugc

    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

ఒక చేప దాడి చేయడంతో మత్స్యకారుడు మృతి చెందాడు.

ఈ సంఘటన విశాఖ జిల్లా ముత్యాలమ్మపాలెంతో జరిగింది.

ముత్యాలమ్మపాలెంకు చెందిన ఐదుగురు మత్స్యకారులు నిన్న సాయంత్రం సంప్రదాయ పడవలపై వేటకు వెళ్లారు.

తీరం నుంచి సుమారు ఎనిమిది కిలోమీటర్ల వరకు వెళ్లి అక్కడ చేపల కోసం వలలు వేశారు.

వీడియో క్యాప్షన్, ఈ గోల్డ్ ఫిష్ అమెరికాను భయపెడుతోంది

ఇవాళ ఉదయం 8 గంటల సమీపంలో వీరి వలకు చేపలు పడ్డాయి.

పడవ పై నుంచి వలను పైకి లాగుతుంటే బరువుగా ఉండటంతో దానిని పైకి లాగలేకపోయారు.

దీంతో వల చిక్కుకుందేమోనని చూసేందుకు జోగన్న అనే మత్స్యకారుడు పడవ నుంచి కిందకు దిగే ప్రయత్నం చేశారు.

ఆ సమయంలో చేప బలంగా దాడి చేసింది. దాంతో జోగన్న అక్కడే మృతి చెందారు. జోగన్న మృతదేహాన్ని మిగతా మత్స్యకారులు బయటకు తీసుకుని వచ్చారు.

మృతుడు

ఫొటో సోర్స్, ugc

దాడి చేసింది కొమ్ముకోనాం చేప

కొమ్ముకోనాం చేప దాడి చేసిందని తోటి మత్స్యకారులు చెప్పినట్లు పరవాడ సీఐ ఈశ్వరరావు తెలిపారు.

పదునైనా కత్తిలాంటి కొమ్మును కలిగి ఉండే కొమ్ముకోనాం చేపలకు సాధారణంగా దాడి చేసే గుణముంటుందని వేటకు వెళ్లిన మరో మత్స్యకారుడు గంగన్న తెలిపారు.

"ఈ కొమ్ముకోనాం వలకు దొరకడం కష్టమే. అంత సులభంగా దొరకవు. దొరికినా కొన్నిసార్లు వలను చీల్చుకొని తప్పించుకుంటాయి.

ఇవి బరువు ఎక్కువగా ఉండటంతో వలను పైకి లాగలేకపోయాం. కొమ్ముకోనాం చేప సైజులో పెద్దదిగా ఉండటంతో ఇది వలకు చిక్కిన రోజున మాకు చాలా ఆనందంగా ఉంటుంది.

అయితే అందరం బలంగా వలను పైకి లాగే సమయంలో జోగన్న కిందకు దిగేందుకు ప్రయత్నించాడు.

ఆ సమయంలోనే కోనాం చేప జోగన్నను గట్టిగా కొట్టింది. దాంతో జోగన్న అక్కడే సముద్రంలో పడిపోయాడు. ఛాతీపై బలంగా గాయమైంది" అని గంగన్న చెప్పారు.

వీడియో క్యాప్షన్, వల లేకుండా చేపలు పట్టడం ఇంత సులువా

మరో పడవపైకి ఎక్కించేందుకు...

"వలకు చిక్కిన కోనాం చేప బాగా బరువుగా ఉంది. దీంతో వలకు సమీపంలో ఉన్న పడవ కంటే పెద్ద పడవపైకి దీనిని తీసుకుని వచ్చేందుకు ప్రయత్నించాం. అందులో భాగంగా కొమ్ముకోనాం చిక్కిన వలను బలంగా లాగేందుకు ప్రయత్నం చేశాం.

ఎంత ప్రయత్నించినా రాకపోయే సరికి కిందకు వెళ్లి దానిని తోయాలని అనుకున్నాం. అందులో భాగంగా జోగన్న ముందుగా కిందకు దిగారు. దిగిదిగడంతోనే చేప ఒక్కసారిగా బలంగా కొట్టింది. అంతే జోగన్న పడిపోవడం, మా చేతుల్లో ఉన్న వల తాడును వదిలేయడం జరిగిపోయాయి.

వెంటనే మేం కిందకు దిగి జోగన్నను పైకి తీసుకుని వచ్చాం. కానీ అప్పటికే చనిపోయాడు" అని గంగన్న చెప్పారు.

వీడియో క్యాప్షన్, చుక్కల చేపలకు ఈత నేర్పగలరా?

'డిమాండ్‌తో పాటు ప్రమాదమూ ఉంది'

"ఇవి ఒక్కొక్కటి 20 నుంచి 250 కేజీల వరకు కూడా ఉంటాయి. పైగా ఇవి ఒక్కొక్కటిగా కాకుండా గ్రూపులుగా తిరుగుతుండటంతో ఒకేసారి పెద్ద మొత్తంలో వలకు చిక్కుతాయి.

అయితే అపాయం అని తలచినప్పుడు కొమ్మతో తోటి చేపలపైనా, మనుషులపైనా కూడా ఇది దాడి చేస్తుంది.

సాధారణంగా టూనా చేపకు మార్కెట్‌లో డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత అంతే డిమాండ్ ఉన్న చేప కొమ్ముకోనాం. ఇది ఎక్స్‌పోర్టు కూడా ఎక్కువగా అవుతుంది.

పెద్ద మొత్తంలో ఈ చేప చిక్కితే మత్స్యకారులు ఎక్స్‌పోర్టు చేసే వారికి వీటిని అమ్మేస్తారు. వల నుంచి బయటకు తీయకుండానే దీనిని సైజు ప్రకారం అంచనా వేసి దీనిని కొనేస్తారు. అంత డిమాండ్ ఉంటుంది.

దీనికి వంజరం అని కూడా మరో పేరు ఉంది. తీరం నుంచి సుమారు ఆరేడు నాటికన్ మైళ్లు దాటిన తర్వాత నుంచి ఈ కొమ్ముకోనాం చేప లభిస్తుంది.

ఈ చేపకు డిమాండ్ ఎంత ఉందో ఈ చేపతో ప్రమాదం అంతే ఉంది" అని ఏయూ జువాలజీ విభాగం ప్రొఫెసర్ మంజులత చెప్పారు.

చేప

ఫొటో సోర్స్, ugc

గతంలో ఇటువంటి కేసు చూడలేదు

చేపదాడిలో మృతి చెందిన జోగన్న మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు. ఈ మృతిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పరవాడ సీఐ ఈశ్వరరావు తెలిపారు.

అయితే చేప దాడి చేసిన కేసులు ఇంతకు ముందు ఎప్పుడు నమోదు కాలేదని సీఐ తెలిపారు.

వీడియో క్యాప్షన్, ఇమ్యూనిటీ కోసం చేపల బిస్కెట్లు..

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)