ఈ చేపలు ఈత కొట్టవు, కాళ్లతో నడుస్తాయ్

ఇక్కడేదో అనుమానాస్పదంగా కదులుతున్నట్లుంది!
ఇది చుక్కల చేప.
ఈ చుక్కల చేపల కదలికలు భలే విచిత్రంగా ఉంటాయి. ఇవి చేపలే అయినా గానీ, ఈత కొట్టవు. నీటి అడుగు భాగంలో నేలపై నెమ్మదిగా నడుస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటాయి.
"కోళ్లు కూడా పక్షులే అయినా అవి ఎక్కువ దూరం ఎగరలేవు, ఎక్కువ ఎత్తుకూ ఎగరలేవు. అలాగే ఇవి కూడా ఓ రకం చేపలే అయినా గానీ ఎక్కువదూరం ఈదలేవు" అని సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ టిమ్ లించ్ అన్నారు.
ఇవి ఎక్కువగా కదలవు. అలా ఓచోట కూర్చొని ఉన్నట్లుగా ఉండటానికే ఎక్కువ ఇష్టపడతాయి. వాటికి అలా ఉంటేనే సంతోషం.
1980కు ముందు టాస్మానియా ఆగ్నేయ తీరప్రాంతంలో ఇవి ఎక్కడ పడితే అక్కడ విరివిగా కనబడేవి. కానీ రానురాను వీటి సంఖ్య తగ్గిపోయింది.
ఇప్పుడు అరుదుగా, చాలా తక్కువ ప్రదేశాల్లో మాత్రమే కనిపిస్తున్నాయి. అందుకే వీటిని పరిరక్షించేందుకు శాస్త్రవేత్తలు ప్రయత్నిస్తున్నారు.
ప్రయోగశాలలో పునరుత్పత్తి చేసి... ఈ చుక్కల చేపల జాతిని రక్షించే దిశగా పరిశోధనలు చేస్తున్నారు.
ఈ ప్రక్రియ కోసం 9 రకాల ప్రదేశాల నుంచి చుక్కల చేపల్లో వయసు ఎక్కువగా ఉన్న వాటిని ఎంచుకుని తీసుకొచ్చారు. వాటి ద్వారా ఆ జాతిని అభివృద్ధి చేయడానికి చర్యలు తీసుకుంటున్నారు.
"అవి గుడ్లు పెట్టడం చూస్తే భలే సంతోషంగా ఉంది. మా దగ్గర ఇప్పుడు 70 వరకూ పిల్ల చుక్కల చేపలున్నాయి. ఆ చిన్న చేపలు నీటి అడుగున కదులుతుంటే ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఆ చేప పిల్లలను చూస్తుంటే ఈ జాతి అంతరించిపోకుండా ఆపలేకపోయినా... కనీసం మరికొన్ని రోజులు బతికేలా చేశామనే తృప్తి కలుగుతోంది" అని శాస్త్రవేత్తలు సంతోషపడుతున్నారు.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)









