గుంటూరు జిన్నా టవర్: ఆకుపచ్చగా ఉన్న ఈ టవర్‌కి భారత్ జెండా రంగులు ఎవరు., ఎందుకు వేశారు?

జిన్నా టవర్
    • రచయిత, వడిశెట్టి శంకర్
    • హోదా, బీబీసీ కోసం

గుంటూరులో సుదీర్ఘ చరిత్ర కలిగిన జిన్నా టవర్ రంగు మారింది.

గత కొంతకాలంగా ఈ టవర్ చుట్టూ చర్చ సాగుతోంది. జిన్నా టవర్ పేరు మార్చాలని ఏపీ బీజేపీ నేతలు డిమాండ్ చేయగా, ప్రభుత్వం దానిని తోసిపుచ్చింది.

తాజాగా గుంటూరు మునిసిపల్ కార్పోరేషన్ ప్రతినిధులు, స్థానిక నేతలు కలిసి జిన్నా టవర్‌కి మూడు రంగులు వేశారు.

అంతకు ముందున్న ఆకుపచ్చ రంగు స్థానంలో భారత త్రివర్ణ పతాకంలోని మూడు రంగులను టవర్‌కి అద్దారు. దాంతోపాటుగా టవర్ ప్రాంగణంలో జాతీయ జెండాను కూడా ఆవిష్కరించాలని అధికారికంగా నిర్ణయించారు.

వివాదం ఏమిటి?

పాకిస్తాన్ జాతిపితగా చెప్పుకునే ముహమద్ ఆలీ జిన్నా పేరుతో ఈ టవర్ గుంటూరులోని ప్రధాన కూడలిలో స్వాతంత్ర్యానికి ముందు నుంచే ఉంది.

1942లో గుంటూరు జిల్లాలో మతఘర్షణలు జరిగినపుడు స్థానిక కోర్టులో శిక్ష పడిన వారికి అండగా జిన్నా బొంబాయి హైకోర్టులో వాదించారు.

ఆ కేసులో నిందితులకు ఉపశమనం లభించింది. అదే సమయంలో భవిష్యత్తులో గుంటూరు ప్రాంతంలో మత సామరస్యం పెంపొందించాలనే లక్ష్యంతో ఈ టవర్ నిర్మించారు.

మహమ్మద్ అలీ జిన్నా

ఫొటో సోర్స్, Getty Images

అప్పట్లో గుంటూరు ఎమ్మెల్యేగా ఉన్న ఎస్.ఎం.లాల్ జాన్ బాషా చొరవతో నిర్మించిన ఈ టవర్ ప్రారంభానికి జిన్నా రావాల్సి ఉన్నప్పటికీ ఆయన రాలేకపోయారు.

జిన్నాకు బదులు ఆయన ప్రధాన అనుచరుడు జుదా లియాఖత్ అలీఖాన్ సమక్షంలో ఈ టవర్ ప్రారంభోత్సవం జరిగింది.

ఆ సభలో స్వాతంత్ర్య సమరయోధులు కొండా వెంకటప్పయ్య పంతులు, కాశీనాథుని నాగేశ్వర రావు, ఉన్నవ లక్ష్మీనారాయణ, కల్లూరి చంద్రమౌళి సహా పలువురు పాల్గొన్నట్టు రికార్డులు చెబుతున్నాయి.

జిన్నా పేరుతో ఇండియాతోపాటూ, పాకిస్తాన్‌లో కూడా ఎక్కడా మరో టవర్ లేకపోవడంతో దీనిని ప్రపంచంలోనే ఏకైక జిన్నా టవర్‌గా చెబుతారు. ఇది గుంటూరులో గత 70 ఏళ్లుగా ఉంది.

మొదట గుంటూరు మునిసిపాలిటీ, ఆ తర్వాత నగర పాలక సంస్థ పర్యవేక్షణలో ఈ టవర్ నిర్వహణ కొనసాగుతోంది.

1964లో ఈ టవర్ పేరు మార్చాలనే డిమాండ్ వచ్చింది. అప్పట్లో కొందరు మునిసిపల్ కౌన్సిల్‌లో కూడా దానిని ప్రతిపాదించారు. కానీ అది ఆమోదానికి నోచుకోలేదు. ఆ తర్వాత కార్గిల్ యుద్ధం సమయంలో కూడా జిన్నా టవర్ గురించి కొంత చర్చ జరిగింది.

ఇటీవల బీజేపీ నేతలు జిన్నా టవర్ పేరు మార్చాలని డిమాండ్ చేశారు. లేదంటే కూల్చేస్తామనే స్థాయిలో కొందరు హెచ్చరికలు చేశారు. దాంతో దీనిపై మరోసారి వివాదం రాజుకుంది.

గుంటూరులో జిన్నా టవర్

బీజేపీని తప్పుబట్టిన ప్రభుత్వ వర్గాలు

జిన్నా టవర్ పేరు మార్చాలని బీజేపీ నేతలు చేసిన హెచ్చరికలను రాష్ట్ర ప్రభుత్వం తీవ్రంగా తప్పుబట్టింది. మత రాజకీయాల కోసమే ఇలాంటి వివాదాలు రాజేస్తున్నారని వైసీపీ నేతలు విమర్శించారు.

ఇటీవల రిపబ్లిక్ డే సందర్భంగా కొందరు యువకులు జిన్నా టవర్‌పై జాతీయ జెండా ఎగురవేసేందుకు కూడా ప్రయత్నించడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు.

మత విద్వేషాలు రాజేసి లబ్ది పొందాలనే ప్రయత్నం తప్ప గుంటూరులో ఎలాంటి వివాదాలూ లేవని గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ ముస్తాఫా షేక్ అంటున్నారు.

వీడియో క్యాప్షన్, జిన్నా టవర్ గుంటూరులో ఎందుకుంది?

"ఇక్కడ ఎలాంటి వివాదం లేదు. కానీ బీజేపీ, ఆర్ఎస్ఎస్‌కు చెందిన కొందరు కావాలనే కుయుక్తులు పన్నారు. అందుకే వివాదం లేకుండా చేయాలని, జిన్నా టవర్‌కి మూడు రంగులు వేయాలని నిర్ణయించాం. జాతీయ జెండా కూడా ఎగురవేస్తాం. మత సామరస్యానికి ప్రతీకగా గుంటూరు నగరం ఉంది. దానికి నిలయంగానే జిన్నా టవర్ ఉంది. గుంటూరు నగర విశిష్టతను కాపాడేందుకే ఇలాంటి నిర్ణయం తీసుకున్నాం. ఈ టవర్ నిర్వహిస్తున్న మునిసిపల్ కార్పోరేషన్ ఆధ్వర్యంలోనే ఇదంతా జరుగుతోంది" అని బీబీసీకి చెప్పారు.

నగర మేయర్, ఇతర నేతలు అందరూ చర్చలు జరిపిన తర్వాతే జిన్నా టవర్‌కి జాతీయ జెండా రంగులు వేయాలని నిర్ణయించామని ఎమ్మెల్యే బీబీసీకి తెలిపారు.

జిన్నా టవర్ చుట్టూ ఇనుప ఫెన్సింగ్ కూడా ఏర్పాటు చేశారు. ఫిబ్రవరి 3న ఇక్కడ జాతీయ జెండా ఎగురవేసేందుకు స్తూపం కూడా సిద్ధం చేశారు. దీనికి మొత్తం రూ.5 లక్షలు ఖర్చు చేసినట్లు కార్పోరేషన్ అధికారులు బీబీసీకి చెప్పారు.

మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్
ఫొటో క్యాప్షన్, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్

వివాదం సమసిపోవాలి...

లౌకిక భారతదేశం విశిష్టతను చాటేవిధంగా గుంటూరులో అన్ని ప్రయత్నాలూ చేస్తున్నామని ఏపీ ప్రభుత్వ మైనార్టీ వ్యవహారాల శాఖ సలహాదారు, మాజీ ఎమ్మెల్యే జియావుద్దీన్ బీబీసీకి చెప్పారు.

టవర్ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన అప్పటి ఎమ్మెల్యే లాల్ జాన్ భాషాకి జియావుద్దీన్ మనవడు.

"జిన్నా టవర్‌ని వివాదం చేయాలని కొందరు ఆశిస్తున్నారు. కానీ అలాంటి అవకాశం ఇవ్వకూడదు. ముస్లిం మత పెద్దలంతా సహకరించారు. జిన్నా టవర్ అనేది గుంటూరులో ఓ ల్యాండ్ మార్క్ గా ఉంది. దాని ప్రతిష్టను కాపాడుకుంటాం. అందరూ కలిసి మెలిసి సాగాలని ఆశిస్తున్నాం. రాజకీయాల కోసం చరిత్రను తొలగించాలని కోరడం అసంబద్ధం. అందుకే జాతీయ జెండా కూడా అక్కడ ఎగురుతుంది" అన్నారు.

జిన్నా టవర్ చుట్టూ వివాదాలు రాజేయడం సరికాదని జియావుద్దీన్ అభిప్రాయపడ్డారు.

బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

ఫొటో సోర్స్, FB/Somu veerraju

ఫొటో క్యాప్షన్, బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు

జిన్నా పేరు మార్చాల్సిందే..

మరోవైపు టవర్‌కు జిన్నా పేరు మార్చి వేరే జాతీయ నేతల పేర్లు పెట్టాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు డిమాండ్ చేస్తున్నారు.

"జిన్నా టవర్ పేరు మీద అభ్యంతరం ఉంది. దానికి అబ్దుల్ కలాం గానీ మరొకరు జాతీయ నేత పేరు పెట్టాలి. దేశ విభజనకు కారణమైన వారి పేరుతో మన గడ్డ మీద టవర్ కొనసాగించడంపైనే మేము నిరసన తెలుపుతున్నాం. పేరు మార్చే వరకూ మేము ఊరుకోం. జాతీయ జెండా రంగులు వేయడం ఆహ్వానించదగినదే. కానీ టవర్ పేరు మార్చేవరకూ మేము వెనక్కి తగ్గం" అని ఆయన స్పష్టం చేశారు.

జిన్నా టవర్ పేరు పేరు మార్చాలని గత నెలలో బీజేపీ నేతలంతా ఒక్కసారిగా ప్రకటనలు చేశారు. ఏపీ బీజేపీ వ్యవహారాల ఇన్ఛార్జ్ కూడా ఇదే డిమాండ్ చేశారు. ఆ తర్వాత కొందరు స్థానిక బీజేపీ అనుబంధ సంస్థల నేతలు దానికోసం ఆందోళనలు కూడా నిర్వహించారు. ఇప్పుడు టవర్ రంగులు మార్చిన తరుణంలో దాని పేరు మార్చాల్సిందేనని ఆ పార్టీ నేతలు కోరుతున్నారు.

జిన్నా టవర్

రాజకీయం చేయడం తగదు

రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం సరికాదని, జిన్నా టవర్ పేరుతో ఇప్పుడు గుంటూరులో వివాదాలు సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని స్థానికులు అంటున్నారు.

"బీజేపీ నేతల తీరు అభ్యంతరకరం. ఏపీలో మత విద్వేషాలు రగల్చాలనే ప్రయత్నం సరికాదు. ప్రజలు సహించరు. గుంటూరులో మైనార్టీలు సంఖ్య ఎక్కువ. కానీ ఎన్నడూ ఎలాంటి వివాదాలూ లేవు. అలాంటి ప్రాంతంలో జిన్నా టవర్ ఆధారంగా విభజనకు పూనుకోవడం తగదు. ఆపార్టీ నేతలే పాకిస్తాన్ వెళ్లి జిన్నాని కొనియాడారు. జిన్నా వారసుడు నస్లీ వాడియా నుంచి నిధులు కూడా తీసుకుని పార్టీ కార్యక్రమాలు చేసినట్టు గతంలోనే అంగీకరించారు. కానీ, ఇప్పుడు గుంటూరులో వివాదం కోసం యత్నిస్తున్నారు. ఇక వివాదానికి తెరదించడం మంచిది" అని గుంటూరులోని అడ్వొకేట్ ఎం.రవీంద్ర అభిప్రాయపడ్డారు.

జిన్నా టవర్ ఇటీవల కొంత శిథిలమవుతున్న తరుణంలో తాజా వివాదం వల్ల టవర్ పటిష్టత కోసం కొంత ప్రయత్నం జరగడం ఆహ్వానించదగిన పరిణామం అని ఆయన బీబీసీతో అన్నారు. చారిత్రక ఆనవాళ్లను కాపాడుకుంటే భవిష్యత్తు తరాలకు ఆనాటి విశిష్టతను అందించడానికి వీలవుతుందని అభిప్రాయపడ్డారు.

జిన్నా టవర్ చుట్టూ వివాదం చెలరేగడం, చివరకు దానికి జాతీయ జెండా రంగులు అద్దడంతో ఈ వ్యవహారం ఇప్పుడు కొత్త మలుపు తీసుకున్నట్టయ్యింది.

వీడియో క్యాప్షన్, తాజ్‌మహల్‌లో బ్రిటిషన్లు ఏమేం దోచుకెళ్లారో తెలుసా

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)