హైమెనోప్లాస్టీ: కన్యత్వ శస్త్రచికిత్సలపై బ్రిటన్‌లో ఎందుకు నిషేధం విధించాలని చూస్తున్నారు?

హైమెనోప్లాస్టీ

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, రాజ్‌దీప్ సంధు
    • హోదా, బీబీసీ ప్రతినిధి

కన్యత్వ పొరగా పిలిచే ‘‘హైమెన్’’కు మరమ్మతుచేసే కాస్మెటిక్ శస్త్ర చికిత్సలపై నిషేధం విధించాలని బ్రిటన్‌ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోంది.

కొన్ని ప్రాంతాల్లో ఈ పొరను మహిళల కన్యత్వానికి గుర్తుగా భావిస్తారు. దీనితో మహిళల గౌరవానికి ముడిపెడుతుంటారు. దీంతో ఈ పొరను మళ్లీ సృష్టించేందుకు కొందరు హైమెనోప్లాస్టీ శస్త్రచికిత్సలను ఆశ్రయిస్తుంటారు.

అయితే, కన్వత్వ పరీక్షలతోపాటు ఈ చికిత్సలపైనా నిషేధం విధించాలని బ్రిటన్ భావిస్తోంది.

దేశంలోని మహిళలు, యువతుల హక్కుల పరిరక్షణకు తాము కట్టుబడి ఉన్నట్లు బ్రిటన్‌లోని మానసిక ఆరోగ్య శాఖ మంత్రి గిలియన్ కీగన్ చెప్పారు.

హైమెనోప్లాస్టీ

ఫొటో సోర్స్, Getty Images

బ్రిటన్‌లో హైమెనోప్లాస్టీ చికిత్సకు దాదాపు రూ.3 లక్షలు (3,000 యూరోలు) వరకు క్లినిక్‌లు వసూలు చేస్తున్నాయి.

యోని ముఖద్వారాన్ని కప్పి ఉంచే హైమెన్‌గా పిలిచే సన్నని పొరను మళ్లీ సృష్టించేందుకు ఈ చికిత్స నిర్వహిస్తారు.

అయితే, ఈ పొర లేకపోయినంత మాత్రాన సెక్స్‌లో పాల్గొన్నట్లు భావించకూడదని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇదివరకు చాలాసార్లు స్పష్టంచేసింది.

రుతుస్రావ సమయంలో ఉపయోగించే టెంపోన్లతోనూ ఈ పొర దెబ్బతినే అవకాశముంది. స్పోర్ట్స్ ఆడేటప్పుడు కూడా ఇది దెబ్బతినొచ్చు.

చాలా ప్రాంతాల్లో పెళ్లైన తర్వాత తొలిసారి సెక్స్‌లో పాల్గొన్నప్పుడు ఈ పొర నుంచి రక్తస్రావమైతేనే సదరు మహిళ కన్యగా భావిస్తారు.

20కిపైగా దేశాల్లో ఇప్పటికీ కన్యత్వ పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైమెన్ పొర భద్రంగా ఉందో లేదో ఈ పరీక్ష ద్వారా చూస్తారు.

హైమెనోప్లాస్టీ

ఫొటో సోర్స్, Thinkstock

టీనేజీలో ఉన్నప్పుడు తనపై అత్యాచారం జరిగిందని అలీనా (పేరు మార్చాం) చెప్పారు. ఆ ఘటన తర్వాత హైమెనోప్లాస్టీ శస్త్రచికిత్స చేయించుకోవాలని కుటుంబం తనపై ఒత్తిడి తీసుకొచ్చిందని ఆమె వివరించారు.

‘‘నేను ఒంటరినైపోయినట్లు అనిపించింది. నా భుజాలపై బరువు మోస్తున్నట్లు, నా మాటకు విలువ లేనట్లు కూడా అనిపించింది.’’

శస్త్రచికిత్సకు ఆమె నిరాకరించారు. అయితే, ఆమెపై కుటుంబ సభ్యుల ఒత్తిడి కొనసాగింది. ఈ పరిస్థితి నుంచి తప్పించుకునేందుకు హైమెన్ పొరకు ప్రాధాన్యం ఇవ్వని వ్యక్తిని ఆమె పెళ్లి చేసుకున్నారు.

ఆ శస్త్రచికిత్స చేయించుకుకోకుండా ఒత్తిడికి ఎదురు నిలబడినందుకు ఇప్పుడు గర్వంగా ఉందని ఆమె వివరించారు.

‘‘నేను సరైన నిర్ణయం తీసుకున్నానని నాకు తెలుసు. నా కుటుంబ సభ్యులు వారి పరువు ప్రతిష్ఠల కోసం నాపై ఒత్తిడి తీసుకొచ్చేవారు’’అని ఆమె చెప్పారు.

హైమెనోప్లాస్టీ

ఫొటో సోర్స్, Getty Images

ఐదేళ్ల జైలు

హైమెనోప్లాస్టీ చికిత్సను నిషేధిస్తూ చట్టాన్ని తీసుకురాబోతున్నట్లు గతేడాది బ్రిటన్ ప్రభుత్వం వెల్లడించింది.

ప్రస్తుతం ఈ శస్త్రచికిత్స చేయించుకోవాలని ఒత్తిడితెస్తే ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించేలా నిబంధనలు తీసుకొచ్చారు.

కన్యత్వ పరీక్షలపై నిషేధం విధిస్తూ గత ఏడాది ప్రతినిధుల సభలో ప్రభుత్వం ఓ బిల్లును కూడా ప్రవేశపెట్టింది. కన్యత్వ పరీక్షలకు, హైమెనోప్లాస్టీకి దగ్గర సంబంధముందని మహిళా హక్కుల ఉద్యమకారులు చెబుతున్నారు.

‘‘ఇలాంటి పరీక్షల కోసం ఒత్తిడికి గురయ్యే అమ్మాయిలకు బలవంతపు పెళ్లిళ్లు చేసుకోవాల్సిన ముప్పు ఎక్కువ’’అని హైమెనోప్లాస్టీపై నిషేధం కోసం పనిచేసిన ఇరానియన్, కుర్దిష్ మహిళా హక్కుల సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డయానా నమ్మి చెప్పారు.

‘‘హైమెనోప్లాస్టీతో చాలా ఒత్తిడి ఉంటుంది. దాదాపు సగం కేసుల్లో ఈ చికిత్స తర్వాత సెక్స్‌లో రక్తస్రావం కాకపోవచ్చు కూడా. ఫలితంగా పరువు హత్యలకు కూడా దారితీయొచ్చు’’అని ఆమె వివరించారు.

‘‘ఈ చికిత్సలపై తల్లిదండ్రులకు, అమ్మాయిలకు అవగాహన కల్పించేందుకు కాస్త సమయం పడుతుంది’’అని మిడిల్ ఇస్టర్న్ విమెన్ అండ్ సొసైటీ ఆర్గనైజేషన్ (ఎంఈడబ్ల్యూఎస్‌వో) వ్యవస్థాపకురాలు హలేలే తహేరి చెప్పారు.

కుద్దిష్ అయిన గోలాలే సిమిలితో తహేరి కలిసి పనిచేశారు. కన్యత్వంపై చాలా విశ్వాసం ఉండే సమాజంలో సిమిలి పెరిగారు. తన పెళ్లికి ముందు కన్యత్వ ధ్రువీకరణ పత్రాన్ని కూడా ఆమె తీసుకోవాల్సి వచ్చింది. తను చాలా ఒత్తిడికి గురైనట్లు ఆమె చెప్పారు.

2017లో ఆమె బ్రిటన్‌కు వచ్చారు. అయితే, అప్పుడే తన కుమార్తె కన్య కాదనే విషయాన్ని ఆమె తెలుసుకున్నారు. ఆందోళనకు గురైన ఆమె హైమెనోప్లాస్టీ చికిత్స గురించి ఆరాతీశారు. అయితే, ఎంఈడబ్ల్యూఎస్‌వోలో చేరిన తర్వాత తన కుమార్తెపై ఇలాంటి చికిత్సల కోసం ఒత్తిడి తీసుకురాకూడదని ఆమె నిర్ణయించుకున్నారు.

వీడియో క్యాప్షన్, యవతలో ఎక్కువగా వచ్చే లైంగిక వ్యాధి ఇదే

వేధింపులు..

కర్మ నిర్వాణ స్వచ్ఛంద సంస్థ కోసం ఇందిరా వర్మ పనిచేస్తున్నారు. తాము హైమెన్ శస్త్రచికిత్స చేయించుకున్నామని అంగీకరించడానికి కూడా మహిళలు అంత తేలిగ్గా ఒప్పుకోరని ఆమె చెప్పారు.

చాలావరకు ఈ చికిత్సలు క్లినిక్‌లలో నిర్వహిస్తారు. అయితే, కొన్నిసార్లు ఇళ్లలోనూ వీటిని చేస్తుంటారు.

‘‘పెద్దలు లేదా డాక్టర్లు ఈ చికిత్సల కోసం ఇంటికి కూడా వస్తారు. వారు భారీ మొత్తంలో డబ్బులు తీసుకుంటారు. దీని వల్ల ఆ అమ్మాయిలు క్లినిక్ వరకు వెళ్లాల్సిన అవసరం ఉండదు’’అని ఇందిర చెప్పారు.

‘‘ఇదొక అండర్‌గ్రౌండ్ పరిశ్రమ లాంటిది. చాలా మంది ఈ చికిత్సలను చేయించుకుంటారు. ఆ అమ్మాయిలు వేధింపులు, ఒత్తిడికి కూడా గురవుతుంటారు.’’

వీడియో క్యాప్షన్, నటి భావనపై లైంగిక దాడి కేసు: ఆ రోజు ఏం జరిగింది? నిందితులు ఎవరు?

‘‘విదేశాలకు వెళ్తారు’’..

ఈ చికిత్సలపై నిషేధం విధించడాన్ని లండన్‌లో హార్లే స్ట్రీట్‌లో ఓ ప్రైవేటు క్లినిక్ నడుపుతున డాక్టర్ ధీరజ్ భర్ ఖండించారు. ‘‘నేను ఎప్పుడూ కన్యత్వ పరీక్షలు నిర్వహించలేదు. కానీ హైమెనోప్లాస్టీ చేస్తుంటాను. దీని కోసం రూ.3 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు ఖర్చు అవుతుంది. 45 నిమిషాలపాటు ఈ చికిత్స కొనసాగుతుంది’’అని ఆయన వివరించారు.

ఈ చికిత్సపై నిషేధం విధిస్తే, కొందరి మహిళల జీవితాలు ప్రమాదంలో పడతాయని ఆయన అన్నారు. నిషేధానికి బదులు ఈ చికిత్సలను నియంత్రించాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘‘ఈ చికిత్సలపై నిషేధం విధిస్తే, దొంగచాటుగా వీటిని నిర్వహిస్తుంటారు. లేదా ఈ చికిత్సల కోసం విదేశాలకు వెళ్తుంటారు. ఇది చాలా పెద్ద విషయం’’అని ఆయన వివరించారు.

‘‘నా దగ్గరకు చికిత్స కోసం వచ్చే అమ్మాయిల్లో చాలా మంది కుటుంబం, సమాజం ఒత్తిడి వల్లే వస్తుంటారు. కానీ వారు చికిత్స బలవంతంగా చేయించుకోరు’’అని ఆయన అన్నారు.

‘‘సమాజం వారిని ఆమోదించాలని వారు భావిస్తుంటారు. అందుకే ఈ చికిత్సలు చేయించుకుంటారు’’అని ఆయన చెప్పారు.

కుటుంబం బలవంతపెట్టడం వల్ల అమ్మాయిలు వచ్చినట్లు అనిపిస్తే తాను చికిత్స చేయబోనని ఆయన అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)