విశాఖలో ‘పుస్తకాలు, అట్టల కోసం ఇంటికి రమ్మని 14 మంది బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు’ అంటూ వ్యక్తికి దేహశుద్ధి

పిల్లలపై లైంగిక దోపిడీ

ఫొటో సోర్స్, iStock

ఫొటో క్యాప్షన్, ప్రతీకాత్మక చిత్రం
    • రచయిత, లక్కోజు శ్రీనివాస్
    • హోదా, బీబీసీ కోసం

చాక్లెట్లు, పుస్తకాలు, పెన్నులు ఆశ చూపి విశాఖ మల్కాపురం పోలీస్ స్టేషన్ పరిధిలో బాలికలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడంటూ చిన్నారావు అనే వ్యక్తిని పిల్లల తల్లిదండ్రులు చితకబాదారు.

నిందితుడికి గాయాలు కావడంతో అతన్ని కేజీహెచ్‌కు పంపారు.

చిన్నారావుపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు.

'పుస్తకాలు ఇచ్చి...అట్టల కోసం ఇంటికి రమ్మన్నాడు'

వీడియో క్యాప్షన్, ‘పుస్తకాలు, అట్టల కోసం ఇంటికి రమ్మని 14 మంది బాలికలతో అసభ్యంగా ప్రవర్తించాడు’

పోలీసులు, బాధితులు చెప్పిన వివరాల ప్రకారం.. చిన్నారావు తరచూ స్థానిక ప్రభుత్వ పాఠశాలకు వెళ్లి పిల్లలకు పుస్తకాలు, పెన్సిల్స్, అట్టలు ఇస్తూ ఉంటారు. అందులో భాగంగా డిసెంబర్ 2వ తేదీన కూడా ఒక పాఠశాలకు వెళ్లి చిన్నారులకు బహుమతులు అందించారు.

అట్టలు అయిపోయాయి, ఇంటికి వస్తే ఇస్తానని కొందరు బాలికలతో చెప్పాడు. అతని దురుద్దేశం తెలియని బాలికలు చిన్నారావు ఇంటికి వెళ్లారు. అక్కడ నుండి ట్యూషన్‌కు వెళ్లిన బాలికలు అందోళనతో కనిపించారు. ట్యూషన్ టీచర్ విషయం అడగడంతో చిన్నారావు తమతో అభస్యంగా ప్రవర్తించారని చెప్పారు. మరికొందరు బాలికలు కూడా గతంలో తమతో కూడా అలాగే ప్రవర్తించాడని తెలిపారు.

ఈ విషయం తెలిసిన తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి చిన్నారావును పిలిపించాలని ప్రధానోపాధ్యాయుడిని అడిగారు. చిన్నారావు పాఠశాలకు రాగానే తల్లిదండ్రులు అతడ్ని నిలదీశారు. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అప్పటికే అగ్రహాంతో ఉన్న తల్లిదండ్రులు చిన్నారావుకు దేహశుద్ది చేశారు.

వీడియో క్యాప్షన్, తోడపుట్టిన వాడే కన్నబిడ్డలపై అత్యాచారం చేశాడు

'14 మంది బాలికలను వేధించాడు'

అదే సమయంలో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. తల్లిదండ్రులతో పాటు ఉన్న బాలికలతో మహిళా పోలీసులు మాట్లాడారు. ఆ సమయంలో తమతో చిన్నారావు ఎలా ప్రవర్తించింది బాలికలు పోలీసులకు చెప్పారు. ఇలా మొత్తం 14 మంది నాలుగు, ఐదు, ఆరు తరగతులకు చెందిన బాలికలు అతడి వేధింపులకు గురైనట్లు పోలీసులకు తెలిపారు.

అసలు చిన్నారావును పాఠశాలకు పదేపదే ఎందుకు రానిస్తున్నారంటూ తల్లిదండ్రులు అగ్రహాం వ్యక్తం చేశారు.

"నిజానికి చిన్నారావు ఎటువంటి వాడనేది మాకు తెలియదు. కాకపోతే పిల్లలకు ఉపయోగపడే పుస్తకాలు, పెన్సిల్స్ ఇస్తున్నాడని, అలాగే ఏవైనా సేవాకార్యక్రమాలు చేస్తానని చెప్పడంతో అతడిని అనుమతించాము. పైగా అతని కుమార్తె కూడా ఇదే పాఠశాలలో చదువుతోంది. మరి అతడిని పాఠశాలలోకి రానివ్వకుండా ఉండలేం కదా? అతడు ఇలాంటి వాడని అనుకోలేదు" అని జీవీఎంసీ ప్రకాష్ నగర్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వెంకటరమణ చెప్పారు.

వీడియో క్యాప్షన్, యవతలో ఎక్కువగా వచ్చే లైంగిక వ్యాధి ఇదే

పోక్సో కేసు నమోదు

బాలికల తల్లిదండ్రులు కొట్టడంతో చిన్నారావు గాయాలపాలైయ్యాడు. దాంతో అతడిని కేజీహెచ్‌కు తరలించి చికిత్స అందిస్తున్నారు. హార్బర్ ఏసీపీ శిరీష ఈ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

"బాధితుల ఫిర్యాదు మేరకు చిన్నారావుపై పోక్సో కేసు నమోదు చేశాం. బాలికలు చెప్పిన వివరాల మేరకు లైంగిక వేధింపులు జరిగినట్లు ప్రాథమికంగా తెలిసింది. అతన్ని అరెస్ట్‌ చేసి ఆసుపత్రికి పంపాం. తదుపరి దర్యాప్తు చేస్తున్నాం'' అని హార్బర్‌ ఏసీపీ శిరీష తెలిపారు.

వీడియో క్యాప్షన్, అత్యాచార బాధితులు: "ఆయన నన్ను తాకినప్పుడల్లా నేను వేదనకు లోనవుతుంటాను"

చిన్నారావు ఎవరు?

మల్కాపురం ప్రాంతానికి చెందిన దోమాన చిన్నారావు మూడేళ్ల కిందట 'చిన్నారావు వెల్ఫేర్‌ సొసైటీ' పేరుతో ఒక సంస్థను నెలకొల్పాడు. దాని ద్వారా పలువురికి సన్మానాలు చేయడం, పోటీలు నిర్వహించడం, బహుమతులు ఇవ్వడం, పాఠశాలల విద్యార్థులకు పుస్తకాలు, అట్టలు, పెన్నులు ఉచితంగా పంపిణీ వంటివి చేస్తుంటాడు.

మల్కాపురం పరిధిలో ఉన్న ప్రకాశ్‌నగర్‌ జీవీఎంసీ ఉన్నత పాఠశాల, సమీపంలోని ప్రాథమిక పాఠశాలల్లో ఈ తరహా కార్యక్రమాలు ఎక్కువగా చేస్తున్నాడు.

అయితే ఇదే సమయంలో పిల్లలపై, మహిళలతో అభస్యంగా ప్రవర్తించడం, ఆస్తి వివాదాల్లో తలదూర్చి లబ్ధిపొందడం వంటి ఆరోపణలపై కొందరు బాధితులు చిన్నారావుపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసులు పెట్టారు. అవి ఎక్కువకావడంతో 2017లో అతనిపై మల్కాపురం పీఎస్‌లో రౌడీ షీట్ ఓపెన్ చేశారు.

వీడియో క్యాప్షన్, చైనాలో వీగర్ ముస్లింలపై రేప్‌లు.. తీవ్రమైన లైంగిక హింస.. బయటపెట్టిన బాధితులు

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)