లైంగిక వేధింపులు: ‘నేను స్కూల్‌కి వెళ్లను... అతను నన్ను రేప్ చేశాడు’ - తల్లితో 12 ఏళ్ల బాలిక చెప్పిన చివరి మాటలివి

- రచయిత, హన్నా ప్రైస్
- హోదా, బీబీసీ ప్రతినిధి
హెచ్చరిక: ఈ కథనంలో లైంగిక వేధింపులకు సంబంధించిన వివరాలు ఉన్నాయి.
జరా మెక్‌డెర్మాట్ వయసు 21 సంవత్సరాలు. ఒక రోజు నడుచుకుంటూ ఇంటికి వెళ్తోంది. కొన్ని నిమిషాల్లో ఇంటికి చేరుకుంటుంది.
కానీ అంతలోనే ఊహించని ఘటన జరిగింది. ఆమెను ఫాలో అవుతూ వస్తున్న ఒక టీనేజర్ ఆమెను బలవంతంగా గోడ వైపునకు నెట్టేశాడు. ఆమెను గోడకు అదిమిపట్టి, ఆమె బట్టలు తొలగించే ప్రయత్నం చేశాడు. తన చేతులను ఆమె ప్యాంటులోపల పెట్టేందుకు ప్రయత్నించాడు.
పట్ట పగలే ఇదంతా జరిగింది. జరా అదృష్టవంతురాలు. రోడ్డుపై వెళ్తున్న వాళ్లు ఇదంతా చూసి సాయం చేయడానికి పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. దాంతో ఆ టీనేజర్ పారిపోయాడు. లైంగిక దాడి నుంచి ఆమె తప్పించుకోగలిగారు.
"అతనొక స్కూల్ విద్యార్థి. అతనికి సుమారు 15ఏళ్లు ఉండొచ్చు" అని ఆనాటి ఘటనను జరా గుర్తు చేసుకున్నారు.
ఈ ఘటనపై ఆమె పోలీస్ కేసు పెట్టింది. కానీ పోలీసులు ఆ టీనేజర్‌ను పట్టుకోలేకపోయారు.
అత్యాచారం ఆలోచనలు చిన్న వయసులోనే అబ్బాయిలకు ఎందుకొస్తాయని ఈ ఘటనతో ఆమె ఆలోచించడం మొదలుపెట్టారు.
"నేను అతన్ని కలవాలనుకున్నాను. ఎందుకంటే ఈ ఆలోచనలు మరిన్ని దారుణాలకు దారి తీయొచ్చు" అని ఆమె చెప్పారు.
2018లో 'లవ్ ఐలాండ్' షోలో కనిపించిన తర్వాత జరా పాపులర్ అయ్యారు. అప్పటి నుంచి ఆమె మోడల్‌గా, సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్‌గా పని చేస్తున్నారు.
కానీ ఈ చేదు ఘటనను మాత్రం ఆమె మర్చిపోలేకపోయారు.

'11, 12 ఏళ్ల అబ్బాయిల నుంచి కూడా నాకు మెసేజ్‌లు వస్తున్నాయి'
అత్యాచారాలు, లైంగిక వేధింపులు పెరగడంపై సోమ సరా అనే అమ్మాయి తన అనుభవాన్ని ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇది ప్రపంచవ్యాప్తమవుతుందని ఆమె అప్పుడు అనుకోలేదు. కానీ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన తర్వాత మెసేజ్‌లు వరదలా వచ్చిపడ్డాయి.
ఆమె ఒక్క కథ వేలాది మంది కథగా మారిపోయింది. అందుకే ఆమె 'ఎవ్రీవన్ ఈజ్ ఇన్‌వైటెడ్' (అందరికీ ఆహ్వానం) స్థాపించారు.
స్కూళ్లలో అత్యాచార సంస్కృతి తమపై ఎలాంటి ప్రభావం చూపిస్తోందో తమ ఆచూకీ బయటపెట్టకుండానే చర్చించే వేదిక ఇది.
అనేక ప్రైవేటు, ప్రభుత్వ స్కూళ్లపై విమర్శలు వచ్చాయి. బ్రిటన్‌లోని స్కూళ్లపై ఈ ఉద్యమం తీవ్ర ప్రభావం చూపించింది.
ఇటీవల స్కూళ్లలో ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ.. ఎంతగా చర్చిస్తున్నప్పటికీ.. ఇప్పటికీ తనకు బాలుర నుంచి సందేశాలు వస్తున్నాయని జరా చెబుతున్నారు.
"11, 12 సంవత్సరాలు, చివరికి ఏడేళ్ల వయసున్న అబ్బాయిల నుంచి నాకు లైంగికపరమైన సందేశాలు వస్తున్నాయి. లైంగిక విషయాలను అడుగుతున్నారు. ఆ వయసులో ఉన్నప్పుడు.. అసలు అవంటే ఏంటో కూడా నాకు తెలియదు" అని ఆమె చెప్పారు.
స్కూళ్లలో లైంగిక వేధింపులు.. బాధితులపై జీవితాంతం ప్రభావం చూపుతాయని, ఆ చేదు జ్ఞాపకాల నుంచి వారు బయటపడలేరని తన తాజా డాక్యుమెంటరీలో ఆమె చెప్పారు.
"ప్రతి స్కూల్‌లో లైంగిక వేధింపుల సమస్య ఉంది. ప్రతి ఒక్క అమ్మాయీ వేధింపులను ఎదుర్కోవడమో లేదా అలాంటి అనుభవం ఎదురైన వారి గురించి ఆమెకు తెలిసి ఉండటమో జరిగింది. ఇదెంతో బాధకరమైన విషయం" అని ఆమె అన్నారు.
అత్యాచారానికి గురైన ఒక బాలిక తన పేరు బయటపెట్టకుండా తన పరిస్థితిని వివరించింది. స్కూల్‌లో తనకు జరిగిన విషయాన్ని రిపోర్ట్ చేయడానికి కూడా చాలా భయమేసిందని ఆమె చెప్పారు.
"లైంగిక వేధింపుల గురించి తాము చెప్పినా నమ్ముతారన్న గ్యారెంటీ లేదని, ఒకవేళ ధైర్యం చేసి చెప్పినా.. దాని తర్వాతి పరిణామాలు అత్యాచారం కంటే ఘోరంగా ఉంటాయని చాలామంది అమ్మాయిలు భావిస్తున్నారని మేము గుర్తించాం. ఇది చాలా బాధాకరమైన సమస్య" అని జరా చెప్పారు.
'ఎవ్రీవన్ ఈజ్ ఇన్‌వైటెడ్' చొరవతో బ్రిటన్ ప్రభుత్వం ఒక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసింది. స్కూళ్లలో లైంగిక వేధింపులపై సమీక్ష చేసింది.
ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లలో అమ్మాయిలు వేధింపులకు గురికాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది.
ప్రభుత్వం 2021 ఏప్రిల్‌లో హెల్ప్‌లైన్ ప్రారంభించింది. అప్పటి నుంచి బలవంతం చేయడం, సన్నిహితంగా ఉన్న ఫొటోలను దుర్వినియోగం చేయడం, లైంగిక వేధింపులకు సంబంధించిన 800 ఫిర్యాదులు వచ్చాయి.
తమకు ఎదురైన పరిస్థితి గురించి బయటకు చెప్పాలనుకోలేదని, చెప్పినా ఎవరూ పట్టించుకోరేమోనని అనుకున్నామని ముగ్గురు బాధిత అమ్మాయిలు చెప్పారని హెల్ప్‌లైన్ సర్వీస్ హెడ్ శాండ్రా రాబిన్‌సన్ చెప్పారు.

ఫొటో సోర్స్, RACHEL HALLIWELL
'అత్యాచారం చేశాడు.. వేధించారు.. బెదిరించారు'
"నేను స్కూల్‌కి వెళ్లను. అతను నన్ను రేప్ చేశాడు"
సమీనా హల్లివెల్ అనే అమ్మాయి చనిపోవడానికి ముందు తన తల్లి రేచల్‌తో చెప్పిన చివరి మాటలివి. ఆ అమ్మాయి వయసు 12 సంవత్సరాలు.
తను ఎప్పుడూ సంతోషంగా ఉండేది. పాటలు, డాన్స్ అంటే తనకు చాలా ఇష్టం. డిస్నీ సినిమాలను తను ఎంతో ఇష్టపడేది. తను చాలా అందంగా ఉండేదని కూతుర్ని గుర్తు చేసుకుంటూ రేచల్ చెప్పారు.
2020 సెప్టెంబర్‌లో సమీనా ఏడో తరగతిలో చేరాల్సి ఉంది. కోవిడ్-19 కారణంగా తను ఒక ఏడాది కోల్పోయింది.
కానీ కొన్ని వారాల తర్వాత రాత్రికి రాత్రే తన ప్రవర్తన మారిపోయిందని రేచల్ చెప్పారు. సమీనా మూడీగా మారిపోయింది. ఎవ్వరితో మాట్లాడేది కాదు. ఫోన్‌కు అతుక్కుపోయి ఉండేదని రేచల్ గుర్తు చేసుకున్నారు.
సమీనా తనను తాను గాయపర్చుకోవడం అప్పుడే మొదలైంది. సమీనా చిల్ట్రన్ అండ్ అడోలసెంట్ మెంటల్ హెల్త్ సర్వీస్‌కు వెళ్లి ఎవర్నో కలిసి వచ్చేది.
స్కూల్‌కు చెందిన ఒక అబ్బాయి నుంచి సమీనాకు మెసేజ్‌లు వస్తున్నాయని రేచల్ మార్చిలో గుర్తించారు.
అతను మంచివాడేనని, తనతో బాగానే ఉంటాడని సమీనా మొదట తన తల్లికి చెప్పింది. ఇది కొన్ని వారాలు సాఫీగానే సాగింది. ఆ తర్వాత బెదిరింపులు మొదలయ్యాయి.
"నగ్నంగా ఉన్న నీ ఫొటోలు పంపికపోతే నేను నిన్ను బ్లాక్ చేస్తాను" అని స్నాప్‌చాట్‌లో మెసేజ్‌లు పంపించాడని సమీనా గతంలో చెప్పింది. ఆమె దానికి ఒప్పుకోకపోతే, ఒకసారి కలుద్దామని అతను బతిమిలాడేవాడు.
కలుద్దామని పదే పదే అడిగే సరికి, ఆ పోరు భరించలేక చివరికి అతన్ని కలిశానని సమీనా తనకు చెప్పిందని రేచల్ తెలిపారు.
మదర్స్ డేకి ఒకరోజు ముందు సమీనా తన బాధనంతా తల్లికి చెప్పేసింది.
"అతను తనను రేప్ చేశాడని సమీనా చెప్పింది. ఆ క్షణం ఎలాంటిదో నేను వివరించలేను" అని రేచల్ అన్నారు.
"అది విన్న తర్వాత తన గురించి నేను కన్న కలలు ఎలా ముక్కలయ్యాయో నేను వివరించలేను. నా చిట్టి తల్లిని చిదిమేశాడు" అని కన్నీరు పెట్టుకుంది.
ఆ తర్వాత సమీనా ఆన్‌లైన్ వేధింపులకు గురయ్యిందని, ఇతరుల నుంచి వేధింపులను ఎదుర్కొందని రేచల్ చెప్పారు.
ఆ వేధింపులు కొనసాగుతూనే ఉన్నాయి. తనను వేధించారు. బెదిరించారు. కొట్టారు. ఆమెను తిట్టారు. అబద్దాలకోరని ముద్ర వేశారు.
ఆ అబ్బాయిని పోలీసులు ప్రశ్నించారు. కానీ ఎలాంటి కేసు పెట్టకుండానే అతన్ని వదిలేశారు.

ఫొటో సోర్స్, RACHEL HALLIWELL
ఆమె ప్రాణాన్ని కాపాడి ఉండొచ్చు
ఈ ఘటనపై స్కూల్‌లో కూడా ఫిర్యాదు చేశామని రేచల్ చెప్పారు. కానీ చర్యలు తీసుకోవడంలో స్కూల్ యాజమాన్యం విఫలమైంది.
స్కూల్‌లో కోవిడ్ బబుల్‌లో భాగంగా సమీనా వారానికి ఒకరోజు ఆ అబ్బాయిలో ఉండాల్సి వచ్చేది. దాంతో స్కూల్‌కి వెళ్లనని సమీనా నిరాకరించడం మొదలుపెట్టింది.
జూన్‌లో సమీనా అత్మాహత్య యత్నం చేసిందని రేచల్ చెప్పారు. కోమాలోకి వెళ్లిన సమీనా నాలుగు రోజుల తర్వాత ఆస్పత్రిలోనే చికిత్స తీసుకుంటూ చనిపోయింది.
"స్కూల్‌కు తిరిగి వెళ్లడం, మళ్లీ ఆ అబ్బాయిని చూడడం గురించి తలుచుకుని సమీనా చాలా బాధపడేది.
ఆ అబ్బాయి తనను రేప్ చేశాడని సమీనా చెప్పిన మాటలే అత్యంత బాధాకరమైన విషయాలని రేచల్ అన్నారు.
ఆ ఘటన తనపై ఎంతగా ప్రభావం చూపిందో అర్థం చేసుకోవచ్చని తెలిపారు.
ఒక కుటుంబంగా ఇదివరకు ఉన్నంత సంతోషంగా మేము ఉండలేం. తప్పు చేసిన వారికి శిక్ష పడాలి. ఆమె చనిపోకుండా ఆపి ఉండగలిగే వాళ్లం" అని రేచల్ చెప్పారు.
పరిస్థితులు మారాలి
అధికార యంత్రాంగమే సమీనాను ఓడించిదని రేచల్ నమ్ముతున్నారు. ఇప్పటికీ స్కూళ్లలో ఉన్న అత్యాచార సంస్కృతిని రూపుమాపేందుకు చేయాల్సింది ఎంతో ఉందని ఆమె చెప్పారు.
తనపై అత్యాచారం జరిగిందని 12 ఏళ్ల బాలిక చెప్పినప్పుడు దాన్ని సీరియస్‌గా తీసుకోవాలి.
ఈ అమ్మాయి కథ విన్న తర్వాత, ఆమెకు న్యాయం జరగలేదని తెలిసిన తర్వాత, తనకు జరిగిన దారుణం గురించి బయటకు చెప్పడానికి ఏ అమ్మాయి కూడా ముందుకు రాదు. ఈ విషయంలో ఏదో ఒకటి చేయాలి.
సమీనా మరణం తర్వాత పోలీసులు ఒక ప్రకటన విడుదల చేశారు. సమీనాపై అత్యాచారం,ఆమె చేసిన ఇతర ఆరోపణలపై తాము దర్యాప్తు కొనసాగిస్తున్నామని పోలీసులు చెప్పారు.
రేచల్ తన కూతురి పేరున ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేశారు. మరో అమ్మాయికి ఇలా జరగకుండా కాపాడే ప్రయత్నం చేస్తున్నారు. స్కూళ్లలో అత్యాచార బాధితులకు సరైన రక్షణ చర్యలను ప్రభుత్వాలు కూడా తీసుకోవాలని ఆమె కోరుతున్నారు.
గత వారం సమీనా పుట్టిన రోజు.
"టీనేజ్‌లోకి ఎప్పుడు అడుగుపెడతానా అంటూ తను ఎదురుచూస్తూ ఉండేది. కానీ ఇప్పుడు తనే లేదు. ఇది జీర్ణించుకోవడం చాలా కష్టం" అని రేచల్ అన్నారు.
"2021 జూన్‌లో మా విద్యార్థిని చనిపోవడం మాకు చాలా బాధాకరం. కేసు దర్యాప్తులో మా స్కూల్ పోలీసులకు పూర్తిగా సహకరిస్తుంది. అత్యాచారం జరిగినట్లు చెబుతున్న ఘటన స్కూల్ బయట జరిగింది" అని సమీనా స్కూల్ ఒక ప్రకటన విడుదల చేసింది.
ఆ తర్వాత ఏం జరుగుతుంది?
స్కూళ్లలో అత్యాచార ఘటనలపై బ్రిటన్ ప్రభుత్వ విద్యాశాఖ చేసిన సమీక్ష జూన్‌లో ప్రచురితమైంది. కొందరు అమ్మాయిల నగ్న చిత్రాల కోసం కనీసం 11 మంది అబ్బాయిలు వారిని సంప్రదించారని ఈ సమీక్షలో తేలింది.
అన్ని రకాల వేధింపులను గుర్తించి, వాటిని నివారించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులు స్కూళ్లు, కాలేజీలకు విజ్ఞప్తి చేశారు.
సమాజంలో ఉన్న తల్లిదండ్రులు, పిల్లలు, స్కూళ్లు, ప్రభుత్వం, కోర్టులు ఇలా ప్రతిఒక్రరు దీనిపై మాట్లాడాలని, ఈ సమస్యకు పరిష్కారం కనిపెట్టాలని ఎవ్రీవన్ ఈజ్ ఇన్‌వైటెడ్ క్యాంపేయిన్ ప్రతినిధులు చెప్పారు.
ఇవి కూడా చదవండి:
- ‘కూతురిపై రెండేళ్లుగా అత్యాచారం చేసిన తండ్రిని చంపేసిన నలుగురు టీనేజీ కుర్రాళ్లు’
- చెక్క, గడ్డి, గంజాయితో 1941లోనే కారు తయారీ.. దీన్ని ఫోర్డ్ సంస్థ ఎందుకు ధ్వంసం చేసింది?
- లైంగిక సామర్థ్యం తగ్గిపోతోంది, భాగస్వాముల్ని మోసం చేస్తున్నాయి, ఇతర పక్షులతో సంబంధాలు పెట్టుకుంటున్నాయి
- క్రిప్టోకరెన్సీలో 70 లక్షలు నష్టపోయి ఆత్మహత్య: ‘నేనిలా చేస్తానని కలలో కూడా ఊహించలేదు...’
- కొందరు వందేళ్లకు పైగా జీవించడానికి కారణమేంటి... ఏమిటీ మిస్టరీ?
- రూ. 7 కోట్ల లాటరీ తగిలితే ఇన్ని కష్టాలా?
- బీజింగ్ ఎయిర్పోర్ట్ ఫొటోను నోయిడా ఎయిర్పోర్ట్ అంటూ కేంద్ర మంత్రులు ఎందుకు పోస్ట్ చేశారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













