అత్యాచారం: నిందితుడు బాధితురాలిని పెళ్లి చేసుకుంటే సరిపోతుందా.. సుప్రీంకోర్టు సూచనను ఎలా అర్థం చేసుకోవాలి

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, దివ్య ఆర్య
- హోదా, బీబీసీ కరస్పాండెట్
రేప్ కేసులో బాధితురాలిని పెళ్లి చేసుకోవాలంటూ ఓ నిందితుడికి సుప్రీంకోర్టు సూచించిన నేపథ్యంలో ఇక్కడ మూడు అర్థాలు ధ్వనిస్తాయి.
- అత్యాచారం అనేది హింస కాదు. అది కేవలం ఒక మహిళ గౌరవాన్ని దోచుకోవడం
- అత్యాచార నేరాలలో స్త్రీలు అనుభవించే శారీరక, మానసిక బాధలను పట్టించుకోవాల్సిన పనిలేదు.
- రేప్ కేసుల్లో హింస సర్వసాధారణం. దానికి శిక్ష తప్పనిసరి కాదు.
బాధితురాలిని పెళ్లి చేసుకుంటారా అంటూ దేశపు అత్యున్నత న్యాయస్థానం నుంచి ప్రశ్న వినిపించినప్పుడు దాని విస్తృతి, ప్రభావం ఎక్కువగా ఉంటుంది.
మహారాష్ట్రకు చెందిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఒక బాలికపై అత్యాచారం చేశారు. బెయిల్ కోరుతూ నిందితుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా, ఈ పిటిషన్‌ను విచారించిన ఎస్.ఎ.బోబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల సుప్రీం ధర్మాసనం 'బాధితురాలిని పెళ్లి చేసుకుంటారా' అని అడిగింది.
అయితే పెళ్లి చేసుకోవాలని నిందితుడిని కోర్టు ఆదేశించలేదు. కానీ నేరం చేసిన వ్యక్తికి ఇప్పటికే పెళ్లయింది.
అరెస్టు నుంచి ఉపశమనం కల్పిస్తూ బెయిల్ కోసం నిందితుడికి నాలుగు వారాల గడువు కూడా ఇచ్చింది.
“ఈ సూచన నన్ను షాక్‌కు గురి చేసింది. ఇలా అడగడమంటే బాధితురాలిని బాధను, ఆమెపై జరిగిన హింసను విస్మరించడమే. ఇది అమానవీయం” అన్నారు దిల్లీకి చెందిన న్యాయవాది సురభి ధార్. ఆమె పలు అత్యాచార కేసులను వాదించారు.
“ఇలాంటి నిర్ణయాలు, సూచనల వల్ల బాధితులు పోలీసుస్టేషన్లు, కోర్టులకు వెళ్లడానికే భయపడతారు. ఇది వారిపై తీవ్ర ప్రభావం చూపుతుంది” అన్నారామె.
“బాధితురాలు చాలా చిన్నవయసులో తన కుటుంబ స్థితిగతులను, అడ్డంకులను కూడా అధిగమించి సుప్రీంకోర్టు వరకు వచ్చారు. కానీ న్యాయస్థానం నుంచి వచ్చే ఇలాంటి నిర్ణయాల వల్ల బాధితులు కచ్చితంగా నిరాశకు గురవుతారు” అన్నారు సురభి.

పెళ్లయినా హింస ఆగకపోవచ్చు
అయితే ఈ తరహా కేసుల్లో ఇదే మొదటిది కాదు. ఒక మైనర్ అమ్మాయితో సెక్స్‌లో పాల్గొన్నాడన్న నేరాన్ని గత ఏడాది విచారించిన మద్రాస్ కోర్టు, బాధితురాలిని పెళ్లి చేసుకుంటానన్న నిందితుడి హామీపై అతడికి బెయిల్ ఇచ్చింది.
ఇదే తరహాలో కేరళ, గుజరాత్, ఒడిశా హైకోర్టులు కూడా బాలికలపై అత్యాచారానికి పాల్పడిన వ్యక్తులకు బాధితులను పెళ్లి చేసుకునే హామీపై బెయిల్ ఇచ్చాయి.
“ఇదొక దారుణమైన,అమానవీయమైన పరిణామం’’ అన్నారు గరిమా జైన్. ఆమె అత్యాచార బాధితులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి అనుభవాలపై పరిశోధన చేస్తున్నారు.
ఆమె కలుసుకున్న అనేకమంది అత్యాచార బాధితుల్లో ఒకరి కథనాన్ని గరిమా జైన్ బీబీసీతో పంచుకున్నారు.
“నేనొక 16ఏళ్ల బాధితురాలితో మాట్లాడాను. బాయ్‌ఫ్రెండ్ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఏడాదిపాటు విచారణ జరిగిన తర్వాత బాధితురాలిని పెళ్లి చేసుకోవాలని న్యాయమూర్తి సూచించారు.” అని గరిమా వివరించారు.
“ఆ మైనర్ అప్పటికే అనేక ఒత్తిళ్ల మధ్య ఉన్నారు. కోర్టు చేసిన సూచనను ఆమె జీర్ణించుకోలేకపోయారు. కానీ కాదని చెప్పలేకపోయారు. అయిష్టంగానే నిందితుడిని పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. ఆ తర్వాత ఆమెపై హింస మొదలైంది” అన్నారు గరిమా.
“తనపై వేధింపులు పెరిగిపోవడంతో భర్తపై గృహహింస కేసు పెట్టారు. నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష పడింది. ఇప్పుడామె తన కూతురితో ఒంటరిగా ఉంటున్నారు” అని వెల్లడించారు గరిమ.
“న్యాయస్థానాలు ఇలాంటి నిర్ణయాలు ప్రకటించే ముందు దీన్ని చాలా సున్నితమైన విషయంగా గుర్తించాలి. మహిళల మానసిక స్థితిపై పడే ప్రభావం, హింసను కూడా పరిగణనలోకి తీసుకోవాలి” అని గరిమా అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, REUTERS/ADNAN ABIDI
చట్టం ఏం చెబుతోంది?
2012లో చిన్నారులపై జరిగే లైంగిక నేరాలను అరికట్టే లక్ష్యంతో ‘ది ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్’ (POCSO) చట్టం తీసుకువచ్చింది.
నిందితుడిని వెంటనే విచారణ జరిపేందుకు పోలీసులకు అనేక అధికారాలను ఈ చట్టం కల్పిస్తోంది.
న్యాయపోరాటంలో బాధితులు ఎక్కువకాలం ఇబ్బంది పడకుండా, ఏడాదిలోగా విచారణ పూర్తి చేసేలా ఈ చట్టం కాలపరిమితిని కూడా విధించింది. అలాగే బాధితులకు పరిహారం కూడా ఇవ్వాలని నిర్దేశించింది.
అయితే చట్టంలో కొన్ని లోపాలు కూడా ఉన్నాయని ‘హక్ సెంటర్ ఫర్ చైల్డ్ రైట్స్’కు చెందిన కుమార్ షైలాబ్ అన్నారు.
చట్టం అమలుకు అవసరమైన మౌలిక సదుపాయాలు లేవని, దీనివల్ల విచారణ వేగంగా జరగడంలేదని ఆయన అన్నారు. ఈ పరిస్థితుల్లో బాధితురాలిని వివాహం చేసుకోవాలంటూ న్యాయమూర్తులను నిందితులను కోరుతున్నారని ఆయన అభిప్రాయపడ్డారు.
చిన్నారులపై లైంగిక నేరాలు అదుపులోకి రాకపోగా, ఇంకా పెరుగుతున్నాయన్న నివేదికల నేపథ్యంలో ఈ చట్టం అమలు తీరు ఎలా ఉందో తెలపాలని సుప్రీంకోర్టు వివిధ రాష్ట్రాల హైకోర్టులు, పోక్సో కోర్టులను కోరింది.
ఈ సందర్భంగా పలు ఆశ్చర్యకరమైన విషయాలు వెల్లడయ్యాయి. 99 శాతం కేసుల్లో బాధితులకు మధ్యంతర పరిహారం దక్కలేదని, అలాగే తుది తీర్పు తర్వాత కూడా 99 శాతం కేసుల్లో బాధితులకు పరిహారం అందలేదని తేలింది.
ఏడాదిలోగా విచారణ పూర్తి చేయాలన్న నిబంధనలున్నా మూడింట రెండువంతుల కేసుల్లో ఇలా జరగలేదని బైటపడింది. అలాగే నమోదైన 90% కేసుల్లో నిందితులు బాధితులకు చాలా దగ్గరివారేనని కూడా తేలింది.
“మైనర్లు తమపై జరిగిన దాడులను అంత సులభంగా రిపోర్ట్ చేయలేరు. వారిపై అనేక ఒత్తిళ్లు కూడా ఉంటాయి. ఇలాంటి సందర్భంలో బాధితుల హక్కులకు న్యాయస్థానాలు ప్రాధాన్యమివ్వాలి” అని షైలాబ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, Reuters
మహారాష్ట్ర కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరణ
సమాజపు ఒత్తిళ్ల కారణంగానే చాలాసార్లు నిందితులకు, బాధితులకు మధ్య సెటిల్‌మెంట్‌లు జరుగుతుంటాయని, , కానీ సుప్రీంకోర్టు స్వయంగా ఇలాంటి సలహా ఇవ్వడం సరికాదంటున్నారు షైలాబ్.
మహారాష్ట్ర అత్యాచారం కేసులో కేవలం నిందితుడి బెయిల్ పిటిషన్ మీద మాత్రమే విచారణ జరిగిందని, నిందితుడిపై ఇంకా అభియోగాలు కూడా మోపలేదని షైలాబ్ అన్నారు. ఈ కేసులో నిందితుడు బాధితురాలికి బంధువని కోర్టుకు అందిన సమాచారం చెబుతోంది.
పైగా నిందితుడు చాలా రోజులు ఆమె వెంటపడ్డాడని, అత్యాచారం చేశాడని, బెదిరించారని ఆరోపణలు ఉన్నాయి. అయితే బాధితురాలికి 18 సంవత్సరాలు వచ్చిన తర్వాత వివాహం చేసుకునే విధంగా ఇరు కుటుంబాల మధ్య ఒప్పందం కూడా కుదిరింది కానీ అది జరగలేదు. తరువాత నిందితుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
నిందితుడికి దిగువ కోర్టు నుండి బెయిల్ లభించగా, బాంబే హైకోర్టులోని ఔరంగాబాద్ బెంచ్ ఈ బెయిల్ పిటిషన్‌ను తప్పుపట్టింది.
పోక్సో చట్టం ప్రకారం బెయిల్ నిబంధనలు కఠినంగా ఉంటాయి. తనపై వచ్చిన ఆరోపణలను సరైనవి కాదని నిరూపించుకునే బాధ్యత నిందితుడిపైనే ఉంది. అప్పటి వరకు అతడు దోషిగానే ఉంటారు.
కానీ ఈ కేసులో సుప్రీంకోర్టు నిందితుడికి అరెస్టు నుండి నాలుగు వారాలపాటు ఉపశమనం కల్పించింది.
నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు పోక్సో చట్ట ప్రకారం నిర్ణయం తీసుకోలేదని న్యాయవాది సురభి ధర్ అన్నారు.

ఫొటో సోర్స్, Getty Images
“బాధితురాలిని వివాహం చేసుకుంటానంటే మేం మీకు సహాయం చేస్తాం. లేకపోతే మీ ఉద్యోగం పోతుంది. మీరు జైలుకు వెళతారు” అన్న సుప్రీంకోర్టు వ్యాఖ్యలు సరికావని సురభి ధార్ అన్నారు.
ఈ సలహాను ఉపసంహరించుకోవాలని కోరుతూ చీఫ్ జస్టిస్ బోబ్డేకు దేశంలోని సుమారు 4000మంది మహిళలు, స్త్రీవాద ఉద్యమకారులు, సంస్థలు లేఖ రాశాయి.
"మీ నిర్ణయంతో వివాహం అనేది అత్యాచారానికి లైసెన్స్ అన్న సందేశం వెళుతుంది. అలాంటి లైసెన్స్ ఉన్నప్పుడు నిందితుడు చట్టం నుంచి సులభంగా తప్పించుకుంటాడు’’ అని అందులో పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
- ముస్లిం, క్రైస్తవ మతాలకు చెందిన మృతుల ఖననానికి మారుమూల దీవిని ఎంపిక చేసిన శ్రీలంక
- కొండ బారిడి: తుపాకులు గర్జించిన నేలలో ఇప్పుడు సేంద్రియ వ్యవసాయ విప్లవం
- కరోనా వైరస్ వ్యాక్సీన్ కోసం నమోదు: కోవిన్ యాప్, వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ఇలా.. ఏఏ ధ్రువపత్రాలు కావాలంటే
- కరోనావైరస్: ప్రపంచానికి కోవిడ్ వ్యాక్సీన్ అందిస్తున్న భారతీయ కంపెనీ
- హాథ్రస్: కూతురిని వేధించారని కేసు పెట్టినందుకు తండ్రిని కాల్చి చంపేశారు
- కరోనావైరస్: ఇండియాలో మళ్లీ పాజిటివ్ కేసులు పెరుగుతుండడానికి కారణమేమిటి.. మరో వేవ్ మొదలైందా
- కోవిడ్-19 టీకా వేయించుకున్న ప్రధాని మోదీ
- ఇథియోపియా టిగ్రే సంక్షోభం: బీబీసీ విలేకరిని నిర్బంధించిన సైన్యం
- కృత్రిమ గర్భధారణ ఖర్చులు భరించలేక ఫేస్బుక్లో వీర్యదాతలను ఆశ్రయిస్తున్నారు... ఆరోగ్యం ఏమవుతుంది?
- భారతదేశంలోని ‘అస్థిపంజరాల సరస్సు’.. అంతు చిక్కని రహస్యాల నిలయం
- సెక్స్‌కు 'విశ్వగురువు' ప్రాచీన భారతదేశమే
- పేద దేశాలకు దక్కకుండా ధనిక దేశాలు వ్యాక్సీన్‌ను లాగేసుకుంటున్నాయా?
- అంబేడ్కర్ తొలి పత్రిక ''మూక్ నాయక్''కు 101 ఏళ్లు: అప్పట్లో దళితులు మీడియాను ఎలా నడిపించేవారు?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)








