ఇథియోపియా అంతర్యుద్ధం: వీధుల్లో అడుక్కుంటున్న డాక్టర్లు.. తీవ్రమైన ఆకలి, ఆహారం లేదు.. 8 నెలలుగా జీతాలు అందట్లేదు..

ఫొటో సోర్స్, Getty Images
ఇథియోపియాలోని టిగ్రే ప్రాంతానికి చెందిన అతిపెద్ద ఆసుపత్రికి చెందిన కొంతమంది వైద్యులు, నర్సులు... తమను తాము పోషించుకోవడం కోసం భిక్షమెత్తాల్సి వస్తోందని బీబీసీతో ఒక వైద్యుడు చెప్పారు.
8 నెలలుగా వారికి జీతాలు అందట్లేదని, తమ కుటుంబ పోషణ కోసం ఇతర మార్గాలను వెతుక్కోవాల్సి వస్తోందని ఆయన తెలిపారు.
టిగ్రేలో గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎక్కువ మంది 'తీవ్రమైన ఆకలి' బారిన పడుతున్నట్లు ఐక్యరాజ్య సమితి నివేదిక పేర్కొంది.
22 లక్షల మంది ప్రజలు తీవ్రమైన ఆహారం కొరతతో బాధపడుతున్నట్లు ఆ నివేదిక చెబుతోంది.
గర్భిణీలు, పిల్లలకు పాలిచ్చే స్త్రీలలో సగం మంది పోషకాహార లోపంతో బాధపడుతున్నారని యూఎన్ ప్రపంచ ఆహార కార్యక్రమం (డబ్ల్యూఎఫ్‌పీ) సర్వేలో తేలింది.
నెలల పాటు సాగిన పోరాటాల కారణంగా టిగ్రేతో పాటు అమ్హారా, అఫర్ రీజియన్లకు చెందిన మొత్తం 90 లక్షల మంది ప్రజలకు, ఏదో ఒకరమైన ఆహార సహాయం అవసరమున్నట్లు డబ్ల్యూఎఫ్‌పీ తెలుపుతోంది.
టిగ్రేలోని ఉత్తర ప్రాంతంలో ఇథియోపియా ఫెడరల్ ప్రభుత్వ దళాలు, తిరుగుబాటుదారుల మధ్య 2020 నవంబర్ నుంచి పోరాటం జరుగుతోంది. ఈ వివాదంలో ఇప్పటివరకు వేలాదిమంది మరణించారు.
దీనిఫలితంగా టిగ్రే రీజియన్ నిర్వీర్యమైంది. కీలకమైన సహాయం, వైద్య సామగ్రి సరఫరా చేయడం, అత్యవసర సేవలు అందించడం కష్టంగా మారింది. బ్యాంకుల కార్యకలాపాలు కూడా ఆగిపోయాయి. ప్రజలు తమ ఖాతాలను నిర్వహించుకునే అవకాశం లేకుండా పోయింది. చెల్లింపులు ఆగిపోయాయి.
డాక్టర్లు, నర్సులు కూడా ఈ పరిస్థితి నుంచి తప్పించుకోలేకపోయారు.
''గత ఏడు నెలల కాలంలో డాక్టర్లు, నర్సులు ఆహారపొట్లాల కోసం లైన్లలో నిల్చోవడం సాధారణమైపోయింది'' అని టిగ్రే రాజధాని మెకెల్లేలోని ఎయిడెర్ ఆసుపత్రి వైద్యుడొకరు చెప్పారు. ఆయన తన పేరును రహస్యంగా ఉంచాలని కోరారు.
ఆహారం లేకపోవడంతో శిశువు మృతి
గతేడాది మే నుంచి వారికి వేతనాలు అందలేదు.
''ఒకరోజులో తీసుకునే భోజనాల సంఖ్యను చాలామంది తగ్గించుకున్నారు. వంటనూనె, కూరగాయలు, దినుసుల ధరలు కొనడానికి వీల్లేని స్థాయిలో పెరిగిపోయాయి. కొందరు ఆహారం కోసం భిక్షమెత్తడం ప్రారంభించారు'' అని ఆ డాక్టర్ వివరించారు.
వైద్య సామగ్రి కొరత, వైద్యరంగాన్ని ఎలా ప్రభావితం చేసిందో కూడా ఆయన వివరించారు. ''శస్త్రచికిత్స సమయంలో, ఆ తర్వాత గాయాలను శుభ్రపరచడానికి స్టెరిలైజ్డ్ సర్జికల్ గేజ్ అత్యవసరం. కానీ ఇప్పుడు ఎయిడెర్ ఆసుపత్రిలో దానికి బదులుగా విరాళాలుగా అందిన గుడ్డలను కత్తిరించి వాటిని స్టెరిలైజ్ చేసి ఉపయోగిస్తున్నారు'' అని ఆయన చెప్పారు.
సరిపడినంత ఆహారం లేక 3 నెలల శిశువు సురాఫీల్ మెరిగ్ చనిపోయినట్లు ఆయన వెల్లడించారు. ''క్రమంగా బరువు పెరుగుతుండటంతో మెరిగ్‌ను ఇంటికి పంపించారు. కానీ ఇంటికి వెళ్లిన తర్వాత ఆ శిశువుకు సరిపడినంత ఆహారం లభించలేదు. దీంతో జనవరి 13న మరణించాడు'' అని ఆయన వెల్లడించారు.
అంతర్యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి టిగ్రేలోని కమ్యూనికేషన్ వ్యవస్థ అనేక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించిన వివరాలను బీబీసీ నేరుగా ధ్రువీకరించలేకపోయింది.
గత సెప్టెంబర్ తర్వాత మొదటిసారిగా రెడ్ క్రాస్ అంతర్జాతీయ కమిటీ, మెకెల్లెకు వైద్యసహాయాన్ని అందించింది. ఈ నేపథ్యంలో అక్కడి పరిస్థితుల్లో కాస్త మార్పు రావొచ్చు.
టిగ్రేలో ఆకలిని నివారించడానికి రోజుకు 100 లారీల ఆహారం అవసరమని డబ్ల్యూఎఫ్‌పీ చెప్పింది. కానీ డిసెంబర్ మధ్య నుంచి ఇప్పటివరకు యూఎన్ నుంచి ఎలాంటి ఆహార సహాయం టిగ్రేకు అందలేదు.
ఉత్తర ఇథియోపియాలో తదుపరి ఆరు నెలల పాటు తాము చేపట్టే కార్యక్రమాల కోసం 337 మిలియన్ డాలర్ల నిధులను యూఎన్ కోరుతోంది.
టిగ్రే రీజియన్‌లోని ప్రాంతీయ బలగాలపై సైనిక దాడికి ప్రధానమంత్రి అబియ్ అహ్మద్ ఆదేశించడంతో ఈ వివాదం రాజుకుంది. ప్రభుత్వ దళాలు ఆశ్రయం పొందుతోన్న సైనిక స్థావరంపై దాడికి ప్రతిస్పందనగా తాను ఆ ఆదేశాలు జారీ చేయాల్సి వచ్చిందని ప్రధాని స్పష్టం చేశారు.
తిరుగుబాటుదారుల పురోగతిని ఇటీవలి నెలల్లో ఫెడరల్ సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. అయితే టిగ్రే, అఫర్ రీజియన్ సరిహద్దుల్లో మాత్రం ఈ పోరాటం కొనసాగుతోంది.
త్వరలోనే అక్కడ శాంతి చర్చలు జరుగుతాయని అందరూ ఆశిస్తున్నారు.
'హార్న్ ఆఫ్ ఆఫ్రికా' రీజియన్‌కు కొత్తగా నియమితులైన అమెరికా ప్రత్యేక రాయబారి డేవిడ్ శాటర్‌ఫీల్డ్ ఇటీవలే అడిస్ అబాబాకు వెళ్లారు. అదే సమయంలో నైజీరియా మాజీ అధ్యక్షుడు, ఆఫ్రికన్ యూనియన్ల మధ్యవర్తి ఒలుసెగన్ ఒబాసాంజో కూడా సీనియర్ టిగ్రే నాయకులతో సమావేశమయ్యారు.

ఇవి కూడా చదవండి:
- అమెరికా-కెనడా సరిహద్దులో మైనస్ 35 డిగ్రీల చలిలో 11 గంటలు నడిచి.. గడ్డకట్టుకుపోయి, ప్రాణాలు కోల్పోయిన కుటుంబం
- RRB NTPC: విద్యార్థులు రైలుకు నిప్పు పెట్టేంత వరకూ ఎందుకెళ్లారు? ఈ ఆందోళన వెనుక ఎవరున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్
- కిమ్ జోంగ్ ఉన్ భయపడుతున్నారా? పెడుతున్నారా? ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఎందుకు?
- బడ్జెట్ వివరాలు ఎలా లీక్ అయ్యాయి? 1950 నాటి ఈ ఘటన తరువాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు
- 'దేవుడు నా బ్రా కొలతలు తీస్తున్నాడు' అంటూ శ్వేత తివారి వివాదాస్పద వ్యాఖ్యలు
- ఆంధ్రప్రదేశ్: కొత్త జిల్లాల ఏర్పాటుపై ప్రజలు తమ అభ్యంతరాలను ఎవరికి చెప్పాలి? ఎలా చెప్పాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











