అఫ్గానిస్తాన్: ఈ చిన్నారిని కాబూల్ విమానాశ్రయంలో కంచె మీద నుంచి సైనికులకు అందించారు.. ఆర్నెల్ల తర్వాత అతడి ఆచూకీ ఎలా తెలిసిందంటే...

సొహైల్ ఆగస్టు 19న కాబూల్ విమానాశ్రయంలో తప్పిపోయాడు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, 2021 ఆగస్టు 19న కాబూల్ విమానాశ్రయంలో సొహైల్ తప్పిపోయాడు.

అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్లు అధికారం హస్తగతం చేసుకున్నపుడు అమెరికా, కాబూల్ నుంచి కుటుంబాలను తరలించే సమయంలో ఓ బాలుడు తల్లిదండ్రుల నుంచి వేరై తప్పిపోయాడు. ఆ బాలుడు ఎట్టకేలకు తన తల్లిదండ్రుల చెంతకు చేరాడు.

గత ఏడాది ఆగస్టులో తాలిబాన్లు అధికారాన్ని చేజిక్కించుకున్నపుడు అఫ్గానిస్తాన్ నుంచి పారిపోవటానికి వేలాది కుటుంబాలు కాబూల్ విమానాశ్రయానికి వరుసకట్టాయి.

ఆ సమయంలో విమానాశ్రయం వద్ద తొక్కిసలాట నుంచి కాపాడటానికి ఓ కుటుంబం తమ రెండు నెలల కొడుకు సొహైల్ అహ్మదిని కంచె మీదుగా అవతలివైపున్న అమెరికా సైనికులకు అప్పగించింది.

ఎట్టకేలకు ఆ కుటుంబం విమానాశ్రయం లోపలికి చేరుకున్నాక తమ కొడుకు కోసం ఎంత వెదికినా అతడి జాడ దొరకలేదు.

ఆ బాలుడి తండ్రి మీర్జా అలీ అహ్మది కాబూల్‌లోని అమెరికా రాయబార కార్యాలయంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేశారు. తమ చిన్నకుమారుడి కోసం వెదికి వేశారాక.. అహ్మది, ఆయన భార్య సురయ, వారి మరో నలుగురు పిల్లలను విమానంలో అమెరికా తరలించారు.

కాబూల్ విమానాశ్రయంలో ఒంటరిగా కనిపించిన సొహైల్‌ను ఇంటికి తీసుకెళ్లిన సఫీ.. అతడిని అతడి తాతకు అప్పగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, కాబూల్ విమానాశ్రయంలో ఒంటరిగా కనిపించిన సొహైల్‌ను ఇంటికి తీసుకెళ్లిన సఫీ.. అతడిని అతడి తాతకు అప్పగిస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు

ఇన్ని నెలలుగా వారికి తమ కుమారుడి జాడ తెలియలేదు.

సొహైల్ గురించి ఈ కుటుంబం వెదుకులాటపై నవంబర్‌లో రాయిటర్స్‌లో కథనం వచ్చింది. ఆ తర్వాత కాబూల్‌లో ఉండే 29ఏళ్ల టాక్సీ డ్రైవర్ హమీద్ సఫీ వద్ద ఆ చిన్నారి ఉన్నట్లు ఆచూకీ తెలిసింది.

సొహైల్ కాబూల్ విమానాశ్రయం దగ్గర ఒంటరిగా నేల మీద ఏడుస్తూ కనిపించాడని ఆ వార్తా సంస్థ చెప్పింది. ఆ బాలుడి కుటుంబాన్ని వెదికి పట్టుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోవటంతో, సఫీ ఆ బాలుడిని తన ఇంటికి తీసుకెళ్లి తమ పిల్లలతో పాటు తమ కొడుకుగా పెంచాలని నిర్ణయించుకున్నారు.

వారు ఆ బాలుడికి మొహమ్మద్ అబిద్ అని పేరు పెట్టారు. తమ పిల్లలందరి ఫొటోలను సఫీ ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేశారు.

సొహైల్ ఆచూకీని నిర్ధరించుకున్న తర్వాత.. అఫ్గానిస్తాన్‌లోని ఈశాన్య బడాఖ్షాన్ ప్రావిన్స్‌లో నివసించే ఆ చిన్నారి తాత మొహమ్మద్ ఖాసిం రజావీ కాబూల్ వెళ్లి ఆ బాలుడిని వారి తల్లిదండ్రులకు తిరిగి అప్పగించాలని కోరారు.

సొహైల్ ఎట్టకేలకు తన తాత ఒడికి చేరాడు

ఫొటో సోర్స్, REUTERS

ఫొటో క్యాప్షన్, సొహైల్ ఎట్టకేలకు తన తాత ఒడికి చేరాడు

కానీ.. ఆ బాలుడిని అప్పగించటానికి సఫీ నిరాకరించారని, తనను, తన కుటుంబాన్ని కూడా అమెరికాకు తరలించాలని డిమాండ్ చేశారని రాయిటర్స్ తన కథనంలో చెప్పింది.

ఈ అంశంపై ఏడు వారాల పాటు సంప్రదింపులు జరిపారు. సఫీని కొన్ని రోజులు అదుపులోకి కూడా తీసుకున్నారు. చివరికి తాలిబాన్ పోలీసులు ఈ రెండు కుటుంబాల మధ్య ఒప్పందం కుదిర్చారు. దీంతో శనివారం నాడు ఆ బాలుడిని అతడి తాతకు అప్పగించారని రాయిటర్స్ వివరించింది.

తమ కొడుకు తిరిగి తమ కుటుంబానికి చేరటాన్ని వీడియో చాట్ ద్వారా వీక్షించిన అతడి తల్లిదండ్రులు తమకు చాలా సంతోషంగా ఉందని చెప్పారు.

‘‘అందరం సంబరాలు చేసుకుంటున్నాం. పాటలు, డాన్సులు.. ఇదో పెళ్లిలా ఉంది’’ అని రజావి చెప్పారు.

అమెరికాలో మిషిగన్ రాష్ట్రంలో నివసిస్తున్న తమ వద్దకు సొహైల్‌ను త్వరగా తీసుకురావటానికి ఏర్పాట్లు జరుగుతాయని అతడి తల్లిదండ్రులు ఆశాభావం వ్యక్తంచేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)