అఫ్గానిస్తాన్: దూర ప్రయాణాలు చేసే మహిళలకు పురుషుల తోడు తప్పనిసరి చేస్తూ తాలిబాన్ల ఆదేశాలు

ఫొటో సోర్స్, WAKIL KOHSAR
అఫ్గానిస్తాన్‌లో మహిళలను ఒంటరిగా దూర ప్రయాణాలు చేయడానికి అనుమతించేది లేదని తాలిబాన్లు ప్రకటించారు.
చిన్న ప్రయాణాలు మినహా, ఎక్కడికైనా కాస్త దూర ప్రాంతాలకు వెళ్లాలంటే సమీప బంధువుల్లో ఎవరైనా పురుషులను తోడు తీసుకెళ్లడాన్ని తప్పనిసరి చేశారు.
దూర ప్రయాణాలు చేయాలనుకునే మహిళలు తమతోపాటూ ఎవరైనా పురుషులను తోడు తీసుకెళ్లకపోతే వారికి ప్రయాణించడానికి రవాణా సౌకర్యాలు ఉండవని తాలిబాన్ అధికారులు ఆదివారం చెప్పారు.
తాలిబాన్ల 'సద్గుణాలు ప్రచారం చేసి, చెడును నిరోధించే' మంత్రిత్వ శాఖ దీనికి సంబంధించి ఆదేశాలను జారీ చేసింది.
"ఇక మీదట 72 కిలోమీటర్లకు మించి దూర ప్రయాణాలు చేసే మహిళలు తమతోపాటూ బంధువుల్లోని పురుషులను వెంట తీసుకెళ్లకపోతే, వారికి ప్రయాణించే సౌకర్యం లభించదు" అని మంత్రిత్వ శాఖ ప్రతినిధి సాదిక్ అకిఫ్ ముహాజిర్ వార్తా ఏజెన్సీ ఏఎఫ్‌పీతో చెప్పారు.
దీనితోపాటూ హిజాబ్ ధరించని మహిళలను వాహనాల్లో ప్రయాణించడానికి అనుమతించవద్దని రవాణా వాహనాల యజమానులకు కూడా ఆదేశాలు జారీ చేశారు.
అయితే, తాలిబాన్ల ఈ నిర్ణయాలను మానవ హక్కుల కార్యకర్తలు వ్యతిరేకిస్తున్నారు. హిజాబ్ గురించి తాలిబాన్ల వివరణ ఇప్పటికీ స్పష్టంగా లేదని చెబుతున్నారు.

ఫొటో సోర్స్, EPA
వాహనాల్లో సంగీతం వినిపించడం నిషేధం
చాలా మంది అఫ్గాన్ మహిళలు ఇంతకు ముందు నుంచీ తలకు స్కార్ఫ్ కట్టుకుంటున్నారని, ఇప్పుడు ఇలాంటి ఆదేశాలు ఇవ్వాల్సిన అవసరంలేదని మానవ హక్కుల కార్యకర్తలు అభిప్రాయపడ్డారు.
వీటితోపాటూ సంగీతం, టీవీ సీరియళ్ల గురించి కూడా తాలిబాన్లు పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ప్రజలు ఇక మీదట తమ వాహనాల్లో మ్యూజిక్ ప్లే చేయకూడదని తాలిబాన్లు కొత్తగా ఆదేశించారు. మహిళలు నటించే సీరియళ్లు, నాటకాలు ప్రసారం చేయకూడదని తాలిబాన్లు గతంలో టీవీ చానళ్లకు ఆదేశాలు జారీ చేశారు.
దీనితోపాటూ హిజాబ్ లేకుండా టీవీ కార్యక్రమాల్లో కనిపించకూడదని, వార్తలు చదివే మహిళా యాంకర్లకు, మహిళా జర్నలిస్టులకు కూడా సూచించారు.
తాలిబాన్లు ఇదే ఏడాది ఆగస్టు 15న అఫ్గానిస్తాన్‌ను తమ అధీనంలోకి తెచ్చుకున్నారు. అయితే మహిళల పట్ల తము గత ప్రభుత్వంలోలా కఠినమైన విధానాలను అనుసరించమని వారు హామీ ఇచ్చారు.

ఫొటో సోర్స్, Getty Images
మాట నిలబెట్టుకోని తాలిబాన్లు
అఫ్గానిస్తాన్‌లో తాలిబాన్ల పాలనను బీబీసీ వరల్డ్ సర్వీస్ దక్షిణాసియా వ్యవహారాల ఎడిటర్ యథిరాజన్ అన్బరసన్ నిశితంగా పరిశీలించారు.
ఆగస్టు మధ్యలో అఫ్గానిస్తాన్‌లో అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ తాలిబాన్లు అఫ్గాన్ మహిళలపై మెల్లమెల్లగా ఆంక్షలను పెంచుతూ వెళ్తున్నారని ఆయన చెప్పారు.
గత అఫ్గాన్ ప్రభుత్వాన్ని కూల్చిన తర్వాత ఆ దేశంలో చాలా ప్రాంతాల్లో ఇప్పటికీ సెకండరీ స్కూళ్లలో బాలికలను అనుమతించడం లేదు. తాలిబాన్లు దేశాన్ని ఆక్రమించిన నెల తర్వాత బాలికలు చదువుకోడానికి అనుమతి ఇచ్చారు. కానీ చాలా షరతులు విధించారు. వీటిలో క్లాసులో అమ్మాయిలు, అబ్బాయిల మధ్య తెర ఏర్పాటు చేయాలనే ఆదేశాలు కూడా ఉన్నాయి.
అయితే, అఫ్గానిస్తాన్‌లోచాలా ప్రాంతాల్లో తాలిబాన్ స్థానిక అధికారులు మళ్లీ స్కూళ్లు తెరవడానికి అంగీకరించారు. అయినప్పటికీ బాలికలను మాత్రం స్కూళ్లకు దూరంగానే ఉంచారు.
తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత పశ్చిమ దేశాల నుంచి అందే ఆర్థికసాయం ఆగిపోవడంతో అఫ్గానిస్తాన్ ఆర్థిక పరిస్థితి చాలా దారుణంగా ఉంది. త్వరలో ఆకలిచావులు, పేదరికం గుప్పిట్లో ఆ దేశం విలవిల్లాడే ప్రమాదం ఉందని ఎన్నో మీడియా నివేదికలు చెబుతున్నాయి.
ఈ పరిస్థితి నుంచి తప్పించుకోడానకి తాలిబాన్లు కనీసం తమ బ్యాంకు ఖాతాలపై విధించిన నిషేధం అయినా ఎత్తివేయాలని బలమైన దేశాలను కోరారు. దీనితోపాటూ చాలా సంస్థలు కూడా అఫ్గానిస్తాన్‌కు సాయం అందించాలని ప్రపంచ దేశాలను కోరాయి.
కానీ, అక్కడి మహిళల హక్కులను గౌరవించినపుడే అఫ్గానిస్తాన్‌కు ఆర్థిక సాయం అందిస్తామని ఆ దేశానికి నిధులు అందించే దేశాలు తాలిబాన్లకు షరతు విధించాని యతిరాజన్ తెలిపారు.
ఇలాంటి పరిస్థితుల్లో డిసెంబర్ ప్రారంభంలో తాలిబాన్లు తమ అత్యున్నత నేత పేరుతో జారీ చేసిన ఆదేశాల్లో మహిళల హక్కులను గౌరవిస్తామని చెప్పారు. అయితే ఆ వాటిలో బాలికలకు విద్య అందించడం గురించి ఎలాంటి ప్రస్తావనా లేదు.
ఇవి కూడా చదవండి:
- జేమ్స్ వెబ్: అంతరిక్షంలోకి విజయవంతంగా దూసుకుపోయిన అతి పెద్ద టెలిస్కోప్
- హిందూ ఓట్ బ్యాంక్ సృష్టించింది ఛత్రపతి శివాజీయా? ఈ బీజేపీ నేత చెబుతున్నది నిజమేనా
- తెలంగాణలోని ఈ ఊరిలో రోజూ సూర్యోదయం ఆలస్యంగా, సూర్యాస్తమయం వేగంగా అయిపోతుంది
- పాకిస్తాన్: సమ్మెటతో అమ్మవారి విగ్రహం ధ్వంసం చేసిన యువకుడు, దైవదూషణ కేసు నమోదు
- "జాతరలో భార్య/భర్తలను ఎంపిక చేసుకునే సమాజంలో 21 అయినా, 18 అయినా మార్పు ఉండదు"
- ఒమిక్రాన్: 11 రాష్ట్రాలకు పాకిన కొత్త వేరియంట్, బయటపడే మార్గం లేదా
- అల్ట్రా-ప్రాసెస్డ్ ఫుడ్: ఇది ఎక్కువగా తింటే మెదళ్లు పాడైపోతాయా, పరిశోధనలు ఏం చెబుతున్నాయి ?
- తిరుపతి: ఒక్క రూపాయి ఖర్చు చేయకుండా అమరావతి అభివృద్ధి చేయొచ్చు - చంద్రబాబు
- పుష్ప రివ్యూ: సుకుమార్ ఆ పని చేయకపోవడమే ప్లస్, మైనస్
- ఉత్తర కొరియా: కిమ్ జోంగ్ ఉన్ పాలనకు పదేళ్లు.. ఈ దశాబ్ద కాలంలో ఆ దేశం ఏం సాధించింది?
- హీరోయిన్ను చంపేసిన దుండగులు.. కొడుకు కోసం ఎదురుచూస్తుండగా బైక్‌పై వచ్చి కాల్పులు
- స్పైడర్ మ్యాన్-నో వే హోం రివ్యూ: ఇది ⭐⭐⭐⭐⭐ రేటింగ్ సినిమా ఎందుకైంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)











