అఫ్గానిస్తాన్: హెరాయిన్‌తో పోటీ పడుతున్న డ్రగ్ మెథామ్ ఫెటామిన్, 100 కిలోలకు రూ. 20 కోట్లు

ఫొటో సోర్స్, Getty Images
- రచయిత, సికిందర్ కిర్మానీ
- హోదా, బీబీసీ ప్రతినిధి, అఫ్గానిస్తాన్
దక్షిణ అఫ్గానిస్తాన్‌లో ఒక గ్రామంలోని చిన్న గదిలో ప్లాస్టిక్ సంచుల్లో తెల్లటి క్రిస్టల్ పదార్థం మెరుస్తోంది. ఆ సంచుల్లో ఉన్నది ఎగుమతి చేసేందుకు సిద్ధమైన నాణ్యమైన మెథామ్‌ఫెటామిన్ (ప్రమాదకరమైన మాదక ద్రవ్యం).
దీన్ని ఆస్ట్రేలియా లాంటి సుదూర దేశాలకు స్మగ్లింగ్ చేస్తారు. అలా చేస్తే ఈ గదిలో ఉన్న వంద కిలోల మెథ్‌కు దాదాపు రూ.20 కోట్లు లభిస్తాయి.
అఫ్గానిస్తాన్‌లో డ్రగ్స్ వ్యాపారం చాలా విస్తరించింది. దేశంలో తాలిబాన్లు అధికారంలోకి వచ్చాక, అది మరింత వేగంగా పెరిగింది. అఫ్గానిస్తాన్‌కు చాలా కాలం నుంచీ హెరాయిన్ ఉత్పత్తి చేసే దేశంగా పేరుంది. కానీ ఇది గత కొన్నేళ్లుగా క్రిస్టల్ మెథ్‌కు కూడా ఒక ప్రధాన ఉత్పత్తిదారుగా ఆవిర్భవించింది.
"దేశంలో నైరుతిగా ఉన్న ఒక జిల్లాలో ఈ డ్రగ్‌కు సంబంధించి 500కు పైగా తాత్కాలిక ఫ్యాక్టరీలు పనిచేస్తున్నాయి. వీటిలో ఇప్పుడు ప్రతి రోజూ దాదాపు 30 క్వింటాళ్ల క్రిస్టల్ మెథ్ తయారవుతోంది" అని ఈ వ్యాపారంతో సంబంధం ఉన్న ఒక వ్యక్తి చెప్పారు.

హెరాయిన్‌కు పోటీ ఇస్తున్న క్రిస్టల్ మెథ్
ఒక డ్రగ్‌గా మెథ్ డిమాండ్ చాలా పెరిగింది. నిజానికి స్థానికులు 'ఒమాన్' పేరుతో పిలిచుకునే ఇది ఒక సాధారణ అడవి మొక్క, దీనిని 'ఎఫెడ్రా' పేరుతో కూడా పిలుస్తారు. దీని నుంచి 'ఎఫిడ్రిన్' తయారు చేస్తారు. అది మెథామ్‌ఫెటమిన్ డ్రగ్ తయారీకి ప్రదాన మూలకం అవుతుంది.
ఎడారిలో ఉన్న ఒక మార్కెట్ అఫ్గానిస్తాన్‌లో మెథ్ వ్యాపారానికి ప్రధాన కేంద్రంగా ఉంది. ఇక్కడ అమ్మకాల కోసం ఎఫెడ్రా మొక్కల పెద్ద పెద్ద గుట్టలు సిద్ధంగా ఉన్నాయి. అంతకు ముందు ఇలాంటి పరిస్థితి అక్కడ ఎప్పుడూ కనిపించలేదు.
తాలిబాన్లు మొదట్లో ఎఫెడ్రా మొక్కలపై పన్ను వసూలు చేసేవారు. కానీ, ఇక దాని సాగుపై నిషేధం విధిస్తున్నట్టు వారు ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కానీ, వారు తమ ఆదేశాలను ఎక్కువ ప్రచారం చేయలేదు.
ప్రస్తుతం అఫ్గానిస్తాన్‌లో మెథ్ తయారు చేసే లాబ్‌లన్నీ బిజీ బిజీగా ఉన్నాయి. "ఎఫెడ్రా మీద నిషేధం విధించడం వల్ల మెథ్ టోకు ధరలు రాత్రికిరాత్రే రెట్టింపు అయ్యాయి" అని ఈ వ్యాపారంలో ఉన్న ఒక అఫ్గాన్ నవ్వుతూ చెప్పారు.
అందుకే, మెథ్ ఉత్పత్తి చేసేవారి గోడౌన్లన్నీ ఎఫెడ్రా మొక్కలతో నిండిపోయి ఉన్నాయి.
అఫ్గానిస్తాన్‌లో మాదకద్రవ్యాల వ్యాపారం గురించి డాక్టర్ డేవిడ్ మాన్స్‌ఫీల్డ్‌కు మంచి అవగాహన ఉంది. ఆ పనిలో ఉన్న లాబ్‌లను గుర్తించడానికి ఆయన ఉపగ్రహం ద్వారా తీసిన చిత్రాలను ఉపయోగించారు. వాటి సాయంతో అక్కడ మెథ్ ఉత్పత్తి పెరుగుతోందని గుర్తించారు.
"పంట మెథ్ ఉత్పత్తికి సిద్ధమైన తరుణంలో ఎపెడ్రాపై నిషేధిస్తున్నట్లు తాలిబాన్ల ఆదేశాలు వచ్చాయి. అందుకే ఆ నిషేధం ప్రభావం వచ్చే ఏడాది జులై వరకూ పెద్దగా కనిపించకపోవచ్చు" అని తెలిపారు.

మెథ్ ఉత్పత్తి హెరాయిన్ కంటే ఎక్కువ
అఫ్గానిస్తాన్‌లో ప్రస్తుతం ఉత్పత్తి అవుతున్న మెథ్, అక్కడ తయారయ్యే హెరాయిన్ కంటే ఎక్కువగా ఉందని డాక్టర్ మాన్స్‌ఫీల్డ్ భావిస్తున్నారు. అఫ్గానిస్తాన్‌లో మొదటి నుంచీ ఓపీఎం(నల్లమందు) ఉత్పత్తి జోరుగా సాగుతోంది. అక్కడ సాగు చేసే ఓపీఎం ప్రపంచం మొత్త ఉత్పత్తిలో దాదాపు 80 శాతం ఉంటుందని ఒక అంచనా.
గత కొన్ని వారాలుగా అఫ్గానిస్తాన్‌లోని రైతులు ఓపీఎం సాగుకోసం తమ పొలాలను సిద్ధం చేయడంలో, నాట్లు వేయడంలో బిజీగా ఉన్నారు.
"ఇది హానికరమని మాకు తెలుసు. కానీ మేం పండించే మిగతా పంటల వల్ల మాకు పెద్దగా ఆదాయం ఉండదు" అని కాందహార్ దగ్గర తన పొలం దున్నుతున్న రైతు మొహమ్మద్ గనీ చెప్పారు.
ఈ ఏడాది తాలిబాన్లు మళ్లీ అధికారంలోకి వచ్చాక అంతర్జాతీయ సంస్థల నుంచి ఆ దేశానికి లభించే అన్ని రకాల సాయం నిలిచిపోయింది. దీంతో అఫ్గానిస్తాన్ ఆర్థికవ్యవస్థ కుప్పకూలడంతో చాలా మంది రైతులు నల్లమందు సాగునే సురక్షితమైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నారు. తీవ్ర వర్షాభావ పరిస్థితుల వల్ల నీటిమట్టాలు పడిపోవడంతో అక్కడ వేరే పంటలు పండే అవకాశమే లేదంటున్నారు.
"మేం బెండ,లేదా టమటా లాంటి పంటలు వేయాలంటే వాటికి నీళ్ల కోసం బావులు తవ్వాల్సి ఉంటుంది. అయినా, పెట్టుబడిలో సగం కూడా రాదు" అని గనీ చెప్పారు.
తాలిబాన్ల పాలనలో త్వరలో నల్లమందు సాగుపై కూడా దేశంలో నిషేధం విధిస్తారని ఊహాగానాలు వస్తున్నాయి. దీంతో దాని ధర పెరుగుతుండడంతో మిగతా రైతులు కూడా ఉత్సాహంగా నల్లమందు సాగు చేయడం మొదలెట్టారు.

తాలిబాన్ల పాలనలో డ్రగ్ డీలర్లకు స్వేచ్ఛ
ప్రస్తుతం నల్లమందు పరిశ్రమ మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అవినీతి ప్రభుత్వ అధికారులకు లంచాలు ఇచ్చి రహస్యంగా ఓపీఎం నల్ల పేస్ట్ సంచులను విక్రయించే నల్లమందు డీలర్లు మార్కెట్లలో దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు.
"తాలిబాన్లు దేశానికి విముక్తి కల్పించినప్పటి నుంచి, మేం పూర్తిగా స్వేచ్ఛ పొందాం" అని ఒక నల్లమందు టోకు వ్యాపారి బీబీసీకి నవ్వుతూ చెప్పారు.
అయితే తాలిబాన్లు ఈ వ్యాపారంపై ఇప్పటికీ మెత్తగా వ్యవహరిస్తున్నారు. హేల్‌మంద్ ప్రాంతంలోని ఒక పెద్ద ఓపీఎం మార్కెట్‌ను చిత్రీకరించకుండా వారు బీబీసీని అడ్డుకున్నారు. అది నిషేధిత ప్రాంతమని చెప్పారు.
బీబీసీ దీనిపై ప్రాంతీయ సాంస్కృతిక కమిటీ చీఫ్ హఫీజ్ రషీద్‌తో మాట్లాడింది. లాభాలు సంపాదిస్తున్న వారిలో తాలిబాన్లు కూడా ఉన్నారనే దానిని చిత్రీకరించకుండా అడ్డుకుంటున్నారా అని ప్రశ్నించింది.
ఆ ప్రశ్న అడగ్గానే ఆయన తన ఇంటర్వ్యూను హఠాత్తుగా ముగించారు. కెమెరా నుంచి ఫుటేజ్ డెలిట్ చేయాలని, లేదంటే కెమెరా పగలగొడతామని బెదిరించారు.
అంతకు ముందు సమీపంలో కాందహార్‌లోని ఒక నల్లమందు మార్కెట్‌ను చిత్రీకరించడానికి మాకు అనుమతి ఇచ్చారు. కానీ, హేల్‌మంద్ వెళ్లినపుడు మాత్రం అలా తీయడం కుదరదని చెప్పారు.
దీనిపై కాబుల్‌లో తాలిబాన్ ప్రతినిధి బిలాల్ కరీమీ బీబీసీతో మాట్లాడారు.
"రైతుల కోసం నల్లమందుకు ప్రత్యామ్నాయం వెతకడానికి తాలిబాన్లు ప్రయత్నిస్తున్నారు. మేం వారికి వేరే ఏదైనా ఇవ్వకుండా, వారిని ఇది పండించకూడదని అడ్డుకోలేం" అన్నారు.

ప్రత్యామ్నాయం లేకుండా డ్రగ్స్ మీద నిషేధం విధించడం కష్టం
తాలిబాన్లు మొదట అధికారంలో ఉన్నప్పుడు నల్లమందుపై నిషేధం విధించారు. అయితే అధికారం కోల్పోయి వారు బయటున్న సమయంలో అది వారి ప్రధాన ఆదాయ వనరుగా మారింది. అయితే, ఆ విషయాన్ని వారు ఎప్పుడూ బహిరంగంగా ఖండిస్తూ వచ్చారు.
"తాలిబాన్లు అనుకుంటే మళ్లీ డ్రగ్స్ మీద సమర్థంగా నిషేధం విధించగలరని నల్లమందు వ్యాపారం చేసే పరిశ్రమలు నడిపేవారు చెబుతున్నారు. మరికొందరు మాత్రం తాలిబాన్లు మళ్లీ నిషేధం విధించడంపై సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
"ఈరోజు వాళ్ల దగ్గర ఉన్నదంతా నల్లమందు వల్లే వచ్చింది. అంతర్జాతీయ సమాజం అఫ్గాన్లకు సాయం చేసేవరకూ, మేం నల్లమందుపై వారిని నిషేధం విధించనివ్వం. లేదంటే మేం ఆకలితో చచ్చిపోతాం. మా కుటుంబం కడుపు కూడా నింపలేం" అని ఒక రైతు కోపంగా అన్నారు.
అఫ్గానిస్తాన్‌లోని చాలా ప్రాంతాల్లో ఉన్న మాదక ద్రవ్యాల పరిశ్రమలు ఆయా ప్రాంతాల ఆర్థికవ్యవస్థలో కీలక భాగంగా మారాయి.
హేల్‌మంద్‌లో గండమ్ రేజ్ అనే గ్రామాలకు చేరుకోడానికి ఒక మట్టి, కంకర రోడ్డుపై వెళ్లాల్సుంటుంది. కానీ, ప్రపంచ హెరాయిన్ వాణిజ్యంలో అది అత్యంత కీలకమైన ప్రాంతం. ఇక్కడ కేవలం నల్లమందు విక్రయాల కోసమే ఎన్నో షాపులు, పరిశ్రమలు ఉన్నాయి.
ఇక్కడ ప్రతి పరిశ్రమలో 60 నుంచి 70 మంది హెరాయిన్‌ను ప్రాసెస్ చేస్తుంటారు. పాకిస్తాన్, ఇరాన్ గుండా దీనిని స్మగ్లింగ్ చేస్తారు. ఆ తర్వాత అది అక్కడ నుంచి పశ్చిమ యూరప్, ప్రపంచంలోని మిగతా ప్రాంతాలకు అక్రమ రవాణా అవుతుంది.

ఫొటో సోర్స్, Getty Images
యూరప్ వెళ్లగానే ధర 50 రెట్లు పెరుగుతుంది
అఫ్గానిస్తాన్ నుంచి ఎగుమతయ్యే హెరాయిన్ ఒక కిలో ధర దాదాపు రూ.90 వేలు పలుకుతుందని అక్కడే పనిచేసే ఒక స్థానికుడు చెప్పారు. కానీ, బ్రిటన్ చేరుకోగానే దాని ధర కిలో దాదాపు రూ.50 లక్షలకు పెరుగుతుందని బ్రిటన్‌లోని ఒక మాజీ డ్రగ్ స్మగ్లర్ బీబీసీకి చెప్పారు.
ఇలా పెరిగిన ఈ హెరాయిన్ ధరల్లో ఎక్కువ భాగం డ్రగ్స్ రవాణా చేసేవారి జేబుల్లోకి చేరుతుంది. అయితే, తాలిబాన్లు హెరాయిన్ ఉత్పత్తిచేసేవారిపై పన్నులు విధిస్తున్నారు.
డ్రగ్స్ ద్వారా తాలిబాన్లు సంపాదించే మొత్తాన్ని తరచూ ఎక్కువ చేసి చెబుతుంటారు. దీనివల్ల వచ్చే ఆదాయం మిగతా వనరులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది అని డాక్టర్ మాన్స్‌ఫీల్డ్ చెప్పారు.
2020లో డ్రగ్స్ మీద వసూలు చేసిన పన్నుల వల్ల తాలిబాన్లకు దాదాపు రూ.26 కోట్ల ఆదాయం లభించిందని ఆయన అంచనా వేశారు.
"అది వారికి చాలా కీలకం. తాలిబాన్లు మొదట అధికారంలోకి వచ్చినపుడు డ్రగ్స్‌పై, ముఖ్యంగా నల్లమందును నిషేధించడానికి వారికి ఆరేళ్లు పట్టింది" అన్నారు.
అఫ్గానిస్తాన్ ప్రస్తుత ఆర్థికవ్యవస్థ దృష్ట్యా తాలిబాన్లు బహుశా వీటిపై నిషేధం విధించకపోవచ్చు అని డాక్టర్ మాన్స్‌ఫీల్డ్ చెప్పారు.
"అలా చేస్తే, వారు తమకు గతంలో అండగా నిలిచిన వారిని అధికారంలోకి వచ్చిన తర్వాత శిక్షించినట్టే అవుతుంది" అన్నారు.
"అయితే మాదక ద్రవ్యాల ఉత్పత్తిని నిషేధించడం వల్ల అఫ్గానిస్తాన్‌కు, అంతర్జాతీయ సమాజానికి రెండింటికీ మేలు జరుగుతుంది. అందుకే ప్రపంచం కూడా దానికి సాయం చేయాలి" అని తాలిబాన్ ప్రతినిధి బిలాల్ కరీమీ బీబీసీతో చెప్పారు.

అఫ్గానిస్తాన్‌లో కూడా భారీగా వినియోగం
అఫ్గానిస్తాన్ డ్రగ్స్ వ్యాపారం కేవలం ఎగుమతుల కోసమే జరగడం లేదు. ఆ దేశంలో కూడా దాని వినియోగం బాగా పెరిగింది. దాని ప్రభావం అఫ్గాన్ ప్రజలపై దారుణంగా ఉంది.
రాజధాని కాబుల్ శివార్లలో బిజీగా ఉన్న ఒక రోడ్డుపై చాలా మంది చిన్న చిన్న గ్రూపులుగా విడిపోయి క్రిస్టల్ మెథ్, హెరాయిన్ తీసుకుంటూ కనిపించారు.
"ఇప్పుడు అఫ్గానిస్తాన్‌లో ఈ డ్రగ్ తయారవడం వల్ల ఇది చౌకగా దొరుకుతోంది. మొదట్లో ఇది ఇరాన్ నుంచి వచ్చేది. అప్పుడు మెథ్ గ్రాము ధర దాదాపు రూ.1500 అఫ్గాన్ రూపాయలు(రూ.1100) ఉండేది. ఇప్పుడు దాని ధర 20 నుంచి 30 అఫ్గానీ రూపాయిల(రూ.15, రూ.20)కి తగ్గింది" అని మెథ్ తీసుకుంటున్న ఒక వ్యక్తి చెప్పాడు.
ఆ ప్రాంతంలో పరిస్థితి చాలా దారుణంగా ఉంది. కొందరు మత్తులో కాలువల్లో కూడా పడిపోతున్నారు. "ఇక్కడ మా బతుకు కుక్క బతుకు కంటే హీనంగా ఉంది" అని మరో వ్యక్తి అన్నారు.
తాలిబాన్లు తరచూ మత్తులో ఉన్న వారిని పునరావాస కేంద్రాలకు తరలిస్తుంటారు. కానీ వాళ్లు మళ్లీ తిరిగి అక్కడికే వచ్చేస్తుంటారు.
ప్రస్తుతం మరిన్ని మాదక ద్రవ్యాలు అఫ్గానిస్తాన్ మార్కెట్లోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాయి.
ఇవి కూడా చదవండి:
- తనలాంటి మరో వ్యక్తిని చంపేసి.. తానే చనిపోయినట్లు నమ్మించి.. చివరికి పోలీసులకు దొరికిపోయారు
- వ్లాదిమిర్ పుతిన్: 'రహస్యంగా ప్రైవేట్ క్యాబ్ డ్రైవర్‌గా పనిచేశా'
- రైతుల ఉద్యమం వాయిదాపడింది.. కానీ మోదీ ఇమేజ్ పెరిగిందా.. తగ్గిందా
- ఈ సినీ దర్శకుడు ఇస్లాం వదిలి హిందూ మతం స్వీకరించడానికి, బిపిన్ రావత్ మరణానికి సంబంధం ఏమిటి
- మనుషులు నడవడం ఎప్పుడు మొదలుపెట్టారు? ఎందుకు నడిచారు?
- ‘నీ సెక్స్ జీవితం ఎలా ఉంది అని అడిగారు, రేప్ చేసి చంపేస్తామనీ బెదిరించారు’
- ఆంధ్రప్రదేశ్ పరిస్థితి 'అప్పు చేసి పప్పుకూడు...'లా మారిందా? 11 ప్రశ్నలు - జవాబులు
- ఆంధ్రప్రదేశ్‌లో తొలి ఒమిక్రాన్ కేసు.. విశాఖపట్నంలో ఐసోలేషన్‌లో 30 మంది
- ఒక బాలిక యదార్థ గాధ: "నా చేతులు పట్టుకుని అసభ్యంగా... నేను వారికి అభ్యంతరం చెప్పలేక.."
- ‘రాత్రి 12 గంటలకు ‘బతికే ఉన్నావా’ అని మెసేజ్ పెట్టాను.. జవాబు రాలేదని ఫోన్ చేస్తే ఆయన స్నేహితులు ఎత్తారు’
- ‘నేను భారతీయ పైలట్‌నని తెలిసిన తరువాత కూడా ఆ పాకిస్తాన్ గ్రామస్థులు చికెన్‌తో భోజనం పెట్టారు’
- ఇంటర్నెట్ వాడుతున్న మీ పిల్లలు ఎంత ప్రమాదంలో ఉన్నారో తెలుసా
- వాతావరణ మార్పులను అరికట్టడానికి 7 మార్గాలు
- బంగ్లాదేశ సరిహద్దుల్లో ఉన్న త్రిపుర రాష్ట్రంలో ముస్లింలపై దాడులు.. కారణమేంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)













