RRB NTPC: విద్యార్థులు రైలుకు నిప్పు పెట్టేంత వరకూ ఎందుకెళ్లారు? ఈ ఆందోళన వెనుక ఎవరున్నారు? - బీబీసీ గ్రౌండ్ రిపోర్ట్

- రచయిత, దిల్నవాజ్ పాషా
- హోదా, బీబీసీ ప్రతినిధి
"పది రోజుల పాటు వరుసగా ట్వీట్లు చేశాం. కోటి ట్వీట్లు వచ్చాయి. కానీ ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇక మేం రోడ్డు ఎక్కాల్సి వచ్చింది."
"ఉత్తర్ ప్రదేశ్, బిహార్ ఎన్నికలపై దీని ప్రభావం పడకుండా ఉండేందుకు, నిరుద్యోగులు శాంతించేందుకు ఓ కమిటీ వేసి మా ఆగ్రహాన్ని చల్లార్చాలని చూస్తోందీ ప్రభుత్వం. వారి కుట్రలు మాకు అర్థమవుతున్నాయి."
ఆర్ఆర్‌బీ-ఎన్‌టీపీసీ పరీక్షా ఫలితాలపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యార్థుల వ్యాఖ్యలివి.
కోపంతో రగిలిపోతున్న విద్యార్థులు బిహార్ రాజధాని పట్నాలో, అనేక ఇతర నగరాల్లో నిరసన ప్రదర్శనలు చేపట్టారు.
పలుచోట్ల హింసాత్మక ఘటనలు చోటుచేసుకున్నాయి. రైళ్లకు నిప్పు పెట్టారు. ఇప్పటివరకు ఎనిమిది మంది విద్యార్థులను అరెస్టు చేశారు.
శుక్రవారం విద్యార్థులు బిహార్ బంద్‌కు పిలుపునిచ్చారు. పోలీసులు పట్నాలో గట్టి భద్రతా ఏర్పాట్లుచేశారు.
నిరుద్యోగ యువత ఆగ్రహం తీవ్ర స్థాయిలో ఉంది. వారి ఆగ్రహం ఏ క్షణానైనా ఆందోళనగా మారవచ్చని అర్థమవుతోంది.
విద్యార్థుల నిరసనలకు బిహార్‌లోని మహాకూటమి మద్దతు ప్రకటించింది.

ఫొటో సోర్స్, Niraj Sahay
ఎందుకింత ఆగ్రహం?
పట్నాలోని భిఖ్నా కొండ మలుపు, పరిసర ప్రాంతాల్లో ఎక్కడ చూసినా కోచింగ్ ఇన్స్టిట్యూట్‌లు, హాస్టల్ బోర్డులే కనిపిస్తాయి.
బిహార్ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఎంతో మంది విద్యార్థులు ఇక్కడకు వచ్చి పోటీ పరీక్షలకు కోచింగ్ తీసుకుంటారు.
ఇటీవల జనవరి 14న రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఎన్‌టీపీసీ (నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ) పరీక్ష ఫలితాలను ప్రకటించారు.
ఈ ఫలితాల్లో అవకతవకలున్నాయని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనివలన మెరిట్ విద్యార్థులు నష్టపోతారని ఆరోపిస్తున్నారు.
'ప్రభుత్వ వ్యూహాలు మాకు అర్థమవుతున్నాయి'
సమస్తీపూర్‌కు చెందిన 27 ఏళ్ల శశిభూషణ్ గత ఆరేళ్లుగా పట్నాలో ఉంటూ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారు.
కోచింగ్ కోసం సుమారు అయిదు లక్షలు ఖర్చుచేశానని, పరీక్షా ఫలితాల్లో అవకతవకల వలన తన ఆశలన్నీ అడియాశలైపోయాయని శశిభూషణ్ వాపోయారు.
విద్యార్థుల నిరసనల్లో శశిభూషణ్ కూడా పాలుపంచుకుంటున్నారు. భిఖునియా మలుపు వద్ద పోలీసులకు, విద్యార్థులకు మధ్య రాళ్ల దాడి జరిగింది. శశిభూషణ్ కూడా రాళ్లు రువ్వారు.
"ప్రభుత్వం మాకు మరే అవకాశం వదిలిపెట్టలేదు. మేం చాలా కోపంగా ఉన్నాం. పోలీసులు మమ్మల్ని కొట్టడంతో మేం రాళ్లు రువ్వాం" అని ఆయన తెలిపారు.
పరీక్షా ఫలితాల్లో జరిగిన అవకతవకలు తమ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టాయని శశిభూషణ్ లాంటి వేలాది మంది విద్యార్థులు భావిస్తున్నారు.
ఈ అంశంపై దర్యాప్తు చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక విచారణ కమిటీని ఏర్పాటుచేసింది.
తాము ఈ కమిటీని తిరస్కరిస్తున్నామని, ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికలు రానుండడంతో నిరుద్యోగుల ఆగ్రహాం చల్లార్చడానికి ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఇది అని శశిభూషణ్ అన్నారు.
సరైన సమయంలో రిక్రూట్మెంట్‌లు జరగట్లేదు, ఒకవేళ జరిగినా చాలా ఆలస్యంగా జరుగుతున్నాయని విద్యార్థులు ఆక్రోశం వ్యక్తం చేశారు.
"2019లో లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ రిక్రూట్‌మెంట్ ప్రకటన వచ్చింది. దీనిపేరుతో ఎన్నికల్లో గెలిచారు. మూడేళ్లు గడిచినా ఇప్పటివరకూ ఫలితాలు రాలేదు. విద్యార్థులకు ప్రభుత్వ ఉద్దేశాలు ఇప్పుడు బాగా అర్థమవుతున్నాయి" అని శశిభూషణ్ అన్నారు.
రిక్రూట్‌మెంట్ పరీక్షల తేదీలు, ఫలితాల వెల్లడికి సంబంధించిన క్యాలెండర్ తమ వద్ద లేదని విద్యార్థులు అసంతృప్తి వ్యక్తం చేశారు.
సీబీటీ-2 (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్), స్కిల్ టెస్ట్, ఇంటర్వ్యూ ఎప్పుడు నిర్వహిస్తారో, తుది ఫలితాలు ఎప్పుడు వెల్లడిస్తారో తెలుసుకోవడానికి ఈ క్యాలెండర్ అవసరమని విద్యార్థులు అంటున్నారు.
కమిటీ ఎప్పుడు కావాలంటే అప్పుడు రిపోర్టు ఇచ్చుకోవచ్చు. పరీక్ష తేదీ మాత్రం ఇప్పుడే ఇవ్వండి అని విద్యార్థులు డిమాండ్ చేస్తున్నారు.

ఫొటో సోర్స్, VISHNU NARAYAN
పెరుగుతున్న నిరాశ, నిస్పృహలు
జనవరి 14న ఫలితాలు వెల్లడైనప్పటి నుంచి విద్యార్థులు సోషల్ మీడియాలో నిరసనలు వ్యక్తం చేయడం ప్రారంభించారు. పది రోజుల తరువాత వారు రోడ్డు పైకి వచ్చి నిరసన ప్రదర్శనలు చేపట్టారు. వీరికి ఒక నాయకుడంటూ లేడు. వీరి వెనుక ఏ రాజకీయ పార్టీలు లేవు.
రిక్రూట్మెంట్లు ఆలస్యం కావడం, కోచింగులకు చాలా సమయం, డబ్బు వెచ్చించడం, ఉద్యోగాలు రాకపోవడంతో చాలా కాలంగా విద్యార్థుల్లో అసంతృప్తి నెలకొని ఉంది.
"నేను అయిదు దశల్లో పరీక్షలు రాశాను. ప్రతిసారీ పాస్ అయ్యాను. కానీ ఇంతవరకూ ఉద్యోగం ఊసు లేదు. ఫలితాల తేదీని ప్రభుత్వం పొడిగిస్తూనే ఉంది. కొన్నిసార్లు నాలుగు నెలలు వాయిదా వేస్తుంది. కొన్నిసార్లు ఆరు నెలలు. ఇక మాకు ఓపిక నశించిపోయింది" అంటూ పంకజ్ కుమార్ అనే విద్యార్థి వాపోయారు.
"కొన్నిసార్లు అసెంబ్లీ ఎన్నికల కోసమని, కొన్నిసార్లు లోక్‌సభ ఎన్నికల కోసమని రిక్రూట్‌మెంట్ వాయిదా వేస్తారు. ఇలా మమ్మల్ని వేధిస్తున్నారు. మా సమయం, డబ్బు రెండూ వృథా అవుతున్నాయి" అని ఆయన అన్నారు.
అనేక విద్యార్థి సంఘాలు ఈ ప్రదర్శనకు మద్దతిచ్చాయి. విద్యార్థుల నిరసన ప్రదర్శనలకు ప్రత్యేకంగా ప్రణాళిక ఏమీ లేదు. సోషల్ మీడియా ద్వారా విద్యార్థులకు సమాచారం అందుతోంది. వారంతా ఒక్కటిగా నిలిచి పోరాడుతున్నారు.
"విద్యార్థులు స్వచ్ఛందంగా ఈ నిరసనల్లో పాల్గొంటున్నారు. దీని వెనుక రాజకీయ నాయకులెవరూ లేరు. గత ఎనిమిదేళ్లుగా విద్యార్థుల్లో గూడుకట్టుకున్న కోపం ఇప్పుడు బద్దలైంది. కేవలం ఎన్‌టీపీసీ మాత్రమే కాదు. భారతదేశంలో నిరుద్యోగ స్థితిపై కోపం పెరుగుతోంది. ఎంటీపీసీ ఫలితాల్లో అవకతవకలు దీనికి ఆజ్యం పోశాయి" అని విద్యార్థి సంఘం ఏఐఎస్ఏకు చెందిన వికాస్ అభిప్రాయపడ్డారు.
అయితే, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌కు అనుబంధంగా ఉన్న విద్యార్థి సంస్థ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఇప్పటివరకు ఈ ప్రదర్శనలకు దూరంగా ఉంది. కానీ, విద్యార్థులకు మద్దతు తెలిపింది.
"విద్యార్థులకు సమస్యలున్నాయని మేం అంగీకరిస్తాం. కానీ, మేం సమస్యల కంటే పరిష్కారంపై దృష్టి పెట్టాలనుకుంటున్నాం. దీనికి సంబంధించి అధికారులతో సమావేశమయ్యాం. విద్యార్థుల డిమాండ్లను వారి ముందుంచాం. మేము నిరసనల్లో పాల్గొనట్లేదుగానీ విద్యార్థులకు మా మద్దతు ఉంటుంది" అని ఏబీవీపీతో అనుబంధం ఉన్న సుధాన్షు తెలిపారు.

ఫొటో సోర్స్, Getty Images
ముందు ముందు ఏం జరుగుతుంది?
"ప్రస్తుతం దేశంలో నిరుద్యోగం అతిపెద్ద సమస్య. బిహార్‌లో ఇది మరింత తీవ్రంగా ఉంది. ఎందుకంటే ఇక్కడ పాఠశాల విద్య, ఉన్నత విద్యా సంస్థలు అధ్వాన్నంగా ఉన్నాయి. అందుకే బిహార్ విద్యార్థులు వెనుకబడిపోతున్నారు. బిహార్ యువత సాధారణంగా గ్రేడ్ త్రీ, గ్రేడ్ ఫోర్ ఉద్యోగాల వైపు మొగ్గుచూపుతారు" అని పట్నాలోని టిస్ (టాటా స్కూల్ ఆఫ్ సోషల్ సైన్సెస్) ఛైర్మన్ ప్రొఫెసర్ పుష్పేంద్ర సింగ్ అన్నారు.
విద్యార్థుల ఆగ్రహం చల్లార్చకపోతే, అది తీవ్ర రూపం దాల్చవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
"దేశంలో పెరుగుతున్న నిరుద్యోగ సమస్య ఇలా విద్యార్థుల ఆగ్రహంగా మారింది. సాధారణంగా ఇలాంటి నిరసనలు స్వచ్ఛందంగా ప్రారంభమవుతాయి. కానీ అవి అలా కొనసాగవు. రాజకీయ పార్టీలు, సంస్థలు జోక్యం చేసుకోవడం మొదలుపెడతాయి. ఒక నేతృత్వం వస్తుంది. విద్యార్థుల నిరసనలను రాజకీయం చేసే ప్రయత్నాలు జరుగుతాయి. 1973లో కూడా ఇదే పరిస్థితి ఏర్పడింది. 1974లో విద్యార్థి ఉద్యమం రాజకీయ మలుపు తీసుకుంది. 1974 నాటి పరిస్థితులు మళ్లీ వచ్చేలా కనిపిస్తున్నాయి" అని పుష్పేంద్ర సింగ్ అభిప్రాయపడ్డారు.

ఫొటో సోర్స్, ANI
విద్యార్థులకు ప్రభుత్వంపై నమ్మకం లేదు. కొన్నిచోట్ల ప్రభుత్వ సందేశం విద్యార్థులకు చేరడం లేదు.
"రిక్రూట్మెంట్లను వాయిదా వేయడం ప్రభుత్వానికి ఒక ట్రెండ్ అయిపోయింది. రిక్రూట్మెంట్లు ఆలస్యం..పరీక్షలు ఆలస్యం..ఫలితాలు ఆలస్యం.. ఫలితాలు వచ్చిన తరువాత నియామకాలు జారీ చేయడంలో కూడా ఆలస్యంమే. అందుకే విద్యార్థులకు అపనమ్మకం ఏర్పడిపోయింది" అని పుష్పేద్ర సింగ్ అన్నారు.
విద్యార్థుల నిరసనలు ఎటు దారి తీస్తాయో తెలీదు. వారి ఆగ్రహం తీవ్ర రూపం దాల్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది.
ఇవి కూడా చదవండి:
- యుక్రెయిన్ సంక్షోభం: అమెరికా, రష్యా గొడవ ఇండియాకు ఇబ్బంది కానుందా
- కిమ్ జోంగ్ ఉన్ భయపడుతున్నారా? పెడుతున్నారా? ఉత్తర కొరియా క్షిపణి పరీక్షలు ఎందుకు?
- నెట్‌ఫ్లిక్స్ భారత్‌లో ఎందుకు విజయం సాధించలేకపోతోంది
- విమానం చక్రాల్లో దాక్కుని వెళ్లినా బతికాడు, ఎలాగంటే..
- 5G ఫోన్ల ద్వారా విమానాలకు ముప్పు ఎంత తీవ్రంగా ఉందంటే?
- కోవిడ్ సోకిన వ్యక్తి నుంచి వైరస్ వ్యాపించటం ఎన్ని రోజులకు ఆగిపోతుంది?
- పుతిన్ క్రిమియాను రష్యాలో ఎలా విలీనం చేశారు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)












