ఉత్తర ప్రదేశ్ సహా ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఎవరు గెలిచినా.. పెట్రోలు, డీజిల్ ధరల పెంపు తప్పదా?
పెట్రోలు, డీజిల్ మళ్లీ మోత మోగిస్తాయా? వెంటనే పెరిగేస్తాయేమోనని మీరు కంగారు పడనక్కర్లేదు కానీ మరో నెల నెలన్నరలో అయితే పెరగొచ్చు. ఉత్తర్ ప్రదేశ్‌తో సహా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు మార్చిలో అయిపోతాయ్. ఆ తరువాత ధరల పెంపు ఉండొచ్చనే అంచనాలు ఇప్పుడు వినిపిస్తున్నాయ్. అంతర్జాతీయ మార్కెట్ క్రూడ్ ఆయిల్ ధరలు ఏడేళ్ల గరిష్ఠానికి చేరాయి. విదేశాల నుంచి ముడి చమురు దిగుమతి చేసుకునే దేశీయ ఆయిల్ కంపెనీలకు ఇది కచ్చితంగా భారమే. ఆ భారాన్ని కంపెనీలు మోయవు కాబట్టి దాన్ని రేపో మాపో మనమే మోయాల్సి ఉంటుంది.
టూత్ పేస్ట్ నుంచి ఫేస్ క్రీముల వరకు భారమే
క్రూడ్ ఆయిల్ ధరలు పెరిగితే మాకేంటీ కార్లు, బైకులు తిప్పే వాళ్లకు కదా నష్టమైనా కష్టమైనా అని కొందరు అనుకోవచ్చు. ముడి చమురు ధరల వల్ల పెట్రోలు, డీజిల్ రేట్లు మాత్రమే కాదు మనం రోజూ వాడే అనేక వస్తువుల ధరలు కూడా పెరుగుతాయ్. పొద్దున లేస్తే వాడే టూత్ పేస్ట్ నుంచి ఫేస్ క్రీముల వరకు అనేక ప్రోడక్ట్స్ మీద ఆ ఇంపాక్ట్ ఉంటుంది. షాంపులు, కండీషనర్లు, లిప్ స్టిక్స్, బాడీ లోషన్లు, సబ్బులు, ఇంటికి వేసే పెయింట్స్, ఎరువులు, టైర్లు ఇలా అనేక వాటి తయారీలో ముడి చమురు నుంచి వచ్చే ఉప-ఉత్పత్తులను వాడతారు. హిందుస్థాన్ యూనిలీవర్, బ్రిటానియా, డాబర్, మారికో వంటి ఎఫ్‌ఎంసీజీ సంస్థలు కొద్ది నెలల కిందటే ధరలు పెంచాయ్. ఈ ఏడాదిలోనూ రేట్లు మళ్లీ పెంచేందుకు కంపెనీలు సిద్ధమవుతున్నాయ్.
ఫర్ ఎగ్జాంపుల్ హిందుస్థాన్ యూనిలీవర్ కంపెనీ చూద్దాం. ఈ మధ్యనే 20శాతం వరకు ధరలు పెంచింది ఈ కంపెనీ. లైఫ్ బాయ్, క్లోజప్, డోవ్, బూస్ట్, లక్స్, బ్రూ ఇలాంటి ఫేమస్ బ్రాండ్స్ అన్నీ ఆ కంపెనీవే. 125 గ్రాముల లైఫ్ బాయ్ సోప్ ధర రూ.29 నుంచి రూ.31కి పెరిగింది. సర్ఫ్ ఎక్సెల్ డిటర్జెంట్ సోప్ ధర రూ.10 నుంచి రూ.12కు చేరింది. గత నవంబరులోనే 30శాతం వరకు ధరలు పెంచింది హిందుస్థాన్ యూనిలీవర్. జనవరిలో పెంపు దీనికి అదనం. కంపెనీలు ధరలు పెంచడానికి కారణం పెరుగుతున్న రవాణా చార్జీలు, ముడి పదార్థాల ధరలు కూడా. రవాణా చార్జీలకు ఇంధన ధరలకు సంబంధం ఉంటుందనేది మనకు తెలిసిందే.
ఓలా, ఉబర్ క్యాబ్ ఫేర్స్ పెరగొచ్చు
ఇప్పుడు సిటీల్లో క్యాబ్‌ల వాడకం బాగా పెరుగుతోంది. కరోనా వల్ల పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను తగ్గించి ప్రైవేట్ ట్రాన్స్‌పోర్ట్‌కే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగితే ట్యాక్సీలు, క్యాబ్‌ల ధరలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ఫేర్స్ పెంచాలంటూ ఓలా, ఉబర్ డ్రైవర్లు డిమాండ్ చేస్తున్నారు. రేపు ఎన్నికల తరువాత పెట్రోలు, డీజిల్ రేట్లు పెరిగితే క్యాబ్ అగ్రిగేటర్లు ఆ భారాన్ని కస్టమర్ల మీద వేయొచ్చు. డీజిల్ రేట్లు రవాణా రంగం మీద తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. పాల నుంచి కూరగాయల వరకు అన్ని రకాల నిత్యావసర ధరలను డీజిల్ మార్చేస్తుంది.
మీ కలల స్మార్ట్ ఫోన్ ఖరీదు కావొచ్చు
స్మార్ట్ మొబైల్స్ నుంచి ఏసీ వరకు అనేక రకాల ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్‌ను ఇండియా దిగుమతి చేసుకుంటోంది. పీసీలు, ల్యాప్ టాప్‌లు ఇలా మెజారిటీ ప్రోడక్ట్స్ ఇతర దేశాల నుంచి షిప్‌ల్లో ఇక్కడకు వస్తున్నవే. అధికంగా ఉన్న ముడి చమురు ధరల వల్ల రవాణా ఖర్చులు పెరుగుతాయ్. ఫలితంగా ఈ ప్రోడక్ట్స్ కాస్ట్‌లీగా మారతాయ్. ఇక కార్లు, బైకులు, ట్రాక్టర్లు, ఆటోలు, ఇనుము, ఉక్కు, సిమెంటు ఇలా అనేక రకాల వాహనాలు, వస్తువుల మీద పెరిగే పెట్రోలు, డీజిల్ ధరల ప్రభావం ఉంటుంది.
రైతులకు ఇబ్బందే
ఎప్పుడైనా హైవే మీద పెట్రోలు బ్యాంకుల దగ్గర ఆగినప్పుడు, కొందరు పెద్దపెద్ద క్యాన్స్‌లో ఆయిల్ కొట్టించుకొని పోవడాన్ని తరచూ చూస్తుంటాం. ఇలా క్యాన్స్‌లో ఆయిల్ తీసుకెళ్లే వాళ్లలో ఎక్కువ మంది రైతులే ఉంటారు. పంప్ సెట్ల నుంచి ట్రాక్టర్ల వరకు అన్నింటికీ డీజిల్ కావాలి. నేడు పొలం దున్నడానికి, పంటలు కోయడానికి, కోసిన పంటను మార్కెట్‌కు తరలించడానికి ఇలా అన్నింటికి ట్రాక్టర్లు, కోత మిషన్లు, లారీలే అవసరమవుతున్నాయ్. గుంటూరు జిల్లాలోని నరసరావుపేట వద్ద ఒక ఊరిలో పరిస్థితి ఏంటో చూద్దాం. ప్రస్తుతం అక్కడ పొలం దమ్ము తొక్కడానికి గంటకు రూ.1,300 నుంచి రూ.1,400 తీసుకుంటున్నారు. రెండేళ్ల కిందట ఇది రూ.1,000గా ఉండేది. ట్రాక్టర్‌తో ఒక గంట దమ్ము తొక్కాలంటే 6 నుంచి 7 లీటర్ల డీజిల్ కావాలి. ఒక ఎకరాకు నాగలి వేయాలంటే రైతుకు అయ్యే ఖర్చు రూ.1,200 నుంచి రూ.1,300. ఇందుకు 10 లీటర్ల డీజిల్ పడుతుంది. పొలం నుంచి ధాన్యాన్ని ఇంటికి తరలించడానికి బస్తాకు రూ.20 అవుతుంది. నేడు రైతులు పొలాలకు వెళ్లి రావడానికి, గేదేలకు పచ్చ గడ్డి తీసుకు రావడానికి బైకులనే ఎక్కువగా వాడుతున్నారు. ఇలా చూస్తే పెరిగే పెట్రోలు, డీజిల్ ధరలు వాళ్లకు భారంగా మారతాయి.
మూడు నెలలుగా పెరగని పెట్రోలు, డీజిల్
ప్రస్తుతం అంటే ఈ స్టోరీ చేసే సమయానికి బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ఒక బ్యారెల్ ధర 86 డాలర్లకు అటుఇటుగా ఉంది. మన రూపాయల్లో చెప్పాలంటే సుమారు 6,400. మన ఇంధన అవసరాల్లో సుమారు 80శాతం ఇతర దేశాల నుంచే దిగుమతి చేసుకుంటున్నాం కాబట్టి పెరిగే ముడిచమురు ధరలు మనకు భారమే. ఇప్పటికి దేశంలో పెట్రోలు, డీజిల్ రేట్లు పెరగగా దాదాపు మూడు నెలలు అవుతోంది. 2021 నవంబరులో పెట్రోలు, డీజిల్ మీద ఎక్సైజ్ డ్యూటీని కొంత తగ్గించడమే ఇందుకు కారణం. ఇక ఉత్తర్ ప్రదేశ్, పంజాబ్‌తో సహా అయిదు రాష్ట్రాల్లో ఎన్నికల వల్ల పెట్రోలు, డీజిల్ రేట్లను తాత్కాలికంగా పెంచకుండా కేంద్రం ఆపిందనేది విమర్శకుల మాట. రేపు ఎన్నికలు అయిపోగానే పెంపు మొదలు కావొచ్చని వారు భావిస్తున్నారు.
ఒక బ్యారెల్ అంటే 159 లీటర్లు. ప్రస్తుత ధరల ప్రకారం లీటరు క్రూడ్ ఆయిల్ ధర 40 రూపాయల చిల్లర పడుతోంది. 2020లో క్రూడ్ ఆయిల్ ధరలు 20 డాలర్లు, 30 డాలర్లకు ఉన్నప్పుడు అంటే లీటరు క్రూడ్ ఆయిల్ ధర రూ.10 నుంచి రూ.15 మధ్య ఉన్నప్పుడు పెట్రోలు, డీజిల్ ధరలు డెబ్బైలు, ఎనభైల్లో ఉండేవి. అప్పుడు ప్రభుత్వం రేట్లు తగ్గించింది లేదు. అలాంటిది ఇప్పుడు లీటర్ క్రూడ్ ఆయిల్ ధర 40 రూపాయలుగా ఉన్న నేపథ్యంలో రేట్లు పెంచకుండా ఉంటుందా అన్నది ప్రశ్న.
సెంచరీలు కొట్టిన పెట్రోలు, డీజిల్
గత రెండేళ్లలో ముఖ్యంగా 2021లో పెట్రోలు, డీజిల్ రేట్లు ఎలా పెరిగాయో మనకు తెలిసిందే. నాలుగైదు రోజులపాటు వరుసగా రేట్లు పెరుగుతూ పోయిన సందర్భాలను కూడా మనం చూశాం. విరాట్ కోహ్లీ గత రెండేళ్లలో సెంచరీ కొట్టలేదు కానీ పెట్రోలు, డీజిల్ మాత్రం సెంచరీలు కొట్టేశాయ్. 2020 జనవరిలో లీటరు పెట్రోలు కాస్త అటుఇటుగా రూ.75, డీజిల్ రూ.68గా ఉండేది. 2021 అక్టోబర్, నవంబరు నాటికి అవి సెంచరీలు కొట్టేశాయ్. ప్రస్తుతానికి అయితే ఇంధన ధరలు స్థిరంగా ఉన్నాయ్. క్రూడ్ ఆయిల్ ధరలు ఇలాగే పెరుగుతూ పోతే మాత్రం మన జేబులకు చెల్లు పడక తప్పదు.
ఇవి కూడా చదవండి:
- 10 కోట్ల మంది ఆకలి తీర్చే ఆఫ్రికా అరటి చెట్టు.. దీని పండ్లు మాత్రం తినడానికి పనికిరావు
- వృద్ధుడి మృతదేహంతో పోస్టాఫీసుకు వచ్చారు.. పెన్షన్ ఇవ్వమని అడిగారు.. ఆ తర్వాత..
- ఒమిక్రాన్: ‘బూస్టర్ డోస్’ ఎప్పుడు, ఎక్కడ, ఎలా తీసుకోవాలి? - 8 ప్రశ్నలకు సమాధానాలు
- భర్తతో సెక్స్‌కు నో చెప్పే హక్కు భార్యకు లేదా? మ్యారిటల్ రేప్‌పై ఎందుకు చర్చ జరుగుతోంది
- ఈ పండ్లను బంగారంలా చూస్తారు.. వీటి కోసం దొంగల ముఠాలు కాపు కాస్తుంటాయి
- చింతామణి నాటకాన్ని ఎందుకు నిషేధించారు, అడల్ట్ కామెడీగా మార్చడమే అసలు సమస్యా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)