5G ఫోన్‌ల ద్వారా అమెరికా విమానాలకు ముప్పు ఎంత తీవ్రంగా ఉందంటే?

5G

ఫొటో సోర్స్, Getty Images

    • రచయిత, థియో లాగెట్
    • హోదా, బీబీసీ న్యూస్, బిజినెస్ ప్రతినిధి

అమెరికాలోని ప్రముఖ మొబైల్ నెట్‌వర్క్‌ సంస్థలు 'ఏటీ అండ్ టీ’, ‘వెరైజోన్ ' కొన్ని విమానాశ్రయాలలో తమ 5జీ సేవల విస్తరణను వాయిదా వేయడానికి అంగీకరించాయి.

బుధవారం నుంచి కొన్ని ప్రాంతాల్లో ఈ సంస్థల 5జీ సేవలు ప్రారంభం కావాల్సి ఉంది. గతంలో కూడా ఇది రెండుసార్లు వాయిదా పడింది.

ఈ కొత్త సాంకేతికత వల్ల వేలాది విమానాలు ఆలస్యం అవుతాయని అమెరికాకు చెందిన పది ప్రముఖ ఎయిర్‌లైన్స్ సంస్థలు చెబుతున్నాయి.

5జీ అంటే ఏమిటి? ఇది విమానాలకు ఎలా అంతరాయం కలిగిస్తుంది?

5జీ అనేది మొబైల్ ఇంటర్నెట్ కనెక్షన్ తదుపరి తరం. దీనివల్ల మరింత వేగంగా డేటాను డౌన్‌లోడ్, అప్‌లోడ్ చేసుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ పరికరాలకు ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు.

ఈ టెక్నాలజీ ఎక్కువగా రేడియో సిగ్నల్స్‌పై ఆధారపడుతుంది. అమెరికాలో, 5జీ కోసం ఉపయోగించే రేడియో ఫ్రీక్వెన్సీలు ‘సీబ్యాండ్’ స్పెక్ట్రమ్‌లో భాగంగా ఉన్నాయి.

5జీలో వాడే రేడియో తరంగాలు, విమానాల్లోని రేడియో ఆల్టీమీటర్లలో ఉపయోగించే తరంగాలకు దగ్గరగా ఉంటాయి. అల్టీ మీటర్ల ద్వారా భూమి నుంచి విమానం ఎత్తును కొలుస్తారు. భద్రత, నావిగేషన్ సిస్టమ్‌ల డేటా కోసం వీటిని వాడతారు.

5జీ స్పెక్ట్రమ్‌లో వాడే రేడియో తరంగాల వల్ల విమానాల్లోని ఈ పరికరాల పనితీరుకు ఆటంకం కలుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా విమానం ల్యాండ్ అయ్యే సమయంలో భద్రతా సమస్యలు తలెత్తుతాయని భావిస్తున్నారు.

వీడియో క్యాప్షన్, భవిష్యత్తులో ప్రయాణాలు ఇలా ఉంటాయి

విమానాలకు ప్రమాదం ఎంత తీవ్రంగా ఉంది?

నిజం చెప్పాలంటే దీన్ని తీవ్ర ప్రమాదంగానే పరిగణించవచ్చు.

విమానయాన సమస్యలపై సాంకేతిక మార్గదర్శకాలను రూపొందించే అమెరికా సంస్థ ' రేడియో టెక్నికల్ ‌కమిషన్ ఫర్ ఏరోనాటిక్స్ (ఆర్‌టీసీఏ) ... తగిన ఉపశమనాలు లేనప్పుడు సంభవించే విపత్తులు అనేక మరణాలకు దారితీస్తాయని హెచ్చరిస్తూ 2020 చివరలో ఒక నివేదికను ప్రచురించింది.

5జీ తరంగాల జోక్యం కారణంగా బోయింగ్‌ 787 డ్రీమ్ లైనర్‌లోని అనేక వ్యవస్థల్లో పలు సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని ఇటీవలే అమెరికా విమానయాన నియంత్రణ సంస్థ ‘ఎఫ్ఏఏ’ హెచ్చరించింది.

దీనివల్ల ల్యాండింగ్‌ సమయంలో విమానం వేగాన్ని తగ్గించడం కష్టతరం అవుతుంది. ఇది రన్‌వే పైనుంచి విమానం పక్కకు వెళ్లేందుకు కారణమవుతుంది.

5జీ స్పెక్ట్రమ్

విమాన ప్రయాణాన్ని ఎలా సురక్షితంగా మలచాలి?

5జీ తరంగాల జోక్యం అధికమైనప్పుడు రేడియో ఆల్టీమీటర్‌లను విమానాలు సరిగా ఉపయోగించలేవు.

ఫలితంగా కొన్ని విమానాల ల్యాండింగ్ కష్టతరం అవుతుంది.

పరిస్థితులు అనుకూలించకపోవడంతో 1000కి పైగా విమానాలు ఆలస్యం కావడం లేదా రద్దు అయ్యే పరిస్థితులు ఎదురు అవుతాయని అమెరికాలోని పది ప్రముఖ విమానయాన సంస్థల్లో ఒకటైన ‘ఎయిర్‌లైన్స్ ఫర్ అమెరికా’ హెచ్చరించింది. ఫలితంగా భారీ సంఖ్యలో ప్రజలు ప్రయాణాలు మానేసుకోవాల్సి వస్తుందని సూచించింది.

విమాన ప్రయాణాలపై పరిమితుల కారణంగా అమెరికా విమానయాన సంస్థల్లో ఎక్కువ భాగం నిరుపయోగంగా మారాల్సి వస్తుందని సూచించింది.

విమానయాన సంస్థలు

ఫొటో సోర్స్, Getty Images

ఇతర దేశాలు కూడా ఇలాగే ఆందోళన చెందుతున్నాయా?

మరీ ఈ స్థాయిలో కాదు. కానీ ఆందోళన చెందుతున్నాయి. ఎందుకంటే 5జీ అందుబాటులోకి వచ్చే విధానం ఒక్కో దేశాన్ని బట్టి మారుతూ ఉంటుంది.

ఉదాహరణకు యూరోపియన్ దేశాలలో నెట్‌వర్క్‌లు, అమెరికా ప్రొవైడర్లు ఉపయోగించాలనుకుంటున్న వాటి కంటే తక్కువ పౌనఃపున్యాల వద్ద పనిచేస్తాయి.

దీనివల్ల విమానాలు ఉపయోగించే తరంగాల్లో ఇంటర్నెట్ తరంగాల జోక్యం తగ్గుతుంది. తక్కువ తరంధైర్ఘ్యాల వద్ద కూడా 5జీ పనిచేస్తుంది.

అయినప్పటికీ, కొన్ని దేశాలు ఈ ప్రమాదాలను తగ్గించడానికి తదుపరి చర్యలు తీసుకున్నాయి.

ఫ్రాన్స్‌లో విమానాశ్రయాల చుట్టూ బఫర్‌ జోన్‌లను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా 5జీ సిగ్నల్స్‌ను నియంత్రిస్తారు. అంతేకాకుండా సిగ్నల్స్ జోక్యాన్ని నిరోధించడానికి యాంటెన్నాలను కింది దిశగా వంచుతారు.

అమెరికా అధికారులు ఇంకా ఏం చేస్తున్నారు?

అమెరికాలోని నియంత్రణ అధికారులు అనేక చర్యలు తీసుకున్నారు.

ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్(ఎఫ్ఏఏ) ఇప్పటికే 50 విమానాశ్రయాల చుట్టూ తాత్కాలిక బఫర్ జోన్‌లను ఏర్పాటు చేసింది. ఈ జోన్లలో 5జీ ప్రొవైడర్లు తమ కార్యకలాపాలను పరిమితం చేస్తారు. కానీ, ప్రాన్స్‌లో ఉపయోగిస్తోన్న వాటితో పోలిస్తే ఇవి చాలా చిన్నవి.

5జీ సిగ్నల్స్ ఉన్న ప్రాంతాల్లో ఏ రకమైన ఆల్టిమీటర్లను సురక్షితంగా ఉపయోగించవచ్చో గుర్తించడం ప్రారంభించింది. సురక్షితంగా లేని వాటిని, 5జీ సిగ్నల్స్ వల్ల ముప్పు పొంచి ఉన్నవాటిని భర్తీ చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించింది.

విమానాలకు మార్గనిర్దేశం చేయడానికి రేడియో ఆల్టీమీటర్లకు బదులుగా జీపీఎస్ వ్యవస్థలను ఉపయోగించే విమానాశ్రయాలను ఎఫ్ఏఏ గుర్తించింది.

అయితే ఈ చర్యలు మాత్రమే సరిపోవని విమానయాన సంస్థలు పట్టుబడుతున్నాయి. విమానాశ్రయాల నుంచి రెండు మైళ్ల దూరంలో 5జీ నెట్‌వర్క్‌ని యాక్టివేట్ చేయకూడదని వారు పేర్కొంటున్నారు.

5జీ సంస్థలు ఇప్పుడు ఏం చెబుతున్నాయి?

ఏటీ అండ్ టీ, వెరైజోన్ సంస్థలు 5జీ సేవలను "తాత్కాలికంగా" వాయిదా వేయడానికి అంగీకరించాయి. "నిర్దిష్ట విమానాశ్రయాల రన్‌వేల చుట్టూ పరిమిత సంఖ్యలోనే టవర్లు ఏర్పాటు చేస్తామని’’ ఏటీ అండ్ టీ పేర్కొంది.

శాశ్వత పరిష్కారం దొరికేవరకు కొన్ని ప్రాంతాల్లో 5జీ సేవలు అందుబాటులోకి రావు. విమాన పరికరాల్లో 5జీ తరంగాలు జోక్యం చేసుకునే అవకాశాన్ని తగ్గించాలి.

తాజా వాయిదా వల్ల 5జీ విస్తరణలో పాల్గొన్న 10 శాతం టవర్లు మాత్రమే ప్రభావితం అవుతాయని అధ్యక్షుడు జో బైడెన్ ఒక ప్రకటనలో తెలిపారు.

ఇప్పటికే టెలికామ్ సంస్థలు రెండుసార్లు 5జీ విస్తరణను వాయిదా వేశాయి. పైన పేర్కొన్న విధంగా బఫర్ జోన్ల ఏర్పాటుకు కూడా ఆమోదం తెలిపాయి.

వెరైజోన, ఏటీ అండ్ టీ టెలికామ్ సంస్థలు

ఫొటో సోర్స్, Getty Images

అయితే తాజా వాయిదాపై ఈ రెండు టెలికామ్ కంపెనీలు తమ అసంతృప్తిని వ్యక్తం చేశాయి. 5జీ సేవలను ప్రారంభించేందుకు రెగ్యులేటర్లు రెండు సంవత్సరాల సమయం తీసుకున్నాయని ఏటీ అండ్ టీ తెలిపింది.

ఇప్పటికే దాదాపు 40 దేశాల్లో 5జీ అమలులోకి వచ్చిందని వారు నొక్కి చెప్పారు.

5జీ సేవలను మరింత ఆలస్యం చేయడం వల్ల ఆర్థిక నష్టం వాటిల్లుతుందని గత నెలలో అమెరికా వైర్‌లెస్ ఇండస్ట్రీ సంస్థ' సెల్యులార్ టెలికమ్యూనికేషన్స్ ఇండస్ట్రీ అసోసియేషన్- సీటీఐఏ పేర్కొంది. విమానయాన పరిశ్రమను ‘భయపెట్టే పరిశ్రమ’ అని వ్యాఖ్యానించింది.

వీడియో క్యాప్షన్, దిల్లీ- వైజాగ్: విమాన ప్రయాణం ఇలా సాగింది

బ్రిటన్‌లో పరిస్థితి ఏంటి?

బ్రిటన్ నియంత్రణ, విమానయాన సంస్థలు అనవసరంగా ఆందోళన చెందుతున్నట్లు అనిపించడం లేదు.

‘‘5జీ సిగ్నల్స్ కారణంగా విమానాల వ్యవస్థ పనిచేయకపోవడం, తప్పుడు పనితీరు కనబరిచినట్లు ధ్రువీకరించే సందర్భాలు లేవు’’ అని పౌర విమానయాన అథారిటీ (సీఏఏ) సంస్థ డిసెంబర్‌లో ప్రచురించిన భద్రతా నోటీసులో పేర్కొంది.

"వివిధ జాతీయ మొబైల్ టెలికమ్యూనికేషన్లు విభిన్న వ్యూహాలను కలిగి ఉంటాయి. అంటే, ఒకదానికంటే మరొకటి మరింత ఎక్కువ ముప్పును కలిగిస్తుంటాయి’ అని సీఏఏ నొక్కి చెప్పింది.

ఈ సమస్యపై మరింత లోతుగా డేటాను సేకరించేందుకు అంతర్జాతీయంగా పని చేయాలని యోచిస్తున్నట్లు బ్రిటన్ నియంత్రణ అధికారులు చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)